స్వామియే అయ్యప్ప.. అంటూ అణువణువునీ ఉత్తేజపరిచే శరణుఘోష…
ఓ శరీరం శరణు కోరుతూ తన్మయత్వంలో ఊగిపోతుంటే.. ఆ రూపు కొందరికి భక్తిపారవశ్యంగా అన్పిస్తుంది.. మరికొందరికి మూఢభక్తిగా అన్పిస్తుంది…
ప్రతీ దానికీ ద్వైదీభావం… మళ్లీ ఆ రెండు భావాల్లోనూ స్పష్టత లేక ఎటూ తేల్చుకోలేక.. కాసేపు దేముడు లేడనీ.. కాసేపు పాపం తలుగుతుందనీ చిత్తం మార్చుకుంటూ గందరగోళపడడమూ అలవాటైపోయింది కదా!!
అప్పుడెప్పుడో మాల వేసుకున్నాను.. ఎన్నో ఏళ్ల తర్వాత అయ్యప్ప భజనని కళ్లారా చూసే అవకాశం మళ్లీ ఈరోజు కలిగింది…
———————-
ఎన్ని ప్రయాసలు పడ్డా సంతోషమే కదా మనకు కావలసింది…?
ఆ సంతోషం.. వెదుక్కోకుండానే శరణు ఘోషలో దొరుకుతుంటే.. టట్… భక్తీ లేదూ… ముక్తీ లేదూ.. అంటూ కొట్టిపారేసే జ్ఞానం ఇవ్వగలదా ఆ సంతోషం?
స్వాములు వేరు, విగ్రహాలు వేరు, పూజలు వేరు, వ్రతాలు వేరు.. కానీ నమ్మకమూ, సరెండర్నెస్ ఒక్కటే…
ఓ శక్తి ఉందని నమ్మి, ఆ శక్తికి సరెండర్ అయ్యేవాడిని, చిన్నచూపుగా చూసి.. మూఢభక్తుడిగా భావించడం గొప్పదనమా? అంత గొప్పదనం మనకేం సంతోషాన్ని మిగుల్చుతోంది?
భక్తిని అమాయకత్వంగానూ, మూఢంగానూ చిత్రీకరించడంలో ఉన్న శ్రద్ధ ఆ అమాయకత్వం ద్వారా లభించే ఆనందాన్ని కళ్లారా కట్టి చూపించలేకపోతోందే?
ఈ ప్రపంచంలో అమాయకత్వం మనుషులకు ఒద్దిక నేర్పిస్తోంది.. అణుకువ నేర్పిస్తోంది… కష్టకాలంలో ఒంగి ఉండి తనని తాను కాపాడుకునే నేర్పు నేర్పిస్తోంది… కానీ మితిమీరిన జ్ఞానమే తలబిరుసుగా కూర్చుని.. కూకటి వేళ్లతో సహా పెకిలించుకుపోయే ప్రమాదాన్ని మనకు సృష్టించేది..
————————-
స్వాముల తన్మయత్వంలో కోరస్ కలిపి పాడుతుంటే నన్ను నేను మర్చిపోయాను..
ఎవరో చూస్తారనీ… చిన్నతనమనీ.. దాచుకుని దాచుకుని చప్పట్లు కొట్టే.. పెదాల క్రింద మాటల్ని మింగేసుకుని పాడుకునే దౌర్భాగ్యం మనది…
మనదైన భక్తినీ, నమ్మకాల్నీ సైతం మనం స్వేచ్ఛగా అనుసరించలేని కన్ఫ్యూజన్లోకి మేధావులందరూ మనకి బ్రాండింగ్ వేసేసి తోసేస్తుంటే……
భక్తనేది ఏం అర్థమవుతుంది… మన శరీరాన్ని ఓ ట్రాన్స్‌లోకి తీసుకెళ్లి తాదాత్మ్యంలో మునగడం ఏం తెలుస్తుంది?
అయినా ఎప్పుడూ అభద్రతతో ఉలికులికి పడే ప్రాణాలకు ఆ అలౌలిక స్థితి ఏం అర్థమవుతుందిలెండి…!!!
నమ్మకాలకూ మంచీ, చెడూ అనే రంగు పులిమేస్తున్న పెయింటర్లం.. మన మొహాల్లో వెలుగులూ, రంగులూ వెలిసిపోయినా మనకేం అర్థమవ్వలేని విచిత్ర స్థితి!!
– నల్లమోతు శ్రీధర్
Leave a Reply