ఏక్సిడెంట్ వల్ల మణికట్టు బోన్ కి స్క్రూ వేసి ఆపరేషన్ చేసి 3 నెలలు బరువుగా, అసౌకర్యంగా ఉండే పిండికట్టుని వేసిన తర్వాత 9 ఆగస్ట్ రోజు (5 రోజుల క్రితం) ఆ కట్టుని తొలగించారు. ఆత్మీయులు ఎందరో నాకు యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పటి నుండి వచ్చి వెళుతూ ఉన్నారు. అసలు ఇలా ఇంతమంది నన్ను ఆదరించే మిత్రులు ఉన్నారని నేను ఊహించలేదు.. క్షణం తీరికలేకుండా బిజీగా ఉండే వారెందరో రోజూ దాదాపు ఒకరిద్దరు ఈ 3 నెలలపాటు వచ్చి వెళుతూనే ఉన్నారు. వివిధ కారణాల వల్ల స్వయంగా రాలేక ఫోన్ ద్వారా పరామర్శించిన ఇతర మిత్రుల కోసం కట్టుమీద ఉన్నప్పుడూ, కట్టు తీసేసిన తర్వాత నేను తీసుకున్న ఫొటోలను ఇక్కడ ఉంచుతున్నాను.

ఇదేమైనా గొప్ప విషయమా షేర్ చేసుకోవడానికి అనీ, సానుభూతి కోసమనీ నా వేవ్ లెంగ్త్ అర్థం కాని కొందరు అపార్థం చేసుకోవచ్చు. అలాంటి వారి కోసం కాదు ఇవి షేర్ చేసుకుంటున్నది.
యాక్సిడెంట్ లో అతి ముఖ్యమైన బోన్ విరిగి ముక్కలుగా దూరమైందని ఆర్థోపెడిక్ డాక్టర్ చెప్పి, స్క్రూ వేసి ఆపరేషన్ చేయాలని చెప్పిన క్షణం ఇప్పటికీ నా కళ్ల ముందు ఉంది. 2-3 నెలలు ఆ చేత్తో ఏ పనీ చేయలేరనీ, పూర్తిగా కట్టు మీద ఉంటుందనీ చెప్పడం మరో షాకింగ్ న్యూస్ నాకు. కారణం 2001 నుండి 2010 వరకూ కంప్యూటర్ ఎరా మేగజైన్ మొత్తాన్నీ నేను ఒక్కడినే రూపొందిస్తూ ఉన్నాను. అంతకాలం పాటు మేగజైన్ విడుదల చేయలేనంటే, రీడర్స్ కీ నాకూ ఉన్న అటాచ్ మెంట్ కొద్దీ అది ఎంత బాధాకరమైన విషయమో నాకే తెలుసు. ఆ వాస్తవాన్ని 1-2 గంటల్లో జీర్ణించుకుని, అప్పటికప్పుడు అపోలోలో అడ్మిట్ అయి మరుసటి రోజు సర్జరీ చేయించుకుని.. మే 12న సర్జరీ జరిగిన రోజు నుండి ఇప్పటివరకూ 3 నెలలు కట్టు మీద ఉండడం ఓ మరిచిపోలేని అనుభవం.
నాకు నేను పరిపూర్ణ వ్యక్తిగా, పరిపక్వత కలిగిన వ్యక్తిగా నిరూపించుకోవడానికి ఈ 3 నెలలనూ వాడుకున్నాను. అనూ తెలుగు టైపింగ్ ఎంత కష్టమో దాన్ని వాడిన వారికి తెలిసే ఉంటుంది. ఈ 3 నెలల్లో ఒంటిచేత్తో అనూతో తెలుగులో టైపింగ్ చేస్తూ అనేక టెక్నికల్ పోస్టులు చేశాను, రోజుకి ఒకటి చొప్పున 90 వరకూ టెక్నికల్ వీడియోలను ప్రిపేర్ చేశాను. తెలుగు సాంకేతిక భాషానిర్మాణంపై నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన రోజు నుండి నాలుగైదు రోజుల పాటు ఆ ఒంటిచేత్తోనో ఎంతోమందికి వేగంగా తెలుగులో అనూతో స్పందనలు టైప్ చేశాను. వీటన్నింటినీ గొప్పకోసం చెప్పట్లేదు. నేను మనసు, ఆలోచనలు, మనస్థత్వాలూ వంటి అంశాలపై సంపాదకీయాలూ, విశ్లేషణలూ చేస్తుంటానని మీకు తెలిసిందే. మనసు యొక్క మర్మంకొంతవరకైనా అర్థం చేసుకుని భౌతికమైన శరీరపు బాధ మనసుని చేరకుండా దేనికి దాన్ని దూరంగా ఉంచడం ద్వారా ఎలాంటి పరిస్థితిలో అయినా మనం మన పనులు చేయవచ్చనీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుగు వారందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న నా లక్ష్యానికి ఈ సంఘటన, భౌతికమైన గాయం ఏమాత్రం అవరోధంగా మిగల్లేదనీ నాకు నేను నిరూపించుకోవడానికే కసిగా కష్టపడ్డాను.
సరిగ్గా ఈ సమయంలోనే తెలుగు భాషారక్షణ పేరుతో నేను మిత్రుల్లో ఆలోచన రేకెత్తించ ప్రయత్నించినప్పుడూ, ఇతర ఒకటి రెండు సందర్భాల్లోనూ కొందరు మిత్రులు నా గురించి అవహేళనగా మాట్లాడుకోవడం నా దృష్టికి వచ్చింది. వారి హ్రస్వదృష్టిని చూసి నవ్వుకున్నాను తప్ప వారి అవహేళనలు నన్ను బాధించలేకపోయాయి. అలాగే నన్ను మానసికంగా గాయపరచాలనీ పరుష పదజాలంతో కొందరు ప్రయత్నించారు. నా లక్ష్యం ముందూ, నా చిత్తశుద్ధి ముందూ, మరీ ముఖ్యంగా ప్రాక్చర్ తో ఓ గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటూ కూడా పనిచేసుకుంటూ ఉన్న నా మానసిక స్ధితి ముందు ఎవరు నన్ను ఏం చేయగలరు?

గత 3 నెలల కాలంలో జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలూ, జీవితంపై మరింతగా నాకు కలిగిన అవగాహనా వీలువెంబడి మిత్రులతో వివరంగా పంచుకుంటాను. ఇంతగా ఆత్మీయత కనబరిచిన మిత్రులందరికీ, నాకు స్వస్థత చేకూరాలని భగవంతునికి ప్రత్యేకంగా పూజలు చేసిన ఓ 10 మంది వరకూ పాఠక మిత్రులకూ, భగవంతునికీ, మెయిల్స్ ద్వారా, ఫోన్ల ద్వారా ఆశీస్సులు తెలిపిన పాఠకులకూ నా హృదయపూర్వక ధన్యవాదాలు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్