కళ్లు తెరిచి చూస్తే చిమ్మ చీకటిగా ఉంది… దూరంగా ఓ చిన్న కాంతి మిణుక్కుమిణుక్కుమంటూ మెల్లగా కదుల్తోంది.. చుట్టూ పడుకున్న ఫ్రెండ్స్ చడీచప్పుడు లేకుండా గాఢనిద్రలో ఉన్నారు.. ఠకాల్మని దుప్పటి మొహంమ్మీదకు లాక్కుని భయాన్ని ఉగ్గబట్టుకుంటూ నిద్రలోకి వెళ్లే ప్రయత్నం.. అంత భయానికి కారణం “ఓ స్త్రీ రేపు రా” పుకార్లు.
అది మా ట్యూషన్… సాయంత్రం స్కూల్ అయ్యాక ఇంటికి కాసేపు వచ్చి స్నానం చేసి.. కొద్దిగా తినేసి ట్యూషన్‌కి వెళ్లడమే. రాత్రి 11 గంటల వరకూ క్రింద నేల మీద బాసింపట్ల వేసుకుని చదవాల్సిందే. “అక్బర్, బాబర్, ఔరంగజేబు, మొదటి పానిపట్టు యుద్దం, రెండవ పానిపట్టు యుద్ధం” కంఠతా వచ్చేంత వరకూ ఎన్నిసార్లు చదివానో. చదివింది ట్యూషన్ పంతులుకి అప్పజెప్పేటప్పుడు… ఆయన చేతిలో బెత్తం పట్టుకుని కూర్చుని వింటుంటే చేతులు కట్టుకుని.. ఓ సీక్వెన్స్‌లో గుర్తు తెచ్చుకోవడానికీ.. ఎక్కడైనా ఓ సెంటెన్స్ మిస్ అయితే తడుముకుంటూ అవస్థపడింది గుర్తు తెచ్చుకుంటే నవ్వాగదు. ఫ్లోలో చెప్తేనే అంతా కక్కగలిగేది.. ఎక్కడ తేడా వచ్చినా మొత్తం అతుకుల బొంత అవుతుంది.. బైహాట్ చేయడం కదా అంతే మరి!
ఇద్దరి ముగ్గుర్ని ఓ గ్రూప్ గా చేసి.. ఆ గ్రూప్‌కి ఒకర్ని లీడర్ని చేసి చదివించేవాళ్లు. సో ఓ చిన్న హాల్లో అలా ఓ 10-15 సపరేట్ గేదరింగ్‌లు. ఎవరి లోకం వాళ్లదే. పాతకాలం ఎర్ర లైట్ కాంతిలో అసలే పగలంతా స్కూలుకెళ్లి, సాయంత్రం కాసేపు స్కూల్ గ్రౌండ్లో ఆటలాడీ, స్నానం చేసీ, తినీ కూర్చోవడం వల్ల వద్దన్నా నిద్ర వచ్చేది. తిన్నగా కూర్చుని చదివే వాళ్లు తక్కువ. అటూ ఇటూ ఊగిపోతూ పెద్ద గొంతేసుకుని ఏదో కంఠతా వచ్చేసినట్లు కాన్ఫిడెంట్‌గా చదవడం గొప్ప. ఆపుకోలేని నిద్ర వచ్చిన వాళ్లు ఓ పక్కకి తూలిపోతుండే వాళ్లు. మిగతా వాళ్లందరం వాళ్లని చూసి ఒకరికొకరు సైగలు చేసుకుని నవ్వుకుండే వాళ్లం.
ట్యూషన్ పక్కనే పెద్ద కాలువ. ఆ కాలువ దాటగానే శ్శశానం. అప్పట్లో ఇళ్ల తలుపుల మీద “ఓ స్త్రీ రేపు రా” అని రాసుండేది. దాని గురించి భయంభయంగా కధలు కధలు చెప్పుకునే వాళ్లం. ఊళ్లో తిరిగే దెయ్యం అలా రాసిన ఇళ్ల జోలికి వెళ్లదని నమ్మకం. అలా తిరిగే దెయ్యం దూరం నుండి ఓ చిన్న కాంతిలా కదులుతుందని, అదీ శ్శశానం కళ్లెదురే ఉండేసరికి, అక్కడే దెయ్యాలుంటాయనీ మా ఊహలు కల్పించి ఒకర్నొకరు భయపెట్టుకున్నాం. సో ఎవరైనా చదువుకుంటూనో, నిద్రపోతూనో ఆ శ్శశానం వైపు చూస్తే భయమేసేది.
ఓ వరండాలో ఒకరి పక్కన ఒకరు దాదాపు 30-40 మంది పడుకునే వాళ్లం. ఒకర్నొకరు తోసుకుంటూ. కొందరు డొక్కల్లో తంతుంటే, కోపమొచ్చి రిటర్న్ అలాగే తన్నడం.. ఒకరి దుప్పటి మరొకరు లాక్కోవడం.. ఇలా!
క్లాస్ మారితే text, note బుక్స్ తెచ్చుకుని బ్రౌన్ కలర్ అట్టలు తెచ్చుకుని అవి వేసుకుంటూ ఆ ట్యూషన్లోనే కూర్చుని సంబరంగా గడిపేవాళ్లం, కొత్త క్లాస్‌కి వెళితే ప్రమోషన్ వచ్చినంత ఆనందమన్నమాట.
అన్నట్లు పేనుబెత్తం అని ఒకటుంటుంది.. చాలామందికి తెలీకపోవచ్చు. చాలా చురుక్కుమంటుంది. సరిగ్గా చదవకపోయినా, ఏమైనా extras చేసినా ట్యూషన్ మాస్టర్ చేయి చాపించి.. కౌంట్ చేసి మరీ 5 తగిలించే వాడు. ఒక్కో దెబ్బ కొడుతుంటే.. ఇంకా నాలుగే ఉన్నాయి కదా.. అని కళ్లు మూసుకుని పంటి బిగువునా నొప్పి భరిస్తూ దెబ్బలు తినడం అన్నమాట. అప్పుడు కొడుతున్నా ఎవరి పేరెంట్స్ ఏమీ అనే వారు కాదు. పిల్లల్ని కొట్టాలంటే ఇప్పుడు అంతర్జాతీయ గొడవ అయిపోతోంది, మానవ హక్కుల సంఘాలూ జోక్యం చేసుకుంటున్నాయి 🙂 సామదాన దండోపాయం అనే దాని విలువ తెలీని రోజుల్లోకి వచ్చాం. అందుకే అవసరం అయినచోట కూడా భక్తీ, భయమూ తగ్గాయి.
పుస్తకాలు చదువుతుంటే.. ఏ పేజీ ఎక్కడ నలిగిందో కూడా మెమరీకి గుర్తే ఉంటుంది. ఏ ఆన్సర్ ఏ పేజీలో ఎంత ఉందో, మిగతా పార్ట్ ఏ పేజీలో ఉందో కూడా విజువల్‌గా అలా మైండ్‌లో ప్రింట్ అయిపోతుంది. చదువుతో ఉన్న అటాచ్మెంట్ అది. రాత్రి చదివి అక్కడే పడుకుని పొద్దున్నే 4 గంటలకు మళ్లీ లేచి మళ్లీ బాబర్, అక్బర్లను మరో మూడు గంటలు చదివి.. ఇంటికొచ్చి మళ్లీ రెడీ అయి స్కూలుకెళ్లడం.. 🙂
– నల్లమోతు శ్రీధర్