“అక్కడ కూర్చున్నావేరా.. రా ఇటు వచ్చి ఇక్కడ కూర్చో” అన్నాడు మా నాన్న.
మాది బాపట్ల జమ్ములపాలెం అయినా పత్తి వ్యవసాయం చెయ్యడానికి మహబూబ్ నగర్ జిల్లా జోగులాంబ అమ్మవారికి ఐదారు కిలోమీటర్ల దూరంలో శ్రీనగర్ అనే ఊరికి దగ్గరలో చెన్నిపాడు అనే ఊళ్లో మా నాన్న, పిన్ని (అమ్మ అనే వాడిని, కధలో గందరగోళం లేకుండా ఉండడానికి పిన్ని అని రాస్తాను) ఉండే వారు.
మా తాతయ్య చనిపోతే నేను ఒంటరి వాడిని అవుతానని, గతంలో జరిగిన గొడవలు పక్కనబెట్టి తాను చనిపోవడానికి ఓ ఐదారేళ్ల క్రితమే మా నాన్న వాళ్లకి కబురు పంపి నన్ను వాళ్లతో కలిపే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలో ఓసారి మా నాన్న నన్ను కర్నూలు తీసుకు వెళ్లడానికి ఏర్పాటు చేశారు. తెనాలిలో మా చిన్న చెల్లెళ్లిద్దరు (మా నాన్న రెండో పెళ్లి సంతానం) చదువుకుంటూ ఉన్నారు. వాళ్లల్లో పెద్దమ్మాయి తెనాలి నుండి కర్నూలు వచ్చేది ఉందనీ, తనతో కలిసి నేనూ వెళ్లేలా ఏర్పాటు చేశారు. నాకు అప్పటి వరకూ పరిచయం లేని కొత్త చెల్లెలు. అప్పటి వరకూ నాకు తెలిసిన పదిమంది తప్పించి కొత్త వ్యక్తులతో ఉన్నదీ లేదు. అంత దూరం జీవితంలో ఎప్పుడూ ప్రయాణించింది లేకపోవడంతో రాత్రంతా నిద్రపట్టలేదు. మా పెద్ద చెల్లెలు నిద్రలో అలా ప్రశాంతంగా నా భుజం మీద తల వాల్చి పడుకుంది. అప్పుడు నాలో ఓ అన్న ఉదయించాడు. కదిలితే ఎక్కడ లేస్తుందేమోనని అలాగే కదలకుండా కూర్చున్నాను. ఇప్పటికీ పెద్ద చెల్లెలికి, చిన్న చెల్లెలికి నేనంటే ఇష్టం. కానీ జీవితంలో మేం కలిసి గడిపింది పట్టుమని పదిరోజులు కూడా లేదు. ఏవైనా ఫంక్షన్లలో పిన్ని గానీ (అమ్మ), చెల్లెళ్లు గానీ కన్పిస్తే పలకరిస్తాను.
అలా మొదటిసారి చెన్నిపాడు వెళ్లినప్పుడు మిద్దె ఇంట్లో బయట వరండాలో ఒక్కడినే కూర్చుని ఉన్నాను. నాన్న, అమ్మ, చెల్లెలు లోపల ఉన్నారు. చనువుగా లోపలికి వెళ్లే చనువు లేదు. అప్పుడు ఆయన అన్నమాట..
“అక్కడ కూర్చున్నావేరా.. రా ఇటు వచ్చి ఇక్కడ కూర్చో!”
వెళ్లి కూర్చున్నాను.. మంచం కోడు మీద, కూర్చోనీ, కూర్చోనట్లు! తలెత్తకుండా గచ్చుని చూస్తూ ఉన్నాను. తలెత్తి ఎవరి కళ్లల్లోకి చూసే ధైర్యం లేదు. ఎవరు పిలిచినా కళ్లు ఎక్కడో ఆకాశంలో పెట్టి పక్క చూపులు చూడడమే, గట్టిగా అడిగితే సమాధానం చెప్పడమే లేదంటే మౌనమే.
మా అమ్మమ్మ చనిపోయిన రోజు నా స్లీపింగ్ పిల్స్ వ్యసనం గురించి పెద్దల పంచాయితీ తర్వాత, అందరూ కలిసి మా నాన్నకి అప్పజెప్పారు నన్ను. కర్నూలులో బళ్లారి రోడ్లో బాలాజీ హోటల్ పక్కన మా నాన్న మిత్రుడిది ఓ ఫెర్టిలైజర్ షాపు ఉంటే అందులో అకౌంటెంట్‌గా చేర్చారు. ఆ పక్క గల్లీలోనే చిన్న గది. ఇప్పటికీ టచ్‌లో ఉన్న మిత్రుడు కర్నాకర్ అప్పటికే ఆ రూములో ఉంటున్నాడు. తనతో కలిసి రెండు నెలలు సావాసం చేశాను. జీవితంలో ఓ కొత్త వ్యక్తి కూడా స్నేహితుడు అవుతాడని అప్పుడే తెలిసింది. తను హిందీ పాటలు వింటూ వాటి అర్థాలు చెబుతూ, నువ్వు హిందీ నేర్చుకో శ్రీధర్, చాలా అర్థవంతమైన పాటలు హిందీలో ఉన్నాయి అంటూ ఆసక్తి పెంచే వాడు.
రోజూ ఉదయాన్నే ప్లాస్టిక్ బుంగలు పట్టుకుని రూమ్ నుండి రోడ్ మీద ఉన్న మునిసిపాలిటీ కుళాయి దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాడిని. 1995లో జరిగిన సంఘటనలు ఇవన్నీ. నా జీతం 1200. అందులో రూమ్ రెంట్ 600 మిగిలేది 600 వందలు. తిండికి ఏర్పాటు చేశారు మా నాన్న. అదనంగా ఒక్క పైసా అడగాలన్నా చనువు ఉండేది కాదు. ఆయనే ఓ వందో రెండొందలో చేతిలో పెట్టి వెళ్లే వాళ్లు.
మాకు దూరపు బంధువులైన (ఆయన బంధువని అప్పటి దాకా నాకు తెలీదు) ఒంగోలు శ్రీనివాస్ అదే షాపులో పనిచేస్తుండే వాళ్లు. టేబుల్ మీద అకౌంట్స్ పుస్తకాలు పెట్టుకుని తలెత్తకుండా కూర్చుండే నన్ను శ్రీనివాస్, మరో ఇద్దరు కలిసి “టీ తాగొద్దాం” అని బలవంతంగా లేవదీసుకు వెళ్లే వాళ్లు. నా చేతిలో పైసా ఉండేది కాదు. అందరికీ టీ డబ్బులు ఇచ్చే స్థోమత కాదు. వాళ్లు టీ డబ్బులు ఇస్తుంటే సిగ్గుతో వాళ్ల వెనుక నుంచుండే వాడిని.
ఆరోజు నిర్ణయించుకున్నాను.. నేను సెటిల్ అయ్యాక నాతో ఉన్న ఏ వ్యక్తితో నేను ఖర్చు పెట్టించకూడదు అని! అప్పటి నుండి ఈ క్షణం వరకూ అది వందలు బిల్ అయినా, వేలు బిల్ అయినా నా దగ్గర ఆర్థికంగా అంత డబ్బు లేకపోయినా, నా పక్కన లక్షలు సంపాదించే వారు ఉన్నా ప్రతీ దానికీ నేనే బిల్ కట్టడం మొదలెట్టాను. నాకు ఒకటే ధైర్యం.. “నన్ను భగవంతుడు చల్లగా చూస్తాడు, ఆఫ్టరాల్ ఈ చిన్న విషయాలకు నువ్వూ, నేనూ అని ఇతరుల చేత బిల్ కట్టించడమేంటి అని!
కర్నూలులో పన్నెండు వందల జీతం సరిపోకపోవడంతో చాలా కష్టంగా ఉండడంతో ఓరోజు అక్కడే ఏదో హోటల్లో మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగాలు పడితే జీవితంలో మొదటిసారి ఇంటర్వ్యూకు వెళ్లా. అందరూ టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని వచ్చారు. టై కట్టుకున్నారు. ఇస్త్రీ కూడా లేకుండా నలిగిపోయిన షర్ట్‌తో నేను వెళ్లాను. బెల్ట్ కూడా లేదు. అప్పటి వరకూ జీవితంలో బెల్ట్ వాడింది కూడా లేదు. టక్ ఎలా చేసుకోవాలో కూడా తెలీదు. ఇక టై సంగతి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ నాకు టై కట్టుకోవడం రాదు. అందరూ ఇంగ్లీషులో మాట్లాడుకుంటున్నారు. కనీసం నాకు ఒక్క ఇంగ్లీష్ పదం మాట్లాడడం కూడా రాదు. “నేను సెలెక్ట్ అవనని అర్థమైంది”. అనుకున్నట్లుగానే ఇంటర్వ్యూలో ఏమడిగారో కూడా అర్థం కాక, తెల్లమొహం వేసి వచ్చేశాను.
రూముకొచ్చాక ఆ చింకిపోయి మురికి పట్టిపోయిన మెత్త మీద పడుకుని కళ్లు మూసుకుంటే.. శూన్యత. ఎలా బ్రతకాలి, నన్ను ఎవరు ఆదుకుంటారు, నా జీవితం ఏమైపోవాలి అనే వేదన మొదలైంది.
మిగతా తర్వాతి భాగంలో!
- Sridhar Nallamothu