1997 నాటి మాట.. కాళహస్తిలో “రధయాత్ర” షూటింగ్ జరుగుతోంది. రాజశేఖర్, రోజా హీరో హీరోయిన్లు. కోడి రామకృష్ణ దర్శకులు. మిత్రులు జగన్ గారనుకుంటా ఆ సినిమాకి PRO. షూటింగ్ కవరేజ్ కోసమని చెన్నై నుండి రెండు పెద్ద కార్లలో పసుపులేటి రామారావు గారు, ఉమా మహేశ్వరరావు గారు, జగన్ గారు, మణిగోపాల్ (హ్యాపీడేస్ లో అరెరె.. గీతరచయితా, ఇప్పటి వనమాలి) గారు మరికొందరు బయల్దేరాం.
నేను కాళహస్తిని చూడడం అదేననుకుంటా మొట్టమొదటిసారి. వెళ్లడం వెళ్లడం మండపం దగ్గర షూటింగ్ యూనిట్ దగ్గరకు వెళ్లాం. షాట్ గ్యాప్ లో కోడి రామకృష్ణ గారు, రాజశేఖర్ గారు, రోజా గారూ అందరం ఒకర్నొకరు విష్ చేసుకున్న తర్వాత వాళ్లు షూటింగ్ పనిలో పడ్డారు. మధ్యాహ్నం లంచ్ చేశాక ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకున్నాం.
ఎటూ టైమ్ ఉంది కదా అని ఆ మండపంలో తిరుగుతూ, ప్రెస్ మిత్రులందరం సినిమా కబుర్లు చెప్పుకుంటూ, మధ్యలో షూటింగ్ మీద ఓ కన్నేస్తూ గడుపుతున్నాం. బాగా గుర్తు… రాజశేఖర్ గారి మీద ఏదో ఒక షాట్ ఎంతకీ ఓకే కావడం లేదు. పాపం రాజశేఖర్ గారు ఓపిగ్గా మళ్లీ మళ్లీ చేస్తూనే ఉన్నారు.
కేవలం మీడియాలో మాత్రమే రాజశేఖర్, జీవిత గార్లని చూసే చాలామంది వార్ని చిన్నచూపు చూడడం, ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేయడం వింటూ ఉన్నాను. వారి రాజకీయ నిర్ణయాలూ, ఇతరత్రా పక్కన పెడితే.. సినిమా రంగంలో అన్యోన్యమైన జంట అని పర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా ఎవర్నయినా చెప్పాలంటే రాజశేఖర్, జీవితలనే చెప్పుకోవాలి. జీవిత గారైతే షూటింగ్ తనది కాకపోయినా, ఇంటి నుండి క్యారేజ్ కట్టుకొచ్చి పక్కన, చంటి పిల్లని (అప్పటికి ఒకమ్మాయే) చాలా జాగ్రత్తగా చూసుకుంటూ సెట్ లో ఓ మూలన కూర్చుండే వారు. షాట్ గ్యాప్ లో రాజశేఖర్ గారు వచ్చినప్పుడు ఆయనకు సపర్యలు చేయడం.. ఇక్కడ ఎవరో ఏదో అనుకుంటారన్న మొహమాటాలు లేవు. తాను తన భర్త క్షేమం చూడాలి అన్న తాపత్రయం.
సినిమా చూసి, లేదా చూడకుండానే ఎవరో ఏదో చెప్తే బాగుందనో, బాలేదనో అనుకుంటాం గానీ.. అక్కడ అలా సెట్లలో ఓ పక్క లైటింగ్ ఉక్కపోత, చెమట్లు దిగగారిపోవడం, సరిచేసుకున్న నిమిషంలోనే పాడైపోయే మేకప్పు, ఓ వైపు లైట్ బాయ్స్ దగ్గర్నుండీ ప్రొడక్షన్ వాళ్ల దాకా కెమెరా డిపార్ట్ మెంట్, ఆర్ట్ డైరెక్టర్, కోడైరెక్టర్లు, అసిస్టెంట్లూ, ప్రొడక్షన్ వాళ్లూ అస్సలు ఆ సందడిలో అన్నీ ఓ హార్మోనీలోకి రావడానికి ఎంత కష్టపడాలో.. మనం సినిమాల్ని చూసేసి ఎంతో సులభంగా విరిచే పెదవి విరుపులు ఎందరి కష్టాన్ని అణగదొక్కుతున్నాయో అర్థం చేసుకుంటే ఎంత చవకబారు సినిమానైనా ఎప్పుడూ విమర్శించాలనుకోం.
సరే మధ్యాహ్నం కోడి రామకృష్ణ గారూ, హీరోహీరోయిన్లూ అందరం కూర్చుకుని ఇండస్ట్రీ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ పూర్తి చేశాం. తర్వాత కామన్ ప్రెస్ మీట్ లో అందరం ఎవరు రాసుకునేది వాళ్లం రాసేసుకుని, మళ్లీ షాట్ గ్యాప్స్ లో రాజశేఖర్ గారితోనూ, రోజా గారితో నా వరకూ నేను స్పెషల్ ఇంటర్వ్యూలు తీసుకుని వచ్చిన పని పూర్తి చేశాను. తిరుగు ప్రయాణంలో చెన్నై చేరుకునేసరికి అర్థరాత్రయింది. అందర్నీ ఎవరిళ్ల దగ్గర వాళ్లు దిగేసి సెలవు తీసుకున్నాం. మరోసారి మరో సినిమా అనుభవంతో కలుస్తాను.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
>> “మనం సినిమాల్ని చూసేసి ఎంతో సులభంగా విరిచే పెదవి విరుపులు ఎందరి కష్టాన్ని అణగదొక్కుతున్నాయో అర్థం చేసుకుంటే ఎంత చవకబారు సినిమానైనా ఎప్పుడూ విమర్శించాలనుకోం”
ఒక సినిమా తీయటానికి వాళ్లు పడే కష్టమే టికెట్ కొనటానికి వెచ్చించే యాభై రూపాయలు (కుటుంబంతో సహా ఐతే రెండో మూడో వందలు) సంపాదించటానికి సగటు ప్రేక్షకుడు కూడా పడతాడు కదా. తన సొమ్ముకి తగ్గ ప్రతిఫలం లభించకపోతే విమర్శించే హక్కు అతనికెందుకు ఉండదనుకుంటున్నారు?
అబ్రకదబ్ర గారు.. నేను ఎప్పుడూ ప్రతీ విషయాన్ని దాని వెనుక ఉన్న కష్టం కోణంలో చూస్తుంటానులెండి, ముఖ్యంగా ఒక వస్తువును కొనేటప్పుడు మనం పెట్టే డబ్బుకి తగ్గ వస్తువు వస్తుందో లేదో ఆలోచించే మాదిరిగా సినిమాలూ, కళలూ, పుస్తకాలూ, పాత్రికేయం వంటి సృజనాత్మక రంగాలకు విలువ కట్టడం ఎంతవరకూ సబబో నాకు తెలియదు. సృజనాత్మక కష్టాన్ని డబ్బుతో పోల్చకపోవడం నా బలమో, బలహీనతో తెలియదు. ఏదేమైనా కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు.
సినిమా తీసేదీ, మనకి చూపించేదీ డబ్బు కోసమే ఐనప్పుడు దానికి సొమ్ముతో విలువ కట్టకుండా ఉండటం ఎలా? పోనీ డబ్బు సంగతి వదిలేయండి. కాలానికన్నా విలువీయాలి కదా. తమ విలువైన సమయం వృధా చేసుకుని, ప్రేక్షకుల అమూల్యమైన సమయం హరించే సినిమా తీసి వదిలితే విమర్శలు రాకుండా ఎలా ఉంటాయి? ఇది ఏ కళకైనా వర్తిస్తుంది. సృజనాత్మకత పేరుతో చెత్త తెచ్చి జనం నెత్తిన కుమ్మరించి అదే మహా ప్రసాదం అనుకోమంటే ఎలా కుదురుతుంది? There’s an adage that goes .. ‘stop complaining about labor pains and show me the baby’. మనోళ్లకి ఉదారత్వమూ, పోన్లే పాపం అని సర్దుకుపోయే గుణమూ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ శాతంలో ఉండబట్టే ఏ రంగం తీసుకున్నా నాణ్యత నాస్తి, నాసిరకం సరుకులు జాస్తి. We need to get rid of this easy forgiving nature.
ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇది చదివి మీది మారుకోవాలనే ఉద్దేశం లేదు, కుంటారనే నమ్మకమూ లేదు 🙂