భగవద్గీతలో చిట్టచివరి అధ్యాయమైన మోక్ష సన్యాస యోగం నుండి ప్రారంభించి.. వెనుక నుండి ముందు అధ్యాయాల్లోని శ్లోకాలను పూర్తి చేసిన తర్వాత ఓ క్రమ పద్ధతిలో మొదటి నుండి చివరి వరకూ ఓ పుస్తక రూపంలో తీసుకు రావాలన్నది నా సంకల్పం. అందులో భాగంగానే మోక్ష సన్యాస యోగమైన 18వ అధ్యాయంలోని శ్లోకాలు ఇవి. అర్జునుని సందేహాలను వదిలేసి కేవలం కృష్ణ భగవానుడిచే లౌకిక, పారమార్థిక, ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడేలా చెప్పబడిన సారాంశాన్ని మాత్రమే ప్రస్తావించడం జరుగుతోంది. కొన్నిచోట్ల అర్జునుడి సందేహాలు ప్రాముఖ్యత కలిగినవి అయితే వాటిని కూడా ప్రస్తావిస్తూ, వాటికి భగవానునుని వివరణని అందించడం జరుగుతుంది.
18వ అధ్యాయం 1వ శ్లోకం: అర్జునుడు భగవానుని ఇలా అడుగుతున్నాడు!
సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ ।
త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన ।। 1 ।।
గొప్ప బాహువులు కలిగిన కృష్ణా, సన్యాసమూ, త్యాగమూ యొక్క స్వభావాన్ని, వాటి మధ్య వ్యత్యాసాన్ని కూడా తెలుసుకోగోరుతున్నాను.
18వ అధ్యాయం 2వ శ్లోకం: గీతాకారుడు ఇచ్చిన వివరణ ఇది.
కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః ।
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ।। 2 ।।
కోరికలచే ప్రేరితమైన కర్మలను త్యజించటమే సన్యాసము అని జ్ఞానసంపన్నులు అన్నారు. సమస్త కర్మల ఫలములను విడిచిపెట్టటమే పండితులు త్యాగము అని అన్నారు.
మరింత వివరంగా చెబుతాను. భగవత్ ప్రాప్తికి రెండు మార్గాలున్నాయి. మనం చేసే ప్రతీ పనికీ (కర్మకీ) కారణం అయ్యేది మనస్సులో ఉండే కోరికే కాబట్టి సంసార బంధనాలను, లౌకిక జీవితాన్ని విడిచిపెట్టి పూర్తిగా సన్యాస మార్గం ఎంచుకోవడం మొదటి మార్గం. అయితే చేసే ప్రతీ పనీ (కర్మ) పట్ల, దాని ఫలితాల పట్ల ఎలాంటి మమకారం లేకుండా చేసేది నేను, చేయించబడేది భగవానుడు అనే సత్యాన్ని గ్రహించి నడుచుకోవడం అనేది త్యాగ మార్గం.
ఈ రెండు మార్గాల్లో ఏదైనా ముక్తికి దారి తీస్తుంది. మొదటిదైన సన్యాసం గురించి చెప్పుకుందాం. “అన్ని కుటుంబ బాధ్యతలు వదిలేసి అతను సన్యసించాడు” అని అప్పుడప్పుడు వింటూ ఉంటాం. ఒక వ్యక్తి సన్యసించడం వెనుక రెండు కారణాలుంటాయి. సన్యాసం ద్వారా ముక్తికి చేరుకుందామనే ఓ అంతర్లీనమైన ఆశ మొదటి కారణం. ఇలా కోరిక, ఆశ కలిగి ఉన్నప్పుడే అతను సన్యాస అర్హతను కోల్పోయినట్లు! కాబట్టి అతను తన గమ్యాన్ని చేరుకోలేడు. రెండో కారణం విషయానికి వస్తే.. ప్రతీ కోరికా ఓ కర్మగా ఎలా మారుతుందో, ఆ కర్మలు ఈ భౌతిక ప్రపంచంలో ఎలా తనని కట్టిపడేసి ఉంచుతాయో అవగాహన కలిగి ఉండడం వల్ల సన్యాస మార్గంలో నడుస్తారు.
ఇక్కడ ఓ వ్యక్తి సన్యాస మార్గంలోకి వెళ్లాడంటే కేవలం అది అతని సంకల్పం వలన ఏమాత్రం జరిగినది కాదు. అతని ప్రమేయం లేని శక్తి అతన్ని ఆ వైపు నడిపిస్తుంది.
ఇక రెండో దానికి వద్దాం. కర్మఫలం పట్ల మమకారం లేకుండా త్యజించడం అనేది!
కోరిక అనేది ఓ పని చెయ్యడానికి దారి తీస్తుంది. ఆ కర్మని చేసిన తర్వాత దానికి మీకు నచ్చినదో, నచ్చనిదో ఓ ఫలితం వస్తుంది కదా! నచ్చిన ఫలితాన్ని చూసి సంతోషపడడం, నచ్చని ఫలితాలను చూసి బాధపడడం, మీరు చేసిన పని ద్వారా వచ్చిన ఫలితాన్ని చూసి గర్వపడడం వంటివన్నీ మనిషి ఆలోచన ఇక్కడిక్కడే ఈ భౌతిక ప్రపంచంలో తిరిగేలా చేస్తుంటాయి. తనలోని భగవత్ స్వరూపాన్ని తెలుసుకోకుండా చేస్తాయి.
మీరు ఓ సంస్థలో ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకున్నారు అనుకోండి. ఆ ఇంటర్వ్యూ కోసం ఓ వారం రోజుల పాటు రాత్రింబవళ్లు సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యారు అనుకోండి. ఇంటర్వ్యూ ఏవో వివిధ కారణాల వల్ల పోయింది, మీరు రిజెక్ట్ చెయ్యబడ్డారు అనుకోండి. ఇక్కడ ఉద్యోగం కోసం దరఖాస్తు పెట్టుకోవడం, సబ్జెక్ట్ ప్రిపరేషన్, ఇంటర్వ్యూకి హాజరు అవడం మాత్రమే మీ చేతిలో ఉన్న కర్మలు. కర్మలను చెయ్యడం మానేయాల్సిన పనిలేదు. కానీ వాటి ఫలితాల పట్ల మమకారమే విడిచి పెట్టాలి. ఉదా.కి.. మీరు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే మీ మనస్సులో ఏం జరుగుతుందో చూద్దాం.
నేను ఇంత కష్టపడ్డానే ఎందుకు సెలెక్ట్ కాలేకపోయాను? నేను చాలా అన్‌ఫిట్, ఏదీ సాధించలేను – అనే అత్మన్యూన్యత మొదలవుతుంది. ఇది మన శరీరంలో సెల్ఫ్ ఎస్టీమ్కి కేంద్రకమైన మణిపూరక చక్రలో ప్రాణ శక్తి బ్లాక్ అవడానికి కారణం అవుతుంది. శరీరంలో క్రింది మూడు చక్రాలలో ఒకటైన ఈ చక్రలో ప్రాణశక్తి నిరోధించబడితే అది పై చక్రాలకు స్వేచ్ఛగా వెళ్లలేక మనిషి భగవంతుని విశ్వశక్తితో ఏకమవడం జరగదు.
నేనంతా బ్రహ్మాంఢంగా ప్రిపేర్ అయ్యాను, కానీ హెఆర్ తప్పే అంతా.. అని మరో వ్యక్తి మీద కోపం రావచ్చు. నేను బాగానే పనిచేశాను, ఫలితమే సరిగా రాలేదు అన్న భావన కలిగినప్పుడు, ఆ ఫలితానికి వేరే వ్యక్తి కారణం అని మీ మనస్సు ఓ కంక్లూజన్ ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తిని ఎదుర్కొవడం అయితే అతనితో ఘర్షణ పడాలని గానీ, బయటకు ఘర్షణ పడలేకపోతే మనస్సులో అతనితో ఘర్షణ పడడం, లేదా మనుషులంతా ఇంతే అనే ఓ బాధితుడి మనస్థత్వం కలిగి ఉంటే ఆ పరిస్థితి నుండి పారిపోవడం, కుమిలిపోవడం జరుతుంది. దీంతో బ్రెయిన్లో నొరెపైనెఫ్రిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ మరియు హార్మోన్‌గా పనిచేసే కెమికల్ విడుదల అయి దానికి సంబంధితమైన సందేశాలను కేంద్రీయ నాడీ వ్యవస్థ (సెంట్రల్ నెర్వస్ సిస్టమ్) ద్వారా శరీరంలోకి విడుదల చేసి శక్తిని హరిస్తుంది. ఇది మీ శరీరంలోని అడుగు నుండి రెండో చక్ర అయిన, భావోద్వేగాలకు కారణమైన స్వాధిష్టాన చక్రలో ఎనర్జీ బ్లాక్‌కి కారణం అవుతుంది.
అంటే శ్రీకృష్ణ భగవానుడు కర్మల ఫలితాలను త్యజించమని ఊరికే చెప్పలేదు. “నేను మాత్రమే ఇంత గొప్పగా ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇంత మంచి ఉద్యోగాన్ని పొందగలిగాను” అనే భావన కలిగినా కూడా అది అహాన్ని పెంచుతుంది. అహం పెరిగాక, మిగతా వాళ్లంతా ఊరికే అర్హత లేకపోయినా ఉద్యోగాలు తెచ్చుకున్నారు, నేను మాత్రమే గొప్ప పరిజ్ఞానం కలిగి ఉన్న వాడిని అనే కళ్లు మూసుకుపోయే తత్వం అలవడుతుంది. అందుకే భగవానుడు చెప్పినట్లు కర్మలు చేసుకుంటూ వెళ్లాలే గానీ వాటి ఫలితాల పట్ల పీకులాటలు, మమకారాలూ, గర్వాలూ, అహాలు పెంచుకుంటూ పోతే మనిషి ముక్తికి దూరమవుతాడు.
మనం పనిచేస్తూ వాటి ఫలితాన్ని త్యజించమంటే ఎలా అనే భావన మీకు రావచ్చు. భూమ్మీద పుట్టిన ప్రతీ మనిషికీ తన తుది శ్వాస వరకూ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉండాలి. అలా చేసేటప్పుడు ధర్మబద్ధంగా ఉన్న సత్కర్మలు చేస్తూ వాటి ఫలితాలు కూడా దైవ అర్పితమని భావించడం అనేది ఏ కర్మా, ఏ ఫలితమూ మన ఆత్మకి అంటకుండా ముక్తి మార్గంలో అన్ని బంధనాలు తెంచుకుంటూ ముందుకు సాగడం లాంటిది!
- Sridhar Nallamothu