శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ।
న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ।। 15 ।।
తత్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః ।
పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ।। 16 ।।
శరీరం, వాక్కు, మనస్సులచే ఏ కర్మ జరిగినా అది మంచి, చెడులలో ఎలాంటిదైనా దానికి కారణము “శరీరము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము” అనే ఐదు అంశాలే. ఇది తెలుసుకోలేని వారు ఆత్మే అన్నీ చేయిస్తుంది అనే భ్రమలో ఉంటారు. అటువంటి మలిన బుద్ధిని కలిగిన వారు వాస్తవాన్ని చూడలేరు.
వివరణ:
శ్రీ కృష్ణ భగవానుడు ఒక కర్మ (పని) జరగడానికి ఏ అంశాలు కారణం అవుతాయో ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు కదా. కర్మకి కారణం అయ్యేది ఆ “శరీరము, కర్త, వివిధ ఇంద్రియములు, వివిధ రకాల కృషి, దైవానుగ్రహము” అనే ఐదు అంశాలైతే, మరి మనం తరచూ చేసే కర్మలేంటి అంటే.. ఆ ఐదింటి వల్ల శరీరం చేతా, మాటల రూపంలో, మనస్సు రూపంలో చేసే కర్మలే ఔట్పుట్ అన్నమాట.
మొదట ఈ మూడు రకాల కర్మల గురించి చూద్దాం. ఒక రోజంతా కష్టపడి మీరు ఓ డాట్.నెట్, జావా కోడ్ రాశారనుకోండి. లేదా ఒక రైతు తన పొలంలో దుక్కి దున్నాడు అనుకోండి. లేదా ఓ నేర స్వభావం కలిగిన వ్యక్తి ఎవరితో హత్య చేశాడు అనుకోండి. తన శరీరం చేత చెయ్యబడే ఇలాంటి కర్మలన్నీ “కాయిక కర్మలు” అని చెప్పబడతాయి. శరీరం అంటే కాయం అని అర్థం కాబట్టి కాయంతో చేసేవి అన్నమాట ఇవి. ట్రాఫిక్‌లో ఇరుక్కుని వచ్చి మీ కారు మిర్రర్‌కి తగిలిన ఆటో డ్రైవర్ని తిట్టడానికి అద్దం దించి, “అరే దున్నపోతా, కళ్లు కనిపించడం లేదా” అని గానీ, లేదా ఇళ్లల్లో భార్యాభర్తలు, స్నేహితులు ఒకర్నొకరు తిట్టుకునేవి, ప్రేమతో మాట్లాడుకునేవి అన్నీ కూడా వాచిక కర్మలు. అంటే వాక్కుతో (మాట) చేస్తున్న పనులన్నమాట. ఇక మూడవ రకాలైన పనులు మనకు తెలీకుండానే చేస్తుంటాం. మనస్సుతో చేసేవి. వీటిని “మానసిక కర్మలు” అంటుంటాం.
“నన్నే కష్టపెడతాడా, ఆ వ్యక్తి పురుగులు పట్టి పోవాలి” అని మనస్సులో శపించేవి..
“ఇతనేంటో పెద్ద ఫోజులు కొడుతున్నాడు, అక్కడ అంత సీన్ లేదు” లాంటి జడ్జ్మెంట్ల ద్వారా చేసే కలుషితమైన అస్పష్టమైన పర్సెప్షన్ ద్వారా చేసే కర్మలు
“నాకే దేవుడు ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చాడు” అని యూనివర్శల్ ఎనర్జీ పట్ల స్పష్టత లేని, తన సమస్యల పట్ల మాత్రమే మైక్రో ఫోకస్ కలిగిన కర్మలు..
“నేను సరిగా మాట్లాడలేను, నాకు ఏ టాలెంట్ లేదు” అని తనని తాను మానసికంగా కష్టపెట్టుకుని సెల్ఫ్ ఎస్టీమ్కి కారణమయ్యే తన సోలార్ ప్లెక్సెస్ చక్రలో ఎనర్జీ బ్లాక్ అయ్యేలా చేసుకునే కర్మలూ.. ఇలాంటివన్నీ మానసిక కర్మల క్రిందే లెక్క.
“మరి ఏదీ ఆలోచించకూడదా? ఆలోచించకుండా ఉంటే మనిషెలా అవుతాడు? మనిషికి భావోద్వేగాలూ, ఆలోచనలు లేకుండా ఉంటే రాయితో సమానం కదా” అని కొంతమంది భావిస్తూ ఉంటారు.
ఎందుకు ఆలోచించకూడదు.. బ్రహ్మాంఢంగా ఆలోచించవచ్చు. మైండ్ (మనస్సు) అనేది ఓ టూల్ అయినప్పుడు ఆ టూల్‌ని చెడు మానసిక కర్మలు చేయకుండా, మంచి వాటి వైపు మళ్లించుకునేలా బ్రహ్మాంఢంగా ఉపయోగించుకోవచ్చు.
“ఏది చెడు, ఏది మంచి.. నాకు మంచి అయినది మీకు చెడు కావచ్చు కదా” అనే సందేహం వెంటనే వస్తుంది. అందుకే దీన్ని వివరంగా చెబుతాను.
ప్రతీ ఆత్మా ఒక నిర్థిష్టమైన విధంగా కాన్షియస్‌నెస్‌ని కలిగి ఉంటుంది. ఆ కాన్షియస్‌నెస్‌ని బట్టే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది, అలాగే మనం కలిగి ఉన్న కాన్షియస్‌నెస్‌ని మన ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మార్చుకోవచ్చు. తద్వారా ఆత్మకు పట్టిన మలినాలు ప్రక్షాళించుకోవచ్చు. అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటి అన్నది చూద్దాం. మీరు ఈ క్షణం ఉన్న మానసిక స్థితి మొత్తం కలిసి కాన్షియస్నెస్ అని భావిస్తాం.
ఒక వ్యక్తికి అందరిలో మాట్లాడాలంటే భయం అనుకోండి. అతని ప్రస్తుత కాన్షియస్నెస్ పిరికితనం. పిరికితనం అనే కాన్షియస్‌నెస్‌లో అతను తన జీవితాన్ని, చుట్టూ ప్రపంచాన్ని చూసే దృష్టి మారుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తన మనస్సులో ఓ అంతర్గత విశ్వాన్ని సృష్టించుకుని, బయట విశ్వంతో ఒక సోల్ నిరంతరం అనుసంధానించబడుతూ వైబ్రేషన్స్ రూపంలో సమాచారాన్ని వెదజల్లుతూ, విశ్వం నుండి సమాచారాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగుతూ ఉంటుంది.
పిరికితనం అనే కాన్షియస్‌నెస్‌లో ఉన్నప్పుడు అతను తన జీవితాన్ని చూసుకునే దృష్టి “వెధవ జీవితం, కాస్తయినా ధైర్యం లేకుండా పోయింది” అనేలా ఉంటుంది. అలాగే అతను భగవంతుడు అనే విశ్వ శక్తిని తలుచుకుని… “ఈ దేవుడికి నా మీద దయ లేదు, నన్ను ఇలా నిస్సహాయుడిగా పుట్టించాడు, అసలు దేవుడే లేడు” అనేలా ఉంటుంది. “అస్సలు దేవుడే లేడు, యూనివర్శల్ ఎనర్జీనే లేదు” అని భావించిన వెంటనే డోర్ క్లోజ్ అయిపోయినట్లే కదా! అంటే “నల్లమోతు శ్రీధర్ రాసేది బాగుంది, చదివి అవగాహన పెంచుకుందాం” అనే భావన ఉన్నప్పుడే కృష్ణ భగవానుడి చేత ప్రేరేపించబడి నాచేత రాయబడుతున్న ఈ జ్ఞానం మీ మనస్సుకి చేరుతుంది, “ఇదంతా ట్రాష్” అని కొట్టిపారేస్తే ఇంకా మీలోకి అది ఎలా చేరుతుంది? అందుకే మన జీవితం పట్లా (Life View), విశ్వ శక్తి పట్లా (God’s View) ప్రతీ క్షణం మనం కలిగి ఉండే భావనలు అత్యంత కీలకమైనవి. అవే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి.
పిరికితనం అనే కాన్షియస్‌నెస్‌లో ఉన్న వ్యక్తి సాయంత్రానికి మందు తాగితే అతని కేంద్రీయ నాఢీ వ్యవస్థ రిలాక్స్ అయి వెంటనే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. దీన్ని “ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్” అంటారు. తమ ప్రస్తుత మానసిక స్థితిని అధిగమించడం కోసమే, సరికొత్త కాన్షియస్‌నెస్‌ని కాసేపు అరువు తెచ్చుకోవడం కోసమే చాలామంది ఆదివారం వస్తే పబ్లకి వెళుతుంటారు, కొంతమంది డ్రగ్స్ సేవిస్తారు, మరికొంతమంది సినిమాలు చూస్తూ తమ life viewని, god’s viewలను పెద్ద స్క్రీన్ మీద చూపించబడే ఓ నకిలీ క్యారెక్టర్ల ఎమోషనల్ స్టేట్లోకి వెళ్లి మర్చిపోవడానికి ప్రయత్నిస్తారు. మన జీవితం పట్ల మనకున్న దుఃఖం, విచారం, నిరుత్సాహం వంటి కాన్షియస్నెస్ ఇలాంటి అలవాట్ల ద్వారా కాసేపు మరుగునపడిన వెంటనే ఎక్కడ లేని చాలా రిలీఫ్ వస్తుంది. ఆ రిలీఫ్ కోసమే మళ్లీ మళ్లీ అవే పనులు చేయాలనిపిస్తుంది. 1960-70 దశకంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఆధ్యాత్మిక గురువులు డ్రగ్స్ సేవనం చేసే వారు. దీనికి కారణం లూసిడ్ డ్రీమింగ్, తన భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయి నిర్వచించడానికి వీల్లేని అరుదైన అనుభూతులను పొంది ట్రాన్స్సెండింగ్ అవడానికి వాళ్లకి ఈ డ్రగ్స్ ఓ సాధనంలా అన్పించేవి. అంటే ఇదే ఆల్టర్డ్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నమాట.
అంతెందుకు మీ మూడ్ బాలేకపోతే మంచి పాటలు విని మూడ్ సరిచేసుకుంటారు కదా! అదీ అంతే. మూడ్ బాలేకపోవడం అనేది ఓ కాన్షియస్నెస్ అయితే, పాటలు విన్నప్పుడు మానసిక, భౌతిక ప్రవర్తనలో మనలో వచ్చే మార్పు ఓ విభిన్నమైన కాన్షియస్నెస్.
సరిగ్గా మెడిటేషన్ చేసినా కూడా ఇప్పుడు మనకు ఉన్న కాన్షియస్నెస్ స్థానంలో హై-బీటా బ్రెయిన్ తరంగాల నుండి, నెమ్మదిగా ఉండే ఆల్ఫా, థీటా, డెల్టా వంటి తరంగాల వైపు మన మైండ్ మారుతుంది. డ్రగ్స్ సేవించడం, పాటలు వినడం, సినిమాలు చూడడం అనేవి డిపెండెన్సీని పెంచుతాయి. అంటే ఆ పనులు చేస్తేనే మన మానసిక స్థితి మారుతుంది. ఒక మాయని తప్పించుకోవడానికి మరో మాయలోకి వెళ్లడం లాంటిదన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు గానీ, ఇతర పౌరాణిక సందర్భాల్లో గానీ ధ్యానం చెయ్యమని ఎందుకు ఎక్కువగా చెప్పబడుతుంది అంటే, అది డిపెండెన్సీ పెంచే అలవాటు కాదు. మాయా కాదు, సత్యాన్ని, ఆత్మని చేరుకునే మార్గం. కనీసం ఒక ఏడాది పాటు నిరంతరం ధ్యానం చేస్తే జీవితాంతం చాలా కామ్‌గా, స్థిరంగా, దేనికీ అటాచ్ కాని మానసిక స్థితి లభిస్తుంది. మన కాన్షియస్‌నెస్‌ని బట్టే మనం కర్మలు చేస్తుంటాం కాబట్టి మనం ఈ క్షణం ఎలాంటి కాన్షియస్‌నెస్‌ని కలిగి ఉన్నాం అన్నది స్పష్టత కలిగి ఉండి, దాన్ని మెరుగుపరుచుకోవాలి.
సరే మంచి ఏది చెడు ఏది అనే మెయిన్ పాయింట్లోకి వద్దాం. వృత్తిపరంగా డాక్టర్, పిహెచ్డి కలిగిన డేవిడ్ ఆర్. హాకిన్స్ అనే ఆయన సైంటిఫిక్‌గా కొన్ని పరిశోధనలు చేశారు. మజిల్ టెస్ట్ అనే ప్రక్రియ ద్వారా ఒక మనిషి కలిగి ఉండే అనేక భావనలకు, వాటికి లైఫ్ ఎనర్జీ ఎలా మార్పు చెందుతోంది గుర్తించి 20 నుండి 1000 వరకూ వేర్వేరు పాయింట్లుగా కాన్షియస్‌నెస్‌ని విభజించారు. ఆయన పరిశోధన ప్రకారం 200 పాయింట్ల కన్నా దిగువ ఉన్నవన్నీ మనిషిలోని శక్తిని హరించి, అతన్ని మరణం వైపు, జబ్బుల వైపు శక్తిహీనం వైపు తీసుకెళ్లే ఎమోషన్స్.
అలా 200 లోపు ఉన్నవి మొదటిది అవమాన భారాన్ని కలిగి ఉండడం! ఎవరైనా మిమ్మల్ని అవమానించారు అనుకోండి, దాన్ని మీరు మోస్తుంటే అది చాలా శక్తిని హరిస్తుంది. అప్పుడు మీ లైఫ్ వ్యూ “నా జీవితం వృధా” అనే దుఖః రూపంలో ఉంటుంది, God’s View దేవుడిని తృణీకారంగా చూస్తుంటారు. మీ ప్రవర్తనలో ఇది అందరినీ, అన్నింటినీ దూరంగా పెట్టే విధంగా మారుతుంది. అంటే అవమానం జరగడం మీ చేతిలో లేని పని కానీ, దాన్ని మీ మనస్సుకి స్వీకరిస్తే మీ కాన్షియస్నెస్ ఎలా మారిపోతోందో ఇక్కడ అర్థం చేసుకోండి. ఆ అవమానాన్ని పట్టించుకోకుండా మెడిటేషన్ వంటి ప్రక్రియల ద్వారా డిటాచ్మెంట్తో ఉంటే ఈ లైఫ్ వ్యూ, గాడ్స్ వ్యూ అనే దృక్పధాలన్నీ మారిపోతాయి కదా!
ఇలా అవమానం, అపరాధభావం, ద్వేషం, వేదన, భయం, నిరంతరం రకరకాల కోరికలు, కోపం, గర్వం వంటివన్నీ 20 నుండి 175 వరకూ కాన్షియస్నెస్ స్కేల్‌ని కలిగి ఉంటాయి. చెడు పనులంటే ఇలాంటి భావనలు పెంచే పనులకి దూరంగా ఉండడం. అది ఇతరుల్ని గాయపరచడం గానీ, మీరు గాయపడడం గానీ రెండూ ఈ 175 లోపల ఉన్న ఎమోషన్స్ అత్యంత ప్రమాదకరం.
200 కాన్షియస్నెస్ స్థాయిలో ధైర్యం వస్తుంది. ఇది కొంత వరకూ మంచిది. ఆ తర్వాత న్యూట్రల్‌గా ఉండడం, దేన్నయినా స్వీకరించే సిద్ధపడే తత్వం, అన్నింటినీ, అందర్నీ అంగీకరించడం, అందరి పట్లా అన్ కండిషనల్ లవ్ కలిగి ఉండడం, నిరంతరం హృదయంలో సంతోషాన్ని కలిగి ఉండడం, అందరూ శాంతిగా ఉండాలని, ప్రశాంతంగా కలిగి ఉండాలని కోరుకోవడంతో పాటు మీ మనస్సులో అది కలిగి ఉండడం మంచి కార్యాలు. ఈ మంచి దృక్పధాలు కలిగి ఉంటే భౌతికమైన, మానసికమైన బంధనాల నుండి, ఆలోచనా ప్రవాహం నుండి, మైండ్ చేత చేయబడే మాయ నుండి ఆత్మ విముక్తం అయి ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే మరణించాక లభించేది మాత్రమే కాదు.. బంధనాల నుండి విముక్తం అయిన ఎందరో గురువులు ముక్తితో జీవిస్తున్నారు. ఇలాంటి జీవనంతో పూర్వ జన్మ కర్మలు అనుభవించి, కొత్త కర్మలు చెయ్యకుండా సోల్ పూర్తి స్థాయి ముక్తిని పొందడం అత్యుత్తమ దశ.
భగవద్గీతలో పై శ్లోకాల్లో భగవానుడు చెప్పినట్లు ఆత్మ చేత ఏర్పరచబడుతున్న మాయ అయినా, ఆ మాయని మన దృక్పధాన్ని మార్చుకోవడం ద్వారా తొలగించుకుని దుష్కర్మలు చెయ్యకుండా కాపాడుకునే శక్తి మనం కలిగి ఉన్నాం. అది గ్రహిస్తే చాలు.
- Sridhar Nallamothu