అదేదో సినిమాలో ఆలీ నోరు తెరిస్తే.. ఫస్ట్ వచ్చే పదం “నో… నో.. నో…” 🙂
మనలో కొంతమంది ఉంటారు.. అవతల మనిషి ఏం చెప్పబోతున్నా… “కుదరదండీ.. అన్ని కాంప్లికేషన్లున్నాయి.. అస్సలు ఎలా అవుతుందనుకుంటున్నారు..” అంటూ మొహం చిట్లించుకుని ఆలీలాగే ఖరాఖండిగా తేల్చి పారేస్తుంటారు.
కానీ కొంతమందిని చూస్తే.. “ఈ ఒక్క మనిషి ఉంటే ఏ పనైనా చేసేయగలం..” అన్నంత నమ్మకం వచ్చేస్తుంది. వాళ్లు మాట్లాడే విధానంలోనే… “అదెంత పని.. ఒకటి రెండు రోజులు కష్టపడితే అయిపోయేదానికి ఎందుకండీ టెన్షన్” అంటూ సమస్యని చాలా తేలిక చేసేస్తారు. అలా ఓ ఉచిత సలహా ఎవరైనా ఇచ్చేయగలరు. కానీ వీళ్లు మాత్రం “మీకెందుకు శ్రమ.. నాకు అప్పజెప్పి మీ పని మీరు చేసుకోండి” అని పూర్తి అభయహస్తం చాపేస్తారు.
ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం తోటి వ్యక్తికి చేతనైనంత చేద్దామన్న ఆలోచనతోనే బ్రతికే ఇలాంటి మనుషులు అదృష్టవశాత్తు నా జీవితంలో అనేకమంది తారసపడ్డారు.
అనేకమంది “కంప్యూటర్ ఎరా” రీడర్స్ నేను చాలామందికి సాయపడుతున్నానన్నట్లు నన్ను గొప్పగా ట్రీట్ చేస్తుంటారు. కానీ నా దృష్టిలో చాలామంది గొప్ప వ్యక్తులున్నారు. వాళ్లు నా పట్ల గౌరవం కొద్దీనో, అభిమానం కొద్దీనో, లేదా ఏదో ఒక అవసరం కొద్దీనో సాయపడలేదు, పడట్లేదు. వాళ్ల నేచరే అంత గొప్పది. ఆణిముత్యాలు. వాళ్లని చూస్తుంటే కొండంత ధైర్యమొస్తుంది. వాళ్లలా ఉండాలన్పిస్తుంది.. కానీ మేగజైన్ దగ్గర్నుండి ఒక్కడినా చేయాల్సిన పనులు తలకు మించి ఉన్నందున వాళ్లలా రీడర్స్ ప్రతీ ఒక్కరికీ వ్యక్తిగతంగా సాయపడే సమయమూ, ఓపికా లేక నిట్టూర్పుతో ఆగిపోవలసి వస్తుంటోంది. కానీ నాకు తెలుసు… నాకన్నా వాళ్లు చాలా గొప్ప వాళ్లని.
ఎవరైనా సాయం కోసం వచ్చినప్పుడు.. సహజంగానే మనం సాయం చేయకపోగా చులకనగా చూడడం, డిజప్పాయింటెడ్గా మాట్లాడడం గొప్పగా భావిస్తుంటాం. మనం ఓ నవ్వు నవ్వి మాట్లాడితే అవతల మనిషి మనస్సు తేలికవుతుంది. ఎన్నో ఇబ్బందుల్లో విపరీతంగా ఆలోచించేసి బాధపడుతున్న జనాల్ని మళ్లీ నిరుత్సాహంగా మాట్లాడేసి మరింత కుంగదీయడం కరెక్ట్ కాదు కదా? మనం సాయం చెయ్యకపోయినా.. ఆ పని అవుతుందన్న ధీమా ఇవ్వగలిగితే ఆ కొంత పాజిటివ్ ఎనర్జీ చాలదా అవతల వ్యక్తి పుంచుకోవడానికి?
“నీకు నేనున్నాను” అనే ధీమా అస్సలు మనం ఎంతమందికి ఇవ్వగలుగుతున్నాం? డొల్ల రిలేషన్లని ఎమోషనలైజ్ చెయ్యడానికి “నీకు నేను లేనూ..” అని ఓ గొప్ప అలెగ్జాండర్లా ఫోజులివ్వడం కాదు.. నిజంగా ఎంతమందికి మనం ఏ క్షణమైనా ఉన్న ఫళాన ఆదుకోవడానికీ, సాయం చేయడానికీ ముందుకు రాగలం?
ఎవరెలా పోయినా.. ఎవరి గురించీ మనకు పట్టకపోయినా మనం దర్జాగానే బ్రతుకుతాం… కానీ సాటి మనిషికి చేయగలిగీ ఏమీ చెయ్యలేకపోయామే అనే ఓ తెలీని వెలితి మనస్సులో ఎప్పటికీ తీరదు.
మనుషుల్ని చూసి భయపడడమో, భయపెట్టడమో, కోప్పడడమో, ద్వేషించడమో, చిరాకు పడడమో, డిజప్పాయింట్ చేయడమో.. ఇలా దూరంగా నెట్టి పారేయడం మానేస్తే… మనుషులు సహజంగానే మనల్ని పెనవేసుకుపోతారు. అదీ మానవత్వం!
– నల్లమోతు శ్రీధర్