మనుషులు, కధలు, కవితలు, పుస్తకాలు, సినిమాలు.. దేని గురించైనా చిటికెలో మన అభిప్రాయాన్ని చెప్పేయగలం. ఎక్కడో విన్నవీ, చూఛాయగా తెలుసుకున్నవీ, కొండొకచో తీరికగా గమనించి ఆకళింపు చేసుకున్నవీ కలిపేసి ఒక అంశంపై మన మెదడు పొరల్లో వేగంగా ఓ ఇధమిద్ధమైన అభిప్రాయం నిర్మితమైపోతుంది. ఒక అంశంపై ఒక అభిప్రాయం ఏర్పడింది మొదలు దాన్ని బయటి ప్రపంచానికి వ్యక్తం చేయడం కోసం మనసు సందర్భం కోసం వేచిచూస్తూనే ఉంటుంది. కారణం మనకు ఏర్పడిన అభిప్రాయంతో పాటే దాని చుట్టూ మనదైన స్పందన మనకు తెలియకుండానే అల్లుకుంటుంది. ఆ స్పందన ఎక్కడోచోట వెల్లడైతే తప్ప మనసుకు స్థిమితం లభించదన్నమాట. అందుకే సమయం, సందర్భం లేకుండా ఎవరి గురించైనా, దేని గురించైనా మనలో నుండి అపరిమితమైన అభిప్రాయాలు వెల్లడవడానికి ఆరాటపడుతుంటాయి. మన మనసులో అభిప్రాయం నిర్మితమయ్యే దశలోనే ఎంతో అస్పష్టత నెలకొని ఉంటే దాన్ని వ్యక్తపరిచే దశలో మన బుద్ధి మరింత దాన్ని పేలవం చేస్తుంది. పేలవమైన అభిప్రాయాలకు విలువ ఉండదు. మనకు ఇవేమీ అక్కరలేదు. మన అభిప్రాయాలను అందరూ గౌరవించాల్సిందే. అడ్డంగా వాదించైనా మనం ఏర్పరుచుకున్న అభిప్రాయమే లోకసమ్మతమని జనాల్ని వత్తిడితో అంగీకరింపజేసుకుని మనల్ని మనం వంచించుకుంటాం.
ఎంత లోతుగా గమనించినా తలకెక్కని విషయాలపై ఎందుకంత వేగంగా అభిప్రాయాలు ఏర్పరుచుకుంటున్నామన్నది ఎప్పుడైనా ఆలోచించామా? మన లోపాన్ని గ్రహించలేక అసమగ్ర అభిప్రాయాలతో ప్రపంచాన్నీ, మనుషుల్నీ ప్రభావితం చెయ్యాలని కోరుకుంటున్నామంటే అది మనం సిగ్గుపడవలసిన విషయం కాదా? ఎవర్నీ లోతుగా చదవకుండానే మన వంతు మంచో, చెడ్డో ఒక మాట అనేసి దులపరించుకుంటే మనం ఎటువంటి సామాజిక బాధ్యత వహిస్తున్నట్లవుతుంది? అలాంటి తాలు అభిప్రాయాలే మన గురించి ఇతరుల నుండి వస్తే స్వీకరించగలమా? మనకు తెలియని విషయాలు, మనుషులపై, అర్థం కాని అంశాల గురించి "ఫలానా విధంగా కాబోలు" అని అస్పష్టతని మరింత వ్యాపింపజేయాలనుకోవడం విజ్ఞతతో కూడుకున్న పనేనా? దేని గురించైనా అభిప్రాయం కలిగి ఉండడం తప్పు కాదు. ఆ అభిప్రాయం సరైనదో కాదో నిర్థారించుకోవడంలో శ్రద్ధ చూపకపోతేనే తప్పు చేసిన వాళ్లం అవుతాం. అభిప్రాయాలను ఆత్మీయులతో చర్చించి సరిచేసుకోవచ్చు. కాకపోతే ఇదంతా ఎవర్నీ మానసికంగానూ, ఇతరత్రానూ మన అభిప్రాయాలతో గాయపరచకముందే స్పష్టపరుచుకోవలసిన తతంగం. మన అభిప్రాయాలకున్న శక్తి ఏపాటిదంటే.. ఒక వ్యక్తి పట్ల మనం ఎంత తప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తపరిస్తే అది మనకు తెలియకుండానే అవతలి వ్యక్తిని అంతగా గాయపరుస్తుంది. వ్యక్తి స్థాయిలోనే అంత హాని చేసేదై ఉంటే.. ఏకంగా సమాజం పట్లే మనం తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకుంటే అది మనల్నీ, మనల్ని అంటిపెట్టుకుని ఉన్న సమాజాన్నీ ప్రశాంతంగా ఉండనివ్వదు.
మనం ఏర్పరుచుకునే అభిప్రాయాలని నిశితంగా విశ్లేషించుకునేటంత సూక్ష్మమైన ఆలోచనలను మనం ఎప్పుడూ చేయం. ఆ క్షణానికి అన్పించినది అనాలోచితంగా వెళ్లగక్కేసి మనకేం పట్టనట్లు.. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేసిన బాపతుగా చలామణి అవుతుంటాం. ఈ తొందరపాటుని నిగ్రహించుకపోతే మనం సంధించిన అభిప్రాయాలు ఎంత శక్తివంతమైనవో మనకు మనం స్వీయఅనుభవంతో తెలుసుకోవలసిన పరిస్థితులూ జీవితంలో తటస్థిస్తూనే ఉంటాయి. ఆ సమయంలో గతంలో మనం పాటించలేకపోయిన నిగ్రహాన్ని గుర్తుచేసుకుని చింతిస్తాం. కానీ ప్రయోజనమేముంది?