మొన్న ఓ హోటల్ లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను.. 40-50 ఏళ్లు వయస్సున్న చాలా డిగ్నిఫైడ్‌గా ఉన్న మరో నలుగురూ పక్కన వెయిట్ చేస్తున్నారు.
లిఫ్ట్ క్రిందికి రావడానికి ఓ అర నిముషం వెయిట్ చేయాల్సొచ్చింది.. అంత ఓపిక లేక వాళ్లల్లో ఒకాయన "ఇది ఇండియా కదండీ.. ఇలాగే ఉంటుంది" అన్నారు. లిఫ్ట్ కోసం వెయిట్ చెయ్యడానికీ ఇండియాకీ సంబంధం ఏమిటో అర్థం కాలా..! అతను వేసుకున్న డ్రెస్ ద్వ
సరే లిఫ్ట్ వచ్చింది.. నేనూ, వాళ్లూ, మరో ముగ్గురు అమ్మాయిలూ లిఫ్ట్‌లో ఎక్కారు.
లిఫ్ట్‌లోకి ఎక్కాక ఆ సోకాల్డ్ డిగ్నిఫైడ్ పీపుల్ ఆ అమ్మాయిల వంక కొద్దిగా ఇబ్బందికరంగా చూడడం మొదలెట్టారు. మరి ఇండియాలో ఇలా సంస్కారహీనంగా ప్రవర్తించడం తప్పు కాదా? ఇండియాని చులకనగా మాట్లాడే వ్యక్తికి ఇండియా వంటి సభ్యదేశంలో చులకనగా ప్రవర్తించే హక్కు ఎవరిచ్చారు?
వాళ్లల్లో ఒక్కరూ ఫారినర్స్ లేరు.. అందరూ ఇండియన్సే.. ఇంకా చెప్పాలంటే సగం ఇంగ్లీషూ, సగం తెలుగూ మాట్లాడుతున్న తెలుగువాళ్లే.
వాళ్ల మాటల్ని బట్టి కొన్నేళ్లో, కొన్నిరోజులో విదేశాల్లో ఉండి ఉండొచ్చు. అంత మాత్రానికే పుట్టిపెరిగిన దేశం మీద అంత చిన్నచూపా?
సరే వాళ్లని పక్కనబెడదాం… బయట చూడండి.. ట్రాఫిక్ జామ్ అయితే "చెత్త ఇండియా" అంటారు. క్యూలో కాసేపు నిలబడాల్సి వస్తే ఇండియాని తిట్టడమే, ఓట్లు వేసి సరైన నాయకుల్ని ఎన్నుకోవడానికి క్యూలో నిలబడాలన్నా ఇండియాని ఒకటికి పదిసార్లు తిట్టడమే. ఎవరైనా తమ ఆత్మీయుల గురించి ఫీల్ అవుతుంటే "పూర్ ఇండియన్ సెంటిమెంట్స్" అంటున్నాం.. క్రికెట్ మ్యాచ్‌లో ఓడిపోతే తిట్టేదీ ఇండియానే.
ఇండియా అంటే ఎందుకంత చులకన?
ఇవ్వాళ అమెరికా వెళ్లారేమో గానీ, ఇవ్వాళ రకరకాల నగరాలూ, రకరకాల కల్చర్స్ చూస్తున్నారేమో గానీ.. మనం పుట్టింది ఎక్కడ? ఇండియాలో కాదా? చిన్నప్పుడు వర్షం పడితే బురదగుంటల్లో కాళ్లీడ్చుకుంటూ స్కూళ్లకు వెళ్లిన రోజులు గుర్తులేవా? అప్పుడు మాత్రం దేశం మనల్ని భరించాలి. ఇప్పుడు మాత్రం మనకూ నోళ్లు వచ్చాయి కాబట్టి దేశాన్ని ఏమైనా అనేస్తాం? అంతేనా? అప్పుడే దేశం మనల్ని వెలేస్తే ఎక్కడెళ్లి బ్రతికేవాళ్లం? ఒబామా వచ్చి అక్కున జేర్చుకునేవాడా?
మన దేశంలో మొదటి నుండీ మౌలిక సదుపాయాలు తక్కువని మనకు తెలుసు.. ఏం చేస్తాం? సర్థుకుపోలేమా?
సరే వ్యంగ్యపు మాటలతో దేశాన్ని తిట్టి ఏమైనా సాధిస్తున్నామా? మౌలిక సదుపాయాలు పెంచుతున్నామా? అస్సలు ఇండియాని తిడుతూ ఇండియాలో బ్రతికే హక్కు నౌతికంగా మనకు ఉందా?
పెళ్లిళ్లు చేసుకోవడానికి కట్టూబొట్టూ ఉన్న భారతీయ అమ్మాయిలు కావాలి.. తినడానికి ఆంధ్రా ఆవకాయ పచ్చడి కావాలి.. ఆపదొస్తే వాటేసుకుని ఏడవడానికి ఇండియాలో ఉన్న బంధువులు కావాలి… కానీ ఇండియా అంటే చులకన! ఇక్కడ బ్రతికే వాళ్లకైనా, అక్కడ బ్రతికే వాళ్లకైనా..!!! 🙁
ఖరీదైన సూటూ, బూటూ, కోట్ల మధ్యనో, గుభాళించే పెర్ఫ్యూమ్ల మధ్యనో మన చవకబారు నైజాన్ని దాచుకోలేం…
ఆ కోట్లు ఖరీదైనవైనా ఆడది కన్పిస్తే తేరిపారా జుగుప్సాకరంగా కదలాడే కనుగుడ్ల కదలికల్ని మాత్రం దాచుకోలేం.
చదువుకుని దర్జాలు వలకబోసేవారే ఇలా దేశాన్ని, ఇక్కడి మనుషుల్నీ చులకనగా చూస్తే చదువుకోని వారి పరిస్థితేమిటి?
ఆలోచిద్దాం..
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్