నా లైఫ్‌లో ఫస్ట్‌టైమ్ ఓ బుక్‌లో నా పేరు పబ్లిష్ అయ్యేటప్పుడు వచ్చిన ధర్మసందేహం ఇది…
పేరు ఏమని పెట్టుకుందాం? మా కేస్ట్ వాళ్లందరూ దిగ్గజాలున్నారని తోటి మిత్రులు చెప్తుండే వారు.. ఈ కేస్ట్లో పుట్టడం ఓ అదృష్టం అని చాలా గొప్పగా చెప్పేవారు..
కులమతాల పట్టింపులు ఉండకూడదని చిన్నప్పుడు చదువుకున్న నీతివచనాలు గుర్తొచ్చి… ఆగిపోయాను.. నా కులం పేరు నన్ను మనుషులకు దూరం చేయకూడదనీ.. కేవలం కొంతమంది మనుషుల మనిషిగా నేను మిగిలిపోకూడదనీ…. అందరి మనిషినీ అవ్వాలనీ!
———
కట్ చేస్తే.. ఇప్పుడు 90% మందికి కులం పేరు ఖచ్చితంగా చివర్న ఉంటోంది… చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు కూడా!
ఇప్పుడు నేను మాట్లాడబోయే కొన్ని విషయాలు చాలామందికి మింగుడుపడకపోవచ్చు… మనోభావాలు హర్ట్ కావచ్చు.. బట్ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పుకోవాలి, మిమ్మలను నొప్పించడం నా ఉద్దేశం కాదు… ఆలోచింపజేయడం మాత్రమే!
——–
– కేస్ట్ పేరు తగిలించుకుంటే మనిషికి విలువ వస్తుందట… అన్ని కాస్టుల్లోనూ ఎందుకూ కొరగాని వాళ్లెందరో ఉన్నారు, వాళ్లకూ విలువ ఇస్తున్నామా మనం? విలువ వచ్చేది మనం చేసే పనుల ద్వారానా మన కేస్ట్ని బట్టా?
– Attitude always matters.. అంతకుమించి ఏం లేదు.. ఎవరు ఏ కేస్ట్లో పుట్టినా స్వభావం బాలేకపోతే ఎవరూ దగ్గరకు చేరనీయరు.
– పదిమందిలో సందర్భం వచ్చినప్పుడల్లా నాకు కులమతాల పట్టింపు లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్తుంటాం… కానీ అలా కుండబద్ధలు కొట్టిన మనిషి పేరు చూస్తే ఏదో ఒక కులం పేరు ఉంటుంది…. ఎందుకింత నటన.. అవసరమా?
– పేరు పక్కన తోక తగిలిస్తే ఉన్న ఫళాన ఏమైనా నష్టం వస్తుందా? ఇన్నాళ్లూ కష్టపడి, శ్రమపడి మీరు సంపాదించుకున్న పేరూ, కెరీరూ, లైఫూ తుఫానులో కొట్టుకెళ్లినట్లు కొట్టుకెళతాయా?
– దాదాపు అన్ని కేస్టుల వారూ మాకెక్కువ పౌరుషం అంటే మాకు ఎక్కువ అని గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటారు… తన్నుకోవడానికి పౌరుషం కావాలి గానీ బ్రతకడానికి పౌరుషాలు ఎందుకు? లైఫ్ అంటే ప్రతీ క్షణం తన్నుకు చచ్చే సినిమా ఫైటింగా?
– కులాలూ, మతాలూ, ప్రాంతాల వారిగా మైండ్‌లో పార్టీషన్లు క్రియేట్ చేసుకుని.. పైకి విశాల హృదయులుగా, జగమంత కుటుంబం నాదిలా బిల్డప్పులు ఇస్తే మన మీదే మనకు అసహ్యం వేయకుండా ఉంటుందా ఎవరికైనా?
——–
ప్రపంచంలో దేశాలుగానూ, రాష్ట్రాలుగానూ, ప్రాంతాలుగానూ, మతాలుగానూ, చివరకు కులాలుగానూ ఎవరికి వాళ్లం చీలిపోయి ఓ బావిలో కప్పలాంటి ఇరుకైన భావజాలంతో బ్రతికేస్తున్నాం..
మనం ఎన్నుకునే ప్రజాస్వామ్యమూ ఈ కులాల లెక్కల మీదనే.. మతాల లెక్కల మీదనే.. మనం వేసే ఓట్లూ అంతే… ఇంకేంటి మన సంస్కారం మనకు నేర్పింది? బూడిద తప్పించి?
ఏ క్షణమైతే మన పేరు పక్కన ఓ తోక ఉంటే అదో గొప్పగా భావించడం మొదలెట్టామో మనకు ఓ ఐడెంటిఫికేషన్, వేల్యూ వస్తుందనుకుంటున్నాం గానీ ఏమీ రాదు… నీకున్న స్వంత వ్యక్తిత్వం, ఆలోచనలు, మంచితనం అన్నీ కొట్టుకుపోయి, నీ కులం పట్ల ఇతరులకు ఉన్న చిన్నచూపు, కోపం, ఆవేశం కారణంగా నిన్ను అందరికీ దూరం చేస్తాయి..
చాలా పేరున్న వాళ్లెందరో ఈ ఒక్క ట్రాప్‌లో పడుతుంటే ఆశ్చర్యంగానూ, సిగ్గుగానూ ఉంది… ఇక సామాన్యులను గైడ్ చేసేదెవ్వరు?
తోక ఫ్యాషన్ కాదు.. మనల్ని మనుషులకు దూరం చేసే ఓ అగాధం!
కొద్దిగానైనా మిత్రులు ఆలోచిస్తారని భావిస్తూ..
– నల్లమోతు శ్రీధర్