నేను కలలు కంటున్నాను.. "విలువలనేవే లేకుండా ప్రతీ ఒక్కరూ ప్రశాంతంగా బ్రతికే సమాజాన్ని"
నేను కలలు కంటున్నాను.. "ఎవరూ ఎవర్నీ లెక్కచేయని నిర్లక్ష్యపూరిత ప్రపంచాన్ని"
అదే నేను కలలుగంటున్నాను.. "మనస్సులనేవే చచ్చిపోయి కోరికలతో రగిలిపోయే విచ్చలవిడితనపు మృగాల కదలికల్ని"
ఇప్పుడున్న కన్ఫ్యూజన్ ఇంకా ఎంతో కాలం ఉండదు.. మహా అయితే ఒకటి, రెండు జెనరేషన్లు గడిస్తే చాలు.. అందరూ ప్రశాంతంగా ఉంటారు.
వారివరుసలు ఉండవు.. "నీకు అక్కా చెల్లి లేరా" అనే వాళ్లుండరు.. "నువ్వస్సలు అమ్మాయివేనా" అనే వాళ్లూ అస్సలే ఉండరు 🙂
ఇలాంటి ఛాదస్తపు జీవాలన్నీ అరిచి అరిచి చచ్చిపోతాయి. వీళ్లంతా బ్రతికి ఉన్నారు గనుకనే క్లాసుల మీద క్లాసులు పీకి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.
విలువలనేవి కొద్దో గొప్పో పాటించే వాళ్లు ఉన్నప్పుడే మనం గిల్ట్ ఫీలవ్వాలి గానీ.. పేరెంట్స్ దగ్గర్నుండీ, ఫ్రెండ్స్ వరకూ అందరూ విచ్చలవిడితనానికి అలవాటు పడ్డప్పుడు అస్సలు ఏదైనా తప్పెలా అవుతుంది?
ఒకప్పుడు తప్పు ఒప్పుులని చాలా ఉండేవి.. ఇప్పుడు తప్పుఒప్పుల నిష్పత్తి తగ్గిపోయి అన్నీ ఒప్పులుగానే జస్టిఫై చేయబడుతున్నాయి. మరీ ఘోరాతిఘోరాలు తప్పించి. కొన్నాళ్లకు ఘోరాలూ ఉండవు.. అన్నీ సమర్థనీయాలే.
సంప్రదాయం, చట్టుబండలు అన్న వాళ్లందరూ ఠపా కట్టేస్తున్నారు.. ఇక మనకు ఆడిందే ఆట పాడిందే పాట 🙂
మనం కోరుకున్నది ఇదే…
కోరుకున్న వాటితో పాటు కోరుకోనివీ కొన్ని రావడం అతి సహజ నియమం..
ఇక మన పర్సనల్ జోన్లోకి ఎవరు విచ్చలవిడిగా ప్రవేశించినా ఉన్న ఫళంగా నెట్టేయడానికి ఏ విలువల ఆధారాలూ మిగలవు.
మనస్సులకు కోలుకోలేని గాయాలు చేసే వారినీ చూపులతో శపించే శక్తి కళ్లకు ఏమాత్రం మిగలదు.
దేహాలు కొల్లగొట్టబడినా.. శీలాలనే కొరుకుడు పడని పదాలేమీ కాపాడలేవు.
మనం వస్తువుల్లా అమ్ముడుపోతాం.. కొనేయబడతాం, కొనుక్కుంటాం, వాడుకోబడతాం.. తరాల తరబడి మనల్ని కాపాడుతూ వచ్చిన విలువలన్నీ మాయమైన రోజున కన్నీరు పెట్టే అర్హతనూ కోల్పోతాం. కావాలని ఇలా బ్రతకదలుచుకుని.. ఎవరు ఏం అన్యాయం చేశారని? అస్సలు ఏది న్యాయమని..? కన్నీరు పెడతారు?
ఎవరూ ఎవరి దగ్గరా వాపోవడానికి ఉండదు.. ఎవరూ ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరు.. ఎవరూ ఎవరికీ సలహాలు చెప్పరు.. మనం కోరుకున్న స్వేచ్ఛే అది.. మనం కోరుకున్న ఒంటరితనమే ఆ స్వేచ్ఛ ఫలితం.
చివరగా నేను కలలుగంటున్నాను.. జీవశ్చవాలుగా కుళ్లిపోయి, కంపుగొడుతున్న మృతదేహాలతో కూడిన ప్రపంచపు అస్థిత్వాన్ని!!
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్