యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ ।
అయథావత్ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ।। 31 ।।
ఎప్పుడైతే బుద్ధి ఏది ధర్మము ఏది అధర్మము అన్న అయోమయములో ఉంటుందో, ఏది సరియైన ప్రవర్తన ఏది తప్పుడు ప్రవర్తన తెలుసుకోలేకపోతుందో అప్పుడు ఆ బుద్ధి , రజోగుణములో ఉన్నట్టు.
వివరణ:
రజోగుణంలో ఉన్న వ్యక్తి బుద్ధి రాగద్వేషాల చేత ప్రభావితం చెందుతుంది. అంటే ప్రతీ నిర్ణయాన్నీ ధర్మబద్ధంగా, నైతికంగా ఏది మంచి, ఏది చెడు అనే విచక్షణతో కాకుండా, తనకు ఇష్టమైన విధంగా నిర్ణయాలు తీసుకోవడం, అయిష్టంగా ఉన్న వాటికి దూరంగా ఉండడం చేస్తుంటాడు.
నిజానికి రజోగుణ స్వభావం కలిగిన వ్యక్తి గత శ్లోకాల్లో చెప్పుకున్నట్లు ఉప్పు, కారం, మసాలాలు, భావోద్వేగాలను పెంచే ఇతర ఆహారాలను ఎక్కువ వినియోగించుకుంటూ, సంతోషం, దుఃఖం, ఆవేశం, ద్వేషం, ఒంటరితనం, తృణీకార, అపరాధ భావాలు వంటి నిరంతరం ఏదో ఒక భావోద్వేగంలో కొట్టుకుపోతుంటాడు. మైండ్ ఏదైనా భావోద్వేగంలో ఉన్నప్పుడు స్పష్టంగా ఆలోచించలేదు.
మనిషి ఎమోషనలైజ్ అయినప్పుడు బ్రెయిన్లోని అమిగ్డాలా అనే ప్రత్యేకమైన “ఎమోషనల్ సెంటర్” వద్ద రక్త ప్రసరణ, ఆక్సిజెన్ సరఫరా అధికమై.. సవ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే ఫ్రాంటల్ లోబ్‌లోని ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అనే ప్రదేశంలో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో మానసిక శక్తి మొత్తం కోపమో, ద్వేషమో వంటి భావోద్వేగానికి వెచ్చించబడుతుంది తప్పించి కాన్షియస్గా, మైండ్ మన నియంత్రణలో పెట్టుకుని లాజికల్‌గా మంచి చెడుల గురించి ఆలోచించే శక్తి తగ్గిపోతుంది.
సరిగ్గా ఈ కారణం చేతే ఒక మనిషి కోపంలోనో, ఇంకో భావోద్వేగంలోనో ఉన్నప్పుడు అతను ఎంత చదువుకున్న వ్యక్తి అయినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా అవన్నీ పక్కకు వెళ్లిపోయి, అభ్యంతరకరంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ప్రతీ ఎమోషన్లోనూ దాన్ని అవే ఆలోచనలతో పెంచి పోషించుకోకపోతే గరిష్టంగా ఏడు నిముషాల్లో ఆ ఎమోషన్ సద్దు మణుగుతుంది. ఆ తర్వాత “మనం ఇలా ఎందుకు ప్రవర్తించాం” అని అదే వ్యక్తి తన లాజికల్ మైండ్‌తో పశ్చాత్తాప పడుతూ ఉంటారు.
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఎక్కువగా మనుషుల బుద్ధి రజోగుణంలో ఉంటోంది. ఒకరి కంటే ఒకరు ఎలాంటి మార్గాల్లో అయినా ఎదగాలనే ఆరాటం, దాని కోసం రాజకీయాలు చెయ్యడం, ప్రొఫెషనల్ జెలసీ.. ఇలా ప్రతీదీ మనిషి ప్రశాంతంగా ఉండే సత్త్వ గుణాన్ని నాశనం చేసి ఒకరిపై మరొకరు భావోద్వేగాలతో విరుచుకుపడేలా చేస్తోంది.
రజోగుణం వల్ల మనిషి యొక్క ఎనర్జీ మొత్తం శరీరంలోని క్రింది నుండి రెండవదైన స్వాధిష్టాన చక్ర (శాక్రల్ చక్ర)లో బ్లాక్ అవుతుంది. అక్కడి నుండి పైకి ఎనర్జీ సరిగా కదలకపోయేసరికి.. ఆ తర్వాతి చక్రలైన సెల్ఫ్ ఎస్టీమ్, కాన్ఫిడెన్స్లకి చెందిన మణిపూరక చక్ర, మనుషులు, ప్రకృతి మొత్తాన్నీ అన్ కండిషనల్‌గా ప్రేమించే గుణాన్ని పెంచే అనాహత చక్ర, సత్యాన్ని ధైర్యంగా, హుందాగా మాట్లాడడానికి, వాక్చుద్దికి ఉపయోగపడే “విశుద్ధ చక్ర” వంటి వాటికి తగినంత ఎనర్జీ అందక మనిషి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం పడుతుంది.
అంతే కాదు.. రజో గుణ బుద్ధి కలిగిన వ్యక్తి, దానివల్ల ఏదో ఒక విషయంలో తరచూ కోపం, ద్వేషం వంటి వాటికి గురయ్యే వ్యక్తి శరీరం కెమికల్ ఫ్యాక్టరీగా తయారవుతుంది. స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిజాల్ ఎక్కువగా విడుదల అవుతూ ఉంటుంది. స్ట్రెస్ హార్మోన్ విడుదలైనప్పుడు ఈ క్రింది మూడు పనులు నిలిపి వేయబడతాయి.
- శరీరంలోని వివిధ కణాల డిఎన్ఏ రిపేర్ అనేది ఆగిపోతుంది. దీంతో ఏదైనా చిన్న పుండు పడినా, లేదా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా అది తగ్గడానికి చాలా సమయం పడుతుంది.
- రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల ఊరికే జలుబు, సైనస్, డస్ట్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీస్ వంటి వాటికి లోనవ్వడం జరుగుతుంది. మీరు గమనిస్తే చాలామంది మానసిక వత్తిడిలో ఉన్నప్పుడు మాత్రమే ఎలర్జీస్ ఎక్కువగా ఇబ్బంది పెడతాయి.
- జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఆకలి వేయదు. తిన్న ఆహారం అరగదు. దీనివల్ల గ్యాస్ సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
- స్ట్రెస్‌లో ఉన్నప్పుడు పునరుత్పత్తి ప్రక్రియ అయిన సెక్స్, సెక్స్ కోరికలు వంటివి తగ్గిపోతాయి.
దీనంతటికీ ఒకటే కారణం.. ఒక మనిషి పట్ల గానీ, ఒక విషయం పట్ల గానీ ఏర్పడే రజోగుణ స్వభావమైన విపరీతమైన కోపం, అత్యంత శక్తివంతమైన ఎమోషన్. ఆ మానసిక స్థితిలో ఉన్నప్పుడు చాలా మెంటల్ ఎనర్జీ, కేంద్రీయ నాఢీ వ్యవస్థ ద్వారా శరీరంలోని వివిధ భాగాలు బిగదీసుకుపోయి తన ఇగోకి ఏర్పడిన ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడతాయి కాబట్టి.. “నా ఇగోని ఎవరూ హర్ట్ చెయ్యకూడదు” అనే తనని తాను కాపాడుకునే వ్యూహంలో మనిషి ఆలోచన ఉంటుంది కాబట్టి.. జీర్ణ వ్యవస్థ మొదలుకుని, సెల్ రిపేర్, సెక్స్ వంటివన్నీ అంత ఇంపార్టెంట్ కాదు అనే భావనలోకి మన శరీరం యొక్క ఇంటెలిజెన్స్ వెళ్లిపోతుంది. మీరు గమనిస్తే స్ట్రెస్ తగ్గిన తర్వాత మాత్రమే మెల్లగా కడుపులో పేగులు అరుస్తూ ఆకలి వేస్తుంది.
అంతెందుకు, ఎదురుగా ఆడియెన్స్ ఉంటే స్టేజ్ మీద మాట్లాడడానికి భయపడే వ్యక్తి నోరు ఎండిపోవడానికీ కారణం ఇదే. ఎదుట ఉన్న వ్యక్తులు తనని జడ్జ్ చేస్తారేమో, అపహాస్యం చేస్తారేమో, తాను సరిగా మాట్లాడలేనేమో అనే మానసిక వత్తిడిలో అతను ఉన్నప్పుడు, జీర్ణ వ్యవస్థని మందగించేలా చెయ్యడంలో భాగంగా నోటిలో లాలాజలం సరిగా ఊరకుండా చేసి నోరు పిడచగట్టుకుపోయేలా శరీరం యొక్క ఇంటెలిజెన్స్ చేస్తుంది.
అందుకే సాధ్యమైనంత వరకూ భగవద్గీతలో చెప్పినట్లు రజోగుణ బుద్ధిని కాకుండా నిరంతరం ప్రశాంతంగా ఉంచే సత్త్వ గుణ బుద్ధిని కలిగి ఉండాలి.
- Sridhar Nallamothu