ఈ కొద్దిపాటి ఆలోచన లేకపోతే.. ఏమవుతుంది?
మనకు అందరూ జవాబుదారీగా ఉండాలి.. మనం ఎవర్నైనా క్వశ్చన్ చెయ్యగలం!
మాట్లాడడానికి ఓ నోరుంటే చాలు.. ఎదుటి వ్యక్తిని క్వశ్చన్ చేసే అర్హత మన మానసిక పరిపక్వతకు ఉందా లేదా అన్నది అనవసరం.
ఎవర్నయినా నిలదీసే దమ్ము మనకుందని విర్రవీగుతాం.. మనకు కట్టుబడడానికి అవతలి వారేమైనా మనకు కప్పందార్లా అన్నది ఆలోచించం.
మనకు ఎవర్నీ సూటిగా ప్రశ్నించే అర్హత లేదు. ఇది నూటికి నూరుశాతం
తమని ప్రశ్నించడాన్ని ఎవరూ సహించరు. ఎవరి జీవితం వాళ్లది. ఎవరి ఆలోచనలు వాళ్లవి..
సమాజంలో మార్పు తీసుుకురావాలంటే "మీరలా ఉన్నారు.. ఇలా ఉన్నారు" అంటూ మనుషుల్ని దోషులుగా నిలబెడితే మార్పు వస్తుందో లేదో తెలీదు కానీ ఆ మనుషులు మొదటి క్షణమే మన మాటల్ని తిరస్కరిస్తారు.
మనుషుల్లోని ఏదైనా మానసిక లోపాల్ని తప్పనిసరి పరిస్థితుల్లో అర్థమయ్యేలా స్పష్టపరిచి చూపించాలనుకుంటే.. అపసవ్యంగా ఆలోచించే వాళ్ల గుంపులో మనల్నీ కలిపేసుకుని "మీరు మారండి అనడం కన్నా మనం మారదాం" అని చెప్పడం వల్ల కొంతైనా ఫలితం ఉంటుంది.
అలాగే సమాజం బాగుపడాలని రకరకాలుగా ఆవేదన వ్యక్తం చేస్తాం.. కన్పించిన అందరి నిబద్ధతనీ ప్రశ్నిస్తాం. మన ప్రశ్నలకు సమాధానాలు రాకపోతే నోరారా నిందిస్తాం…
ఇదే ఫార్ములాని రివర్స్‌లో అప్లై చేస్తే ఎన్ని రాళ్లు మన మీద పడాలి? అస్సలు ఆఫ్టరాల్ మనమెవరిమి? మనకు మన్మోహనో, కిరణ్నో, చిరంజీవో, బాలకృష్ణో, జగనో, ఏ తాడేపల్లి గారో, భరద్వాజ్ గార్లో, నల్లమోతు శ్రీధరో, నవీన్ కుమారో ఎందుకు సమాధానం చెప్పాలి? వాళ్లనేమైనా మనం ఉద్ధరిస్తున్నామా?
ఇక్కడ పన్నులు కడుతున్నాం వంటి అంశాలు పక్కనబెడదాం. ఎందుకంటే పాలకుల్ని పన్నులు కడుతున్నాం, ఓట్లేస్తున్నాం అన్న సాకుతో ప్రశ్నించడం బాగా అలవాటైంది.. ఆ అలవాటు కన్పించిన ప్రతీ ఒక్కర్నీ క్వశ్చన్ చేయడంగా మారిపోయింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మనం జవాబుదారీగా ఉండట్లేదు. ఇంతంత నోరేసుకుని ఇతరుల్ని మన ముందు చేతులు కట్టుకుని జవాబుదారీగా ఉండమంటే ఉండాలా? ఉంటారా?
ప్రశ్నించడం చాలా సులభం. ఊహ తెలీని చిన్న పిల్లాడూ ప్రశ్నిస్తాడు. ప్రశ్నల్లో అర్థముంటే.. అన్నింటికంటే ముఖ్యంగా మన ప్రశ్నలు చెల్లుబాటు చేసుకునేలా జవాబు చెప్పేవారి వద్ద మన మాటల ద్వారా, చర్యల ద్వారా బాధ్యతగా ఉంటే ప్రశ్నించే అర్హత లభిస్తుంది.
వ్యవస్థ పట్ల బాధ్యతలు వదిలేసి.. మనుషులను ధిక్కరించి.. అణుకువని మరిచి.. రాజకీయ నాయకుల్ని తిట్టేసి.. "మీరంతా నాకు జవాబుదారీగా ఉండండి… ఇవి నావి వంద ప్రశ్నలున్నాయి.." అంటూ జీవితాంతం ప్రశ్నించడమే గొప్పన్నట్లు బ్రతికితే బాధ్యతగా ఉండడంలో ఆనందం రుచి తెలియదు. అంతకుమించి అసంతృప్తే మిగులుతుంది.
చివరిగా ఒక్కమాట.. ఎవర్నైనా ప్రశ్నించే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం.. మనసావాచాకర్మణా మనకు ఆ అర్హత ఉందా? అణుకువ ఉందా, అలా ప్రశ్నలు సంధించే ముందు అవతలి వారికి మనమేం చేశాం, లేదా అవతలి వ్యవస్థకు మనమేం చేశాం, మన బాధ్యతలు మనం నిర్వర్తించామా లేదా అన్నది!!
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్