విశ్వంలో ప్రతీదీ కాంతి, సమాచారం, ఎనర్జీ, కాన్షియస్నెస్ రూపాల్లో వ్యక్తమవుతూ ఉంటుంది. కానీ జ్ఞానేంద్రియాలు అయిన మన కళ్లకి కనిపించేది, చెవులకి వినిపించేది మాత్రమే మనం నిజమని నమ్ముతూ ఉంటాం. చిన్న ఉదాహరణ చెబుతాను, మీరు కూర్చున్న చోట, మీ తలకి చుట్టూ మీ ఇంట్లో ఉన్న వైఫై రూటర్ నుండి వెలువడుతున్న వై-ఫై సిగ్నల్ పయనిస్తూ ఉంది. అది మన కళ్లకు నేరుగా కనిపించదు కాబట్టి అది ఉంది అన్న విషయం కూడా మనకు అర్థం కాదు. కేవలం మొబైల్ ఫోన్ వైఫై కి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే వై-ఫై సిగ్నల్ ఆ గదిలో ఉంది అన్నది అర్థం చేసుకుంటాం.
సరిగ్గా అదే విధంగా విశ్వంలో ఉండే ప్రతి వస్తువు, ప్రతీ జీవి, ప్రతీ ప్రదేశమూ కాంతిని, సమాచారాన్ని ఫ్రీక్వెన్సీ రూపంలో వెలువరిస్తుంటాయి. ఆయా జీవులు, వస్తువులు అణువులు, కణాల స్థాయిలో నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీని కలిగి ఉండటం మాత్రమే కాకుండా, బయట వాతావరణంలోని ఆ ఫ్రీక్వెన్సీని ప్రసరించడం, బయటి నుండి ఫ్రీక్వెన్సీని స్వీకరించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి. 101.9 అనే ఫ్రీక్వెన్సీలోకి మీ దగ్గర ఉన్న రేడియోని ట్యూన్ చేస్తే ఎలాగైతే ఆ FM ఛానెల్ ప్రసారం చేసే పాటలు వస్తాయో, 99.8 అనే ఫ్రీక్వెన్సీకి మారితే మరో భిన్నమైన సమాచారం వస్తుందో మనం ఒక రకంగా రేడియో తరంగాల ట్రాన్స్మిటర్, రిసీవర్ లాంటి వాళ్లం. అంటే మనం మన ఆలోచనల ద్వారా శరీరంలో కణాల స్థాయిలో మార్పులు జరిగి, ఆ కణాలు తమ ఎక్స్ప్రెషన్ ద్వారా బయటకు పంపించే సమాచారంతో పాటు, విశ్వంలో నిరంతరం అందుబాటులో ఉండే సమాచారాన్ని మనం స్వీకరించగల సామర్థ్యం కూడా కలిగి ఉంటాం. మొదట ఇంతవరకు అర్థం చేసుకోండి.
జర్మనీకి చెందిన బయోఫిజిసిస్ట్ ఫ్రిట్జ్ ఆల్బర్ట్ పాప్ Ph.D బయో ఫోటాన్స్ గురించి మూడు దశాబ్దాలుగా అధ్యయనం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రాణం కలిగి ఉన్న జీవులు నుండి వారు కలిగియున్న ఆలోచనలకు తగ్గట్లు వారి నుండి వెలువడే (మనం దీన్ని aura అని అంటున్నాం) అతి సూక్ష్మమైన తక్కువ సాంద్రత కలిగిన లైట్ పార్టికల్స్ గురించి అతను విస్తృతంగా అధ్యయనం చేశారు. దీని కోసం అతను 1996లో ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోఫిజిక్స్ (IIB) అనే సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పదికి పైగా దేశాలలో రీసెర్చ్ లాబరేటరీ లు ఆయనతో పాటు పరిశోధనలో పాల్గొన్నాయి.
ఒక మనిషి శరీరంలోని కణాల DNAలో ఉండే సమాచారం లైట్ పార్టికల్స్ రూపంలో ఇతర కణాలకు చాలా సమర్థవంతంగా కమ్యూనికేట్ చెయ్యగలుగుతుందని, తద్వారా ఆ లైట్ పార్టికల్స్ రూపంలో జరిగే కమ్యూనికేషన్ వల్ల ఆ మనిషి యొక్క ఆరోగ్యం మంచిగా గానీ, చెడుగా గానీ ప్రభావితం చెందుతుందని వారు ఆధారాలతో నిరూపించారు. ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి, స్థలాభావం వల్ల ఇక్కడ రాయట్లేదు, మనం నిరంతరం చేసే పాజిటివ్, నెగిటివ్ ఆలోచనలు మన కణాల DNAని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. చెడు ఆలోచనలు చేస్తే శరీరం మొత్తం కాలక్రమేణ రోగగ్రస్తం కావడానికి కారణం ఇదే. ఇక్కడ మీరు అడగవచ్చు. “చెడు ఆలోచనలు, మానసిక వత్తిడి కలిగి ఉన్న వారు, ఇప్పుడు బానే ఉన్నారు కదా” అనే సందేహం మీకు రావచ్చు. శరీరంలోని వివిధ ఆర్గాన్లలో ఉండే టిస్క్యూలు, వాటిలోని కణాలు మనం చేసే ఆలోచనలకు తగ్గట్టు మెల్లగా వాటి జెనెటిక్ ఎక్స్ప్రెషన్ని మార్చుకుంటూ ఉంటాయి. కొన్నాళ్లకి ఆయా కణాలలో జరిగే మార్పుల వల్ల ఆయా అవయువాలు దెబ్బతిని ఇన్ఫ్లమేషన్, పెయిన్, ఎడిమా, మెల్లగా సెల్ డివిజన్, క్యాన్సర్ కణాలుగా మారిపోవడం, కణం చనిపోవడం అన్నీ దశల వారీగా జరుగుతాయి. అందుకే ఈ క్షణం బాగానే ఉన్నట్లు కనిపిస్తే ఆ మనిషి బాగున్నట్లు కాదు. లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటుంది. ఈరోజు క్యాన్సర్లు మొదలుకుని అజీర్తి, గ్యాస్ లాంటి చిన్న చిన్న సమస్యల వరకూ ఒక మనిషి ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు మన ఆహారపు అలవాట్లతో పాటు మనం చేసే ఆలోచనలను వలనే జరుగుతున్నాయి.
“యాపిల్ తింటే డాక్టర్కి దూరంగా ఉండొచ్చు” ఇలాంటి స్లోగన్లు గుర్తు పెట్టుకుని యాపిల్, ఇతర ఫ్రూట్స్, మొలకలు ఇలా రకరకాల మంచి న్యూట్రీషనల్ ఫుడ్ మీద చాలా మంది దృష్టి పెడతారు కానీ, ఒక కణానికి పోషక విలువలతో పాటు దాని జెనెటిక్ ఎక్స్ప్రెషన్ మారకుండా ఉండాలంటే మన ఆలోచనా దృక్పథం అతి కీలకమైనది అని అర్థం చేసుకునే వారు చాలా తక్కువ మంది!
డబ్బు సంపాదన కోసం, పేరు ప్రతిష్టల కోసం విపరీతంగా ఆరాటపడి మానసిక ఒత్తిడి పెంచుకోవటం ఎంత ప్రమాదకరమో, ఇతరుల పట్ల అసూయ, ద్వేషం, సమాజం పట్ల, పరిస్థితుల పట్ల ఆవేశం లాంటి భావనలు కలిగి ఉండటం ఒక మనిషి మానసిక ఆరోగ్యానికి మాత్రమే కాదు శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. సరే మెయిన్ టాపిక్లోకి వచ్చే ఆర్టికల్లో వెళదాం.
- Sridhar Nallamothu