ప్రతీ మాటా ఛేష్టా ఎన్నెన్నో అర్థాలను ధ్వనింపజేస్తుంది. ఓ సంఘటనను సమాజంతో పంచుకోవాలని అన్పించి మాటల్లో చెప్పేసుకుంటాం. కొందరు మనం సానుభూతిని ఆశిస్తున్నామనుకుంటారు.. మరికొందరు అయ్యో పాపం అని ఏకంగా సానుభూతిని కురిపించేస్తారు.. కానీ మనం వాటిలో ఏ ఫలితాన్నీ కోరుకోము. మనం కోరుకోని స్పందనలు.. వేర్వేరు వ్యక్తుల నుండి వేర్వేరు రూపాల్లో రావడం చూశాక.. ప్స్ ఎందుకు పంచుకున్నామా అన్పిస్తుంది. ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. మనుషుల మెదడులు నిరంతరం రకరకాల రసాయనాల సమ్మేళనంతో ప్రభావితమై పలు రకాల భావోద్వేగాలతో నిండిపోయి ఉంటాయి. వారి చుట్టూ ప్రపంచంలో చోటుచేసుకునే పరిణామాలూ, అవి కలిగించే భావోద్వేగాలను బట్టి వారి ఈ క్షణపు మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది. ఆ మానసిక స్థితిని బట్టే ఈ క్షణం వారు మనకు ఎలా స్పందించబోతున్నారన్నది నిర్మితమవుతుంది. ఒక్కో మాటా, మన ప్రవర్తన ద్వారా వ్యక్తమయ్యే ఒక్కో చర్యా వేర్వేరు వ్యక్తులకు భిన్నాభిప్రాయాలు కలిగిస్తూ ఉండబట్టే కొందరికి మనం సజావుగానూ, మరికొందరికి అపసవ్యంగానూ కన్పిస్తుంటాం. ప్రతీ మనిషీ పక్క మనిషిని అర్థం చేసుకునే క్రమంలో ఇన్ని సంక్లిష్టతలు ఉండబట్టే.. ఆ సంక్లిష్టతలను ఛేధించి ఎదుటి వ్యక్తిని సవ్యంగా అర్థం చేసుకునే తీరుబడి మనకు ఉండడం లేదు కాబట్టే.. సుగుణాభిరాములను సైతం ఒక్కోసారి ఛీదరించుకుంటూ ఉంటాం, అష్టావక్రులను సైతం ఎగబడి అక్కున చేర్చుకుంటూ ఉంటాం. ‘మనిషిని చూడగానే మనస్థత్వం ఏమిటో ఇట్టే చెప్పేయలేనూ..’ అంటూ చాలాసార్లు డాబుసరి ప్రదర్శిస్తుంటాం గానీ ఈ డాబుసరి అంచనాలతో ఎంత మంచి అనుబంధాలను చేజేతులా దూరం చేసుకున్నామో, చెప్పుడు మాటలను నమ్మి నిఖార్సయిన మనుషులకూ దూరంగా మెలిగామో గతాన్ని తవ్వుకుంటే తేటతెల్లమవుతుంది.
మనుషుల మధ్య తెలీని ఇన్ని అగాధాలు ఏర్పడడానికి ప్రధాన కారణం.. సమాజాన్నీ, మనుషులనూ మనం తడిమి చూడలేకపోతున్నాం. తోటి మనిషి మనసులోని తడిని అనుభూతి చెందలేకపోతున్నాం. భౌతికపరమైన చర్యలనూ, అసమగ్రంగా వ్యక్తమయ్యే మాటలనూ ప్రాతిపదిక చేసుకుని మనిషిని అంచనా వేసేస్తున్నాం. ఒక్కోసారి తోటి మనిషి తడబాటులో తనకు లేని భావాన్ని మాట మెలికపడి అనేస్తే.. అతని మనస్థత్వం చెడ్డది కాదని మనకు స్పష్టంగా తెలిసినా.. ‘చూశారా.. ఎంత మాట అనేశాడో’ అని కర్కశంగా దోషిగా నిలబెట్టేస్తున్నాం. ఇలా కన్పించిన ప్రతీ మనిషినీ దోషిగా నిలబెడుతూ మనమొక్కళ్లమే సరైన వాళ్లుగా భ్రమిస్తూ బావుకునేదేమిటో నాకైతే అర్థం కా వట్లేదు. మనిషిని అభిమానించడానికి చర్యలూ, మాటలూ, భావోద్వేగాలు మాత్రమే ప్రాతిపదిక కాకూడదు. మనం వాటినే ప్రాతిపదికలుగా తీసుకుంటున్నాం కాబట్టే వాటిని అద్భుతంగా పలికించే వాళ్లు మనకు మంచి వాళ్లవుతున్నారు. ఆ మెళకువ తెలియని వాళ్లు చెడ్డవాళ్లవుతున్నారు. మోటుగా మాట్లాడినా మనసు నిండా మంచితనం నింపుకున్న పల్లెటూరి బైతు మనకు పురుగులా కన్పించడానికీ.. అణువణువూ విషం నింపుకుని కూడా తియ్యగా మాట్లాడే ఓ ప్రొఫెషనల్ మనకు దేవదూతగా కన్పించడానికీ బీజం పడుతోందిక్కడే! పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులూ, తియ్యని స్వరాన్నీ, ఆకట్టుకునే మొహకవళికల్ని నేర్పించే సెషన్లూ.. ఓ రాతి మనిషికి బంగారు పూతని తొడుగుతుంటే అదే నిజమని భ్రమపడి అబ్బురంగా ఆ ముఖారవిందాల నుండి దృష్టిని మరల్చుకోలేకపోతున్నాం మరోపక్క ‘ప్రాణమిచ్చే మనసొక్కటే’ ఉన్న మనిషిని దూరం పెడుతున్నాం.
– నల్లమోతు శ్రీధర్