"మా అబ్బాయి చాలా కామ్ అండీ.. ఎవరితోనూ పెద్దగా కలవడు" అంటూ ఏదైనా గెట్ టు గెదర్‌లో పరిచయాలప్పుడు కామెంట్లు విన్పిస్తూనే ఉంటాయి.
సరిగ్గా అలాంటప్పుడు ఆ అబ్బాయి మొహంలోకి లోతుగా తొంగిచూడండి.. "ఎందుకు నన్ను ఇలాగే ఇరికించేస్తారు.. నేనూ మాట్లాడగలను.. మీ ఛాదస్తపు మొహాలతో కాదు.. నా సర్కిల్ నాకుంటుంది" అన్న ఫీలింగ్ ఓ తెరలా కదలాడుతుంది.
అదే అబ్బాయి బయట ఫ్రెండ్స్‌తో చ
ఇది ఓ చిన్న ఉదాహరణ మాత్రమే.. హ్యూమన్ రిలేషన్స్‌లో ఉన్న పర్సనాలిటీ డిజార్డర్‌కి ఓ మచ్చుతునక ఇది.
పుట్టి బుద్ధెరిగాక ఎప్పుడైనా ఓ రెండుసార్లు ఎవరైనా స్వీట్స్ పెడితే వద్దనండి.. మన కళ్లల్లోకి మన పేరెంట్స్ కేరింగ్ చూపులు గుచ్చుకుని.. ఓ నిర్ణయం తీసేసుకుని.. "మా వాడికి స్వీట్స్ ఇష్టం ఉండదు" అని ఓ కంక్లూజన్ని వారు జీవించినంతకాలం మోస్తూనే ఉంటారు.
పై రెండు ఉదాహరణల్నే తీసుకుంటే మాట్లాడడానికీ ఉత్సాహకరమైన వాతావరణమూ, కామన్ సబ్జెక్ట్ ఉండాలన్న విషయమూ.. స్వీట్స్ తినడానికీ ఆకలీ, నచ్చిన స్వీటూ, ఇష్టంగా తినగలిగే అట్మాస్ఫియరూ ఉండాలన్న విషయమూ మనం విస్మరిస్తాం.
ఓ మనిషి మన గమనిస్తుండగా ఒక పని పట్ల ఒకటికి రెండుసార్లు ఒకేలా స్పందిస్తే అతను జీవితాంతం అలాగే ఉంటాడని మనం నిర్ణయించేస్తాం. ప్రచారం చేస్తాం.
దీని గురించి ఇంత చెప్పుకోవలసిన అవసరం ఏముంది అని మీకు అన్పించవచ్చు.
మన కుటుంబాల్లోనూ, స్నేహాల్లోనూ ఎందరివో అలవాట్లూ, వ్యక్తిత్వాలూ ఇలాగే తప్పుడు అంచనాలతో ఓ మూసలోకి ఇరికించేయబడుతుంటాయి.
"మా అమ్మాయికి మాటలు రావు.. బొత్తిగా లోకజ్ఞానం లేదు, ఎలా బ్రతుకుతుందో ఏమిటో" అని గట్టిగా వాటేసుకుని ఇన్సెక్యూర్డ్గా ఓ పదేళ్లు ఒకటే మాటని చెప్పుకుంటూ వెళితే ఆ అమ్మాయి జీవితాంతం బేలగా కాక ఎలా చూస్తుంది? మనం స్లో పాయిజన్‌లా మన అసంపూర్ణ ముద్రల్ని వారిపై గుద్దేస్తున్నాం. పాపం వారు అలాగే బ్రతుకుతారు.. తల్లిచాటు కొడుకుల్లా.. అమ్మకూచి కూతుళ్లల్లా.
పేరెంట్స్, పిల్లలకే కాదు.. ఇది అందరికీ వర్తిస్తుంది! అదెలాగో మరో చిన్న ఉదాహరణతో చెప్తాను.
"శ్రీధర్ గారూ.. మీ రాతల్ని బట్టి మీరు చాలా సీరియస్ టైప్ అనుకున్నానండీ.. మీరేంటి ఇంత గోలగోల చేస్తున్నారు.. అస్సలు మీరూ కంప్యూటర్ ఎరా ఎడిటరూ ఒక్కరేనా" అని ఇదే మాట నన్ను నేరుగా కలిసి, కొంత చనువు ఉన్న ఎంతోమంది చెప్తుంటారు.
అలాగే మరోవైపు "శ్రీధర్ గారూ మీరేంటండీ.. ఇంత మౌనంగా ఉన్నారు.. మీరు చాలా సరదాగా ఉంటారని expect చేశామే" అని మరికొందరు అంటుంటారు.
ఇక్కడ మొదటి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులకు నేను ఒకటి రెండు సందర్భాల్లో ఒకలా అర్థమై ఉంటాను.. రెండవ స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తులకు నేను మరొక సందర్భంలో మరొకలా అర్థమై ఉంటాను.
కొన్నిసార్లు రెండు స్టేట్మెంట్లూ కరెక్టే, కొన్నిసార్లు రెండూ తప్పే.. మరికొన్నిసార్లు రెండింటిలో ఒకటే కరెక్ట్ కావచ్చు. It depends on the situation, my mood at that point of time. అంతే తప్ప నేను రెండూ కాకుండాపోనూ, రెండూ అయీపోనూ!!
మనం ఒక మనిషినీ, ఓ సందర్భాన్నీ, దానికి ఆ మనిషి ఆ క్షణంలో వ్యక్తపరిచిన ఎమోషన్‌నీ జతచేసి.. ఓ అభిప్రాయంగా మన మనస్సులో ముద్రించేస్తున్నాం.
మనిషి ఒక్కరే కావచ్చు.. సందర్భమూ, ఎమోషన్ మారొచ్చు.. మన అభిప్రాయం ఇలా వేసేసుకున్నాం కాబట్టి ఎమోషనూ అలాగే రావాలనుకోవడం, అలా రాకపోతే నోరెళ్లబెట్టడం.. it’s our fault only.
"నాకు వంకాయ కూర ఇష్టముండదు.." ఇది ఎవరైనా వంకాయ వడ్డించేముందు నేను చెప్పాననుకోండి.. ఇక ఆ విషయం వారికి గుర్తున్నంతకాలం వంకాయని నిర్ధాక్షిణ్యంగా నాకు దూరం చేసేయగలరు 🙂
నాకు వంకాయ ఎందుకు ఇష్టముండదో కారణాలు వారికి అనవసరం.. కారణం చెప్పాలంటే లోపల పురుగులు ఉంటాయనీ, అవతల వారు శుచీశుభ్రం పాటించని వారైతే ఇష్టం ఉండదని తప్పించుకోవడం నా మనస్సులో నేను ఏర్పరుచుకున్న క్రైటీరియా.
మరోచోట వంకాయ చాలా శుభ్రంగా వండి ఉండొచ్చు.. నాకు తినాలని ఉంటుంది.. వాళ్లూ సర్వ్ చెయ్యబోతారు.. పక్క నుండి ఓ వాయిస్ విన్పిస్తుంది.. "అబ్బాయికి వంకాయ ఇష్టముండదు.. ఆ వేసేదోదో ఓ రెండు ముక్కలు ఎక్కువ నాకు వేయండి" అని! ఎంత మండుతుంది మనకు?
సో.. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. కేరింగ్‌గా ఉండడం అంటే.. స్నేహితుల్నీ, కుటుంబ సభ్యుల్నీ పట్టించుకోవడం అంటే.. వారి క్యారెక్టర్ మొత్తాన్నీ మనమే చిత్రించేసి.. ఓ ఫ్రేమ్‌లో బంధించేసి.. "మా ఫ్రెండూ, మా అబ్బాయీ, మా అమ్మాయి.. ఇలాగే ఉంటారు" అని వారి బ్రతుకునీ బొమ్మరిల్లు సినిమాలోని ఫాదర్‌లా బ్రతికేయడం కాదు.
మనుషులు సందర్భాలకు తగ్గట్లు భిన్నంగా ప్రవర్తిస్తారు.. వారిని క్వశ్చన్ చెయ్యడానికి మనం హక్కుదారులం కాదు.. వారిని ఎక్కువ పట్టించుకుంటున్నాం కాబట్టి.. మన ఇష్టాన్ని రంగరిస్తున్నాం కాబట్టి.. మన ఆలోచనల్లోనే వారు జీవించాలి అనుకోవడం.. వారి గొంతు పెగిలే లోపు మన గొంతు డామినేట్ చేయడం సంస్కారం కాదు.
గమనిక: ఈ పోస్ట్ ఎవరికైనా పనికొస్తుందని మీకు అన్పిస్తే మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్