ఒక అతి మామూలు మనిషి..
సీమాంధ్రో, తెలంగాణానో అప్రస్తుతం..
పొద్దస్తమానూ కష్టపడితే నోట్లోకి నాలుగు ముద్దలు వెళతాయి..
కష్టపడడమే తెలుసు, హాయిగా నిద్రపోవడమే తెలుసు..
అంతలో ప్రత్యేక తెలంగాణా అంటూ, సమైఖ్యాంధ్ర అంటూ ఉద్యమాలూ, నినాదాలూ మిన్నుముట్టాయి..
పక్క మనిషిని కదిలిద్దామంటే.. ఎగాదిగా చూసి "మనోడో కాదో" గుర్తుపట్టేసి నవ్వు మొహానే కారాలూ మిరియాలూ నూరేసేటంతగా ఇరు ప్రాంతాల రాజకీయ నాయకులు మామూలు మనిషి నరనరానా విషం చిమ్మేశారు..
సరేలే రోజులు బాలేవని తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు..
టివి పెడితే "తన్నేయండి, తరిమేయండి" అంటూ కొందరూ, హైదరాబాద్ ఎవడబ్బ సొత్తని మరికొందరూ ఎడాపెడా తిట్టేసుకుంటున్నారు..
ప్చ్.. అని నిట్టూర్చి.. కలతపడిన మనసుతో పనిలోకి తలదూర్చేశాడు..
అంతలో రాజకీయాలు ముదిరి పాకానపడ్డాయి..
సమ్మెలన్నారూ, బస్సూ, రైలూ, స్కూలూ, బొగ్గూ, ఈ ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి రాకపోకలూ కుదరనే కుదరవన్నారు..
ఇన్నాళ్లూ నడుస్తున్న పని కూడా బందయింది.. ఇక ఆ మనిషికి ఎవరికి చెప్పుకుని వాపోవాలో అర్థం కావట్లా..
నోరుతెరిచి సమ్మెల వల్ల తాను పడుతున్న ఇబ్బందులు ఏకరువు పెడదామంటే "నువ్వు తెలంగాణా ద్రోహి"వంటూ విరుచుకుపడే వారు కొందరు!
ఇన్నాళ్లూ రాజకీయాల వల్ల బాధలు పడుతుంటే బాధిత ప్రజలు ఒకరికొకరు రాజకీయ నాయకుల్ని తిట్టుకుంటూ ఎంతో కొంత ఉపశమనం పొందేవారు.
ఇప్పుడు తమకెదురవుతున్న ఇబ్బందుల గురించి ఇతరులతో కలిసి తిట్టుకోవడానికి సాటి మనిషి కూడా వస్తాడో రాడోనన్నంతగా ఒంటరితనం అలుముకుంది.
వాదాలు ఏవైనా, రాష్ట్రాలు ఎన్నయినా మనం మనుషులం. రాజకీయాలు కలుషితం అయినా ఫర్వాలేదు కానీ అవి మనల్ని కలుషితం చేయకుండా జాగ్రత్త తీసుకోపోతే మనకు మనం కూడా మిగలము.
గమనిక: నేను ఏ "వాదినీ" కాదు. సగటు మనిషిని.
– నల్లమోతు శ్రీధర్