“నువ్వంటే నాకు చాలా ఇష్టం” – ఆడా మగా ఇద్దరి మధ్య చోటుచేసుకునే ఈ సంభాషణని చదవగానే ఎవరు ఎవరితో ఏ సందర్భంలో ఇలా అన్నారో ప్రస్తావించకపోతే ఇదేదో ప్రేమ వ్యవహారం అనే సందేహమే అధికశాతం మందికి సహజంగా కలుగుతుంది. ఒకే భావాలున్న ఇద్దరు వ్యక్తులు తమ ఆలోచనలను ఒకరిలో మరొకరు చూసుకుంటూ ఉబ్బితబ్బిబ్బయ్యే వేళ ఇలా ఇష్టాన్ని వ్యక్తపరుచుకోపోతే మనసు నిరాశ చెందుతుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ప్రేమికులే కానవసరం లేదు.. స్నేహితులూ ఒకరినొకరు ఇష్టపడొచ్చు. కానీ ఆ ఇష్టాన్ని మనసారా మాటల్లో చెప్పాలన్నా “ఇష్టం” అనే పదం అపార్థాలకు తావిస్తుందేమోనని గుంజాటంలో చిక్కుకునే దుస్థితి మనది. నేస్తం తన స్నేహహస్తంతో హృదయాన్ని తడిమినప్పుడు “నువ్వంటే ప్రాణం మిత్రమా” అని మనసు ఒద్దికగా ఒదిగిపోతూ మూలగకపోతే మనలో స్పందనలు ఏమున్నట్లు? నిష్కల్మషమైన ఆ ప్రేమకు కూడా ఆద్యంతాలు, తర్కాలు అన్వేషించనారంభిస్తే మనలో మానవత ఎంత అడుగంటిపోయినట్లు..?
“నిన్ను ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను, మిస్ అవుతున్నాను…” వాక్యాలు వేరైనా భావం ఒక్కటే… హృదయాన్ని మరో హృదయం ముందు పరచడం! “హృదయం” అనేది ఇప్పటి రోజుల్లో మనసుతోపాటు శరీరాన్నీ ప్రేమించే “సంపూర్ణ ప్రేమికుల”కు కట్టబెట్టబడిన పేటెంట్ వస్తువు. ఒకరి హృదయాన్ని మరొకరు తరచి చూడడం ప్రేమికులే చేయాలి. అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితులు భావాలు కలిసి హృదయసావాసం చేసుకోవడం భౌతిక ప్రపంచానికి మింగుడుపడదు. హృదయాన్ని ప్రేమించడం అంటే శారీరక వ్యామోహమూ అందులో అంతర్లీనంగా ఉండి ఉండాలి అనే రీతిలో సినిమాలు, ప్రసారమాధ్యమాలు ఎన్నో హృదయాలకు మధ్య అగాధాలు పెంచేస్తున్నాయి.
నా నేస్తం తన ఆప్యాయతతో మనసుని నిమిరినప్పుడు “ప్రియతమా” అని మనసారా పిలవాలనిపిస్తుంది. కానీ గొంతులోనే సమాధి అయిపోతుంది ఆ పిలుపు. అలాంటి పదాలు వాడాలంటే మనసులో లేశమాత్రమైనా నటన లేకున్నా “నాటకీయత” ధ్వనిస్తూ అద్భుతమైన అనుభూతి అతి సాధారణం అయిపోతుందేమోనన్న భయం ఆవరిస్తుంది. భావవ్యక్తీకరణకు, ఇరువురు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పటిష్టం చెయ్యడానికి ఆలంబనగా నిలిచే ఆణిముత్యాల్లాంటి.. “ఇష్టం, ప్రేమ, ప్రియతమా, నేస్తమా… ప్రేమతో” వంటి పదాల్ని సినిమాల్లో యువహృదయాల్ని ఆకట్టుకుని కనకవర్షం కురిపించుకోవడానికి విచ్చలవిడిగా వాడేసి ఎంత చులకన చేశారో తలుచుకుంటే హృదయం తరుక్కుపోతుంది. యంత్రాల మధ్య భౌతికంగా మనమూ యంత్రాలమైపోయాం. గాఢమైన అనుభూతులను చులకనైపోయిన అమూల్యమైన పదాలతో పలకలేక మనసునూ యాంత్రికం చేసుకుంటూ సాగుతున్నాం.
ఇరు హృదయాల మధ్య సాన్నిహిత్యం చోటుచేసుకోవడానికి మన సమాజంకొన్ని అర్హతలు అనధికారికంగా నిర్దేశిస్తోంది. అయితే ప్రేమికులు కావాలి. లేదా రక్త సంబంధం కావాలి. ప్రేమికులు నాలికపై నుండి చిలకపలుకులు పలికినా దేవదాస్ పార్వతిలతో పోలుస్తూ ఎక్కడలేని ముగ్ధత్వం ఆపాదించబడుతుంది. తల్లిదండ్రులకు, బిడ్డలకు మధ్య ఉండే అనుబంధం, అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలు… కూడా మన ప్రపంచానికి రిస్క్ లేదు. ఎటొచ్చీ అపోజిట్ సెక్స్ కి చెందిన ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడే అనుబంధమే.. దాని అంతేదో తేల్చాలి అన్నంత నిద్రలేకుండా చేస్తుంది సమాజాన్ని! ఇక ఆ ఇద్దరి మధ్య ప్రేమ, ఇష్టం వంటి పదాలు సమాజపు పాము చెవులకు విన్పిస్తే ఇంకేమైనా ఉందా? పుకార్లని షికారు చేయించి ఇద్దరి మనసులు విరిచేసి పైశాచికత్వం నిరూపించుకోదూ…?
అన్ని అద్భుతమైన వ్యక్తీకరణలను ప్రేమకి ముడిపెట్టి మిగతా మానవ సంబంధాలకు(అవి ఏమైనా కావొచ్చు,స్నేహం, అక్క చెల్లెళ్ళు, అన్నా తమ్ముడు) ఎంత అన్యాయం చేశారో అస్సలు ఈ సినిమా రచయితలకు తెలియదు…
అని రాస్తే మనసు ఓ క్షణం చలించింది. హృదయం, ప్రేమ, ఇష్టం వంటి పదాలను, మనుషుల మధ్య అనుభూతులను భ్రష్టుపట్టిస్తూ నిజమైన అనుబంధాలను సమాజం ఎంత నిర్థాక్షిణ్యంగా కాలరాస్తుందో నా స్వీయ అనుభవంతో రాద్దామని చేసిన ప్రయత్నమే ఇది. తన పోస్ట్ ద్వారా ఈ ఆలోచనను రేకెత్తించిన రమణి గారికి ధన్యవాదాలు.