ఫస్ట్ నుండి ఫోర్త్ డైమెన్షన్స్ వరకూ గతంలో వివరించాను. సృష్టిలో అంతా ఒకటిగానే ఉండేది.. అది భౌతికంగానూ మరియు మన ఆలోచనలతో సృష్టించుకునే అంతర్గత ప్రపంచంలోనూ ఫస్ట్ డైమెన్షన్లో అంతా ఒకటే అనేది అర్థం చేసుకోవాలి.
కానీ అలా అంతా ఒకటిగా ఉంటే విభిన్న రకాల అనుభవాలు ఎలా ఏర్పడతాయి, సృష్టిలోని ఎనర్జీ తనని తాను ఎలా ప్రదర్శించుకోగలుగుతుంది అన్న స్థితి నుండి సృష్టి పాజిటివ్, నెగిటివ్ ఎనర్జీలుగా విడిపోవడం మొదలుపెట్టింది. అదే సెకండ్ డైమెన్షన్. అంటే మనం కొన్ని విలువలు పెట్టుకుని అది మంచి అని భావిస్తే.. అలా మంచిని నమ్మే వారంతా ఓ వైపు, మిగతా వారంతా మరో వైపు.. ఇలా మోరల్ సిస్టమ్స్ మొదలుకుని ఒక జెంట్లో ఉండే పురుషత్వ ఎనర్జీ, స్త్రీత్వపు ఎనర్జీ ఇలా.. వేర్వేరు దశల్లో వేర్వేరు రూపాల్లో సెకండ్ డైమెన్షన్లో ఎనర్జీ దేనికది విడిపోవడం మొదలుపెట్టింది. ఇలా దేనికది సుదూరంగా విస్తరిస్తూ పోయిన నెగిటివ్, పాజిటివ్ ఎనర్జీలను న్యూట్రలైజ్ చేసి ఆ రెండింటి కలయికతో మేటర్ని (పదార్థాన్ని) సృష్టించడానికి ఏర్పడినదే థర్డ్ డైమెన్షన్. ఉదా.కి.. పురుష స్త్రీ కలయిక న్యూట్రలైజ్ అయితే పుట్టే పిల్లలు.. ఓ సాధకుడు సాధన ద్వారా తనలోని నెగిటివ్ ఎనర్జీలను, పాజిటివ్ ఎనర్జీలను గుర్తించి వాటిని అధిగమించి అవేమీ అంటని న్యూట్రల్ స్థితికి చేరుకోవడం అనేది త్రికోణం లాంటి థర్డ్ డైమెన్షన్లో పైన ఉండే స్థితి.
ఇక్కడ ఒక విషయం మీకు అర్థమైన తర్వాత మాత్రమే ఇప్పుడు రాయబోయే మిగతా డైమెన్షన్స్ అర్థమవుతాయి. ఒక పిల్లాడు స్కూల్లో చేరి 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి చదివినట్లు ఒక దాని తర్వాత మరో దానికి చేరుకునేవు కాదు ఈ డైమెన్షన్స్ అంటే! ఏదైనా విషయాన్ని ఇలా ఓ వరుసలో ఆశించడం కూడా మన మైండ్ యొక్క పరిధి ఎంత సంకుచితమైనదో అన్న దానికి ఉదాహరణ. సో ఒక మనిషి ఇప్పుడు చెప్పుకోబోయే ఫోర్త్ డైమెన్షన్లో ఉన్నప్పుడే మరో వైపు థర్డ్ డైమెన్షన్ని కూడా అనుభవిస్తుంటాడు.
సో ఫోర్త్ డైమెన్షన్లో నాలుగు దశలు ఉంటాయి. 1. వ్యక్తీకరణ 2. ప్రయోగాలు చెయ్యడం 3. ఇంటిగ్రేషన్ 4. విశ్వ శక్తితో కలవడం
ఒక ప్రాణి తల్లి గర్భంలో ప్రాణం పోసుకోవడం అనేది ఈ ప్రపంచంలో తాను చూపించుకునే వ్యక్తీకరణ క్రింద లెక్క. అంటే పుట్టడం అనేది మొదటి దశ. పుట్టిన తర్వాత ఒక వయస్సు వచ్చే వరకూ తాను ప్రత్యేకం అనే ఇగోని పెంచుకుని, ఆ తర్వాత తన ఎనర్జీస్‌తో తన రంగంలో అన్నీ సాధించి ఎనర్జీతో ప్రయోగాలు చెయ్యడం అనేది రెండవ దశ. తాను సృష్టించిన సంపదని, నాలెడ్జ్‌ని DNA రూపంలో తన సంతానానికి బదలాయించడం మూడవ దశ అయిన ఇంటిగ్రేషన్. చివరిగా తాను చేసిందేమీ లేదు, ఏదీ తనది కాదు అనే పరిపక్వతకు వచ్చి విశ్వ శక్తితో మానసికంగా, సాధన ద్వారా కలవడం గానీ, భౌతికంగా చనిపోవడం ద్వారా చేరుకోవడం గానీ నాలుగవ దశ.
పై ఫోర్త్ డైమెన్షన్ వరకూ గతంలో వివరించాను. ఇప్పుడు ఫిప్త్ డైమెన్షన్ గురించి చూద్దాం. ఈ 5వ డైమెన్షన్లో ప్రధానంగా మూడు అంశాలు మూల స్థంభాలుగా ఉంటాయి.
- ప్రేమ
- విజ్డమ్
- సృష్టి
ఈ ఐదవ డైమెన్షన్లో గురు స్థానానికి చేరుకున్న వారు ఉంటారు. వారు థర్డ్ డైమెన్షన్లో ఉండే జీవితానుభవాలను తన జీవిత కాలంలో స్వయంగా అనుభవించి ఉంటారు. ఫోర్త్ డైమెన్షన్లో ఉండే జీవితం యొక్క, సృష్టి యొక్క దశలను చనిపోక ముందే అర్థం చేసుకోగలిగి ఉంటారు. బ్రతికి ఉన్నప్పుడే మొత్తం ప్రాసెస్‌ని అర్థం చేసుకుని దేనితోనూ ఇరుక్కుపోకుండా డిటాచ్మెంట్ సాధించి ఉంటారు. మనం చాలామందిని మాస్టర్స్‌గా, గురువులుగా భావిస్తూ ఉంటాం. ఉదా.కి.. మీరు సినిమా ఫీల్డ్‌లో ఉంటే మీకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన వ్యక్తిని గురువుగా భావిస్తూ ఉండొచ్చు. లౌకికమైన విషయాల్లో గురువులు వేరు.. లౌకిక ప్రపంచాన్ని చూసి వచ్చి తనని తాను ఈ మాయ నుండి విడిపర్చుకుని సాధనతో గురు స్థానానికి వెళ్లే గురువులు వేరు. ఈ ఐదవ డైమెన్షన్లో అలాంటి గురువులు ఉంటారు. అనుభవం ద్వారా సాధించిన తమ విజ్డమ్తో వీరు నిరంతరం మిగతా ప్రపంచానికి ఏది మంచి, ఏది చెడు, మనిషి పయనం ఎటు వైపు ఉండాలి అన్నది వీరు నిరంతరం మిగతా ప్రపంచానికి చెబుతూనే ఉంటారు.
విశ్వం నుండి వచ్చే ఎనర్జీని ఛానలైజ్ చేసి, దాన్ని అర్థం చేసుకుని సర్వైవల్ ఎమోషన్స్‌లో, చక్రాస్తో ఇరుక్కుపోయి రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న తోటి మానవుల్ని అన్ కండిషనల్ లవ్‌తో దిశా నిర్దేశం చేసే బాధ్యతని వీరు తీసుకుంటారు. ఈ ఐదవ డైమెన్షన్లో ఉండే వ్యక్తులు నేరుగా మూడవ డైమెన్షన్లో ఓ పక్క పాజిటివ్, మరో పక్క నెగిటివ్, ఈ రెండు ఎనర్జీస్‌ని కలిపి న్యూట్రాలిటీ, మేటర్ వంటివి సృష్టిస్తూ సాధారణ వ్యక్తులుగా జీవిస్తున్న వారికి.. సృష్టిలో ఓ మైక్రో ఎమోషన్లో, సూక్ష్మమైన విషయం దగ్గర ఇరుక్కుపోయి బ్రతికే థర్డ్ డైమెన్షన్ వారికి ఈ ఐదవ డైమెన్షన్‌కి చేరుకున్న వారు స్థూలమైన (మాక్రో) దృక్పధాన్ని కలిపించి ఒక దగ్గర ఇరుక్కుపోవడం కాకుండా దాని నుండి విడిపడి మరింత విస్తృతమైన దృక్పధాన్ని అలవరుచుకోవడం ఎలాగో తెలియజేస్తారు.
ఇక్కడ ఒక విషయం గ్రహించాలి. ఈ డైమెన్షన్స్ అన్నీ కూడా సృష్టిలోని శరీర భాగాలు లాంటివి. దేని పని అది చేసుకుపోతూ ఉంటుంది. మన శరీరంలో లివర్, కిడ్నీ, గుండె లాంటివి ఎలాగైతే తమ పని తాము చేసుకుపోతాయో అలా వివిధ డైమెన్షన్స్‌లో ఉండే వ్యక్తులు బుద్ధిగా తలొంచుకుని తమ పని తాము చేసుకుంటూ పోతారు. కానీ ఈ డైమెన్షన్స్ అన్నింటికీ ఉండే గమ్యం ఒకటే సృష్టి లయబద్ధంగా ముందుకు సాగడానికి పనిచెయ్యడం! అందుకే కొందరు ఎమోషన్స్‌లో కొట్టుకుపోతూ థర్డ్ డైమెన్షన్స్‌లో ఆ ఎమోషనల్ ఎనర్జీతో కర్మలు చేస్తూ మేటర్ని సృష్టిస్తూ పోతే.. ఆ దశని దాటి వచ్చిన మరికొందరు ఐదవ డైమెన్షన్ నుండి మూడవ డైమెన్షన్ వారికి “ఇది మంచి ఇది చెడు” అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. చేయాల్సిన కర్మలు పూర్తి చేసుకున్న థర్డ్ డైమెన్షన్ వ్యక్తులు మాత్రమే ఈ ఐదవ డైమెన్షన్ వ్యక్తులు అన్ కండిషనల్ లవ్‌తో, విజ్డమ్తో చెప్పే విషయాలు స్వీకరించి ఆ థర్డ్ డైమెన్షన్ నుండి తమని తాము విముక్తం చేసుకుని కొత్త డైమెన్షన్ని మానసిక స్థితిలో సాధిస్తే.. మిగతా వారంతా ఆ విజ్డమ్ని అర్థం చేసుకునే శక్తి లేక అపహాస్యం చేస్తూనో, విస్మరిస్తూనో, తమ బాధల్లో తాము కొట్టుకుపోతూ పట్టించుకోకుండానో తమ కర్మలు పూర్తి చేసుకుంటూ ఉంటారు.
- Sridhar Nallamothu