పొద్దుట్నుంచీ ఈ విషయం గురించి రాయకూడదని ఉగ్గబట్టుకుని ఆపుకోలేక రాస్తున్నాను.
నేను చాలా straight forwardగా కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను.
ముందుగా దివంగతులు సుమన్ ఆత్మకు శాంతి లభించాలని కోరుకుంటున్నాను.
ఈరోజు సంతాపాలూ, రకరకాల వ్యాఖ్యానాలూ, రామోజీరావు కొడుకు కాకపోయుంటే సుమన్ చాలా మంచోడు అంటూ డొంకదారి సానుభూతులూ తెలుపుతున్న వ్యక్తులు కొందరు కొన్నేళ్లుగా.. ఇదే సుమన్‌ని ఒక బఫూన్ క్యారెక్టర్‌గా చిత్రీకరించి జోక్‌లు పేల్చుకున్న సందర్భాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.
ఉన్న ఫళంగా జాలి కారిపోతోంది.. రేపు మనమూ ఇలాగే అవుతామనే భయం కొద్దీనో, పాపం పోయాడు కదా కనీసం సానుభూతైనా చూపించకపోతే బాగోదన్న లౌక్యం కొద్దీనో!
సుమన్ ప్రోగ్రాములంటే జనాలకు చులకన.. వెటకారంగా మాట్లాడుకుంటూ మరీ చూస్తుంటారు. సుమన్ సీరియళ్లలో వాడే సెంటిమెంటో, డైలాగులో, తెలుగు భాషో.. మరొకటో మనకు నచ్చకపోవచ్చు.. ఆ మాత్రానికే అదే సీరియళ్లని, ప్రోగ్రాముల్ని, పాటల్ని ఆస్వాదించే యావత్ ఆంధ్ర గ్రామీణ ప్రజానీకం యొక్క అభిరుచిలో లోపం ఉందని మనం తప్పు పట్టగలమా? లేదా వాళ్లకీ నచ్చకపోయినా తప్పనిసరై చూస్తున్నారంటారా?
ఈరోజు చాలా టివి ఛానెళ్లు వచ్చాయి.. సుమన్ అంతరంగాలు మొదలు ఇప్పటివరకూ చేసిన వివిధ సీరియళ్లలో కనీస ప్రమాణాలూ, మానవతావిలువల పట్ల గౌరవం చూపించిన ప్రోగ్రాముల్ని ఏవైనా చూపించగలరా సుమన్‌ని ఇన్నాళ్లూ విమర్శించిన వాళ్లు?
ఒక మనిషి బ్రతికుంటే మన మాటలతో కుళ్లబొడిచి చంపేయడం… చనిపోయాక చనిపోయాడు కాబట్టి కూసింత మంచిగా చెప్పుకోవడం.. తెల్లారి లేస్తే ఎవరి పనుల్లో వాళ్లు పడిపోవడం మనకు కొత్తేమీ కాదు. యెస్ మనమింతే…
ఈరోజు సుమన్‌ని కావచ్చు, రేపు ఇంకొరినిని కావచ్చు.. చులకనగా మాట్లాడే మన బోటి సగటు జనాభా ఎప్పటికి మానసికంగా వారికి సమానంగా ఎదగగలుగుతుంది? మనందరం కలిసి వాళ్ల మీద ఎన్ని రాళ్లు విసురుతున్నామో.. అదే మొత్తంలో మన మీద విసరబడితే బ్రతికి బట్టకట్టగలుగుతామా?
సుమన్ శ్రీహరిస్వరాలు వంటి కొన్ని పాటల్ని చూస్తుంటే.. అలా మన భారతీయ ఆధ్యాత్మిక సంపద పట్ల గౌరవంతో.. కొన్నేళ్లుగా ఆరోగ్యం బాలేకపోయినా పట్టుదలతో చేసే వ్యక్తుల్ని ఎక్కడ నుండి తీసుకురాగలం?
ఇప్పటికి చాలామందికి ఓ డౌట్ వచ్చి ఉంటుంది.. సుమన్ పట్ల ఈయనకెందుకు అంత అభిమానం అని!
నాకు ఈరోజు సుమన్ అయినా, రేపు ఇంకొకరైనా వ్యక్తుల పట్ల అదే స్థాయి అభిమానం ఉంటుంది.
ఒక్క పావుగంట షూటింగ్ చేస్తే ఎంత దారుణంగా ఉంటుందో చిన్న చిన్న షూటింగుల్లో పాల్గొనే నేనే ఫీలవుతూ ఉంటాను… అలాంటిది ఓ వ్యక్తి ఏక్టింగ్ మొదలుకుని, స్క్రిప్ట్, పాటలు, బొమ్మలు వగైరా.. అన్నీ తానే చేస్తుంటే అతని ప్రజ్ఞని ఇన్నాళ్లూ ఎగతాళి చేయడం అస్సలు సంస్కారమేనా? ఈ ప్రశ్న నేను ఇప్పుడు మాత్రమే వేయగలుగుతున్నాను. కారణం.. ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఇదే మాట నేను అంటే నన్నో వింత పశువుగా చూసేవారు ఇదే జనాలు. ఇప్పుడు ఆయన ఎటూ చనిపోయాడు కదా.. ఎక్కడా లేని జాలీ వచ్చేసింది కదా.. సో శ్రీధర్ గారు మాట్లాడుతున్నదీ పాయింటే అని ఒప్పేసుకుంటారు.
చివరగా ఒక్క మాట అడుగుతాను… మీరు జీవితంలో కష్టపడి ఏదో ఒకటి సాధిస్తూ ఉన్నారనుకుందాం.. రకరకాల ఇబ్బందుల్ని తట్టుకుంటూ! నేనూ, మరో పదిమందో, లేదా ఏకంగా ఓ టైమ్ పాస్ బ్యాచ్ మొత్తమో మిమ్మల్ని హేళన చేస్తూ, ఎందుకూ పనికిరాని వారిగా మాట్లాడుతూ పోతే ఎలా ఫీలవుతారు? ఈ ఒక్క మాటకీ మీకు మీరు ఆన్సర్ చేసుకుని.. ఇకముందు మానసికంగా ఎవర్నైనా గాయపరచాలా లేదా అన్నది నిర్ణయించుకోండి.
అంతే తప్ప ఈరోజుకి పరమ దయామయులుగా మారిపోయి రేపటి నుండి పరమ కఠినాత్ములుగా తిరిగి రంపాలకు పదును పెట్టి హృదయాల్ని గాయపరుచుుకుంటూ పోతే… ఎక్కడా ఏ సృష్టీ జరగదు.
మీకు సుమన్ నచ్చకపోయినా, ఆయన సీరియళ్లు నచ్చకపోయినా.. హాపీగా వేరే ఛానెల్ చూసే స్వేచ్ఛ ఉన్నప్పుడు.. ఎందుకు ఇన్నాళ్లూ ఆయన్ని ఆడిపోసుకున్నారు?
ఇదే లాజిక్ ఇతరులతోనూ వర్తిస్తుంది. మన దయతో ఎవరూ బ్రతకట్లేదు. సో మనం దయ చూపుతున్నట్లు నటిస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం మన దిగజారుడుతనం.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
ur right sir