తెల్లారుగట్ట… చుట్టూ చిరు చీకట్లు.. చాన్నాళ్లుగా కలిసిమెలిసిపోయిన కావలసిన మనిషిని ఎక్కడో దిగబెట్టి వెనుదిరిగాను.. మరో కావలసిన మనిషి కారు డ్రైవ్ చేస్తున్నారు..
రోడ్డంతా విశాలంగా ఉంది.. రోడ్ మీద జీబ్రా గుర్తులూ.. సిగ్నలింగ్ మార్కులూ.. వెళ్తుండే కొద్దీ రోడ్ సాగుతూనే ఉంది. మనిషికి ఎంత దూరంగా జరిగిపోతున్నానో పరోక్షంగా చెప్తూ బాధ పెంచుతూ..
కళ్లమ్మట సన్నని నీటి తెర కమ్మేసింది.. కిలోమీటర్లూ, మైళ్లూ దూరమవుతూనే ఉన్నాం.. అదృష్టం కొద్దీ ఎవరు దూరమైనా.. దూరంగా జరిగినా.. ఓ పదో ఇరవయ్యో రోజులు కలతపడి.. తర్వాత మామూలైపోగలుగుతున్నాం, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఓ కొత్త ప్రపంచం సిద్ధంగా ఉంటూనే ఉంది మనకి.. కొత్త మనుషులు, కొత్త రిలేషన్లు, అంతా కొత్తదనం… కానీ పాతవేమైపోతున్నాయి.. జ్ఞాపకాల్లో అట్టడుగుకి చేరుతున్న మనుషుల్నీ, మధురస్మృతుల్నీ కొత్త ప్రపంచంలో బిజీ అయిపోయి రీకాల్ చేసుకునే తీరిక కూడా దొరకట్లేదే..
దూరంగా జరిగిపోయిన మనుషుల్ని తలుచుకుంటే మనకు బాధ తన్నుకొస్తుంది.. ఏడుపొస్తుంది.. మనకు ఏడ్వడం నచ్చదు.. అస్సలు బాధనేదే తట్టుకోలేం.. అది సెంటిమెంట్స్‌తో కూడిన బాధైనా..! అందుకే వీలైనంత త్వరగా స్టెబిలైజ్ అవుతాం. సరిగ్గా ఇక్కడే ఓ సీక్రెట్ దాగుంది.. రిలేషన్లని పలుచన చేసేది..
ఓ మనిషి దూరంగా వెళ్లేటప్పుడు మనస్సు పడే బాధ దానంతట అది కోలుకోబడిన తర్వాత “ఆ మనిషి దూరంగా ఉండే మనిషే కదా” అన్న భావన కొద్దీ ఇంటెన్షనల్గానే గొప్ప జ్ఞాపకాల్ని వాటిని గుర్తు చేసుకునీ ఆ దూరాన్ని తట్టుకోవడం చేతకాక అసలు గుర్తు చేసుకోవడమే మానేస్తాం. ఎవరికి వారు వాళ్లకు సన్నిహితంగా, సమీపంగా ఉండే ప్రపంచంలోనే ఆనందాన్నీ, అనుభూతుల్నీ వెదుక్కోవడం మొదలెడతారు.
అందుకే వాకింగ్‌కి వెళ్లే తాతయ్యలకు ఏ ఫారిన్లోనో ఉండే కొడుకుల కన్నా బలమైన మానసికమైన అటాచ్మెంట్ ఉండే ఫ్రెండ్స్ తోటి వాకర్స్‌లో దొరుకుతుంటారు. ఎవరేమిటో తెలీకపోయినా ఓచోట బ్రతికే వాళ్లు అంత త్వరగా దగ్గరయ్యేదీ ఈ కారణం చేతే!
ఎవరి ప్రపంచం వాళ్లకు ఏర్పడుతోంది.. బానే ఉంది కానీ…
దూరంగా ఉంటూ జ్ఞాపకాల్లో కొందరూ, సజీవంగా కొందరూ, నిర్జీవులై కొందరూ.. మనుషులంతా చెల్లాచెదురవుతుంటే మనస్సు కలత చెందుతోంది.. మనస్సుని కుదుటపరుచుకోవడం గొప్ప విద్యేం కాదు.. కరువుతీరా ఏడ్వడానికి చాలా ధైర్యమూ, మనస్సూ కావాలి ఇవ్వాళ్టి రోజున…
ఓ పక్క అసలు మనుషులే కరువైపోతున్నారు అని బాధపడుతుంటే.. ఇంకా ఉన్న రిలేషన్లని అపార్థాలతో ఎందుకు చంపేసుకుంటారో అర్థం కాక తలబద్ధలవుతుంటుంది కొందరి సమస్యలు వింటుంటే..!!
కారు సడన్ బ్రేక్‌తో ఆలోచల్నుండి బయటకొచ్చాను.. కళ్లెదురు హడావుడిగా పరుగులు తీస్తున్న కొత్త మనుషులూ, కొత్త వాతావరణం.. సాగిపోతూనే ఉన్న రోడ్డూ కన్పిస్తున్నాయి.. ఈ జీవిత ప్రయాణం ఎంతవరకో.. ఏ హృదయాలతోనో కడవరకూ!!
– నల్లమోతు శ్రీధర్