ఫీలింగులూ, ఎమోషన్లూ అన్నీ చంపుకుని.. వీలైనంత ప్రాక్టికల్ గానూ, మెటీరియలిస్టిక్ గానూ ఉండడం చాలామందికి ఇష్టం.
యండమూరి "అంతర్ముఖం" వంటి నావెల్ చదివిన చరిత్ర ఉంటే ఇంకా చెప్పే పనే లేదు.. చాలా కన్విన్సింగ్ లాజిక్‌తో మెటీరియలిజం నేరేట్ చేయబడ్డాక దాన్ని మించిన shell మనల్ని మనం రక్షించుకోవడానికి ఏం కన్పించదు. ఇక్కడ యండమూరి అభిమానులుంటే తప్పుగా అనుకోకుండి.. ఆయన నాకు సుపరిచితులే. సందర్భానుసారం ప్రస్తావించక తప్పలేదు.
Yes… మెటీరియలిస్టిక్ థాట్ ప్రాసెస్‌లో తల్లీదండ్రీ.. అక్కా చెల్లీ, ఫ్రెండూ, పక్కింటోడూ.. అందరూ ఏదో ఒక అవసరం కొద్దీనే relation కొనసాగిస్తున్నట్లు అన్పించడం సహజం.
సంవత్సరానికో నాలుగైదు సార్లు ఫోన్లు చేసే ఫ్రెండ్స్‌నీ.. "ఇప్పుడు గుర్తొచ్చామా.. పనులుంటే గానీ మేం గుర్తు రాము కదా" అంటూ వ్యంగ్యంగా మాట్లాడేసి.. స్వార్థపరులుగా వాళ్లని consider చేసేస్తే గానీ మన మెటీరియలిస్టిక్ లాజిక్ సంతృప్తి చెందదు.
ఇక్కడ అవసరాలు తప్ప మనుషుల మధ్య ఇంకేం లేదు అన్నది మన బలమైన నమ్మకం. అందుకే మనసు నిండా వేక్యూమ్తో ఇంత ఒంటరిగా బ్రతికేస్తున్నాం.
ఎవర్నో అభిమానిస్తాం.. చాలా క్లోజ్‌గా మూవ్ అవుతాం.. వారిపై ఏవోవే expectations పెట్టుకుంటాం. అవతలి వారు ఎక్కడో మన పరిధి దాటి వెళ్లిపోయారన్పిస్తుంది. అంతే మనస్సు గాయపడుతుంది.. మనకు మనం ఒంటరిగా కన్పిస్తాం.. ఆ ఒంటరితనాన్ని సమర్థించుకోవడానికి మెటీరియలిజం టైమ్‌కి మనల్ని ఆదుకుంటుంది. "ఎవరూ మనవారు కాదు.. ఇక నాకెవరితోనూ పనిలేదు.. నా పనేదో నేను చేసుకువెళ్లడమే" అన్న బలమైన నిర్ణయం మనస్సులో fix అయిపోతుంది. కొన్నాళ్లు అలాగే ఉంటాం. అంతలో మరెవరో పలకరిస్తారు. మోడువారిని చిగుళ్లు కాస్తా తిరిగి అల్లుకుంటాయి.
ఇదా మెటీరియలిజం?
మన డిజప్పాయింట్మెంట్లని కప్పిపుచ్చుకోవడానికా ఈ మెటీరియలిజం అనే మేకప్పు?
ఎదుటి వ్యక్తిపై మన expectations అన్నీ చెల్లాచెదురైనంత మాత్రాన ఆ మనిషి స్వార్థపరుడైన వస్తువుగా మారిపోయారా?
——————————————————————————————————-
మనం గొప్పోళ్లం అయిపోతున్నాం.. ఎవరెవరో మనల్ని వాడుకోవచ్చు.. సో మనం ఎవరితోబడితే వాళ్లతో చనువుగా ఉండకూడదు.. మనసారా నవ్వకూడదు.. ఒక్కముక్కలో చెప్పాలంటే "ఎంత ఆచితూచి ఉండాలంటారూ..?"
చాలామంది నమ్మే సిద్ధాంతం ఇది.
మనకు మనసారా నవ్వే స్వేచ్ఛ లేదు. అవతలి మనిషి ఎంతో ఎఫెక్షన్‌తో ఉన్నా.. అదెక్కడి ఐస్ చేసే మెంటాలిటీనోనని భయపడడమే మనకు తెలుసు.. అందుకే పాపం చిరునవ్వు లోపల వికసించినా.. పెదాల బిగింపులో చంపేయబడుతుంది.
ఒక వ్యక్తి మనతో చనువుగా మాట్లాడుతున్నా, అభిమానంగా ప్రవర్తిస్తున్నా.. మన మెటీరియలిస్టిక్ ఆలోచనా విధానానికి ఆ బిహేవియర్ వెనుక సరైన లాజిక్ దొరికే వరకూ మన కళ్లళ్లో కన్ఫ్యూజనే ఉంటుంది.
"ఓ అతను మనతో ఈ అవసరం కోసం ఇలా మాట్లాడుతున్నాడు కాబోలు" అని ఓ conclusionకి వచ్చాక గానీ కళ్లల్లో కన్ ఫ్యూజన్ పోయి మొహంలో stubborn ఉట్టిపడదు 🙂
మనం చాలా గొప్ప మెటీరియల్స్మి.. ఎంత గొప్ప materialsమంటే.. బాడీలాంగ్వేజ్లూ, ఫేసియల్ ఎక్స్ప్రెషన్లు అద్దాల ముందు ప్రాక్టీసులు చేసేసి మరీ.. కృత్రిమ హావభావాలతో మనుషుల్ని వాడుకోగలిగేటంత!
అస్సలు నిజమైన నవ్వు ఎలాగుంటుందో మర్చిపోయాం. ప్రేమగా పలకరించడం తెలీదు.. సూటిగా, సుత్తి లేకుండా ఉన్నదున్నట్లు చెప్పడమే, చెప్పించుకోవడమే మన స్ట్రేటజీ.
"మీరు చాలా మంచోళ్లు సర్" అని ఎవరైనా అంటే ఆనందం వేస్తుందో లేదో తెలీదు కానీ అనుమానం మాత్రం ఖచ్చితంగా మనకు వస్తుంది. అంత ఇన్ సెక్యూర్డ్ మనం!
ఇంట్లో టివి, కంప్యూటర్ టేబుల్ లాంటి వస్తువులే మనుషులూ కాబట్టి.. మనకు తెలిసిందొక్కటే.. మనుషుల్ని వాడుకోవడమో, వాడుకోబడడమో. ఇవ్వాళ వాడుకోబడడానికి మనం ఆస్కారం ఇచ్చినా దానికీ ఓ లెక్కుంటుంది.. రేపు వారిని మనం వాడుకోవచ్చన్న లౌక్యం 🙂
లాజిక్ ఎప్పుడూ మెటీరియలిజంనే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎమోషన్లు అంచనాల్నే పెంచుతాయి. ఆ అంచనాలు తీరకపోతే మిగిలేది నిరాశే. కాబట్టి అస్సలు ఎమోషన్లే ఉండని వస్తువుగా మారిపో అనే చెప్తుంది మెటీరియలిజం.
చిన్న ఉదాహరణే చెప్పాలంటే ముక్కూ మొహం తెలీని ఒక హీరోని ఎంతో అభిమానిస్తూ.. అనుకున్న టైమ్ కి సినిమా రిలీజ్ అవ్వకపోతే థియేటర్లలో గొడవలు చేసేటంత సెన్సిటివ్ మనం.
అలాంటిది ఓ మనిషితో గంటల తరబడి కబుర్లు చెప్పుకుని, ఛాటింగ్ లు చేసుకుని, కొన్నేళ్లు కలిసి బ్రతికి.. ఓ అంచనా తారుమారైతే తట్టుకోగలిగినంత బండబారిపోయిన వాళ్లం కాదు మనం. అందుకే అలా తట్టుకోవాల్సిన struggleలో మనకు కన్పించే మొదటి లాజిక్ మెటీరియలిజమే. "ఇక నేనెవర్నీ రాసుకుపూసుకు తిరగను.. నా పనేదో నేను చేసుకోవడం తప్ప" అనుకోవడంలో ఎంత ఊరడింపో కదా మనకు. మరీ ముఖ్యంగా ఏ సంఘటన వల్లో మనస్సు గాయబడి చెంపలపై కన్నీటి చుక్క ఎండిపోతుంటే… మనం బండబారిపోబోతున్నట్లు ఊహించుకుంటూ నిర్ణయాలు తీసుకోవడంలో తెలీని సంతృప్తి దాగుంటుంది.
మనుషులతో కలిసిపోవాలంటే భయం మనకు.. ఎదుటి మనిషి పెదవి విప్పితే సందేహం మనకు… ఏ అవసరాన్ని తీర్చమంటారో అని! ఇన్ని గొడవలూ లేకుండా isolatedగా బ్రతకడమే సేఫ్ గా అన్పిస్తుంది.
అందుకే మనం మనుషుల్ని వస్తువుల్ని చేసేస్తాం.. మనం వాళ్లని వాడుకుంటాం, వాళ్లు మనకు ఉపయోగపడతారని వాళ్లూ మనల్ని వాడుకునే చొరవ కొంతవరకూ కల్పిస్తాం.
Clash of the Titans సినిమాలోలా శిలల్లా మారిపోయిన మనుషుల్నా సంవత్సరాల తరబడి గడిపేస్తుంటాం. మన నవ్వుల్లో హృదయం ఉండదు.. చూపుల్లో వెలుగుండదు.
ఇంత మెటీరియలిజం అవసరమా మానవ జాతికి?
మనుషుల ఎమోషన్లని భరించలేని బలహీనమైన వాళ్లమా మనం? ఆ ఎమోషన్లని తట్టుకోవడానికి మెటీరియలిజం తప్ప మరో దారి లేదా?
ఆలోచించండి..
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్