బాగా రెస్ట్‌లెస్‌గా ఉంటే.. ఎమోషనలైజ్ అయితే.. ఆ state of mind కొంతకాలం అలాగే కొనసాగితే ఆలోచనలు అంతా చాలా కన్ఫ్యూజ్డ్గా మారిపోయి, సరిగ్గా నిద్ర కూడా పట్టక ఆ వత్తిడి తట్టుకోలేక ఏ రెస్టిల్ వంటి స్లీపింగ్ పిల్కో చాలామంది అలవాటు పడిపోతారు..
మనస్సు కంట్రోల్ తప్పిపోయి మాటలతో చెప్పే ఏ కౌన్సిలింగులూ పనిచేయని వారిని హ్యాండిల్ చెయ్యడానికి హిప్నాటిస్టులు కొన్ని సమ్మోహితమైన ఆదేశాలతో తమ కంట్రోల్లోకీ తీసుకోవడం చూస్తుంటాం..
అలాగే నిరంతరం ఆందోళన చెందే వారికి న్యూరాలజిస్టుల వద్దా నరాలను బలవంతంగా అణగదొక్కే మందులకూ కొదవేం ఉండదు….
వీటితో పాటు భక్తీ, భజనలూ, ఆధ్యాత్మిక బోధనలూ, గుంపులతో కూడిన సభలూ, సమావేశాలూ కూడా మన బుర్రల్ని తాత్కాలికంగా హైజాక్ చేస్తుంటాయి. మానసిక వత్తిడుల నుండి మనకన స్వాంతన కావాలి కాబట్టి.. ఇలాంటి నాలుగు మంచి మాటలు వింటే దృష్టి వేరే విషయాలపై దారి మళ్లి వత్తిడి తగ్గుతుందన్న నమ్మకం మనది.. జరిగేదీ అదే కూడా! అంతకు మించి నిజంగా మనకు ఏ ఆధ్యాత్మిక ప్రవచనమూ తలకెక్కదు.
————–
కేంద్రీయ నాడీ వ్యవస్థని (సెంట్రల్ నెర్వస్ సిస్టమ్) ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలే ఇవన్నీ. అంటే మన బుర్రని మనం నియంత్రించుకోలేక external source ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నామన్నమాట. ఇది చాలా చాలా ప్రమాదకరం..
ఎందుకు ప్రమాదకరమంటే…
ఏ ఆలోచనలు ఎలా పుడుతున్నాయో, అవి ఎలా రూపాంతరం చెందుతున్నాయో, వాటిని ఎలాంటి అలజడులూ, ఎమోషన్లూ మనలో ఉత్పత్తి అవుతున్నాయో అన్నింటినీ నిశితంగా గమనించుకుంటూ… వాస్తవ స్థితిని అర్థం చేసుకోవడం ద్వారా మనస్సుని నిగ్రహంలోకి తెచ్చుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఏ ఆలోచన దేనికి కారణం అవుతోందో, ఏ ఆలోచనకు అతిగా స్పందిస్తున్నామో, ఏ సంఘటన జరిగినప్పుడు మనం విపరీతంగా బాధపడ్డామో, అలా ఇరుక్కుపోయిన స్థితి నుండి ఎలా బయటకు రావాలో మనల్ని మనం విశ్లేషించుకుని సరిచేసుకోపోతే.. సరిగ్గా అవే భయాలూ, బాధలూ, ఎమోషన్లూ, వత్తిడులూ మనస్సుని మళ్లీ మళ్లీ వెంటాడుతాయి. మెదడు మొద్దుబారిపోతుంటుంది. చివరకు మనమేం చెయ్యలేక పైన చెప్పుకున్నట్లు ఏ మందులనో, భోధనలనో, హిప్నాటిస్టునో, న్యూరాలజిస్టులనో నమ్ముకోవలసిన అవసరం ఏర్పడుతుంది.
———————–
ఆలోచనని, భయాన్నీ, వత్తిడినీ అధిగమించడం చేతనవ్వాలి. నిజానికి అంతటి అపారమైన శక్తి మన మనస్సుకుంది… అద్భుతమైన విషయం ఏమిటంటే… మనం ఇంకో ఆలోచనని సృష్టించుకోవడం ద్వారా ఇప్పుడు ఆలోచిస్తున్న విధానాన్ని ప్రశ్నించవచ్చు, తర్కించవచ్చు, అది సమంజసమైన ఆలోచన కాదని అన్పిస్తే ఆ మొదటి ఆలోచనని అంతటితో ఉపసంహరించుకోవచ్చు కూడా! అంటే ఓ భయాన్నీ, ఇన్సెక్యూరిటీనీ మనస్సే క్రియేట్ చేసుకుంటుంది.. అది ఎంతవరకూ కరెక్టో కూడా మనం మనస్సుతోనే విశ్లేషించుకుని మనల్ని మనం స్థిమితపరుచుకోగలం అన్నమాట..
సో ఇలా.. జ్ఞానేంద్రియాలన్నింటినీ స్వాధీనంలోకి తెచ్చుకుని… పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం, జీర్ణించుకోవడం, అవసరం లేని ఆలోచనలను వదిలేయడం, అవసరం అయితే కొత్త తాజా ఆలోచనలు చేయడం, ఏ థాట్ వద్దనైనా ఇరుక్కుపోతే వదిలించుకుని ముందుకు సాగడం చేయడం కరెక్ట్.
————–
మనస్సు స్వాధీనం తప్పితే, వేరొవరో చెప్తే తప్ప మనల్ని మనం సరిచేసుకోలేని దౌర్భల్యం ఏర్పడితే మనం పరోక్షంగా జీవశ్చవాలమే. అద్భుతమైన మానసిక శక్తిని సద్వినియోగం చేసుకోలేకపోయిన వాళ్లమే అవుతాం!!
– నల్లమోతు శ్రీధర్
Nice sridhar gaaru:-):-)