గతంలో ఓసారి చెప్పినట్లు రాత్రి సమయంలో విజయవాడ మెస్ ఎప్పుడు మొదలుపెడతారా అన్నంత ఆత్రంగా నేనూ, రాంబాబూ వెయిట్ చేసే వాళ్లం. 6.45కే రూమ్ నుండి పావు కిలోమీటరు దూరంలో ఉండే మెస్‌కి నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. ఆలస్యంగా వెళితే సాంబార్ తగినంత దొరకదు అనే భయం. ఆ మెస్ ఆంటీని, వాళ్ల అమ్మని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మా ఇద్దర్నీ ఎంతో ప్రేమగా చూసుకునే వారు. అన్నదాతలు వాళ్లు.
ఓసారి ప్రస్తావించినట్లు కొన్నిసార్లు మనస్సు బాలేకపోతే ఇంటికి ఫోన్ చెయ్యాలనిపించేది. మెస్‌కి భోజనానికి వెళుతూ చెన్నై టి.నగర్ సమీపంలోని ఈశ్వరన్ కోయిల్ వీధి చివర ఉండే ఎస్టిడి బూత్‌కి వెళ్లి చీరాల ఎస్టిడి కోడ్ నొక్కి ఉమక్క కాల్ ఎత్తితే “ఎలా ఉన్నావు బాబూ” అని తను అడిగితే “బానే ఉన్నాను” అనే సమాధానం ఎంత బాధని దిగమించుకుని చెప్పే వాడినో! ఒక పూట తింటే మరో పూట తిండి లేక.. ఒక పూట సినిమా హీరోలతో ఫైవ్ స్టార్ హోటల్లో సూప్ తాగుతూ మరో పూట ఆకలికి పస్తులుంటూ.. జీవితం పట్ల తెలీని దిగులు.
మా పెద్దక్క భర్త పెళ్లయిన కొన్నేళ్లకే చనిపోయారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. చనిపోయిన బావ ఉంగరాన్ని నాకు ఇచ్చింది… చేతికి బంగారం లేకపోతే ఎలా అని! ఓసారి ఆకలి, ఇతర అవసరాలకు తాళలేక నా జీవితంలో మొదటిసారి టి.నగర్ రూమ్ సమీపంలోని పాన్ బ్రోకర్ దగ్గరకు వెళ్లాను. దాన్ని తాకట్టు పెట్టి రెండు వేల వరకూ తీసుకున్నాను. అది తీర్చలేక ఆ ఉంగరం అలాగే వదిలేశాను. పాన్ బ్రోకర్ షాపు వైపు వెళ్లాలంటే ఓ అపరాధ భావం ఉండేది. ఊరెళ్లినప్పుడు ఉమక్క ఉంగరం గురించి అడిగితే “ఎక్కడో పోయింది” అని చెప్పాను. ఆరోజు నుండి ఈరోజు వరకూ నా శరీరం మీద బంగారం ధరించలేదు. ఇంట్లో వత్తిడి భరించలేక ఒకటి రెండుసార్లు రింగులు కొన్నా అవి బీరువాలో ఉంటాయి గానీ అవి ఎప్పుడూ ధరించలేదు. మీరెప్పుడైనా చూడండి.. నాకు ఒక రింగ్ ఉండదు, ఓ ఛైన్ ఉండదు. ఎలాంటి ఆభరణాలు ధరించని, వాటి పట్ల ఏ ఆసక్తీ లేని మానసిక స్థితిలో ఉంటాను. బంగారం పట్ల వ్యామోహం లేకపోవడం కాదు ఇది.. ఈ శరీరమే ఈశ్వర ప్రసాదం, దానికి మళ్లీ హంగులు ఎందుకున్న భావన.
ఏవైనా పెళ్లిళ్లకి వెళ్లేటప్పుడు చూడడానికి బాగోదని మెడలో ఛైన్ వేసుకోమని ఉమక్క భరత్ బావ పులిగోరు ఛైన్ ఇచ్చేది. అస్సలు వేసుకునే వాడిని కాదు. ఈ దేహం నా దృష్టిలో ఓ వాహకం మాత్రమే.
క్రేజీవరల్డ్ పత్రికకు కంట్రిబ్యూట్ చేసే సోదరుడు విజయ్ వర్మ ఓరోజు విజయవాడ నుండి చెన్నై వస్తూ.. కంప్యూటర్ రూమ్‌లో కూర్చున్న నా దగ్గర స్టూల్ వేసుకుని కూర్చుని
“శ్రీధర్ నువ్వు ఓ బుక్ రాసి పెడతావా, మెటీరియల్ నేను ఇస్తాను. 5000 ఇస్తాను” అని చెప్పాడు.
బుక్ రాయడం నాకు అతి చిన్న పని. అదీ గాక ఆర్థికంగా చాలా కష్టంగా ఉండేది.
“సరే వర్మా” అన్నాను. ఆ బుక్ పేరు “స్కాలర్షిప్లు పొందడం ఎలా”!
ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించడానికి ఇండియాలోనూ, ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్న వివిధ విశ్వవిద్యాలయాల స్కాలర్‌షిప్‌ల వివరాలు, వాటికి అప్లై చేసుకోవడం ఎలాగన్నది ఆ బుక్‌లో రాయాలి. తను మెటీరియల్ ఇచ్చాడు. దాన్ని రోజుకి ఇన్ని పేజీల చొప్పున సూపర్‌హిట్, క్రేజీ వరల్డ్‌ల పనికి ఇబ్బంది లేకుండా నేరుగా సిస్టమ్‌లోనే రాయడం, పేజ్ లేఅవుట్ చేసి సిద్దం చేశాను. బుక్ పూర్తయ్యాక వర్మ ఐదు వేల రూపాయల ఛెక్ ఇచ్చాడు. నా జీవితంలో మొదటిసారి ఛెక్ ఎలా ఉంటుందో చూశాను. ఎగ్జామినేషన్ లాంటి వాటికి ICWAI చదివేటప్పుడు DD తీసిన అనుభవం ఉంది కానీ ఛెక్ని పట్టుకుంది అప్పుడే!
ఆ ఛెక్ మీద Nallamothu Sridhar అనే పేరు, అమౌంట్ దగ్గర 5000 అనే సంఖ్యని ఎన్నిసార్లు చూసుకున్నానో! ఆఫీస్ నుండి రూమ్‌కెళ్లి కూడా దాన్ని నలగకుండా జాగ్రత్తగా సూట్‌కేసులో పెట్టుకుని, మధ్య మధ్యలో రూమ్మేట్ రాంబాబు గమనించకుండా, ఏదో పని ఉన్నట్లు సూట్కేసుకి అడ్డుగా కూర్చుని ఆ ఛెక్ తడిమి చూసుకుని మళ్లీ జాగ్రత్తగా పెట్టేవాడిని.
ఆ ఛెక్ మార్చుకోవడానికి నాకు బ్యాంక్ అకౌంట్ లేదు. అక్కడ ఓ మిత్రుడి సహకారంతో పాండీ బజార్లో ఓ బ్యాంక్‌లో అకౌంట్ తీసుకున్నాను. ఓ శనివారం మధ్యాహ్నం అనుకుంటా.. రాంబాబూ, నేనూ ఛెక్ తీసుకుని మెస్కెళ్లి అటు నుండి అటు వెళ్లాం అకౌంట్ కోసం! అలా మెస్‌లో లంచ్ చేశాక నేను ముందే బయటకు వచ్చి, వెనుక రాంబాబు వచ్చేలోపు మళ్లీ ఇంకోసారి ఛెక్ని అపురూపంగా చూసుకున్నాను.
వర్మ కోసం రాసిపెట్టిన ఆ “స్కాలర్షిప్లు పొందడం ఎలా” అనే బుక్‌ని నేను తర్వాతి కాలంలో హైదరాబాద్ వచ్చి వర్మ రూమ్‌లో ఉండేటప్పుడు మంద కృష్ణ మాదిగ మా రూమ్‌కి వచ్చి కొనుక్కెళ్లారు. ఆయన నా ఎదురుగా కూర్చుని బుక్ పరిశీలనగా పేజీలు తిప్పి డబ్బులిచ్చి తీసుకెళ్లడం నా కళ్ల ముందు ఉంది.
“ఈ మనిషేంటి ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ తెగ కష్టపడిపోతుంటాడు” అని చాలామంది నన్ను దగ్గరగా చూసిన వాళ్లు అనుకునే వారు. 2015 తర్వాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు, తిరుగుళ్లు కూడా జీవితంలో భాగం చేసుకున్నాను గానీ అంతకుముందు పూర్తిగా రోజుకి 15-18 గంటలు పనిచేసేవాడిని. సినిమాలు చూడడం మొదలుపెట్టాక కూడా ఒకటే చెప్పుకునే వాడిని. దాన్ని అందంగా రివార్డ్ మెకానిజం అని పిలుస్తారు.. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు! “వారం రోజులు రోజుకి కనీసం 14 గంటలు వర్క్ చేస్తేనే శుక్రవారం కొత్త సినిమా చూడాలి, లేదంటే సినిమా క్యాన్సిల్” అని నా మైండ్‌కి బలంగా చెప్పుకునే వాడిని. దాంతో సినిమా కోసమైనా వర్క్ చేసేవాడిని.
మా తాతయ్య, అమ్మమ్మ పొలం వెళ్లి కాళ్లకి పుళ్లు పడేలా పనిచేసి, సంవత్సరానికి ఓ ముప్ఫై వేలు సంపాదించిన దానితో పోలిస్తే నా కష్టమెంత, అసలు ఇంత సుఖపడుతూ ఎంతో కష్టపడినట్లు ఫీలైపోయే వారిని చూస్తే, వారి మానసిక స్థితిని చూస్తే నాకు జాలేస్తుంది. మా అమ్మమ్మ మా పొలమే కాకుండా, ఇతర పొలాల పనులకి కూలీకి వెళ్లేది.. రోజుకి ఆమెకి పది రూపాయలు వచ్చేది. అప్పట్లో పది రూపాయలు ఈరోజు వంద రూపాయలతో సమానం అనుకున్నా ఆ పది రూపాయల కోసం రోజంతా పొలంలో ఎండలో కష్టపడే దానితో పోలిస్తే మన బ్రతుకులెంత!
నా జీవితం నాకు చాలా నేర్పించింది.. ఎలా అణుకువగా ఉండాలో.. ఎలా కష్టపడాలో, ఎలా ఇతరులకి గౌరవం ఇవ్వాలో, ఎలా అందరితో ప్రేమగా ఉండాలో! ఇవన్నీ నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్లకి వెళ్లి నేర్చుకున్న అతుకుల బొంత క్వాలిటీస్ కావు.. జీవితంలో ప్రతీ కష్టాన్నీ అనుభవించి నా వ్యక్తిత్వంలో భాగంగా చేసుకున్నవి!
మరో భాగంతో మళ్లీ కలుస్తాను.
- Sridhar Nallamothu