ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మనమే అంచనా వేయడం:

అనుక్షణం దోబూచులాడే భావ తరంగాల సమాహారం..!!
ఎదుటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తాడో మనమే అంచనా వేయడం:
ప్రతీ ఆలోచనా ఓ కేంద్రకం నుండి జనిస్తుంది. అస్పష్టపు బాల్యదశ నుండి ఆలోచనలు బలం పుంజుకునే క్రమంలో వాటి సరళి సక్రమంగా సాగకపోతే.. చివరకు ఆలోచనల్లో లభించే స్పష్టతలోనూ డొల్లతనమే మిగులుతుంది. మన ఆలోచనలకు ప్రేరకాలు.. సంఘటనలు, మనుషులూ, సరిగ్గానో, తప్పుగానో మనం బేరీజు వేసుకోగలిగామనుకునే మనస్థత్వాలూ! ఆలోచన ఏ కేంద్రకం వద్ద మొదలైందో.. ఆ స్థితిలో మన మనఃస్థితి సవ్యంగా లేకపోతే సంఘటలనూ జీర్ణించుకోలేం, మనుషులనూ అర్థం చేసుకోలేం,పరిస్థితులూ మన నియంత్రణలో లేనట్లు కన్పిస్తాయి, మనం తప్ప మిగిలిన మనస్థత్వాలన్నీ లోపభూయిష్టమైనవిగా గోచరిస్తాయి. ప్రశాంతంగా ఉన్న మనస్సుల్లో ఓ వ్యర్థపు ఆలోచన జనిస్తే అది సృష్టించే అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఏ కేంద్రకం నుండి ఆ ఆలోచన ఉద్భవించిందో దాన్ని దాటిపోయి అశాంతిలో లేనిపోని చిక్కుముడులన్నింటినీ ప్రోది చేసుకునే దిశగా అది విధ్వంసపరుస్తూ పోతుంది. మనకు తెలియకుండా ఏదో అన్యాయం మనకు జరిగిపోతోందనే భ్రమా, సాటి మనిషి మనదైన దాన్ని మనకు కాకుండా చేసేస్తున్నాడన్న అభద్రతాభావం, ఎదుటి వ్యక్తి నిట్టనిలువున ఎదుగుతుంటే మిన్నకుండలేక కనబరిచే దుగ్ధా.. ఇవి చాలు మనల్ని అధఃపాతాళానికి చేర్చడానికి! పరిస్థితులనూ, మనుషులనూ సరిగ్గా అర్థం చేసుకోపోవడం వల్లనే ఈ మానసిక వైకల్యాలు మనకు తెలియకుండానే అంటుకుపోతాయి.
చిన్న ఉదాహరణ చెబుతాను. నేను రాసే ఈ పదాలన్నీ చదివేటప్పుడు గతంలో నాపై నిర్మించుకున్న మీ అసమగ్ర అభిప్రాయాలు అవి మంచివైనా, చెడ్డవైనా నా రాతల్ని మీ మనసుకు చేరకుండా ఒడపోస్తుంటే నా రాతల సారం బదులు నాపై అకారణమైన అభిమానమో, అకారణమైన ద్వేషమో నాటుకుపోతుంది. ఈ అక్షరాల్ని మనసుకి తీసుకోవడం ఒక్కటే వాస్తవానికి తక్షణావసరం మీకైనా నాకైనా! కానీ మొదటి వాక్యంలోనే నా రాతలోని ప్రతీ మాటనూ, గతంలో ఏదో సందర్భంలో, ఏదో కోణంలో నేను వ్యక్తపరిచిన ధోరణినీ, ఆ ధోరణి కనబరచడం వల్ల నాపై ఆ క్షణం నుండి మీరు ఏర్పరుచుకున్న అభిప్రాయాలతో పోల్చి చూసుకుంటూ "శ్రీధర్ ఇలా కదా.. ఇలా కాదు గదా.." వంటి అసమగ్ర విశ్లేషణలతో బుర్రని నింపుకుంటే ఫలితమేమిటి?
మనం చాలామందిమి మనుషుల్ని మనసుతో స్పృశించము. పరిచయమైన మొదటి క్షణం నుండే అపనమ్మకంతోనూ, మంచో, చెడో ఓ వ్యక్తి పట్ల ఏదో ఒక అభిప్రాయాన్ని నిర్మించేసుకుని "నేను నిన్ను ఇలా చూస్తున్నానుగా.. నీ పట్ల నాకున్న అభిప్రాయాన్ని నువ్వేమీ తీసేయలేవుగా" అన్న వెక్కిరింపు ధోరణిలో నూ చూస్తుంటాం. అందుకే ఇప్పటి మన ఆలోచనలకు ప్రాతిపదిక దాదాపు యావత్ సమాజం పట్లా అసమగ్ర విశ్లేషణలతో మనం ఏర్పరుచుకునే కుక్కమూతి పిందెల లాంటి అభిప్రాయాలే తప్ప.. ఈ క్షణం మీలో మంచి ఉన్నా నేను స్వీకరించప్రయత్నించను, నాలో మంచి ఉన్నా మీరూ స్వీకరించరు. ఇలా మన ఆలోచనల కేంద్రకం స్పష్టత లేనిదైనప్పుడు, మనం హృదయాలనేమి గెలవగలం? ఒక మనిషినీ, పరిస్థితినీ ఆపాదమస్తకం తడిమిచూడకుండానే ముడుచుకుపోతున్నామంటే ఎంత ఇరుకైన ప్రపంచంలో జీవిస్తున్నామో కదా! మన వాదనాపటిమతో మన ఆలోచనల్లో డొల్లతనమున్నా వాదించి గెలుస్తూ ఆనందిస్తున్నామంటే.. మనం గెలుస్తున్నట్లా.. మనిషిగా ఓడిపోతున్నట్లా?
హక్కులూ, ఆత్మగౌరవాలపై పెరుగుతున్న శ్రద్ధ మనుషులకు బాధ్యతలపై మృగ్యమవుతోంది. ఎక్కడ చూసినా హక్కుల కోసం పోరాటాలే.. వాటిని తప్పుపట్టలేం, కానీ మనం నిర్వర్తించవలసిన బాధ్యతల్లో చిన్న లోపాన్ని ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేం! కూడుపెడుతున్న వృత్తి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉండదు.. ఆదాయంపై ధ్యాస తప్ప! మన పట్లా, మనం చేసే పని పట్లా, సమాజం పట్లా బాధ్యతని విస్మరిస్తూనే హక్కుల కోసం ఉద్యమిస్తుంటాం. మన ధర్మాన్ని గాలికొదిలేసి నిరంతరం మన క్షేమం పట్లే మమకారం పెంచుకోవడం ఎంత దౌర్భాగ్యస్థితో అర్థమయ్యేటంత సున్నితత్వం మనలో ఇంకా మిగిలి లేదు. చేసే పని పట్ల నిర్లక్ష్యం ఎంత ఉపేక్షించరానిదో అర్థం చేసుకునే పరిస్థితిలోనూ లేము. మన పొరబాట్ల పట్ల అపరాధభావం కూడా మచ్చుకైనా కన్పించకుండా పోతోంది. పరోక్షంగా మన మనఃసాక్షికే జవాబుదారీగా ఉండడం ఎప్పుడో మానేశాం. మన శరీరాలు మందమవుతున్నాయి, బుద్ధులు సంకుచితమవుతున్నాయి. వితండవాదం, తర్కంతో మూర్ఖంగా అన్నీ నెగ్గించుకునే రాక్షస ప్రవృతి మనల్ని స్వారీ చేస్తోంది. ఎవరు చెప్పినా, ఏది చెప్పినా విన్పించుకునే స్థితిని దాటిపోయాం. ఒకవేళ విన్పించుకునే హృదయం ఇంకా మిగిలి ఉన్నా ప్రతీ ఒక్కరూ హక్కులనూ దక్కించుకోమని ప్రబోధించేవారే.. బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించమని నిర్దేశించేవారేరీ? అందరూ మనలాంటి ప్రజల పక్షాన హక్కులకై పోరాడతారు.. హక్కులను సాధించుకోమని ప్రేరేపిస్తారు.. ఏదైనా తేడా వస్తే వ్యవస్థని దుమ్మెత్తిపోస్తారు. వ్యవస్థని పతనావస్థకు చేరుస్తున్నది చేతులారా మనకు మనం కాదా? హక్కుల గురించి పోరాడేవారు బాధ్యతలను ఎందుకు ఉద్భోధించరు? సరిగ్గా పనిచేయమంటే అసలుకే మోసం వస్తుందని.. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యతని విస్మరించడం ఎంతవరకూ సబబు? అసలు ప్రతీ మనిషీ తాను చేయాల్సిన ధర్మాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తే వ్యవస్థలో లోపాలెందుకు ఉంటాయి?
బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి కూడా మనకు ఏదో ఒక ప్రయోజనం ఉండాలి. ఏ ప్రయోజనం లేనిదే చివరకు బ్రతకడం కూడా వృధా అనేటంత వ్యాపారాత్మక ధోరణిని అలవర్చుకున్నాం. దాంతో ఎక్కడా తృప్తి మిగలట్లేదు. బేరసారాలు తలకెక్కక ముందు సమర్థవంతంగా ఏదైనా పనిచేస్తే ఎంతో సంతృప్తిని మూటగట్టుకునే వాళ్లం. ఇప్పుడా సంతృప్తులు ఎక్కడా లేవు. మనం చేసే ఏ పనిలోనూ పరిపూర్ణత గోచరించదు.. అతుకుల బొంతలా ఏదో చేయాలి కాబట్టి చేయడం తప్ప! ఇలాంటి పలాయనవాదంతో జీవిస్తూ మళ్లీ మనకు సమాజంలో దక్కాల్సిన అన్ని హక్కులూ దక్కాలి. ఇదో గొప్ప జీవనశైలీ.. దీన్ని మళ్లీ పద్ధతిగా గడుపుకొస్తున్న జీవితంగా అందరికీ చెప్పుకుని మురిసిపోవడం! ఫలానాది దక్కాలని పోరాడి.. అంతకన్నా పెద్దది మనం చేయాల్సి ఉండీ కూడా నిమ్మళంగా దాటేసి జీవితంలో ఎంతో సాధించామని మురిసిపోవడం ఎంతగా పాతాళానికి దిగజారిపోయామో తేటతెల్లం చేస్తుంది. హక్కులను వదులుకోమని ఎవరూ చెప్పరు.. కానీ హక్కుల కన్నా మన బాధ్యతలు చాలా శక్తివంతమైనవనీ.. హక్కులు ఒకరిస్తే తీసుకునే భిక్షం వంటివనీ, బాధ్యతలు మనకు మనం మన వంతు చేసే దానాల వంటివనీ గ్రహించగలిగిన రోజున మనవంతు ఏమీ దానం చేయకుండా ఉండిపోతూ, మరోవైపు మొండి చేతుల్ని చాచి అడుక్కోవడానికి మనసొప్పదు.
మీ
నల్లమోతు శ్రీధర్
రాజులూ లేరూ.. రాజ్యాలూ లేవూ.. శత్రువులు అంతకన్నా లేనే లేరు. ఉన్నదల్లా దేనికది అకారణంగా వగిచే అసంతృప్త హృదయాలే. ప్రతీ హృదయంలోనూ తడమలేనంత అభద్రతాభావం! మనం రాజులం కాకపోయినా, మనకెలాంటి రాజ్యాలూ లేకపోయినా మనల్ని తప్పించి యావత్ ప్రపంచం వైపూ మన చూపులు అనుమానాస్పదపూరితాలే. ప్రతీ పరిచయంలోనూ తొలుత మనం నిర్థారించుకోవడానికి ప్రయత్నించుకునేది "శత్రువు కాదు కదా" అన్న భావననే! మనకెలాంటీ ఆపదా, మన మార్గానికెలాంటి అవాంతరమూ కలగకపోతేనే.. తదనంతరమే ఎంత బలమైన అనుబంధమైనా! మన జీవితాలని కమ్మేసిన అభద్రత అసలైన మనల్ని చంపేస్తోంది.
ఓ ఇనుప ఛట్రంలోకి మనల్ని మనం కుదేసుకుని.. ఆ ఛట్రాన్ని శత్రుదుర్బేధ్యంగా మలుచుకోవడానికి తపిస్తూ.. మొత్తం ప్రపంచాన్ని శత్రువుని చేసేసి… మనమొక్కళ్లం లోపల ఒరుసుకుపోతూ పళ్ల బిగువున సంతోషాన్ని అనుభవిస్తున్నాం. మనకు తెలిసిందొక్కటే.. "ఈ ప్రపంచం మనకు తీవ్రంగా అన్యాయం చేస్తోంది. ఈ ప్రపంచంలోని మనుషులు మనల్ని దోచుకోవడానికి గుంటనక్కల్లా కాచుక్కూర్చున్నారు.. అవకాశం ఉన్న వాడల్లా మోసగించే ప్రయత్నాల్లో ఉన్నాడు… కొందరు మన అవకాశాలను తన్నుకుపోయే రాబందులుగా తయారయ్యారు". అందుకే అందరూ మన కళ్లకు శత్రువులే.
అంతటి శత్రుత్వాన్ని తట్టుకోవాలంటే ఎంతటి అభద్రతకి లోనవ్వాలీ? ఆ అభద్రతలో ఎన్ని తప్పిదాలు చేయాలీ.. ఎందరి మనసుల్ని గాయపరచాలీ..? శత్రుత్వాన్ని మెదడులో మోస్తూ అపర శకునిలా ఎన్ని కుటిల యత్నాలకు మంత్రాగాలు పన్నాలీ?
స్వచ్ఛమైన మనసుల్లోకి చేజేతులా గునపాలు గుచ్చుతున్నాం.. మన మాటలూ, చేష్టలతో! కన్పించిన ప్రతీ మార్గంలోనూ విషం జల్లుతూ.. సున్నితమైన మనసుల్ని తట్టుకోలేనంతగా చిదిమేస్తున్నాం. ఎక్కడెక్కడో ప్రోగేసుకొచ్చిన మన అసంతృప్తి తో సమాజాన్ని శత్రువుగా చూస్తూ ఇరుక్కుపోయి కాలం గడుపుతున్నాం. దర్జాగా, స్వేచ్ఛగా, సంతోషంగా జీవితాన్ని గడపలేనివ్వని అభద్రతతో అటు మనమూ శాంతిగా ఉండలేకా ఇటు ప్రపంచాన్నీ అశాంతితో నింపుతూ బ్రతకడం అవసరమా?
సమాజంలో ఎక్కడ చూసినా ఎవరికి వారి అభద్రతతో కొనితెచ్చుకునే ఉపద్రవాలే. ఏ మనిషికీ సాటి మనిషి పట్ల భరోసా లేకపోవడమంత దౌర్భాగ్యమైన స్థితి మరేదీ లేదేమో. నమ్మకం లేని స్థితితో మనుషులతో కలిసి జీవిస్తూ ఆ గరళాన్ని వెల్లగక్కడం కోసం విమర్శల పేరుతో, లోపాల పేరుతో, కొండకచో సూచనల పేరుతో ద్వేషాన్ని వెదజల్లుతూ మనల్ని మనం నాజూగ్గా ప్రదర్శించుకోవడం దిగజారుడుతనానికి పరాకాష్ట అని మనకెప్పుడు అర్థమవుతుందో!
మనం ఎవరికీ సూటిగా ఎలాంటి హానీ చెయ్యం. కానీ మన ఉద్దేశాలూ, మన చర్యల్లోని పరమార్థాలూ, మన మాటల్లోని ద్వందార్థాలూ, మనం కోరుకునే లక్ష్యాలూ మనం అభద్రతతో శత్రువుగా భావించే వ్యక్తి పతనంవైపే. ఇంత లౌక్యాన్ని వంటబట్టించుకున్న తర్వాత మనం సమాజానికి దోషులుగా ఎప్పటికి కన్పిస్తాం.. ఏతావాతా మన మనఃసాక్షికి తప్ప, అదీ ఈపాటికే దాని పీక నొక్కేయకపోయి ఉండుంటే! శత్రుత్వపు భావనతో జీవితం గడపడం ఎంత నరకమో చవిచూస్తూనే ఉన్నాం. కనీసం ప్రేమతో మనషుల్ని గెలిచే ప్రయత్నమెందుకు చేయం?