తెలీకుండానే నిద్రలోకి జారుకునే స్థితిలో మొదటి కొన్ని నిముషాలు గుర్తు తెచ్చుకోండి.. చాలా వండర్స్ జరుగుతాయి. పొరలు పొరలుగా ప్రపంచంతో మనకున్న ఎమోషన్లు, బాధలూ, కష్టాలూ, అభిప్రాయాలూ తొలగిపోతూ ఉంటాయి. ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. మనస్సు చాలా ప్రశాంతంగా తయారవుతుంది.
అప్పటికీ మనం కాన్షియస్‌గానే ఉంటాం. బ్రెయిన్లో alpha waves ఏక్టివ్‌గా ఉండే దశ అది. నా వరకూ నేను కొన్ని వందలసార్లు ఆ పర్టిక్యులర్ పీరియెడ్‌లో లేచి అప్పటి థాట్స్‌ని “కనీసం voice notes అయినా డిక్టేట్ చేసుకుందాం” అని భావించి ఆ స్టేట్ నుండి మళ్లీ బాహ్యప్రపంచంలోకి రావడం మనస్కరించక అలాగే పడుకుండిపోవడం జరిగింది.
మనం మెడిటేషన్ చేసినా, కాసేపు కళ్లు మూసుకుని ఏ థాట్స్నీ ప్రాసెస్ చెయ్యకుండా ప్రశాంతంగా కూర్చున్నా మెదడు నిండా ప్రవహించేదీ ఈ alpha wavesనే. ఆ తర్వాత beta, theta తరంగాలను దాటుకుని delta తరంగాల స్థితి అయిన గాఢనిద్రకి చేరకుంటామనుకోండి.
————————–
ఇదంతా నిద్ర గురించి కాదు చెప్తున్నది.. బయటి ప్రపంచంతో మనకు ఉన్న అసోసియేషన్ గురించి! మనం చెడ్డం వాళ్లం కాదు, బయటి ప్రపంచం చెడ్డది కాదు.. కేవలం మన ఆలోచనల్లోనే ఉంది చెడ్డతనమంతా! యెస్.. చెడు చేసే వాళ్లు ఉండొచ్చు, బయటి చెడు కన్పించొచ్చు.. కానీ మనకు చెడ్డ విషయాలు మాత్రమే కళ్లకు భూతద్ధంలో కన్పించడానికి ప్రధానమైన కారణం మనం “చెడు”ని చాలా వైరల్‌గా ఎంటర్టైన్ చేస్తున్నాం, బ్రెయిన్లో ఆగకుండా పలు థ్రెడ్స్‌లో ప్రాసెస్ చేస్తున్నాం. సో మెలకువ ఉన్నంతసేపూ మనకు సంఘర్షణే… ఏదో అయిపోతోందనీ… మనకు రక్షణ లేదనీ, మనుషులు మంచి వాళ్లు కాదనీ… ఇలా రకరకాల పిచ్చి భయాలు.
ఎప్పుడైతే అలసిపోయి కళ్లు మూసి బాహ్యప్రపంచపు ఆలోచనలు alpha waves ద్వారా మందగిస్తాయో అప్పుడు మన సహజసిద్ధమైన అద్భుతమైన స్వభావమూ, సృజనాత్మకతా, అక్షరాలకు అందని ఓ ఆహ్లాదకరమైన అనుభూతికీ లోనవుతాం. నిశితంగా చూస్తే చాలామంది ఈ mental stateని దాటుకునే నిద్రలోకి వెళ్తారు. అదీ నిజమైన మనం! ఆ స్థితి పగలు కూడా ఉంటే.. అదే స్థితి పక్కన శత్రువు ఉన్నా ఉంటే, అదే స్థితి ఇన్ని భయాల మధ్యనా ఉంటే.. అసలు మనల్ని ఎవరూ ఆపలేరు. దాన్నీ మనం ప్రాక్టీస్ చేయాల్సింది.
చెడుని చూస్తూ సొసైటీలో ఓ మూలకు ముడుకుచుపోతూ బ్రతికితే జీవితమే వేస్ట్… ప్రతీ క్షణం ప్రపంచంతో డిటాచ్ అవుతూ, మన పని మనం చేసుకుంటూ.. మనలో క్రియేటివిటీనీ, సున్నితత్వాన్నీ, మంచి ఆలోచనల్నీ పదిలంగా ఉంచుకోగలిగితే అంతకన్నా గొప్ప లైఫ్ ఏదీ లేదు. బ్రెయిన్లో న్యూరాన్ల చలనం మన ఆలోచనల్ని బట్టి మార్గం మళ్లించుకుంటూ ఉంటుంది. భయాలు, బాధలూ, నెగిటివ్ థాట్స్ ఓ బలమైన కెరటంలా కొంతకాలం పాటు అదే తరహా ఆలోచనా విధానాన్నే కొనసాగిస్తాయి. సో ఆ కెరటంలో కొట్టుకుపోకుండా మనల్ని మనం స్థిమితపరుచుకుని పాజిటివ్ ఆలోచనల వైపు మళ్లాల్సిన బాధ్యత మనదే.
అన్నింటికీ మించి ప్రతీ క్షణం మనలో మనం మాట్లాడుకునే మాటలే చెప్తాయి మనమేంటో… ఇదంతా చదివి “ఆ పెద్ద చెప్పొచ్చాడులే… మాకు తెలీదా” అని మీకు మీరు అనుకుంటే.. అదే మీ వ్యక్తిత్వం! అది మీ ఇన్నర్ వాయిస్‌లోనే మీకు ప్రస్ఫుటంగా కన్పిస్తోంది. అంత క్లియర్‌గా కన్పించినా మార్చుకోపోతే అది మన తప్పే కదా. సో మన అంతర్గత సంభాషణలను మార్చుకోవడంతో ప్రక్షాళన మొదలెట్టాలి.
– నల్లమోతు శ్రీధర్