జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా ।
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ।। 18 ।।
జ్ఞానము, జ్ఞేయము (జ్ఞాన విషయము), జ్ఞానమును ఎఱింగినవాడు – ఇవి మూడు కర్మను ప్రేరేపించును. కరణము, క్రియ, కర్త, – ఈ మూడు కర్మ యొక్క అంగములు.
కృష్ణ భగవానుని భగవద్గీత ఈ 18వ అధ్యాయంలోని శ్లోకాలను మొదటి నుండి నిశితంగా గమనిస్తే ఈ అధ్యాయంలో భగవానుడు ఒక క్రమ పద్ధతిలో కర్మకి సంబంధించిన అనేక అంశాలు వివరించారు. మొదట్లో కర్మ త్యాగం గురించి, ఆ తర్వాత ఒక కర్మ ఫలానా విధంగానే జరిగేలా కారణం అయ్యే జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇంటెలిజెన్స్, ఇగో, మోరల్ వంటి ఐదు విషయాల గురించి, ఆ తర్వాత రజో, తమో, సత్వ గుణాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అసలు ఫలానా కర్మ చెయ్యమని ప్రేరేపించే మూడు అంశాల గురించి వివరించబోతున్నారు. వాటిలో మొదటిది “జ్ఞానం”. “జ్ఞానం” రకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది. అదెలాగో చూద్దాం.
“భగవద్గీత చదివితే జీవితం పరిపూర్ణంగా మారుతుంది” – అనేది “జ్ఞానం”
భగవద్గీతలో చెప్పబడిన ప్రతీ అంశమూ జ్ఞాన విషయంగా భావించాలి.
సో పైన దేని వల్ల ఎలాంటి ఉపయోగమో తెలిసిన జ్ఞానముందీ, ఆ జ్ఞానానికి సంబంధించిన పూర్తి సమాచారమూ ఉంది, మరి చివరిగా కావలసిందేమిటి?
అదే “జ్ఞానమును ఎరిగిన వాడు” – ఎవరైతే ఏది జ్ఞానమో, ఏది అజ్ఞానమో తేడా తెలుసుకోగలిగి ఉండి, జ్ఞాన విషయాన్ని గ్రహించి ఉంటాడో అతను జ్ఞానమును ఎరిగిన వాడు అవుతాడు.
ఇంత వివరంగా ఎందుకు చెప్పుకోవాలంటే ఈ మూడింటిలో ఏది లోపం కలిగి ఉన్నా మనకు జ్ఞానం సరిగా సమకూరదు. సరైన జ్ఞానం లేనప్పుడు చేసే కర్మలూ కలుషితం అవుతాయి. మొదట ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో గుర్తించాలి. మనం యూట్యూబ్‌లో చూసే “ఇండియాకి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా, ఫలానా హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో చూద్దాం” లాంటివన్నీ విషయ పరిజ్ఞానాలు. ఆ విషయ పరిజ్ఞానంతో పాటు కొన్ని భావోద్వేగాలను చేర్చి “ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు” వంటి టైటిల్స్‌తో కనిపించే విషయాలు ఇవి. వాటిని చాలామంది లోక జ్ఞానం అనే అపోహలో ఉంటారు. మనిషి బ్రెయిన్లో డొపమైన్ అని ఓ న్యూరో కెమికల్ ఉంటుంది. అది కొత్త విషయాలను నేర్చుకున్నప్పుడు విడుదలై చాలా ప్లెజర్ని (సంతోషాన్ని) అందిస్తుంది. తాగుడు అలవాటు ఉన్న వ్యక్తి మొదట్లో కొద్దిగా తాగేవాడు కాస్తా మెల్లగా అది సరిపోక మోతాదు ఎలా పెంచుకుంటూ పోతాడో.. డొపమైన్ న్యూరో కెమికల్ కూడా బానిసత్వపు స్వభావాన్ని పెంచుతుంది. మొదట్లో ఒకటి రెండు యూట్యూబ్ వీడియోలు చూసే వాళ్లు కాస్తా కొన్నాళ్లకి డొపనైన్ స్థాయిలకు బానిసలుగా మారి రోజంతా ఏవో కొత్తవి తెలుసుకుంటున్నామన్న భ్రమలో ఏవేవో వీడియోలు చూస్తుంటారు.
అంతే కాదు.. విషయ పరిజ్ఞానం పెరిగే కొద్దీ బ్రెయిన్లో గ్రే మేటర్, వైట్ మేటర్ అనే మెదడు ముందు భాగంలో ఉండే పొరల సాంద్రత పెరుగుతూ ఉంటుంది. అంటే విషయ పరిజ్ఞానానికి సంబంధించిన మేధస్సు పెరుగుతుంది. విన్నవీ, చూసినవీ, చదివినవీ అన్నీ ఒకదానితో ఒకటి లింక్ చేసుకుని ఏ టాపిక్ మీదైనా అనర్గళంగా మాట్లాడగలిగే సామర్థ్యం వస్తుంది. అందుకే ఓ నలుగురు ఓ దగ్గర చేరితే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది వంటి అనేక ప్రాపంచిక విషయాల గురించి అనర్గళంగా ఎవరి పంధాలో వాళ్లు మాట్లాడుతూ ఉంటారు. బ్రెయిన్లోని లాజికల్ ప్రదేశం అయిన ప్రీ-ఫ్రాంటల్ కార్టెక్స్ పరిమాణం ఇలా విషయ పరిజ్ఞానం, లాజికల్ థింకింగ్‌తో పెరిగే కొద్దీ మనిషి విశ్వంలోని ప్రతీ అంశాన్నీ దేనికది విడిగా చూస్తూ, ప్రతీ దాని వెనుకా లాజిక్ వెదుకుతూ, తన జ్ఞానేంద్రియాలకు కనిపించని విషయాలను “అవి లేవు” అని వాదిస్తూ స్పిరిట్యువాలిటీకి దూరం అవతున్నాడు. దీనివల్ల మనశ్శాంతి లోపిస్తుంది. దీనికి చాలా గొప్ప ఉదాహరణలు చెప్పుకోవచ్చు గానీ ఓ చిన్నది చూద్దాం.
మీకు ఓ సమస్య వచ్చింది అనుకోండి. సహజంగా అందరూ ఏం చేస్తుంటారు.. తమ లాజికల్ బ్రెయిన్‌తో” నాకే ఎందుకు ఇలా జరిగింది” అని విపరీతంగా ఆలోచించేసి కారణాలు తెలుసుకోవడానికి పోస్ట్‌మార్టం చేస్తుంటారు. గంటలు, రోజుల తరబడి ఆలోచించినా కారణం తెలీదనుకోండి. ఆ అసంతృప్తి అలా కొనసాగుతూ ఉంటుంది. మైండ్ ఒక విషయాన్ని ఒడిసిపట్టుకోలేనప్పుడు సంఘర్షణకి, అశాంతికి లోను చేస్తుంది. అలాగని మైండ్‌తో అన్నీ అర్థం కావు. విశ్వ శక్తి కాస్మిక్ ఎనర్జీస్ రూపంలో వివిధ కార్యాకారణాలను మన వైబ్రేషన్‌ని బట్టి వెదజల్లేటప్పుడు దాని సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్‌ని అర్థం చేసుకోవడానికి మనిషి మైండ్ ఏమాత్రం సరిపోదు. దానికి ఎగ్స్ట్రా సెన్సరీ సామర్థ్యం కావాలి. అందుకే ఏళ్ల తరబడి తపస్సు చేసిన యోగులు మాత్రమే కొన్ని విషయాలు అర్థం చేసుకోగలుగుతారు.
లాజికల్ బ్రెయిన్‌తో కుస్తీ పట్టడం కాకుండా.. ఆధ్యాత్మిక భావనలు ఉన్న ఓ వ్యక్తి “నాకు ఈ సమస్య రాసి పెట్టి ఉంది, అనుభవించాను” అని దాన్ని స్వీకరించి ముందుకు సాగాడు అనుకోండి. ఎంతో స్వేచ్ఛ లభిస్తుంది. ఇక్కడ మనిషి తన జీవితానికి కావలసింది స్వేచ్ఛ ద్వారా లభించే ఆనందమా లేక విపరీతంగా ఆలోచించి మనశ్శాంతిని పోగొట్టుకోవడమా? అసలు విషయ పరిజ్ఞానం, లాజికల్ థింకింగ్ అనేది దేనికి కావాలి? మైండ్‌కి అర్థమయ్యే భౌతికమైన విషయాల గురించి లాజిక్‌తో ఆలోచిస్తే ఫర్లేదు, కానీ ప్రతీదీ లాజిక్‌తో ఎలా పట్టుకోగలం? ఉదా.కి.. ప్రతీ అణువులో, కణంలో ఎలక్ట్రాన్ ఉంటుంది అని సైన్స్ నిరూపించింది. మరి ఎలక్ట్రాన్ కళ్లకు కనిపిస్తుందా? కళ్లకి కనిపించేదే వాస్తవమని నమ్మే సైన్స్, లాజిక్‌ని సృష్టించుకునే సైన్స్ మరి ఎలక్ట్రాన్ని కళ్లతో చూడకుండా ఎలా నిజమని నమ్ముతోంది. ఒక గదిలో ఉన్న వైఫై సిగ్నల్‌ని దాని స్త్రెంగ్త్ని బట్టి నమ్ముతున్నాం గానీ అసలు అది కళ్లకు కనిపించట్లేదు కదా! వైఫై లాంటివే ప్రతీ చోటా కొన్ని వైబ్రేషన్స్ రకరకాల ఫ్రీక్వెన్సీల్లో ఉంటాయన్నది ఇప్పుడున్న సైంటిఫిక్ పరిమితుల వల్ల నిరూపించలేకపోయినంత మాత్రాన ఆ వైబ్రేషన్స్ లేనట్లా?
మేధస్సుని పెంచే విషయ పరిజ్ఞానాన్ని మనం నమ్ముకుంటున్నాం, దానివల్ల నిరంతరం మన ప్లగ్స్ అనీ బయట ప్రపంచానికి గుచ్చబడి మన ఇగోకి అవి ఎక్కడ హాని చేస్తాయో అన్న భయంతో, సపరేషన్తో బ్రెయిన్లో వేగంగా ఉండే బీటా, హై-బీటా వేవ్స్ కలిగి ఉండి నిరంతరం ఆందోళనకు లోనవుతున్నాం. ఎప్పుడైతే ధ్యానం, ఆధ్యాత్మిక, ఆత్మ జ్ఞానం వైపు మన దృష్టి మళ్లుతుందో అప్పుడు మన బ్రెయిన్ వేవ్స్ నెమ్మదిగా ఉండే ఆల్ఫా, థీటా వేవ్స్‌గా నెమ్మదిస్తాయి. దీనివల్ల ప్రతీదానికీ భావోద్వేగంతో స్పందించే స్వభావం నుండి నిశ్చలంగా ప్రశాంతంగా ఉండే స్వభావం పెరుగుతుంది.
“యూట్యూబ్ చూస్తే తప్పేంటి.. కాలక్షేపం అవుతోంది కదా” అనే భావన మనకు కలగొచ్చు. పైన కృష్ణ భగవానుడు జ్ఞానము గురించి ప్రస్తావించిన పదం ఏది ఏ తరహా జ్ఞానమో స్పష్టంగా తెలుసుకోమని పరోక్షంగా సూచిస్తుంది. మనం వినియోగించుకునే జ్ఞానాన్ని బట్టి, అందులో చెప్పబడిన జ్ఞాన విషయాన్ని బట్టి మన విచక్షణ, ఇంటెలిజెన్స్, ఇగో, మోరల్ అన్నీ ఆధారపడి మనం చేసే కర్మలు (పనులు) ప్రభావితం అవుతూ ఉంటాయి.
“ఫలానా రాజకీయ నాయకుడు ఎంత దరిద్రుడో చూడండి” అనే ఓ వీడియోని, లేదా ఫేస్బుక్లో మీ స్నేహితుడు రాసిన ఓ చిన్న కధనాన్ని మీరు చూశారు అనుకోండి. అక్కడ ఏం జరుగుతోంది అంటే ఆ వ్యక్తి యొక్క కలుషితమైన భావోద్వేగాన్ని, వైబ్రేషన్‌ని చదివిన, ఆ వీడియో చూసిన ప్రతీ ఒక్కరికీ పంచుతున్నాడు. ఒక దాన్ని అసహ్యించుకోవడం, ద్వేషించడం మ్యాప్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో అతి తక్కువ వైబ్రేషన్ ఉన్న, మన శరీరాన్ని మనస్సుకి కష్టపెట్టే ఎమోషన్ అన్నది గతంలోనే చెప్పుకున్నాం కదా! ఇలాంటి విషయ పరిజ్ఞానాలను చూస్తూ వినియోగించుకోవడం ద్వారా ప్రపంచాన్ని, ఇతరుల్ని మీకు మీరు చూసే దృష్టి మారిపోతుంది. అంటే ఏది ఎలా చూడాలో మీకు మీరు స్వీయ అనుభవాల ద్వారా గానీ, మీ స్వంత విశ్లేషణ ద్వారా గానీ నిర్ణయించుకునే స్వేచ్ఛ నుండి ఇంకొకరి భావోద్వేగాల ద్వారా ప్రభావితం అయి అన్నింటినీ జడ్జ్ చేసి వారి దృష్టిని మీరు కూడా స్వీకరించి వారిలా మీరూ పొల్యూట్ అయ్యే స్థితికి చేరుకుంటారు.
పూర్వ కాలంలో రాజులు తమ పిల్లలను గురు కులాలకు పంపించే వారు. యుక్త వయస్సు వచ్చే వరకూ ఆ పిల్లలు అలాగే గురువు వద్ద విద్యని అభ్యసిస్తూ ఉండేవారు. దీనికి కారణం ఓ స్వచ్ఛమైనఎన్విరాన్మెంట్ సృష్టించడం! అదే ఇంటి దగ్గరే పిల్లల్ని పెట్టుకుంటే మంత్రి, సేనానీ, పరిచారకులు అందరూ ఇచ్చే ప్రత్యేకమైన ట్రీట్మెంట్ వల్ల ఆ పిల్లాడిలో అహం పెరిగిపోవచ్చు. జ్ఞానం పట్ల ఆసక్తి ఏర్పడకపోవచ్చు. అదే వేకువనే లేపి, అన్ని పనులూ స్వయంగా చేసి, విద్యనభ్యసించి దాన్ని అందరు ఇతర విద్యార్థుల్లా అప్పజెప్పే ఓ క్రమశిక్షణతో కూడిన వాతావరణం కోసం ఇదంతా ఏర్పాటు చేయబడింది. సరిగ్గా అలాంటి క్రమశిక్షణే మనకు కావాలి. జీవితంలో అజ్ఞానం స్థాయిలో ఆత్మ జ్ఞానం పొందాలంటే మన చుట్టూ కలుషితం చేసే వ్యక్తులు ఉన్నారా, వారి ఆలోచనలకు మనమూ పొల్యూట్ అవుతున్నామా, లేదా సత్సాంగత్యం ఉందా, నిరంతరం మన ఆలోచనలు ఎలా సాగుతున్నాయి, వాటిలో లోపాలు ఏంటి వంటి ఓ మంచి వాతావరణం కావాలి.
ఇలా పొందే ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే మన కర్మలు ఓ క్రమ పద్ధతిలోకి వస్తాయి. లేదంటే పక్క వాడు పొల్యూట్ అయి ఎవరినో వెధవ అని తిడితే, వాడి పొల్యూషన్ మనమూ అంటించుకుని మనమూ అకారణంగా వెధవ అని తిడతాం. లేదా “భలే తిట్టాడే” అని వెకిలిగా నవ్వుకుని ఓ పైశాచిక కర్మని చేస్తాం. అది ఓ నెగిటివ్ ఎనర్జీ అని, దాన్ని క్వాంటమ్ ఫీల్డ్‌లోకి వెదజల్లుతున్నామని, అది టైమ్ స్పేస్‌లను దాటిపోయి ఏదోరోజు ఏదో రూపంలో మనకు చుట్టుకుంటుందనే విచక్షణ కూడా ఏర్పడదు. భగవద్గీతలోని జ్ఞానమూ, జ్ఞేయమూ, జ్ఞానమును ఎరిగిన వాడు వంటి మూడు విషయాల పట్ల స్పష్టత వస్తే అదే మన జీవితానికి కొత్త మార్పు అవుతుంది.
- Sridhar Nallamothu