Archive from December, 2008

పెద్దరికం

తనకు నచ్చితేనే ఒప్పుకునే తత్వం ఏ మనిషిదైనా! సామాజిక బంధాల్లో ఇలా మనకు నచ్చడం అన్నది ఎల్లప్పుడూ సాధ్యపడదు. ముఖ్యంగా తరాల అంతరాలున్న బంధాల్లో పెద్దల ఇష్టాలకు అనుగుణంగా పిల్లలు సగౌరవంగా గానీ, అయిష్టంగా గానీ.. అలాగే పిల్లల ఆధిపత్యాన్ని నిస్సహాయస్థితిలో కాదనలేక పెద్దలు గానీ ఒక్కోసారి ఒద్దికగా కావచ్చు, తప్పనిసరై కావచ్చు తలవంచక తప్పదు. పిల్లల పరంగా చూస్తే పెద్దల అనుభవానికి గౌరవం ఇవ్వాలా లేక వయసుతో ఆపాదించబడే పెద్దరికానికి తలవగ్గాలా అన్నది అంత సులభంగా నిర్ణయించుకోలేని ప్రశ్న. అనుభవంతో పరిపక్వత సంతరించుకున్న పెద్దరికం అప్రయత్నంగానే అన్ని బంధాల నుండి గౌరవాన్ని దక్కించుకుంటుంది. ఎటొచ్చీ “వయసులో పెద్దవారం” అన్న అర్హతను ఆధారంగా చేసుకుని ప్రత్యక్ష చర్యల ద్వారానూ, మాటలు చేతల ద్వారానూ ఆధిపత్యాన్ని కనబరచాలనుకునే పెద్దలకు అణిగిమణిగి ఉండాలంటేనే చిర్రెత్కుకొచ్చి చివరకు చిన్న పిల్లలు సైతం ఎదురు తిరుగుతారు. తమకంటూ ఓ నిర్థిష్టమైన వ్యక్తిత్వం ఏర్పరచుకోలేని పెద్దలు, డబ్బు, సామాజిక హోదాల మత్తులో మునిగి ఖద్దరు బట్టల్లో పెద్దరికం ఒలకబోయాలనుకునే పెద్దలు చిన్నవారి మనసుల్లో తిరస్కరణలకు గురవుతూ ఉంటారు. వయస్సు, ఆడంబరత గౌరవం పొందడానికి అర్హతలని ఎప్పుడైతే పెద్దలు భావించడం మొదలెడతారో అక్కడే వారికి ప్రతిఘటన ఎదురవుతుంది.

మన సంస్కృతి పెద్దలను గౌరవించమంటుంది కాబట్టి ఎటూ ఇష్టంగానైనా, అయిష్టంగానైనా పిల్లలు పెద్దలను గౌరవిస్తూనే ఉంటారు. కనీసం గౌరవిస్తున్నట్లు నటిస్తూనే ఉంటారు. కొందరు పెద్దలు తమ వ్యక్తిత్వంలోని ఔన్నత్యంతో పిల్లల మనసుల్ని చాలా సులభంగా కొల్లగొట్టగలం అన్న సూత్రాన్ని మరిచి గౌరవం పొందడానికి పెద్దరికాన్ని అడ్డుపెట్టుకోవాలనుకోవడమే విచారకరమైన విషయం. ఎప్పుడైనా ప్రేమ, ఆప్యాయతలే మనసుల్ని కట్టిపడేసి గౌరవాన్ని అందించగలవు తప్ప వయసుతో అజమాయిషీ చెయ్యడానికి ప్రయత్నిస్తే అది వికటించడం ఖాయం.

విచిత్రమేమిటంటే ఆ వయస్సూ కొంతకాలం మాత్రమే గౌరవాన్ని పొందడం విషయంలో ఆదుకుంటుంది. మరికొన్నేళ్లు గడిస్తే అదే వయస్సు శాపంగా పరిణమిస్తుంది. పిల్లల పట్ల ప్రేమతో మెలిగిన వారికే వృద్ధాప్యంలో కష్టాలు తప్పకపోతే ఇక “పెద్దరికం” ముసుగేసుకుని జులుం ప్రదర్శించిన వారికి వృద్దాప్యంలో ఎలాంటి మర్యాదలు దక్కుతాయో చెప్పనవసరం లేదు. గౌరవించబడుతూ వచ్చిన అతి కొద్దికాలంలోనే వయస్సు మీదపడి నిస్సహాయతలో కూరుకుపోవడం మింగుడుపడని దారుణ పరిస్థితి. నిన్నటి వైభవం బుర్రలో చెరిగిపోకముందే నేటి బాధలు వైరాగ్యంలో ముంచెత్తుతుంటాయి. ఇక్కడ తమకంటూ అనుభవం ఉన్నా, స్వంత అభిప్రాయాలు ఉన్నా తమకూ, కుటుంబానికి చెందిన అన్ని విషయాల్లోనూ పిల్లలకు ఎదురు చెప్పలేక, జోక్యం చేసుకోలేక మౌనప్రేక్షకులుగా మిగిలిపోవడం తప్ప ఏమీ చెయ్యలేని దుర్భరజీవితం పెద్దలది. అందుకే బంధాలను ప్రేమతో గెలవాలి తప్ప వయస్సు, హోదాలతో కాదు అన్నది అందరం గుర్తుంచుకోవాలి.

Dec 9, 2008 - విహారం    11 Comments

మరవలేని అనుభవం వైజాగ్, అరకు ట్రిప్ (దృశ్యమాలిక)


పచ్చదనాన్ని కప్పుకుని ఆకసాన్నంటే గిరులు ఓ వైపు.. అబ్బురపరిచే లోయలు మరో వైపు.. తాచుపాములా మెలికలు తిరిగే సన్నని దారీ.. కళ్లు విప్పార్చుకుని చూసినా కళ్లల్లో ఇమిడిపోలేనన్ని అందాలు..

ఆహ్లాదంగా సాగిన అరకు విహారయాత్ర మిగిల్చిన అనుభవం ఇది. గత నెల 15వ తేదీ నుండి కంప్యూటర్ ఎరా డిసెంబర్ మేగజైన్ ప్రిపరేషన్ వత్తిడిలో బ్లాగుకి దూరంగా ఉన్నాను. అది ప్రింటింగ్ కి పంపిన తర్వాత ప్లాన్ చేసుకున్న ఈ ట్రిప్ ఇలాంటి వత్తిడుల నుండి ఎంతో రిలీఫ్ ని అందించడమే కాకుండా కొంగొత్త ఉత్సాహాన్నిచ్చింది. వైజాగ్ లోని రామకృష్ణ బీచ్, రుషికొండ లో బోట్ షికార్, కైలాసగిరి, యారాడ బీచ్, అరకు, సింహాచలం తదితర ప్రదేశాలను తీరికగా చూసే భాగ్యం ఇన్నాళ్లకు కలిగింది. ఆ అద్భుత ప్రదేశాలన్నీ కళ్లెదుట ఊరిస్తుంటే ఓపిగ్గా మరీ 6.5GBకి పైగా ఫొటోలు, వీడియోలు కెమెరాలో భద్రపరుచుకుని మళ్లీ మళ్లీ చూడడం మరో చక్కని అనుభవం. బ్లాగు మిత్రులతో ఈ ట్రిప్ లోని కొన్ని ఫొటోలు, థింసా డాన్స్ లో చిన్న వీడియో క్లిప్ ని ఈ పోస్ట్ లో షేర్ చేసుకుంటాను. బ్లాగర్ లో ఉన్న పరిమితుల వల్ల తక్కువ క్వాలిటీ ఇమేజ్ లను, పేజ్ లోడింగ్ కి ఎక్కువ సమయం పట్టకుండా తక్కువ ఇమేజ్ లను మాత్రమే ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఏదైనా ఇమేజ్ ని పెద్దదిగా చూడాలంటే ఆ ఇమేజ్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది.