ఎందుకు.. ఏమిటి.. ఎలా..
ఈ మూడు ప్రశ్నలను మన మైండ్ ఇష్టపడుతుంది!
కంటెంట్ క్రియేటర్‌గా 2011లో ఎలాంటి యూట్యూబ్ వీడియోలు చెయ్యాలి అని నేను రీసెర్చ్ చేసేటప్పుడు వాడిన స్ట్రేటజీ ఇది!
ఉదా.కి.. గూగుల్ అనే ఓ పదాన్నే తీసుకుందాం.
గూగుల్ ఎందుకు పుట్టింది?
అసలు గూగుల్ ఎలా పనిచేస్తుంది?
గూగుల్ పనిచేసే విధానంలో సీక్రెట్ ఏంటి?
ఇలా “ఎందుకు, ఏమిటి, ఎలా” అనే మూడు ప్రశ్నలను పట్టుకుంటే మూడు వీడియోలు చేయొచ్చు.
మన మైండ్ వీటిని ఎక్కువగా ఇష్టపడుతుంది కాబట్టి చూసే జనాలు కూడా ఎగబడి చూస్తారు. అందుకే మీరు గమనించారో లేదో చాలా టివి ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లు ఇలాగే టైటిల్స్ పెడతాయి.
జూబ్లీహిల్స్ రేప్ కేస్ వెనుక అసలు నిజాలు “ఏమిటో” తెలుసా? – ఇలా ఉంటాయి టైటిల్స్.
మన మైండ్‌కి సమాచారాన్ని సేకరించి, విశ్లేషించి, ఆవేశం, ఇతర భావోద్వేగాలు వెళ్లగక్కి, అభిప్రాయం ఏర్పరుచుకుని, వాదన ఎస్టాబ్లిష్ చేయడం ఇష్టం.
సో దానికి ప్రతీ క్షణం ఇలాంటి రకరకాల ఆహారం కావాలి. దాన్ని మేపడం కోసం తెల్లారి లేవగానే “ఎందుకు, ఏమిటి, ఎలా” తరహా టైటిల్స్ వీడియోలు, సమాచారం మనం చదువుతూ, చూస్తుంటాం.
మైండ్ ఆహారం కోరుకోవడం, అది అడిగిందని ఆహారాన్ని వెదికి పట్టుకుని దాన్ని మేపడం మన బలహీనత. ఇంకా చెప్పాలంటే మైండ్‌ని మనం అజమాయిషీ చెయ్యట్లేదు. అది “నాకు ఏదో ఒకటి పెట్టు, అర్జెంట్, యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదో ఒకటి చూడు.. నాకు విశ్లేషించడానికి, అభిప్రాయం ఏర్పరుచుకోవడానికి ఆహారం కావాలి” అంటూ ఒకటే పోరుతూ ఉంటుంది.
ఈ విషయం అర్థమైన నాబోటి కొంతమంది మైండ్‌కి కంట్రోల్ ఇవ్వడం కాకుండా.. దానికి ఏదో ఒక చెత్త పడేయడం కాకుండా ఓ టెక్నిక్ ఫాలో అవుతాం.
- మొదట నా ప్రయారిటీలు నేను సెట్ చేసుకుంటాను. నాకే నాలెడ్జ్ కావాలో నేను క్లియర్‌గా డిఫైన్ చేసుకుంటాను. నాకు క్వాంటమ్ ఫిజిక్స్ ఇష్టం. స్పిరిట్యువాలిటీ ఇష్టం. సో ఇలా నాకు క్లారిటీ వచ్చాక నాకు కావలసిన టాపిక్స్ తప్పించి వేరే దేని గురించి ఒక్క నిముషం కూడా వీడియో చూడను. ఒక్క నిముషం చూస్తే ఏమవుతుంది అని మీరు అనుకోవచ్చు. యూట్యూబ్‌లో వీడియోలు, ముఖ్యంగా మన తెలుగులో మసాలా దట్టించి ఎమోషన్లతో ఆడుకునే వీడియోలు ఊబి లాంటివి కొన్ని క్షణాలు చూస్తే చాలు, అలాగే అతుక్కుపోతారు. అవి మన మీద వల వేస్తాయి. సో నాకు క్లారిటీ ఉంది.. నాకేం కావాలో, ఏ నాలెడ్జ్ కావాలో! సో అలాంటి కంటెంట్ మాత్రమే వివిధ మార్గాల్లో తెలుసుకుంటాను. స్టడీ చేస్తాను.
- నిర్ణయాలు తీసుకోవడమో, ఏదైనా నేర్చుకోవడమో చేసేటప్పుడు మాత్రమే నా మైండ్ పనిచేసేలా పరిమితి విధించుకుంటాను. అదెలా సాధ్యం అని మీకు అన్పించవచ్చు. మైండ్‌ని ఖాళీగా పెడితే అది చేసే పనులు ఇవి.
a. ఇతరుల్ని గమనించడం, వారిని జడ్జ్ చెయ్యడం – సో దీన్ని నేను అధిగమించాను, ఇతరుల్ని గమనించను, ఎవర్నీ జడ్జ్ చెయ్యను.
b. ప్రతీ విషయాన్నీ, ప్రతీ విషయంతో పోల్చడం – కంపేరిజన్ అనేది మైండ్ కి ఇష్టం. ఏదో ఒక ఫైనల్ ఔట్పుట్ ఇచ్చి అది హాపీగా ఉంటుంది, కానీ ఆ కంపేరిజన్ తర్వాత మన మూడ్ మారిపోతుంది. అందుకే సాధ్యమైనంత వరకూ దేన్నీ దేనితో నేను కంపేర్ చెయ్యను.
సో ఇలా మైండ్ దానంతట అది ఆటోమేటిక్‌గా చేసే అనేక పనుల్ని నేను ఇష్టపడకపోవడం వల్ల అది కట్టేసిన కుక్కలా అలా నన్ను ఏమీ చెయ్యలేక పడి ఉంటుంది.
నాకు కావలసిన నిర్ణయాలు తీసుకోవడమో, నేను ఏదైనా నేర్చుకోవడమో చేసేటప్పుడు మాత్రమే.. “దా, నువ్వు ఈ పని చేయి” అని మైండ్‌ని మళ్లీ వాడకంలోకి తెచ్చి పని పూర్తి చేయిస్తాను. ఆ తర్వాత మళ్లీ అది వెళ్లి ఆ మూలన కూర్చుంటుంది.
ఐదారేళ్లుగా మెడిటేషన్ చెయ్యడం వల్ల ఏర్పడిన క్లారిటీ ఇది. పైన నేను చెప్పిన విషయం సులభం కాకపోవచ్చు. కానీ సంవత్సరాల ప్రాక్టీస్ చేస్తే చాలా అవలీలగా మైండ్‌పై నియంత్రణ వస్తుంది.
- Sridhar Nallamothu