సినీ తారల మాటలు, ఎమోషన్స్ ఎంత వక్రీకరించబడతాయో, ఒక్కోసారి ఎంత వివాదాస్పదం అవుతాయో ఓ చిన్న ఉదాహరణ ప్రస్తావిస్తూ ఈ “సినిమా మనిషి కబుర్లు” సీరియల్ ప్రారంభిస్తాను.
ఆరోజు చెన్నైలో దాసరి అరుణ్ కుమార్ “గ్రీకు వీరుడు” ఆడియో ఫంక్షన్ జరుగుతోంది. తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ తరలిపోతున్న తరుణం అది. అప్పటికీ 30-40% షూటింగ్ లు, 90 శాతానికి పైగా రికార్డింగ్ లు చెన్నైలో జరుగుతూ ఉన్నాయి. ఆడియో ఫంక్షన్ కి చిరంజీవి గారు, అల్లు రామలింగయ్య, భానుచందర్ మరికొందరు నటీనటులు, టెక్నీషియన్స్ హాజరయ్యారు. చిరంజీవి గారు రావడం రావడం దాసరి దంపతుల్ని, అరుణుకుమార్ ని, ఇతర నటీనటులను తనదైన శైలిలో విష్ చేసి.. జర్నలిస్టులమైన మావద్దకు వచ్చారు. పసుపులేటి రామారావు, జగన్, మణిగోపాల్ (ఇప్పుడు పేరు మార్చుకుని ఓ ప్రముఖ గేయ రచయిత అయ్యారు), ఉమామహేశ్వరరావు తదితరులతో కూడిన బృందం మాది. అప్పటికి కొద్దిరోజుల ముందు చిరంజీవి షూటింగులకు ఇబ్బంది అవుతున్న రీత్యా అక్కడే ఇల్లు తీసుకుని హైదరాబాద్ కి మకాం మార్చారు.
చెన్నై సినిమా జర్నలిస్టులతో ఆయనకు సాన్నిహిత్యం ఎక్కువ. చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఎన్నో సంవత్సరాల పాటు ఓ కుటుంబంలా అనేక ఫంక్షన్లలో కలిసి కబుర్లు చెప్పుకునే జర్నలిస్ట్ మిత్రులను విడిచి కొత్త ప్రదేశంలో కొత్త జర్నలిస్టులతో పూర్తిగా ప్రొఫెషనల్ గా మారడం ఒక మనిషిగా ఆయనకి బాధనిపించింది. మా సమీపానికి వచ్చి పేరుపేరునా పలకరిస్తూ హత్తుకుంటూ సడన్ గా ఎమోషనల్ అయ్యారు. “మిమ్మల్నందరినీ విడిచి హైదరాబాద్ లో ఉండడం చాలా బాధగా ఉంది.. నేను అక్కడ ఉన్నానే కానీ నా మనసంతా మీ దగ్గరే ఉంది” అంటూ కళ్లు చెమర్చుకున్నారు.
నిజమే కదా.. కొన్నేళ్లపాటు ఒక నగరంతో ముడిపడిన అనుబంధం అక్కడి బంధాలను తెంచుకుని వెళ్లవలసి వస్తే ఎంత బాధ అన్పిస్తుందో కదా! ఎంతటి సెలబ్రిటీ అయినా అలాంటి ఎమోషన్స్ ని ఆత్మీయులు కన్పించినప్పుడు కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాని పని. ఆఫ్ ది రికార్డ్ కాదు. అందులో ఏ విధమైన వివాదమూ లేదు. నేను జరిగింది జరిగినట్లు మా పత్రికలో రాశాను. ఒక సాధారణ హ్యూమన్ బీయింగ్ గా సెలబ్రిటీల ఎమోషన్స్ ని, అదీ మా జర్నలిస్టుల మీద ఎఫెక్షన్ తో బయటపడేసరికి రాయకుండా ఉండలేకపోయాను.
ఇంకేముంది వివాదం మొదలైంది. “చిరంజీవి చెన్నై వెళ్లి కళ్లనీళ్లు పెట్టుకున్నాడట. హైదరాబాద్ కి సినిమా ఫీల్డ్ రావడం ఆయనకు ఇష్టం లేదట..” అంటూ హైదరాబాద్ కోటరీ విచ్చలవిడిగా ఊహాగానాలు ప్రచారం చేస్తూ తమ పత్రికల్లో రాశారు. ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరూ చెవులు కొరుక్కోవడం ప్రారంభించారు. ఇక్కడ ఇండస్ట్రీ హైదరాబాద్ లో ఉండాలా, చెన్నైలో ఉండాలా అన్నది కాదు ముఖ్య విషయం. కొన్నేళ్ల పాటు ఒక చోట ఉన్న వ్యక్తి సడన్ గా ప్రదేశం మారేసరికి ఫీలయ్యే అలజడే చిరంజీవి ఫీల్ అయ్యారు. దాన్ని సాటి మనిషిగా అర్థం చేసుకోవడం మానేసి రాజకీయం చేసి చిరంజీవిపై “ఏంటీ హైద్రాబాద్”ముద్ర తగిలించడం బాధేసింది.
ఒక సెలబ్రిటీ తన బాధలను, ఎమోషన్స్ ని స్వేచ్ఛగా express చెయ్యలేనంతగా.. కొండొకచో ఎమోషనల్ అయితే అపార్థాలు తీస్తూ ఎంత ఇరకాటంలో పెడతారో ఈ ఉదాహరణ చూస్తే అర్థమై ఉంటుంది. ఇక్కడ నేను చిరంజీవి అభిమానిని కాదు. అస్సలు నేను జర్నలిస్ట్ గా ఎవరి అభిమానినీ కాదు అన్నది మున్ముందు ఈ సిరీస్ లో రాసే ఇతర “కబుర్లు”ని చదివితే మీకు అర్థమవుతుంది. ఒక human beingగా వారి సమస్యలను సమీపం నుండి గమనించిన తర్వాత.. మనకు ప్రతీరోజూ పేపర్లలో వచ్చే పుకార్ల వంటి వాటిలో ఎంత నిజం ఉంటుందో ఆలోచిస్తారని ఈ అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నాను.