కాస్త దూరంలో తెలిసిన మనిషి.. మనం గమనించినా వాళ్లు గమనించి పలకరింపుగా నవ్వేవరకూ వేచి చూసేటంత.. వాళ్లు గమనించకపోతే మౌనంగా ఉండిపోయేటంత పల్చని రిలేషన్ అన్నమాట..
దగ్గరగా వచ్చి పలకరింపుగా నవ్వారు.. మనమూ నవ్వాం.. ఏదో అడిగారు.. మన మానానికి మనం సమాధానం చెప్పుకుపోతున్నాం.. ఆ మనిషి అదేం పట్టనట్లు “మళ్లీ కలుద్దాం” అని సాగిపోయారు. అక్కడ ఆయన అడిగింది ఫార్మాలిటీకి మాత్రమే అనీ.. మన సమాధానం ఆయనకి అవసరం లేదనీ అర్థమయ్యేసరికి మరో మనిషి పలకరించారు. ఈసారి నవ్వి ఊరుకున్నాం.
ఒక వయస్సులో హృదయం అనేది ఒకటి ఉంటుందనీ.. మనుషుల మధ్య ఇంటరాక్షన్ దాని ద్వారానే జరుగుతుందనీ గుడ్డిగా నమ్ముతారు. కళ్లల్లోని సూటిగా చూడడమూ, ఆ కంటి కదలికల్లో భావాలను ఒడిసి పట్టుకోవడమూ, హృదయాన్ని మాటల్లో పలికించడమూ, ఎక్కడ ఎవరితో ఉన్నా 100% గడిపేయడమూ ఇవన్నీ ఇవ్వాళ్టి రోజున సినిమాల్లో ఎమోషన్లకే పరిమితమన్నమాట. అందుకే మనం పోగొట్టుకున్నవి సినిమా సీన్లలో డైరెక్టర్ హృద్యంగా ప్రజెంట్ చెయ్యగానే హృదయాన్ని టచ్ చేసినట్లు ఫీలైపోతున్నాం. మనుషుల మధ్య ఓ బలమైన అటాచ్మెంట్ ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఉంది.. కాకపోతే అది ఉన్నట్లు మనం express చెయ్యం.. ఏదైనా ఎమోషన్ని express చెయ్యడం అంటే “ఎమోషనల్ ఫూల్”గా బ్రాండింగ్ వేయడానికి ఆస్కారమివ్వడమన్నమాట. ముఖ్యంగా చాలా లైటర్ వెయిన్‌లో సాగిపోతున్న సమాజంలో మనం express చేసినా ఆ ఎమోషన్లని తట్టుకోగలిగే.. కామెడీ చెయ్యకుండా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోగలిగే మనుషులు దొరకడం కష్టమే.
నవ్వుతున్నామంటే సంతోషంగా ఉన్నట్లే భావించే స్టేజ్‌కి వచ్చాం.. జోక్‌లకు వచ్చే నవ్వుకీ.. పలకరింపుగా వచ్చే నవ్వుకీ.. ఓ గేదరింగ్ని ఆస్వాదిస్తూ నవ్వే నవ్వుకీ.. హృదయం తనకి తాను సంపూర్ణంగా నవ్వుకునే నవ్వుకీ తేడా లేకుండా పోయింది. హృదయానికి ఓ భాష ఉంటుంది. అయితే దానితో పెద్దగా ఎవరికీ అవసరం పడట్లేదనుకోండి.
ఈ భూమ్మీద మనలాగా నవ్వేదీ, ఏడ్చేదీ.. రకరకాల ఫేసియల్ ఎక్స్ప్రెషన్లు కుమ్మరించేదీ ఒక్క మనుషులు మాత్రమే కాబట్టి ఇంకా చచ్చినట్లు మనుషులతో కంటిన్యూ అవుతున్నాం గానీ మనుషులతో ఉండాల్సిన బలమైన మూలాలు ఎన్నో ఇప్పటికే మనం నాశనం చేసుకున్నాం. ఎప్పుడో తెలుసా… మనస్సుకి కష్టమనిపించి దిగులుగా కూర్చున్న మనిషినీ, ఆ దిగులుని అర్థం చేసుకుని కాస్తంత సమయం వెచ్చించి లాలించవలసిన మనుషులు కాస్తా పెద్దగా నవ్వేస్తూ.. “ఏంటి మరీ చిన్న పిల్లల్లా ఇలా ఎమోషనల్‌గా.. లేచి ఆఫీస్‌కి రెడీ అవ్వు, అలా బయటికి వెళ్లిరా” అంటూ తామెదిగిపోయినట్లు.. దిగులు పడే వాడు ఎదగలేకపోయినట్లు ఇన్స్టెంట్ సొల్యూషన్లు సజెస్ట్ చేసి తమ పనిలోకి తాము వెళ్లిపోతున్న రోజే మనుషులకు మధ్య అండర్స్టాండింగ్ దెబ్బతినడం మొదలైంది. ఇవ్వాళ మనకున్న రిలేషన్లన్నీ కొన్ని రెడీమేడ్ ఫార్ములాల మధ్య కొనసాగుతున్న అడ్జెస్ట్మెంట్లు మాత్రమే. ఎవరో ఒకరు lowగా ఫీలైన రోజున, ఏదో ఒకటి తారుమారైన రోజున అంతా తట్టుకోలేనిదిగా కన్పిస్తుంది. జీవితమే వద్దనిపిస్తుంది.
– నల్లమోతు శ్రీధర్