నియతం సంగరహితం అరాగద్వేషతః కృతమ్ ।
అఫలప్రేప్సునా కర్మ యత్తత్ సాత్త్వికముచ్యతే ।। 23 ।।
ఏదైతే కర్మ – శాస్త్రబద్దముగా చేయబడినదో, రాగద్వేష రహితముగా ఉన్నదో, మరియు ఫలాపేక్ష లేకుండా చేయబడినదో, అది సత్త్వగుణములో ఉన్నట్టు అని చెప్పబడినది.
వివరణ: ఇప్పటి వరకూ కృష్ణ భగవానుడు వివిధ రకాల జ్ఞానాల గురించి చెప్పారు. ఈ శ్లోకం నుండి మనం చేసే కర్మలు (పనులు) కూడా సాత్త్విక, రాజస, తామసిక కర్మలుగా ఏ స్వభావాన్ని కలిగి ఉంటాయో వివరిస్తున్నారు.
“శాస్త్రబద్ధంగా చేయబడిన కర్మ” అనే వాక్యాన్ని చదివిన వెంటనే అసలు “శాస్త్రం” అంటే ఏంటి అనే సందేహం చాలామందికి కలుగుతుంది. మనిషి ఉన్నతికి ఉద్దేశించబడిన ధర్మ శాస్త్రం మొదలుకుని విశ్వంలోని అన్ని గ్రహాల, నక్షత్ర మండలాల కదలికలకు అంచనా వేసే ఖగోళ శాస్త్రం, భౌతిక పరమైన వస్తు గుణాలను అధ్యయనం చేసే భౌతిక శాస్త్రం, ఇప్పుడిప్పుడు మనం చూస్తున్న కంప్యూటర్ శాస్త్రం (కంప్యూటర్ సైన్స్) వరకూ ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి.
ప్రతీ శాస్త్రానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. వీటిని ఇంగ్లీషులో ప్రిన్సిపుల్స్ అని చెప్పుకుంటాం. అలాగే కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ (నియమ నిబంధనలు), ఆ శాస్త్రానికి సంబంధించిన ప్రామాణిక గ్రంధాలు ఉంటాయి.
ఉదా.కి.. పురుషుడు ఎలా ప్రవర్తించాలో ధర్మ శాస్త్రంలో పేర్కొనబడింది.
కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయాతు రామః
భోజ్యేషు తృప్తః
సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు
ధర్మనాధః
అని ప్రస్తావించబడింది.
భార్యాభర్తలు కావచ్చు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు కావచ్చు ఒక ఆత్మ (సోల్) భూమ్మీదకు తన కర్మలు నిర్వర్తించడానికి వచ్చాక అవి పూర్తి చెయ్యడానికీ, కొత్త దుష్కర్మలు చెయ్యకుండా జీవన్ముక్తి పొందడానికి జీవుడికి అందుబాటులో ఉన్న అద్భుత జ్ఞానమే శాస్త్రాలు. “శాస్త్రాలు చెప్పేదేంటి, నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను” అంటే ఆ ఆలోచన కలిగి ఉండడం కూడా ఓ రజోగుణ మాయే. మాయలో కూరుకుపోయినప్పుడు ఏదీ మనస్సుకి ఎక్కదు.
పైన చెప్పుకున్నట్లు “కార్యేషు యోగీ” అంటే ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పురుషుడు పనులు చెయ్యాలి అని అర్థం. నా కుటుంబానికి నేను ఈ పని చేస్తే ఏమొస్తుంది, లేదా ఈ సమాజానికి నా సేవలు అందిస్తే ఏమొస్తుంది అని ప్రతీదీ లెక్కలు వేసుకుని తనకు చేతనైన పనులు చెయ్యడానికి కూడా వెనుకాడే వాడు కుటుంబ, సమాజ పురోగతికి ఏమాత్రం కంట్రిబ్యూషన్ చెయ్యలేడు. అన్ని సోల్స్ తమ విధులు తాము నిష్కర్మగా చేసుకుంటూ వెళితేనే సమాజంలో మూమెంటమ్ (కదలిక, చైతన్యం) వస్తాయి. ఆ చైతన్యమే విశ్వం యొక్క హార్మొనీకీ (పొందికకు), బ్యాలెన్స్కి ఉపయోగపడుతుంది. మనిషి తన జీవితావసరాల కోసం సంపాదించుకోవడంలో తప్పు లేదు. కనీసం తన కడుపు నిండాకైనా తాను మాత్రమే తన కుటుంబానికి, సమాజానికి చెయ్యగలిగిందేదో నిస్వార్థంగా చేయాలి. అలాంటి నిస్వార్థ సేవలు మాత్రమే విశ్వానికి మనల్ని దగ్గర చేస్తాయి. మీరు గమనిస్తే డబ్బు పట్ల దురాశతో బ్రతికే వారి దగ్గర చాలా సంపద విలాసాలు ఉంటాయేమో గానీ నిస్వార్థంగా ఉండే వారి దగ్గర మన మేధస్సుకి అర్థం కాని ఓ ప్రత్యేకమైన శక్తిని గుర్తించవచ్చు.
అలాగే పురుషుడు క్షమించే గుణం కలిగి ఉండాలని, రూపంలో కృష్ణుడిలా ఉండాలని (ఇది చాలామంది అపార్థం చేసుకుంటారు. రూపం అంటే భౌతిక రూపం అని కాదు, మానసిక రూపం. కృష్ణుడులా నిరంతరం చురుకుగా ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలని అర్థం), వండిన ఆహారాన్ని వంకలు పెట్టకుండా సంతృప్తిగా తినాలనీ.. ఇలా చాలానే ధర్మ శాస్త్రంలో చెప్పబడింది.
మనిషి శాస్త్ర బద్ధంగా ప్రవర్తించినంత కాలం బంధాలు బానే ఉన్నాయి. కానీ “నా ప్రవర్తనని ఫలానా వాళ్లు డిసైడ్ చేసేదేంటి” అని ఎప్పుడైతే అహం మనుష్య జాతికి తలకెక్కిందో అప్పటి నుండి సమస్యలు మొదలయ్యాయి.
ఏకంగా శ్రీకృష్ణుడే ఈ 23వ శ్లోకంలో చెబుతున్నారు. శాస్త్రబద్ధంగా కర్మలు చెయ్యడం వల్ల అది సత్త్వ గుణ కర్మ అవుతుందని!
“నేను శాస్త్రాలను నమ్మను, పాటించను” అని పురుషుడు, స్త్రీలు తాము ఉన్నతంగా, సంతోషంగా ఉండడానికి అనుసరించాల్సిన పద్ధతుల్ని వదిలేశారు అనుకోండి. ఏం జరుగుతుంది? సత్త్వ గుణ కర్మ కాస్తా రజో గుణ కర్మగా మార్పు చెందుతుంది. అంటే కుటుంబం పట్ల బాధ్యత తీసుకోవలసిన, పెట్టిన ఆహారం పట్ల కృతజ్ఞతతో తృప్తిగా తినాల్సిన పురుషుడు కాస్తా భార్యా, పిల్లల పట్ల బాధ్యతలు తప్పించుకుంటూ, రకరకాల వంకలు పెడుతూ తన కుటుంబాన్ని కష్టపెడుతూ ఉంటాడు. దీంతో అసంతృప్తులు, గొడవలు మొదలవుతాయి. భావోద్వేగాలు ఎక్కువవుతాయి. ఇంట్లో గొడవల వల్ల బయట ప్రవర్తన మారిపోతుంది, ఆఫీసులో పని చేయబుద్ధి కాదు, ఎదుగుదల మందగిస్తుంది. అంటే “పురుషుడు ఇలా ఉండాలి” అని శాస్త్రంలో చెప్పబడే ఓ ప్రవర్తన దారితప్పితే ఎన్ని రూపాలుగా అది అనేక ఇతర కర్మలకు కారణం అవుతోందో ఆలోచించండి.
మహిళల విషయానికి వస్తే.. ఇలాంటి ధర్మాల్లో చెప్పబడిన దానిలోనే భోజ్యేషు మాత.. అని శయనేషు రంభ అనీ ఇలా కొన్ని ధర్మాలు చెప్పబడ్డాయి. పురుషుడు, ప్రకృతి (స్త్రీ) ఈ రెండు అంశాలు మాత్రమే సృష్టిని ముందుకు నడిపిస్తాయి. ఓ స్త్రీ తన పిల్లలకు గానీ, భర్తకి గానీ వండిపెట్టేటప్పుడు “వారు తృప్తిగా తినాలని” వారి పట్ల మనస్సులో కలిగి ఉండే ప్రేమే, మాతృ స్వభావమే ఆ ఆహారానికి బలాన్ని చేకూరుస్తుంది. అలాంటి మనస్సు పెట్టిన ఆహారాన్ని, పురుషుడు, కుటుంబం ఏ వంకలు పెట్టకుండా తృప్తిగా తిన్నప్పుడే ఆహారం కాస్తా సక్రమంగా జీర్ణం అయి అది రక్త ప్రవాహం ద్వారా శరీరంలోని ప్రతీ కణానికి శక్తిని ఇస్తుంది. కొంతమంది డ్రైఫ్రూట్స్, ఖరీదైన పండ్లు, వారానికి నాలుగుసార్లు నాన్-వెజ్ వంటి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉంటారు. అయినా డైజేషన్ సమస్యలతో, నీరసంగా బ్రతుకుతూ ఉంటారు. కారణం ఆహార లోపమా? సంతృప్తి లోపమా అంటే.. పచ్చడి మెతుకులు సంతృప్తిగా తిన్న వాళ్లు కూడా చాలా శక్తితో పనిచేయగలుగుతున్నారు. ఆహారంలో పోషకాల విలువలు కాదు… ఆ ఆహారాన్ని సిద్ధం చేయడం వెనుకా, స్వీకరించడం వెనుకా ఉన్న సంతృప్తి అతి ప్రధానం.
కలిసి కొంతమంది భోజనం చేసేటప్పుడు ఈ క్రింది శాంతి మంత్రాన్ని అందరూ చెప్పుకోవడం చేస్తుంటారు.
ఓమ్ సహనావవతు సహనౌభువనక్తు, సహవీర్యం కరవావహై
తేజస్వినా వధీ తమస్తు మావిద్విషావహై, ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః
మనందరం కలిసి ఉందామనీ, తేజోవంతులుగా, వర్చస్సు కలిగిన వారిగా, జ్ఞానాన్నీ, విద్యనీ పొందుదామని, ఒకరినొకరు ద్వేషించుకోకుండా స్నేహితులుగా నడుచుకుందామనీ.. ఇలా మనుషుల మధ్య ఏర్పడే ఇగోని చల్లార్చి అన్ని సోల్స్ని ఒకరికొకరు ప్రేమించుకునేలా చేసి, ఆ తర్వాత భోజనం చేయడం దీని లక్ష్యం. ఇలా మనస్సు సంతృప్తితో నిండినప్పుడు తీసుకునే ఆహారం శరీరాన్ని చాలా శక్తివంతం చేస్తుంది. అలాగే “శయనేషు రంభ” వంటి పదాలను చదివి కొంతమంది “ఆడది అంటే పడక గదికేనా” అని కూడా భావిస్తుంటారు. మహిళలు ఎదుర్కొనే అనేక సామాజిక సమస్యల వల్ల, కొంతమంది బాధ్యత లేని మగవాళ్ల వల్ల, సమాజంలో ఎదుర్కొనే చులకన, ఆకలిగా చూసే ప్రతీ మగాడి వల్లా ఇలాంటి భావనలు కలగడంలో తప్పు లేదు గానీ.. శాస్త్రంలో చెప్పబడిన ఈ “శయనేషు రంభ” లాంటివీ ఎంతో అర్థవంతమైనవి.
స్త్రీ పురుషుల కలయిక అత్యంత పవిత్ర కార్యం. రెండు జీవుల యొక్క ఎనర్జీ మూలాధార చక్ర వద్ద అండంగా, వీర్యంగా పోగుపడి ఆ క్రియేటివ్ ఎనర్జీ (మూలాధార చక్రలో కొత్తగా పుట్టబోయే పిల్లలను (సోల్స్) అకామిడేట్ చెయ్యడానికి చాలా క్రియేటివ్ ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుంది) పురుషుడు స్త్రీ ఆ రతి సమయంలో కలిగి ఉండే మానసిక స్థితి, సిద్ధంగా ఉండడం, లేకపోవడం, తన భాగస్వామి పట్ల కలిగి ఉండే అచంచలమైన ప్రేమ ఇవన్నీ కలిసి రెండు సోల్స్ వేరు అనే భావన నుండి ఇద్దరం ఒకటే అనే భావన వైపు నడిపించి నిజమైన ఆధ్యాత్మికతను పరిచయం చేస్తాయి.
ఇలా తెలుసుకుంటూ పోతే ధర్మ శాస్త్రాల్లో, ఇతర అన్ని శాస్త్రాల్లో అనేక జీవన రహస్యాలు ఉంటాయి. అవన్నీ సృష్టి సజావుగా, ఓ పొందికలో నడవడానికి ఉపయోగపడే సూత్రాలు. వాటిని అనుసరించడం ద్వారా మనుషుడు అనేక కర్మల నుండి విముక్తం అవడంతో పాటు, కొత్త దుష్కర్మలు చెయ్యకుండా సోల్ ముక్తిని పొందే అవకాశముంటుంది. “నాకెందుకు ముక్తి, హాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాను” అని వెంటనే మన మూర్ఖపు మైండ్ వెకిలిగా నవ్వుకుంటుంది.. ఓరీ జీవుడా.. ఆ వెకిలితనమే నీ దుష్కర్మా, నీ మాయా.. ఈ క్షణం ఎంజాయ్ చేస్తున్నాననుకున్నది మరుక్షణం వేదనగా మార్చుకుని, ఈ సమస్యలతో నా వల్ల కావట్లేదు అనే స్థితికి వెళ్లిపోయి ఆత్మహత్యలు, డిప్రెషన్ వైపు వెళ్లిపోతుంటావు.
భగవద్గీత చదువు.. ప్రతీ శ్లోకంలో చెప్పబడిన అర్థాన్ని నిశితంగా తెలుసుకో.. ఈ 23వ శ్లోకంలో చెప్పినట్లు ధర్మబద్ధంగా, రాగద్వేషాలకు అతీతంగా బ్రతకడానికి సాధన చేయి.. నిజమైన స్వేచ్ఛ, ఎంజాయ్మెంట్ అంటే ఏంటో నీకే తెలుస్తాయి. తినే ఆహారాన్ని కూడా వంకలు పెట్టకుండా తినలేని నువ్వు.. అక్కడే శాస్త్రంలో ఏం చెప్పబడిందో నేర్చుకోకుండా ఇంట్లో చిన్న చిన్న గొడవలకు మరీ బీజాలు వేసుకోవట్లేదూ? ఇలాంటి మనస్థత్వంతో పొందేది ఎంజాయ్మెంట్నా… విశ్వాన్నీ, తోటి సోల్నీ అర్థం చేసుకుని సాగించేది గొప్ప జీవనమా.. ఆలోచించు!!
– Sridhar Nallamothu