మా అమ్మకి పెళ్లి చేసేటప్పుడు మా తాతయ్య ఐదెకరాల పొలం పెట్టారు. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే ఆ పొలాన్ని స్వాధీనం చేసుకుని మా అమ్మకి చెందేలా చెయ్యడానికి మా తాతయ్య చాలా ప్రయత్నించారు. ఆ గొడవల్లో మా నాన్నగారి తమ్ముడు బాబాయి ఓరోజు ఆ పొలంలో మా తాతయ్యపై దాడి కూడా చేశారట. పోరాడి ఆ ఐదెకరాలు మళ్లీ వెనక్కి తీసుకుని నేను పుట్టగానే మా తాతయ్య నా పేరు మీద రాశారు. ఊళ్లో వ్యవసాయం సరిగా లేకపోయినా ఇప్పటికీ ఆ పొలం అలాగే కొనసాగిస్తున్నాను.
మా తాతయ్యకి ముగ్గురు కూతుళ్లు. మా అమ్మ అందరికన్నా చిన్నది. రెండో కూతురు (మా పెద్దమ్మ) భర్త చనిపోవడంతో, అప్పటికే వారి పిల్లలు సెటిల్ కావడంతో పిల్లలకు భారం కాకూడదు అని తన ఇంటికి తెచ్చుకున్నారు.
మా నాన్న రెండో పెళ్లి చేసుకోవడంతో మా అమ్మ మతి స్థిమితం కోల్పోయినా తన దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చూసుకున్నారు.
మా పెద్దక్క భర్త చనిపోయినా మళ్లీ తన దగ్గరకే తెచ్చుకుని చూసుకున్నారు.
60 ఏళ్ల వయస్సులో ఎర్రటి అగ్గిలో పొలంలో కష్టపడేవారు. నాకు ఆ వయస్సులో ఆయన విలువ తెలిసేది కాదు. “కొన్నిసార్లు తాతయ్యకి అన్నం టిఫిన్ ఇచ్చిరా పో” అని నా చిన్నతనంలో ఇంట్లో చెబితే, “ఎండగా ఉంది నేనెళ్లను పో” అని మారాం వేసే వాడిని. క్షమించండి తాతయ్య.. నా జీవితంలో నేను చేసిన తప్పులను మనస్ఫూర్తిగా క్షమించండి. మీరు ఆకలితో మాడిన సందర్భాలూ, మీరూ నేనూ, కృష్ణ కాలువలో దోసిలి పట్టుకుని ఆ మురికి నీళ్లు తాగి కడుపు నింపుకున్న జ్ఞాపకాలూ నా కళ్లెదుట అలా సజీవంగా ఉన్నాయి.
నేను కడుపులో ఉండగా మా నాన్న వదిలేయడంతో మా అమ్మ చాలా మానసిక వేదనకు గురైంది. ఆ ప్రభావం నాపై కూడా పడింది. పుట్టడంతోనే మొహమంతా మచ్చలు. అలాగే ఇప్పటికీ కొన్నిసార్లు నియంత్రించుకోలేని వేదన నన్ను వెంటాడుతూ ఉంటుంది. అదేంటో తెలీదు, ఎందుకొస్తుందో తెలీదు. నా మొహం మీద మచ్చల విషయంలో మా తాతయ్య ఎంత దిగులు పడేవాడో!
“బిడ్డ చక్కగా లేకపోతే రేపు జనాల్లో నామోషీ కాదా” అని ఎన్ని హాస్పిటల్స్ తిప్పాడో! బాపట్లలో భావన్నారాయణ స్వామి గుడి దగ్గర ఉండే వేంకటేశ్వర హోమియో స్టోర్ ఇరుకు మెట్లని తాతయ్య నేనూ ఎక్కుతూ ఉన్న జ్ఞాపకం ఇది రాసేటప్పటికీ నా కళ్ల ముందు ఉంది. అలాగే ఓసారి విజయవాడ తీసుకెళ్లి అప్పుడప్పుడే వస్తున్న కాస్మొటిక్ సర్జరీ గురించి మాట్లాడి, ఆ ఖర్చు పెట్టుకునే స్థోమత లేక ఆగిపోయాడు.
నేను మజ్జిగ తాగను. మజ్జిగ తాగకపోవడం వల్ల ఆ మచ్చలు తగ్గట్లేదేమోనని నా చేత బలవంతంగా మజ్జిగ తాగించే ప్రయత్నం చేశాడు. ఓ చిన్న విషయానికే ఇంత శ్రద్ధ తీసుకున్నాడంటే ఆయన వ్యక్తిత్వం అర్థం చేసుకోవచ్చు.
తాతయ్యా, నేనూ మా ఇంటి గుమ్మంలో అరుగు మీద సాయంత్రానికి కూర్చునే వాళ్లం. మా పెద్దమ్మ ఇద్దరికీ కాఫీ గ్లాసులు తెచ్చి ఇచ్చేది. “సీతమ్మకి చేయిస్తి చింతాకు పతకమూ, రామచంద్రా” అంటూ ఆయన తనలో తాను పాడుకుంటుంటే నేను అలా చూస్తుండే వాడిని. ఆ పాట కాదు ముఖ్యం, ఆయన ఎంత తాత్విక దృక్పధం, వేదనా కలిగి ఉండే వాడో ఆ తర్వాత అర్థమైంది.
65 ఏళ్లకు పైబడి తాను ఏ క్షణమైనా రాలిపోతారననుకున్నాడో ఏమో నాకు ఇనుపపెట్టె తాళం ఇచ్చి, తాను కష్టపడి సంపాదించిన డబ్బుకి నన్ను పరోక్షంగా యజమానిని చేశారు. పొలంలో కష్టపడడంతో పాటు ఆ వచ్చిన డబ్బుని అవసరం ఉన్న వారికి రెండు రూపాయల వడ్డీకి ఇవ్వడం మా తాతయ్య ఎంచుకున్న ఆర్థిక ప్రణాళిక. ఎవరికైనా డబ్బులు కావాలంటే ఐదు వేలయితే ఐదు రూపాయల కట్టా, పదివేలయితే పది రూపాయల కట్టా, చాలా గొప్పగా అపురూపంగా చూసుకుంటూ ఇరవై రూపాయల కట్టతో ఇరవై వేలు వాళ్లింటికి వెళ్లి ఇచ్చి వచ్చే బాధ్యత నాకు అప్పజెప్పేవాడు. అలాగే ఎవరైనా డబ్బులు ఇస్తే తిరిగి తీసుకు రావడం, ఇనుపపెట్టెలో పెట్టడం నా బాధ్యత.
ఆయన కష్టార్జితంతో సంపాదించిన వందలూ, వేలూ ఇనుపపెట్టె లోపలి అరలో కన్పిస్తుంటే.. “అబ్బాయి, ఓ పదిరూపాయల తీసుకెళ్లి సీతయ్య కొట్లో బజ్జీలు తెచ్చుకుని తిను” అని పొదుపుగా మాట్లాడడం నాకు అప్పట్లో అర్థమయ్యేది కాదు. ఆయన ఎవరి కోసం కష్టపడ్డారు? నా కోసమే కదా! బజ్జీలు ఎప్పుడూ నా కోసమే తప్పించి సంవత్సరానికి ఏ ఒకటి రెండుసార్లో ఆయన తినేవారు, అదీ రెండు మాత్రమే.
గేదెలకి మేత పిలిమించర (పిల్లిపెసర) తీసుకు వద్దామని ఓ రోజు కంకటపాలెం రోడ్డులో ఉండే రెండెకరాల పొలానికి తాతయ్య తీసుకెళ్లాడు. నన్ను అలా పొలం తీసుకెళ్లడం, నాకు ఓ చిన్న మోపు తల మీద పెట్టి ఆ తర్వాత ఒక్కడే బ్యాలెన్స్ చేసుకుని పెద్ద మోపు ఎత్తుకుని ఇద్దరం కలిసి అర కిలోమీటరు నడిచి ఇంటికి చేరి గేదెలకి వేయడం మాకు అలవాటే!
కూర్చుని పిలిమించర తెంపుతుంటే కళ్లమ్మట నీళ్లు తెచ్చుకుంటూ.. “ఏందోరా అబ్బాయ్, ఆమ్మకి నేనంటే పడడం లేదు. నేను టైముకి తినకపోతే ఉండలేను, సమయానికి అన్నం కూడా పెట్టట్లేదు. మళ్లీ ఈ పొలం చీరిక (ఓ చిన్న భాగం) కావాలని అంటోంది” అంటూ బాధపడ్డాడు. నాకు అనునయించే వయస్సు కాదు, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలీదు. ఏడుపు మొహంతో అలా చేలో కూర్చున్నాను ఆయన ఎదురుగా! సరే తమాయించుకుని ఇంటికి చేరాం.
ఆ బాధలో ఉండగా మరుసటి రోజు సాయంత్రం ఎప్పుడూ అడగని వ్యక్తి.. “కొట్టుకెళ్లి ఓ రెండు బజ్జీలు తీసుకురా అబ్బాయ్” అని చెప్పాడు. నేను తీసుకు రాగానే అబఅబగా తిన్నాడు. ఆయనకి హైపర్ టెన్షన్ ఉంది, సుగర్ ఉంది. ఆరోజు రాత్రి పన్నెండు గంటల సమయంలో ఆయనకి స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. మూతి వంకరపోయింది. కాలు చచ్చుబడిపోయింది. ఇంటి వెనుక ఉండే నాగేశ్వరరావు మామయ్య, సజ్జనరావు మామయ్య ఇలా ఇద్దరు ముగ్గురం కలిసి బాపట్ల నుండి కారు తెప్పించి చీరాల హాస్పిటల్కి తీసుకు వెళ్లాం. దాంట్లో ఆయనకి యూరిన్ వస్తుంటే కదలలేని స్థితిలో ఉన్న ఆయన్ని ఎలాగోలో నేనూ, మిగతా వాళ్లం పక్కన ఓ డ్రైనేజ్ కాలువ దగ్గర ఆపి యూరిన్ పాస్ చేయించాం. చీరాలలో డాక్టర్ కోసం మరో అరగంట వెయిటింగ్. హాస్పిటల్ బెడ్ మీద నేను తాతయ్య పక్కన కూర్చుంటే అలాగే నిస్తేజంగా నా కళ్లల్లోకి చూసిన చూపు.. దేవుడా! మీరు నాకు ఇచ్చిన జీవితాన్ని, మీ రుణాన్ని ఎలా తీర్చుకోగలను తాతయ్యా, ఇలా నాలుగు ముక్కలు మీ గురించి రాయడం తప్పించి!
ఇది రాస్తుంటే నా కళ్లమ్మట నీళ్లు అలా కారిపోతూ ఉన్నాయి. ఏడుపు ఆగట్లేదు. మీలాంటి హీరోని నేను నా కళ్లారా చూశాను తాతయ్యా. మీ నుండి కష్టపడడం, గొడ్డు చాకిరీ చెయ్యడం నేర్చుకున్నాను. మీ నుండి ఫలితంతో, డబ్బుతో సంబంధం లేకుండా బ్రతికే విలువలు నేర్చుకున్నాను. పొలమెళ్లి మీరూ అమ్మమ్మ కష్టపడితే సంపాదించే యాభై, వంద రూపాయలకి మీరు పడిన కష్టాన్ని గుర్తు తెచ్చుకునే.. నెలకి ఇరవై వేల జీతంతో ఇరవై ఏళ్ల పాటు “కంప్యూటర్ ఎరా” పత్రికకు చాకిరీ చేశాను. కర్మయోగం అంటే నేను పుస్తకాలు చదివి నేర్చుకోలేదు తాతయ్యా.. నిన్ను చూసి నేర్చుకున్నాను, పుస్తకాలకు, బోధనలకు ఆవల మనుషులు నిజమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారన్నది మీతోనే అర్థమైంది. అలాంటి ఓ ఉదాహరణగా నేను నిలుస్తున్నాను మీ స్ఫూర్తితో!
బాధ్యత తీసుకుంటే ఎంత ధీరోధాత్తంగా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకుని, మా బాగు కోసం మీరు ఎంత తపించారో గుర్తు తెచ్చుకునే.. “యువతకి నాలుగు మంచి మాటలు చెప్పాలి, వాళ్ల జీవితాన్ని నిలబెట్టాలి” అని నేను అనుకున్న సంకల్పానికి కట్టుబడి ఇలా బ్రతుకుతున్నాను తాతయ్యా. మీ జీవితం వేరూ కాదు, నా జీవితం వేరూ కాదు… మీ అంశనే నేనూ కూడా! నువ్వే నా హీరో తాతయ్య!
నాగేశ్వరరావు మామయ్య వాళ్లు “ఓ స్కూటర్ ఊరెళుతోంది.. నువ్వు వెళ్లిపో” అన్నారు. నాకు తాతయ్యతో ఉండాలన్న కోరిక ఉన్నా చెప్పే ధైర్యం లేదు. సరే వెళ్లిపోయారు. మరుసటి రోజు సాయంత్రానికి తాతయ్య చనిపోయారు అని ఓ మనిషి వచ్చి చెప్పారు. మరో గంటకి ఆయన శవం వచ్చింది.
అమ్మ శవానికి తలకొరివి పెట్టేటప్పుడు నా పక్కన ఉండి నాకు ధైర్యాన్ని ఇస్తూ నిలిచావు తాతయ్యా.. ఇప్పుడు ఆ ధైర్యం ఎక్కడ ఉంది? నీకు నేనెలా తలకొరివి పెట్టగలను! నీ శరీరాన్ని నేను తగలబెట్టి ఉండొచ్చు.. కానీ నీ రూపాన్ని నేను తాతయ్యా. నేను బ్రతికున్నంత కాలం నా పనుల్లో, నా ఆలోచనల్లో ఉంటావు.
- Sridhar Nallamothu