తెలుగు బ్లాగ్లోకంలో మిత్రులు చేసే ఎన్నో అద్భుతమైన టపాలను చదివేటప్పుడు కొన్ని క్షణాలపాటు మనసులో ఏ మూలనో వెలితి మెలిపెడుతుంది. “సాంకేతికాలు”ని సక్రమంగా నిర్వహిస్తే చాల్లే అని అప్పటికప్పుడు సర్ధిచెప్పుకుని సాగిపోతూ ఉన్నాను. విభిన్న ఆలోచనలు మనసుని ముప్పిరిగొని అస్పష్టంగా కదలాడేటప్పుడు “వాటి ఘోషకి అక్షరరూపం ఇస్తే ఆ అలజడి శాంతిస్తుంది కదా” అని మళ్లీ మనసు మూలిగినా గొంతునొక్కిపెడుతూ వచ్చాను. ఈ నింయతృత్వపోకడలు చూసి మనసెక్కడ తిరగబడుతుందోనన్న భయంతో కంప్యూటర్ ఎరా మేగజైన్ లో సంపాదకీయాల్లో ఓ చిన్న వెసులుబాటు కల్పించుకుని నెలకోసారైనా గళాన్ని విప్పుతున్నాను. అయినా అసంతృప్తి తొలగడం లేదు. తెల్లారిలేచించి మొదలు ఆదమరిచి నిద్రపోయేవరకూ మనసులో ఎంతో భావసంఘర్షణ జరుగుతూ ఉంటోంది. ఎలాగైనా అప్పుడప్పుడు కొంత తీరుబడి చేసుకుని దానికి ఓ రూపం సంతరించి ఇవ్వకపోతే ఆ సంఘర్షణ మనసులో చిక్కుముడులుగా ముడిపడిపోతుందేమోనని.. ఎంతోకాలం ఊగిసలాటకు తెరదించి ఇన్నాళ్లకు “మనసులో..” పేరిట ఈ బ్లాగుకి శ్రీకారం చుట్టాను. అందరి ఆదరాభిమానాలు లభిస్తాయని ఆకాంక్షిస్తూ..
– నల్లమోతు శ్రీధర్