కొన్ని ఖాళీలు ఉంటాయి… ఖాళీలు ఉన్నప్పుడు మన దృష్టంతా ఆ ఖాళీలు fill చేయడం మీదే ఉంటుంది నేచురల్‌గా!
మన లైఫ్ కూడా ఇలాగే సాగుతూ ఉంటుంది…
ప్రేమ రాహిత్యమో, డబ్బు సరిగ్గా లేకపోవడమో, షేర్ చేసుకోవడానికి మనుషులంటూ లేకపోవడమో… మనుషులున్నా మనల్ని వాడుకుని వదిలేసే బాపతు కావడమో… ఇలా రకరకాల కారణాల వల్ల కొంత “వెలితి” అంటూ ప్రతీ మనిషికీ ఉంటుంది..
ఆ వెలితిని నింపుకునే gap fillers అన్వేషణలోనే జీవితం మొత్తం గడిచిపోతుంది..
నా బాల్యంలో నేను ఆత్మీయుల్ని మిస్ అయ్యాను కాబట్టి…. నేను జీవితాంతం ఎవరు కొద్దిగా ప్రేమ చూపించినా… సరెండర్ అయిపోతాను.. రిలేషన్లు అన్నీ బాగుండీ సంతృప్తిగా పెరిగిన వ్యక్తికి… మనుషులు పెద్దగా లెక్కగా తోచక పోవచ్చు కూడా! మరొకరు పేదరికంలో పుట్టి పెరిగితే.. డబ్బు తప్ప లోకం లేదన్నట్లుగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు…
ఒక్క మాటలో చెప్పాలంటే Life is fillings Gaps..
అన్నీ వదిలేసి ముందుకు సాగడం కన్నా…. ఉన్న చోట ఆగిపోయి ఇప్పటికే ఉన్న వెలితిని పూడ్చుకుంటూ కూర్చోవడం మనకు ఇష్టమైన ప్రాసెస్.
పేరెంట్స్ ఓ 10 నిముషాలు కూడా పిల్లలతో గడపలేకపోతున్నారు కాబట్టే.. పిల్లలు మరింత ప్రేమని బాయ్, గర్ల్ ఫ్రెండ్స్‌లో వెదుక్కోవడం జరుగుతూ ఉంది…
ఈరోజు సమాజంలో మనం చూస్తున్న లైఫ్ స్టైల్‌కి ప్రతీ మనిషిలోనూ పేరుకుపోతున్న ఎన్నో ఖాళీలే కారణం… వాటిని పూడ్చుకుంటూ ఉండడం వల్లనే నీతీ, నిజాయితీ, నైతిక విలువలూ.. ఇవన్నీ పక్కకు పోయి… ముందు తమని తాము సంతృప్తిగా ఉంచుకోవడం మీదనే దృష్టి పెడుతూ ఉంటున్నారు… ఈ స్టేట్ మెంట్ ని లోతుగా మీరు ఆలోచిస్తే ఎన్ని రకాల సామాజిక రుగ్మతలు ఈ స్టేట్ మెంట్ పరిధిలోకి వస్తాయో మీకే తడుతుంది.
———————————————————————————————————————————————————————
అసంతృప్తి అనేది సంతృప్తి కన్నా ఓ రెండాకులు ఎక్కువ తిని ఉంటుంది…. అందుకే సంతృప్తి కాసేపే మనస్సులో నిలబడితే అసంతృప్తి ఉన్న సంతృప్తిని కూడా పక్కకు తోసేసి… మనస్సులో ఉన్న స్థలం మొత్తాన్నీ ఆక్రమించుకుంటుంది.
అసంతృప్తి డామినేట్ చేసినప్పుడు అంతా సాఫీగా ఉన్న లైఫ్ కూడా ఎక్కడో ________________________ మాదిరిగా ఖాళీలు సృష్టించుకుని సాగుతుంటుంది. ఏదో ఒక దానితో కంపేర్ చేసుకోవాలి… ఓ ఖాళీ సృష్టించుకోవాలి.. ఆ ఖాళీ ఉందని బాధ పడాలి… కుళ్లి కుళ్లి ఏడవాలి… అలా ఏడుస్తూ ఆ ఖాళీని పూరించుకోవాలి…. ఓ క్షణం సంతృప్తి పడాలి… మళ్లీ మరో ఖాళీ కోసం నోరు తెరిచి జనాల్నీ, సమాజాన్నీ అబ్జర్వ్ చేస్తూ…. అందరికీ ఉండీ మనకు లేనిదేమిటో కొన్ని పాయింట్లు నోట్ చేసుకుని…. వాటిని అక్కడక్కడ ఖాళీలుగా మన లైఫ్‌లో పెట్టేసుకోవాలి… మళ్లీ వాటి కోసం ఏడవడం… bla…bla…bla.. రొటీనే!
సో నిరంతరం సంతృప్తి కోసం ఆరాటపడుతున్నా…. సంతృప్తి అంటే ఏమిటో తెలీకుండా లైఫ్ ముగిసిపోతోంది… సంతృప్తి అంటే ఓ మైండ్ గేమ్ అన్నది అర్థమయ్యే లోపే ఆలోచనలు కూడా మనకు cooperate చేయనంత అచేతన స్థితికి చేరిపోతున్నాయి..
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
Leave a Reply