“శ్రీధర్ గారికి నమస్కారం, మీ రచనా శైలి బాగుంటుంది. క్రేజీ వరల్డ్ మాసపత్రికలో సబ్-ఎడిటర్ పోస్టు ఖాళీగా ఉంది. మీకు ఆసక్తి ఉంటే చెన్నై ఆఫీసుకి వచ్చి వివరాలు మాట్లాడవచ్చు.
ఇట్లు
మీ బి. జయ”
అంత చిన్నవాడిని “గారు” అని సంబోధించే సంస్కారం ఆమెలో ఉండేది. కోపమొస్తే అంతే తిట్టేది కూడా!
కర్నూలు అకౌంటెంట్‌గా 1200 రూపాయలకి పనిచేస్తున్నప్పుడు నాకు వచ్చిన ఇన్లాండ్ లెటర్ అది. ఇలా లెటర్ రావడానికో చరిత్ర ఉంది.
గతంలో సివిల్స్ ప్రిపేర్ అవడానికి రకరకాల పత్రికలు కొనే వాడిని కదా. ఆ క్రమంలో క్రేజీ వరల్డ్ అనే పత్రికనూ కొనేవాడిని. అందులో ఓసారి “స్టూడెంట్ జర్నలిస్టులు కావలెను” అని, చదువుకునే వారు ఎవరైనా, వివిధ సామాజిక అంశాల మీద వారి వ్యాసాలను రాసి పోస్ట్ చేస్తే వాటిని పరిశీలించి అర్హమైన వాటిని ప్రచురిస్తాం” అని దాని సారాంశం.
అప్పటికే నాకు పత్రికా వృత్తిలో చిన్నపాటి అనుబంధం ఉంది. మా జమ్ములపాలెంలో అగ్ని ప్రమాదాలు గానీ, ఇంకేవైనా సంఘటనలు గానీ జరిగితే ఓ చిన్న ఐటెమ్ రాసి, బాపట్ల రధం బజారులో ఉండే పాపులర్ షూ మార్ట్ దగ్గర పోస్టు డబ్బాలో వేసి వచ్చే వాడిని. అక్కడికి అప్పటి ఈనాడు రిపోర్టర్ బక్షి గారు, ఇతరులు వచ్చి వార్తలు సేకరించుకునే వారు. అలా నేను పోస్టు చేసిన మా ఊరి వార్తలను నా పేరు లేకపోయినా ఒకటి రెండుసార్లు ముద్రణలో చూసుకుని, “ఇది నేనే రాశాను మన ఊరి గురించి” అని మిత్రులకి గొప్పగా చెప్పుకునే వాడిని. మా ఊరు మొత్తం నన్ను చులకనగా చూసే వయస్సులో అది నాకు ఓ ఊరటలా అన్పించేది.
బాపట్ల ఆర్ట్స్ కాలేజీ నుండి మా ఊరు రిటర్న్ రావడం కోసం షరాఫ్ బజార్లో మస్తాన్ టైలర్ షాపులో వెయిట్ చేస్తూ అక్కడే ఓ స్టేషనరీ షాపులో కొనుక్కున్న A4 పేపర్ల మీద నీట్‌గా రకరకాల అంశాలపై వ్యాసాలు రాసి వాటిని కవర్లో పెట్టి, చెన్నై క్రేజీ వరల్డ్ ఆఫీసు అడ్రస్ రాసి, గడియార స్థంభం దగ్గర ఉండే పోస్టాఫీసులో పోస్ట్ చేసేవాడిని. తర్వాత నెలలో నా పేరుతో ఆ ఆర్టికల్స్ క్రేజీ వరల్డ్‌లో వచ్చేవి. ఆ పేరు, నా ఆర్టికల్ చూసుకుని మురిసిపోయే వాడిని. అగాధంలోకి కూరుకుపోతూ, సమాజం నన్ను లెక్కచెయ్యకపోయినా, నన్ను నేను మానసికంగా నిలబెట్టుకోవడానికి ఈ ప్రయత్నం సహాయం చేసేది.
అలా క్రేజీవరల్డ్తో అనుబంధం బాపట్ల నుండి కర్నూలు వెళ్లాక కూడా కొనసాగింది. ఆర్టికల్స్ రాయడం, అవి ప్రచురించాక చూసుకోవడం.. అదే సమయంలో “ఎవరికైనా కెరీర్ గైడెన్స్ కావాలంటే లెటర్ రాయొచ్చంటూ, ఓ కౌన్సెలింగ్ మొదలుపెట్టాం నేనూ, కర్నూలులో నా రూమ్మేట్ కర్నాకర్”. అవీ లెటర్స్ వచ్చేవి. నేను సరిగా సెటిల్ అవకపోయినా అప్పట్లోనే ఇతరులకి గైడెన్స్ ఇచ్చేవాడిని. అది రెండు దశాబ్దాల తరబడి ఇలా కొనసాగుతూ ఇప్పుడు యువతకి గైడెన్స్ ఇచ్చే స్థాయికి చేరింది.
బి. జయ గారి గురించి చెప్పాలి. ఎన్నో సినిమాలకు, ఎందరో హీరోలకి PROగా పనిచేసి ఇటీవల చనిపోయిన BA రాజు గారి భార్య ఆమె. జయగారు స్వతహాగా ఓ గొప్ప జర్నలిస్టు. అలాగే మహిళా దర్శకురాలిగా ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, వైశాఖం, లవ్లీ వంటి అనేక సినిమాలకి దర్శకత్వం వహించారు. నా జీవితంలో నేను అభిమానించే అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆమె ఒకరు. నాలుగేళ్ల క్రితం చనిపోయారు.
జయ గారి నుండి క్రేజీ వరల్డ్ పత్రికకి సబ్-ఎడిటర్‌గా అవకాశం ఉందని లెటర్ రాగానే మొట్టమొదట నా కళ్లని నేను నమ్మలేదు. కలగంటున్నానా అని కళ్లు నులుముకుని ఆ లెటర్ ఓ నాలుగు రోజుల పాటు ఎన్నిసార్లు చదువుకున్నానో తెలీదు. రూమ్మేట్ కర్నాకర్ సంతోషించాడు. ఏదో పని మీద చెన్నిపాడు నుండి కర్నూలు వచ్చిన మా నాన్నకి చెప్పాను.. “ఆలోచించుకో, నీకు వెళ్లాలనిపిస్తే నీ ఇష్టం” అన్నారు.
మా ఉమక్కకి ప్రతాణం (పెళ్లి చేసినప్పుడు చీర, సారె పెట్టేది) పెట్టే సూట్‌కేసు ఒకటి పెట్టారు. జమ్ములపాలెం నుండి నేను కర్నూలు వెళ్లేటప్పుడు ఉమక్క నా బట్టలు సర్ధుకోవడానికి ఆ సూట్ కేస్ ఇచ్చింది. దాంట్లో బట్టలు సర్ధుకుని ఓరోజు సాయంత్రం ఆరు గంటలకి కర్నూలు బస్టాండులో చెన్నైకి ఆర్టీసి బస్ ఎక్కాను. మిత్రుడు కర్నాకర్ బస్ ఎక్కించాడు. నాన్న వచ్చారో లేదో గుర్తు లేదు. బస్టాండ్ నుండి బస్ కదులుతుంటే తెలీని ఓ దిగులు. బస్ కర్నూలు దాటేటంత వరకూ అన్ని పరసరాలూ అలా చూస్తూ దిగులతో కూర్చున్నాను. ఒక్కడినే ప్రయాణం చెయ్యడం అది మొదటిసారి. ఆ క్షణానికి ఎవరూ లేని ఒంటరిని.
చెన్నై బస్టాండ్‌లో బస్ దిగి సూట్‌కేసు పైన ర్యాక్ నుండి దించుతుంటే బట్టల బరువుకి హ్యాండిల్ ఊడిపోయింది. సూట్‌కేసు చాలా బరువుగా ఉంది. చంకలో అంత బరువున్న సూట్కేసుని అలాగే పెట్టుకుని రెండో చేయి క్రింద పడిపోకుండా సపోర్ట్ పెట్టుకుని కర్నూలు బస్ దిగి కొడంబాకం వెళ్లాలి అని అంటే ఏదో నెంబర్ బస్ చెప్పారు. అది ఎక్కాను. కండక్టర్ కొండబాకం అని అరస్తుంటే దిగాను. అక్కడ పవర్ హౌస్ ఎక్కడ అని అడిగితే మూడు కిలోమీటర్లు వెళ్లాలి అని చెప్పారు. రిక్షా కోసం చూశాను. అన్నీ ఆటోలు కన్పిస్తున్నాయి గానీ రిక్షా కన్పించలేదు. అప్పటి వరకూ జీవితంలో ఆటో ఎక్కలేదు. ఎంత తీసుకుంటారో, మళ్లీ ఖర్చులకి డబ్బులు తగ్గిపోతాయి అని భయం. అందుకే అలా సూట్‌కేసు చంకలో మోస్తూ ఓ అరకిలోమీటర్ నడిస్తే రిక్షా కన్పించింది. పవర్ హౌస్ వెళ్లాలి అన్నాను. తమిళ్, ఇంగ్లీష్ రావు తెలుగు తప్పించి! సరే ఎక్కించుకున్నాడు.
పవర్ హౌస్ చేరుకున్నాక అక్కడ ఓ పబ్లిక్ బూత్ నుండి క్రేజీ వరల్డ్ ఆఫీసుకి కాల్ చేశాను. ఎవరో ఎత్తారు.. అక్కడికి ఓ వంద మీటర్ల దూరంలోనే ఆఫీస్ అట. ఓ పాత బడిన బంగ్లా అది, అందులోనే ఆఫీసు! గేటు తీసుకుని లోపలికి వెళ్లాను. నా జీవితం అక్కడ మలుపు తిరిగింది. మిగతా మరో భాగంలో!
- Sridhar Nallamothu