ఒక కధ చెబుతాను..
CM కేసీఆర్ ఛార్టెర్డ్ ఫ్లయిట్ కొన్నాడు అని పేపర్లో ఓ వార్త వచ్చింది.
ఓ సామాన్యుడు, ఓ అసమాన్యుడు అయిన ఇద్దరు వ్యక్తులు ఆ వార్త చదివారు.
“ఏదో రోజు నేనూ అలాంటి ఫ్లైట్ ని కొంటాను” అని అసమాన్యుడు అనుకున్నాడు.
ఏదో పేరూ ఊరూ లేని స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న కుర్రాడు అతను. ఆ న్యూస్ చదివినప్పటి నుండి అతను ఇంటర్, ఇంజనీరింగ్, మంచి ఉద్యోగం, ఆ తర్వాత స్వంత స్టార్టప్, కంపెనీ CEO, ఆ తర్వాత ఓ పెద్ద బిజినెస్ టైకూన్ అయ్యే వరకూ అతను చిన్నప్పుడు పేపర్లో చదివిన CM కేసీఆర్, స్వంత విమానం అనే వార్త అప్పుడప్పుడు ఆలోచనల్లో సబ్ కాన్షియస్గా మెదులుతూనే ఉంది. మొత్తానికి బిజినెస్ టైకూన్ గా మారాక స్వంతంగా ఛార్టర్డ్ ఫ్లైట్ కొన్నాడు.
ఇప్పుడు “సామాన్యుడి” విషయానికి వద్దాం. పేపర్లో ఆ వార్త చదవగానే “బలిసినోళ్లు ఏదైనా చేస్తారు” అని నిరుత్సాహంగా అనుకున్నాడు. అంతటితో ఆ ఛార్టర్డ్ ఫ్లయిట్ అనేది తాను బలిస్తే తప్పించి సాధించలేనిది అని అతని సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామ్ అయిపోయింది. “బలిసినోళ్లు” అని అదేదో ప్రత్యేకమైన కేటగిరీని తన మనస్సులో అతను క్రియేట్ చేసుకోవడం ద్వారా.. తాను బలిసినోడిని కాదని అతని సబ్ కాన్షియస్ మైండ్ కి చెప్పకనే చెప్పినట్లు అయింది. అంటే “ఇది నీ వల్ల అయ్యేది కాదు, లైట్ తీసుకో” అని అతని జీవితాంతం ఇలాంటి ఇతరుల ఎదుగుదలని లైట్ తీసుకునేలా, ఎలాంటి ప్రేరణ పొందకుండా అతని మైండ్ అడ్డుకుంటూనే ఉంటుంది.
అందుకే మనం వివిధ విషయాలను చూసే దృష్టిని బట్టి మనం సామాన్యులమా, అసమాన్యులమా అన్నది ఆధారపడి ఉంటుంది. We should program our mind to achieve Impossibilities.
- Sridhar Nallamothu