త్వరలో పెళ్లి కాబోతున్న ఓ అమ్మాయి అబ్బాయి ఉన్నారనుకుందాం…
సరదాగా అలా బయటకెళ్లినప్పుడు అబ్బాయి రోడ్ మీద కన్పించిన మరో అమ్మాయి వైపు చూడ్డాన్ని అమ్మాయి గమనించేసి 2 రకాలుగా రియాక్ట్ కావచ్చు.
1. "ఆ అమ్మాయి బాగుంది కదా" అని చాలా కాజువల్‌గా నవ్వుతూ రెస్పాండ్ అవడం
2. లేదా లోపల్లోపల ఉడుక్కుంటూ ఎలాగోలా అతని దృష్టి మరల్చాలని చూడడం
అమ్మాయి నుండి వచ్చే 2 స్పందనలకూ అబ్బాయికీ అతని మనస్థత్వాన్ని బట్టి పలు రకాలైన స్పందనలు ఉండొచ్చు.
మొదటి స్పందనకైతే..
నవ్వుతూ రెస్పాండ్ అవగానే షాక్ అయిపోవడం, ఆ అమ్మాయి క్యారెక్టర్‌పై అనుమానం పుట్టుకురావడం లేదా ఓ విశాలమైన భావాలు కలిగిన పార్టనర్ దొరికిందని సంతోషపడడం.. వీటిల్లో ఏదైనా జరగొచ్చు.
————————————————–
పై ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే.. అమ్మాయిలూ, అబ్బాయిలకే కాదు.. రోజూ మనం మాట్లాడే, తిరిగే, గడిపే ప్రతీ వ్యక్తీ ప్రతీ సంఘటన పట్లా రెస్పాండ్ అయ్యే విధానం చాలా డైనమిక్‌గా ఉంటుంది.
మన ఆలోచనలు నిర్మితమయ్యేది ఎన్నో అనుభవాల, ఎన్నో జ్ఞాపకాల, మనుషుల, పరిస్థితుల సాహచర్యంలో!
ఒక ఆలోచన ఓ బలమైన పునాదితోనూ ఏర్పడవచ్చు.. ఓ గందరగోళమైన మానసిక స్థితీలోనూ రూపుదిద్దుకోవచ్చు.
మనం చేసే తప్పల్లా ఆ ఆలోచనని ఉన్నది ఉన్నట్లు వ్యక్తపరిచేసి.. దాన్ని సమర్థించే స్పందనను ఎదుటి వ్యక్తి నుండి ఆశించడం!
మనకున్నట్లే ఎదుటి వ్యక్తికీ వేర్వేరు అంశాలపై ఎలా స్పందించాలన్నది వివిధ సంఘటనలు జరిగినప్పుడు అంతర్గత సంభాషణల ద్వారా కావచ్చు.. రిపీటెడ్ ఆలోచనాస్రవంతి వల్ల కావచ్చు ప్రీప్రోగ్రామింగ్ చేయబడి ఉంటాయి.
సో ఒక విషయంలో, ఒక సందర్భంలో, ఒక వ్యక్తీకరణలో మన తోటి వ్యక్తి సానుకూలంగా స్పందిస్తే సంతోషపడిపోతాం. విభిన్నంగా స్పందిస్తే ఒంటరిగా ఫీలవుతాం.
ఎన్నో రకాల మనస్థత్వాల మనుషులు.. పిచ్చివాళ్లం… మనతోటి వాళ్లందరూ మనలాగే ఆలోచిస్తున్నారనుకుంటాం.
"లైక్ మైండెడ్ పీపుల్" అనే భావన బెడిసి కొట్టేది ఇక్కడే. ఎదుటి వ్యక్తితో మనం ఏకీభవిస్తున్నామంటే.. దానికి సవాలక్ష కారణాలుంటాయి. నిజంగానే వాళ్ల ఆలోచన నచ్చొచ్చు.. నచ్చకపోయినా అంతకన్నా గత్యంతరం లేకపోవచ్చు.. వాళ్లతో సాన్నిహిత్యం మనం కోరుకుంటూ ఉండొచ్చు.. వారి సాన్నిహిత్యం పొందడానికి మన స్వంత ఆలోచనల్ని వదులుకోవడం మనకు కష్టం అన్పించపోవచ్చు.
మనుషులు మనల్ని తమ చాపల్లోకి చుట్టేస్తారు 🙂 చాలాసార్లు మనమూ అంతే.
ఈ క్షణం నా కళ్లెదుట కన్పిస్తున్న మోనిటర్, స్క్రీన్‌పై ఇప్పటివరకూ టైప్ చేసిన అక్షరాలూ కొన్ని రకాలైన ఆలోచనలు కలిగిస్తుంటాయి.. అంతలో బయటి నుండి చల్లగా వస్తున్న గాలి ఆ ఆలోచనల్ని హైజాక్ చేసేయొచ్చు.. మధ్యలో వచ్చిన ఫోనూ.. ఆ సంభాషణలోని నా ఎమోషనూ వేరొక విధమైన ఆలోచన సృష్టించొచ్చు.
అలాగే మేగజైన్ వర్క్ చేసీ చేసీ అలసిపోయి పెద్దగా ఆలోచించడానికి సహకరించని నా బ్రెయిన్ కొన్ని పై పై ఆలోచనలకే నన్ను పరిమితం చేయొచ్చు. ఇన్ని internal, external factors మీద ఆధారపడి మాత్రమే ఈ క్షణం నా ప్రవర్తానా, ఆలోచనా ఆధారపడి ఉంటుంది. మనొక్కళ్లకే ఈ క్షణపు ఆలోచనను ఇన్ని factors ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న వందలాది మందిని, మన బంధువుల్ని, స్నేహితుల్ని, బయటి పబ్లిక్నీ ఎన్ని రకరకాల అంశాలూ కెమికల్ రియాక్షన్లలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వారి మాటల్నీ, చేతల్నీ డిజైన్ చేస్తుంటాయో కదా?
అందుకే సాటి మనిషి ఆలోచనని excuse చెయ్యడం చాలా అవసరం.. అది మనకు నచ్చినా నచ్చకపోయినా! మనకు నచ్చని ఆలోచన ఎటూ కొంత మనల్ని ఘర్షణకు గురిచేస్తుంది. ఆ ఘర్షణని వీలైనంత త్వరగా తెరదించకపోతే మన తోటి రిలేషన్స్‌లో అందరూ మనకు "ఓ పట్టాన అర్థం కాని" వారే మిగులుతారు.
మనుషుల్నీ, ప్రవర్తనల్నీ ప్రేక్షకుల్లా చూడాల్సిందే తప్ప ప్రాసెసింగ్ చేయదలుచుకుంటే మన CPU Core క్లాక్ స్పీడ్లు సరిపోవు.. వేడెక్కి ప్రాసెసర్లు కాలిపోయినా కాలిపోవచ్చు 🙂
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
mee lo edo oka Evolution modalayyimdi. nenu mimmalni modate gurtimchanu meelo oka thinker vunnadani!