"మనమొక్కళ్లం పూనుకుంటే సమాజం బాగుపడుతుందా?" అన్న తర్కం మాటున దాక్కుని సగటు వ్యక్తి సమాజం గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశాడు. తానూ, తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ఇలా తన పరిధికి కొన్ని హద్దులు పెట్టుకుని ఆ పరిధిలోని ఆనందాలూ, దుఃఖాలు, విజయాలూ, విషాదాలకే స్పందించడం ఎప్పటినుండో జరుగుతూ వస్తున్నదే! కానీ క్రమేపీ ఆ పరిధి కూడా కుంచించుకుపోవడం నిశితంగా గమనిస్తే అందరికీ అర్థమవుతుంది. ఒకప్పటి వరకూ ఎంతో ఆత్మీయంగా మెలిగిన బంధువులు, స్నేహితులు కూడా ముక్తసరిగా నాలుగు మాటలు మాట్లాడడం కూడా గగనం అయిపోయిన దుస్థితిలో మనం ఉన్నాం. పోటీ ప్రపంచంలో జీవితం యాంత్రికమే! అలాగని మనమూ యంత్రాల్లా ప్రేమ, ఆప్యాయతలకు స్పందించనంత "ఎత్తుకు ఎదిగిపోవడం" ఎవరి కోసం?
చిన్న ఉదాహరణలే మనసుని కదిలిస్తాయి. శుభకార్యాలప్పుడు అందరూ కలుస్తుంటారు. అందులో మనం ముసలీ, ముతకాగా భావించే వయోవృద్ధులూ ఉంటారు. ఏ మూలనో కూర్చుని, దృష్టిని ఎక్కడో నిలిపి జ్ఞాపకాల దొంతరల్లో మునిగితేలి ఉంటారు. ఒక్కసారి మనం వెళ్లి మాటవరుసకి పలకరిస్తే.. అప్పటివరకూ నిర్జీవంగా ఉన్న వారి కళ్లల్లో ఎంత వెలుగు మెరుస్తుందో ఎప్పుడైనా గమనించారా? ఏళ్ల తరబడి ఎవరూ సరిగా పలకరించని నేపధ్యమేమో.. ఇంకెవరూ తమని పట్టించుకోరనే నిర్లిప్తత ఏమో.. ఒక్కసారిగా మనలాంటి వాళ్లం వెళ్లి పలకరించేసరికి ఉబ్బితబ్బిబై "బాగున్నావా నాయనా" అంటూ వాళ్ల మాటల్లో ప్రవహించే ప్రేమని ఆస్వాదించగలిగే సున్నితత్వం మనకెక్కడ మిగిలుందీ? అందుకే "ఆ ముసలావిడ అంతేలే మనుషులు పలకరిస్తే చాలు" అంటూ పక్కన వెటకారమాడే బంధువుల వైపూ, ఆ ముసలవ్వ వైపూ ఒక నవ్వు విసిరేసి ముందుకు సాగిపోతాం. ఒక్క పదినిముషాల ఆవిడతో చెంతన కూర్చుంటే మరో పదేళ్లు సంతోషంగా బ్రతికేటంత ఆనందం ఆవిడకు లభిస్తున్నందన్న స్పృహ కూడా మనకు కలగదు. ఎంతైనా మనం చాలా బిజీ కదా!
ప్రతీ క్షణమూ అమూల్యమైనదే. ఒక్కసారి భవిష్యత్ ని ఊహించుకోండి.. ఇంత కష్టపడీ, సంపాదించీ ఆ ఆనందాన్ని పంచుకోవడానికి ఆత్మీయులు కరువైనప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మనకూ.. మిగిలిన ప్రపంచానికీ మధ్య పూడ్చుకోలేనంత అగాధం ఏర్పడి ఉంటుంది. మనమే ఇంత సామాజిక ఒంటరితనానికి లోనవుతున్నామే తర్వాతి తరాలు సంతోషాల్ని పంచుకోవడానికీ, విచార సమయంలో ఓదార్చడానికీ ఎవరూ దొరక్క ఎలా జీవశ్చవాల్లా బ్రతుకుతారో ఒక్కసారి ఆలోచించండి. అందుకే మనం గడించాలని తాపత్రయపడుతున్న కోట్ల రూపాయల్లో ఎవరికీ నయాపైసా అయినా సాయం చెయ్యనవసరం లేదు. "మన పట్ల, మన ఆత్మీయుల పట్ల, సమాజం పట్ల" చేతనైనంతలో ప్రేమాభిమానాలు పంచితే చాలు.