కొందరు దారుణం అన్నారు.. కొందరు మూర్ఖత్వానికి పరాకాష్ట అన్నారు.. కొందరు సాధనకు ఇదే సరైన మార్గమన్నారు.. మరికొందరు ప్రభుత్వ వైఫల్యమన్నారు.. ఎవరి మాట వారు మాట్లాడేసి జరిగిన సంఘటన గాఢతని రాత్రి మిగిల్చిన మత్తులోనే ఒదిలించుకుని నిన్నటిని చరిత్రలోకి జమచేసేశారు. అయిపోయింది.. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ కూడా నేలకూలే ఉంటాడు.. మట్టి గొప్పదా.. మనిషి గొప్పోడా అన్నది తేల్చుకోలేక!
అంతా బాగానే ఉంది.. తెలుగు జాతి ఘనతని ప్రపంచానికి చాటిచెప్పడానికి ఎన్టీయార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించి నిర్మించిన విగ్రహాలు నిమజ్జనమైపోయాయి సరే, అంత విధ్వంసాన్నీ సృష్టించీ సంతుష్టి పరిచే ఫలితమేమైనా సాధించగలిగామా? తెలుగుదనానికి చిరునామాగా ఇన్నాళ్లూ నిలిచిన ఆ విగ్రహాలే ప్రపంచం ముందు మన విజ్ఞతని నిలదీస్తున్నాయి. ఆవేశం, హక్కులూ, ఉద్యమాలూ, అణిచివేతలూ, రెచ్చగొట్టడాలూ.. సాధించుకోవడాలూ.. వీటన్నింటికీ మనలో మానవత్వం హరించుకుపోయి దానవత్వం అలవర్చుకోవడమే సబబనుకుంటే మన ప్రయాణం రాతియుగానికి తప్ప బంగారు భవిష్యత్ వైపు కాదు.
జరిగింది ఆర్థిక నష్టమో, మానసిక కష్టమో తేల్చుకునేలోపే కాలం మన మూర్ఖత్వాన్ని సమాధి చేసేస్తుంది అలవోకగా! దిగ్భ్రమ నుండి స్థిమితపడితే.. తప్పూ ఒప్పుగానే కన్పిస్తుంది.. ఒప్పూ తప్పుగానే కన్పిస్తుంది. కాస్తో కూస్తో మనసుకి కష్టమన్పించేదల్లా ఆ కాసేపే! ఆ దిగ్భ్ఱాంతిని దాటేస్తే ఎవరు బ్రతుకు వారు బ్రతికేయవచ్చు.. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలని మర్చిపోయి! మరో బలీయమైన అంశమేదైనా మనల్ని కలిచివేసేటంత వరకూ అంతా హ్యాపీసు! మన శరీరాలు ఎంత మందమెక్కుతున్నాయో అర్థం కావట్లేదూ.. !!