స్వామి వారి దర్శనం విషయంలో కొన్నిసార్లు అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నా ఏదో ఒక ఇబ్బంది ఏర్పడిందని చెప్పేవాళ్లని చాలామందిని చూశాను.. గతంలో నేనూ కొన్నిసార్లు అలాంటి పరిస్థితి ఫేస్ చేశాను కూడా…
కానీ స్వామిని చూడాలని ఎంత బలంగా కోరుకుంటే, ఎంత సరెండర్ అయితే మిగతా అంతా చాలా సాఫీగా జరిగేలా శ్రీవారు అనుగ్రహిస్తారన్న దానికి నా సడన్ తిరుపతి ట్రిప్ పెద్ద ఉదాహరణ.
————————
అప్పటివరకూ బానే ఉన్న నేను ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ.. ఆరోజు ఎలాగైనా తిరుపతి బయల్దేరాలని అనుకోవడమూ, అప్పటికప్పుడు అదే రోజు రాత్రికి ట్రెయిన్ టికెట్లు దొరికే అవకాశం లేకపోవడం వల్ల స్లీపర్ బస్ టికెట్లు బుక్ చేసుకుని బయల్దేరడమూ యాధృచ్ఛికంగా జరిగింది.
నేను ఏ ఊరు వెళ్లినా ఫలానా ఊరు నేను వెళ్తున్నట్లు FBలో update పెట్టడం నాకు అలవాటు. కారణం కంప్యూటర్ ఎరా పాఠకులు, ఇతర మిత్రులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు… అలాంటి ఆత్మీయ మిత్రుల్ని అవకాశం ఉంటే కలవొచ్చు అన్న ఆలోచన. 24వ తేదీ నేను update పెట్టడమూ, దాన్ని తిరుపతి మిత్రులు చూడడమూ జరిగింది.
వెంటనే తిరుపతిలో GATE Forum పేరిట గేట్ ట్రైనింగ్ ఇస్తున్న భాస్కర్ గారు కాల్ చేశారు, తిరుపతిలో మీ కూడా నేను ఉండి మీకు ఇబ్బంది లేకుండా చూస్తాను సర్ అని కొండంత భరోసా ఇచ్చారు.. భాస్కర్ వెంకట్ గారు 2006 నుండి కంప్యూటర్ ఎరాని ఫాలో అవుతున్న మిత్రులు. అలాగే మరోవైపు సురేష్ గారు తిరుపతికి వచ్చే ఎన్నికల్లో లోక్ సత్తా తరఫున పోటీ చేస్తున్న సిద్ధయ్య నాయుడు గారి వివరాలు ఇచ్చి ఆయనకు ఓసారి కాల్ చేయమని చెప్పారు. నేను కొద్దిగా హడావుడిలో ఉండడం వల్ల కాల్ చేయలేకపోయాను. అంతలో ఆయనే కాల్ చేసి దర్శనం, వసతి సౌకర్యం గురించి ఆరా తీసి.. అంతా అప్పటికే రాంబాబు గారు అనే మరో మిత్రుని ద్వారా ఏర్పాటు అయిపోయాయని తెలుసుకుని.. ఏ అవసరం ఉన్నా నేను చూస్తానని తెలిపారు..
—————
25వ తేదీ పొద్దున్నే బస్ దిగిన క్షణం నుండి 27వ తేదీ సాయంత్రం రిటర్న్ బస్ ఎక్కేవరకూ అనుక్షణం దగ్గరుండి చాలా ఆప్యాయంగా చూసుకున్న వ్యక్తి భాస్కర్ గారు. నాకు తెలుపకుండానే 24వ తేదీ రాత్రే శ్రీనివాసం పక్కన మాధవం అనే కాంప్లెక్స్‌లో రూమ్ బుక్ చేసేశారు. నేనూ, మా కుటుంబ సభ్యులు ఇద్దరూ మొత్తం ముగ్గురం వెళ్లాం. తిరుపతి చేరుకున్న వెంటనే సిద్ధయ్యనాయుడు గారు వచ్చి చాలాసేపు ఆత్మీయంగా గడిపారు.
అదే సమయంలో కువైట్‌లో ఉంటున్న ప్రసాద్ గారు వాళ్ల వైఫ్ తో పాటు కలవడానికి వచ్చారు.. అప్పటికి 3రోజులవుతోంది వాళ్ల పెళ్లి జరిగి! ప్రసాద్ గారు కూడా 2007 నుండి కంప్యూటర్ ఎరా సైట్, ఫోరమ్ లను ఫాలో అవుతూ మంచి టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించారు. “ఈరోజు ఇంత మంచి స్థానంలో ఉన్నానంటే అది మీవల్లే సర్…” అంటూ ప్రసాద్ గారు, ఆయన సతీమణీ పాదాలు పట్టుకోబోతుంటే షాక్ అయి వారించాను. చాలా ఏళ్ల తర్వాత ప్రసాద్ గారిని కలవడం చాలా సంతోషం.
శ్రీవారి మెట్టు వరకూ భాస్కర్ గారు, చందూ గారు (భాస్కర్ గారి ఫ్రెండ్, మా సౌకర్యం కోసం తన కారుని వినియోగించారు) మమ్మల్ని దిగబెట్టారు. ఇక మెట్లు ఎక్కడం, కొండ మీదకు చేరుకోవడం చకాచకా జరిగిపోయాయి.
మా వాళ్లు మిగతా ఇద్దరి కన్నా ఓ అరగంట ముందు నేను మెట్లు ఎక్కి పైన వెయిట్ చేస్తుంటే అప్పుడే మెట్లు ఎక్కిన ఓ వ్యక్తి నన్ను తదేకంగా చూస్తూ ఉన్నారు.. తర్వాత వచ్చి.. “శ్రీధర్ గారు…” అంటూ తనని తాను పరిచయం చేసుకున్న మిత్రులు కొండా శివప్రసాద్ గారు. ఆయన తిరుపతిలో బిజినెస్ చేస్తున్న కంప్యూటర్ ఎరా పాఠకులు.
అక్కడే మెట్ల పూజ చేసి ఉన్న వారి కుటుంబ సభ్యుల్ని పరిచయం చేశారు. కాసేపు చాలా సంతోషంగా గడిపాం.
మా వాళ్లూ పైకి చేరుకోగానే 10TV మిత్రులకూ కావలసిన బైట్ ఇవ్వడమూ, అప్పటికే సిద్ధంగా ఉన్న రూమ్‌కి వెళ్లి ఫ్రెషప్ అయి భోజనానికి వెళ్లడమూ జరిగింది. ఆ తర్వాత మూడు కత్తెరలు శ్రీవారికి సమర్పించి స్నానాలు చేసి సాయంత్రానికి గుడి ఎదురుకు చేరుకోవడమూ, బేడి ఆంజనేయస్వామినీ, వరాహస్వామినీ చూడడమూ, డిన్నర్ చేసి రూమ్‌కి వచ్చేయడం జరిగాయి.
————————
26వ తేదీ ఉదయం 35 నిముషాల్లో దర్శనం పూర్తయింది. స్వామి వారికీ మాకూ మధ్య ఒక ద్వారం మాత్రమే ఉందన్నంత సమీపం వరకూ స్వామిని తనివితీరా దర్శించుకునే ప్రాప్తమూ కలిగాయి. ఈ దివ్య క్షణాల కోసం గత నెలరోజులుగా ఎంత ఎదురు చూశానో నా మనస్సుకి తెలుసు. నేను VIPని కాదు… VIP బ్రేక్ దర్శనాలకు వెళ్లే అలవాటు నాకు లేదు.. కానీ గతంలో అన్నమయ్య సినిమా సమయంలో నాగార్జున, రాఘవేంద్రరావు టీమ్ 10 మందితో పాటు అద్భుత దర్శనం పొందే భాగ్యం అప్పట్లో కలిగింది, మళ్లీ ఇన్నాళ్లకు ఈ VIP బ్రేక్ దర్శనం ద్వారా అంత నిండుగా స్వామిని చూసే అదృష్టం కలిగింది. నాకెలాంటి దర్శనం దొరికినా స్వామిని దర్శించుకోవడమే కావాలి అన్నంత తపనతో నేను కొండకు చేరుకున్నాను. మిగతా అంతా ఆ స్వామి వారే చూసుకున్నారు.
దర్శనం తర్వాత చక్రతీర్థం, శిలాతోరణం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ, పాప వినాశనం, జపాలి (ఆంజనేయ స్వామి గుడి), వేణుగోపాల స్వామి గుడి వంటివన్నీ చూసుకుని లంచ్ చేసుకుని రూమ్ ఖాళీ చేసి స్వామి వారికి మరోసారి మనస్సులో నమస్కరించి కొండ క్రిందకి దిగి మళ్లీ మాధవంలో కంటిన్యూ అవుతున్న రూమ్‌కి చేరుకోవడం జరిగింది.
—————-
26వ తేదీ సాయంత్రం తిరుపతిలో ఉన్న పెద్దలూ, ఆత్మీయులూ జగన్నాధం గారింటికి భాస్కర్ గారూ, నేనూ వెళ్లి ఆయనతోనూ, వారి అన్నగారితోనూ చాలా సంతృప్తిగా గడపడం జరిగింది. నేను జీవితంలో మర్చిపోలేని మరో వ్యక్తి జగన్నాధం గారు.
27వ తేదీ అలివేలు మంగాపురం, అప్పాలాయకుంట దర్శించుకుని రిటర్న్‌లో లంచ్ చేసి మిత్రులు భాస్కర్ గారి ఇనిస్టిట్యూట్‌కి వెళ్లి ఆరోజు సాయంత్రం రిటర్న్ అవడం జరిగింది.
——————————–
ఎప్పటికీ మర్చిపోలేని దర్శనమూ, ఆత్మీయులతో గడిపిన మధురానుభూతులూ ఈ ట్రిప్ ద్వారా సాధ్యమయ్యాయి. స్వామి వారు ఉన్న ఫళాన నన్ను పిలిపించి అద్భుత దర్శనం కల్పించినట్లు అన్పిస్తోంది.. కలలా జరిగిన అన్నింటినీ తలుచుకుంటే!!
భాస్కర్ గారికీ, జగన్నాధం గారికీ, రాంబాబు గారికీ, సిద్ధయ్య నాయుడు గారికీ, ప్రసాద్‌కీ, చందూకీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ..
– నల్లమోతు శ్రీధర్