శ్రీవేంకటేశ్వరుని విషయంలో నేను చైల్డిష్గా ప్రవర్తించిన ఒకసారి నాలుగేళ్ల పాటు దారుణంగా పరీక్షించబడ్డాను…
ఆ తర్వాత కొన్నాళ్లకు అన్నమయ్య సినిమా సమయంలో నాగార్జున, రాఘవేంద్రరావు, జె.కె. భారవిలతో ప్రత్యేక దర్శనమూ, గుడి లోపలే ఉండే మండంలో కూర్చుని పండితుల ద్వారా ప్రసాదం అందుకునే అపూర్వ అవకాశమూ కలిగాయి..
అన్నమయ్య తర్వాత 2008లోనే మళ్లీ శ్రీవారిని దర్శించుకోవడానికి సాధ్యపడింది.. 2010లో ప్లాన్ చేసుకుని… అకస్మాత్తుగా తుఫాన్ పెరగడంతో రాత్రికి రాత్రి ప్రయాణం కేన్సిల్ చేసుకోవడం జరిగింది.
అప్పటి నుండి శ్రీవారిని దర్శించుకోవాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ దర్శించుకోగలిగాను..
నిజంగా ఇది నాకు ఎంతో సంతృప్తి ఇచ్చిన దర్శనం…
అన్ని విషయాల్లోనూ శ్రీవారు నాకు చాలా మానసిక, శారీరక శక్తిని ఇవ్వడంతో పాటు ఈ దర్శనం విషయంలో బయల్దేరే రోజు నుండి హైద్రాబాద్ తిరిగి వచ్చే వరకూ అద్భుతమైన సంతృప్తిని మిగిల్చారు. కేవలం మొక్కు తీర్చుకోవడమే పనిగా వెళ్తున్న నాకు తిరుపతి, తిరుమలలో అన్ని చోట్లకూ తిరగడానికి కార్ మాట్లాడడంతో పాటు, నాతో పాటు మెట్ల ప్రారంభం వరకూ వచ్చి.. ఏమేమో చూడాలో గైడ్ చేసిన మిత్రులు జగన్నాధం గారి ఆత్మీయతను ఎప్పటికీ మర్చిపోలేను. వీలైనప్పుడల్లా ఆయన కాల్ చేస్తూ క్షేమసమాచారాలు కనుక్కుంటూ ఉన్నారు. కార్ డ్రైవర్ నాగరాజు ఎంత ఓపిగ్గా తిప్పాడో, ఎంత హాపీ అన్పించిందో చెప్పలేను.
వాస్తవానికి…
ఫిబ్రవరిలో నా మిసెస్ ప్రెగ్నెన్సీ రిస్క్ అయి బేబీని తొలగించవలసి వచ్చినప్పుడు మదర్కీ రిస్క్ అని విన్నప్పుడు.. అప్పటికప్పుడు ఎలాగైనా కాపాడమని… 6 నెలల్లోపు మెట్లు ఎక్కి కొండకు వస్తానని మొక్కుకున్నాను… మార్చి మొదటి వారంలో ఆన్లైన్లో దర్శనం, తిరుమలలో అకామిడేషన్, అలాగే నేను మెట్ల దారిన ఎక్కుతాను కాబట్టి.. మా మిసెస్ ఆలోపు రిలాక్స్ అవడం కోసం తిరుపతిలో భీమాస్ డీలక్స్ లో రూమ్, ట్రెయిన్ టిక్కెట్లు అన్నీ రెడీ చేశాను…
అయినా మే 1 వరకూ రోజూ టెన్షనే… 2010లో ఎలాగైతే లాస్ట్ మూమెంట్లో ప్రయాణం కేన్సిల్ అయిందో అలా అయితే ఎలాగనే భయం…
అలాగే ట్రెయిన్ సకాలంలో రీచ్ అయితేనే 12 గంటలకు పైన నాకు అకామిడేషన్ అలాట్ అవుతుంది… నేను మెట్లెక్కీ, మా మిసెస్ కారులో వచ్చీ.. ఇద్దరం కలిసి ఆ రూమ్ తీసుకోవడానికి వీలవుతుంది… సో ట్రెయిన్ టైమింగ్స్, నడకకు పట్టే సమయమూ, ఇలా అన్నీ perfectగా ప్లాన్ చేసుకోవలసి వచ్చింది. నేను బుక్ చేసుకున్న ప్రకారం దర్శనం సమయం అయితే మధ్యాహ్నం 3-4 మధ్య…!
ట్రెయిన్ దిగడం ఆలస్యం… భీమాస్కి వెళ్లి… ఫ్రెషప్ అయి జగన్నాధం గారు పంపించిన నాగరాజుతో మెట్లెక్కడానికి కారులో ప్రయాణం అయ్యాను… మధ్యలో జగన్నాధం గారు కూడా కలిసి… శ్రీవారి మెట్టుకి చేరుకునే వరకూ… ఈ 2 రోజులు ఏమేం చూస్తే బాగుంటుందో గైడ్ చెయ్యడంతో పాటు నాగరాజుకి క్లియర్ గా చెప్పారు… "సర్ చాలా సంతృప్తిగా వెళ్లాలి" అని! నాగరాజు కూడా చాలా మంచి వ్యక్తి. బాగా చూసుకున్నాడు.
మెట్లెక్కడం మొదలెట్టాను… మొదట్లో బానే ఉందనిపించినా 300-350 మెట్లు దాటాక పూర్తి నిటారుగా మారిపోయాయి మెట్లన్నీ! ఓ 15 మెట్లు ఎక్కితే కాళ్లు పట్టేస్తున్నాయి… బట్ నాకు ఆగకుండా ఎక్కడం ఇష్టం.. కొద్దిగా ఇబ్బంది అన్పించి ఆగాల్సి వచ్చినప్పుడు.. కెమెరా తీసి ఫొటోలు తీస్తూ మళ్లీ ముందుకు సాగుతూ వెళ్లాను…
చాలామంది పిల్లా పాపలతో ఎంతో కష్టపడి కేవలం ఆ వేంకటేశ్వరుని మీద భక్తితో ఎక్కుతున్నారు.. అది నిర్వచించలేని అనుభూతి…
గతంలో అలిపిరి రూట్ నుండి 2 గంటల పది నిముషాల్లో చేరుకున్న నేను ఈసారి శ్రీవారి మెట్టు రూట్ నుండి మధ్యలో 4-5 బ్రేకులతో 55 నిముషాల్లో కొండమీదకు చేరుకున్నాను.
నేను వెళ్లిన అరగంటకు మా మిసెస్ కూడా కార్ లో పైకి చేరుకున్నారు. సో రూ. 300 దర్శనం క్యూ ఖాళీగా కన్పించడం చూసి…. మధ్యాహ్నం 3-4 మధ్య మాకు దర్శనం అలాట్ అయి ఉన్నా… 11 గంటలకే 300 దర్శనం క్యూలోకి చేరుకుని సరిగ్గా మధ్యాహ్నం 3.15 నిముషాలకు దర్శనం పూర్తి చేసుకోగలిగాం.
నిజంగా ఆ క్షణం ఆ వేంకటేశ్వరుని ఎదుట నిలబడి చూస్తుంటే.. ఎంత ఆనందమో…. నిజంగా నేను కోరుకున్న దర్శనభాగ్యం ఇన్నాళ్లకు కలిగింది..
దర్శనం అయ్యాక.. 12 గంటలు దాటిపోయింది కాబట్టి.. రూమ్ ఇస్తారో లేదో అన్న డౌట్ తో 4 గంటల టైమ్ లో నా అకామిడేషన్ ప్రింటౌట్ తీసుకుని వెళితే రూమ్ ఇచ్చారు… 🙂 ఇదీ చాలా హాపీ. కారణం దర్శనం అయ్యాక కొండపై నిద్ర చేయాలన్నది మా కోరిక..! సో రూమ్ కెళ్లి.. ఫ్రెష్ అయ్యి.. మళ్లీ టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి 7 అయింది… గుడిని ఆ లైటింగ్ లో చూస్తూ ఫొటోలు తీసుకుని… గుడి ఆవరణలో చాలా సంతోషంగా గడిపి భోజనం చేసుకుని రూమ్ కి రిటర్న్ అయ్యాం..
మరుసటి రోజు ఉదయం (3 మే 2013) బ్రేక్ ఫాస్ట్ చేసుకుని.. ఘాట్ రోడ్ లో కారులో రిటర్న్ అయ్యి.. మధ్యలో జింకల పార్కూ, గరుఖ్మంతుడి కొండ… వంటివన్నీ చూసుకుని… అలిపిరి వద్దకు వచ్చి.. శ్రీవారి పాదాల దగ్గర జగన్నాధం గారి సలహా మేరకు గుడిలోకి వెళ్లాం..
అభిషేకం టిక్కెట్ తీసుకుంటే.. ఆ సమయంలో ఎవరో ముఖ్యమైన వ్యక్తి కూడా రావడంతో వేంకటేశ్వర స్వామి వారిని మా కళ్లెదురుగా 45 నిముషాల పాటు పాలు, తేనె, పెరుగు, గంధం, పసుపు వంటి అన్ని రకాల అభిషేకాలూ చేశారు. నిజంగా కొండ మీద అభిషేకం చేయించుకున్నంత సంతృప్తి కలిగింది. ఇది నిజంగా భగవంతుడి కృప జగన్నాధం గారి ద్వారా మాకు చెప్పించింది.. లేదంటే ఆ గుడికి వెళ్లే వాళ్లమే కాదు.
ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం, అలివేలు మంగాపురం, అభయ వేంకటేశ్వర స్వామి గుడి వంటివన్నీ చూసుకుని.. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతికి చేరుకుని… భోజనం చేసి.. మళ్లీ భీమాస్కెళ్లి రూమ్ ఖాళీ చేసి.. ఓ అరగంట రెస్ట్ తీసుకుని… 4.30 కల్లా స్టేషన్ కి చేరుకున్నాం…
అన్ని విధాలా చాలా చాలా చాలా సంతృప్తిని మిగిల్చిన ట్రిప్ ఇది.
ఓం నమో వేంకటేశాయః
– నల్లమోతు శ్రీధర్
ఆర్తితో ఆశ్రయించినవారిని వదలడాయన
గోవింద గోవింద