బంగాళాఖాతంలో అల్పపీడనం..
ఎడతెరిపి లేకుండా వర్షం..
రెండు చేతులు.. చూరు క్రింద నుండి బయటకి పెట్టి చినుకు చినుకునీ స్పృశిస్తూ ఆస్వాదిస్తున్నాయి.
తెనాలిలో ASN కాలేజ్ ఎదురుగా ఉన్న ICFAI ఇనిస్టిట్యూట్ అది. రేకుల షెడ్ క్లాసు రూమ్స్‌లో రేకులపై నుండి పడుతున్న తేలికపాటి వర్షాన్ని ఆస్వాదిస్తున్నది నేనూ, నీలిమా కిరణ్!
అమ్మాయి పేరు చదవగానే లవర్ అనే ఆలోచన మీకు వెంటనే కలిగి ఉండాలే! అది మన దౌర్భాగ్యం, ఆ దౌర్భాగ్యమే నన్ను నాశనం చేసింది. ఎందుకో చెబుతాను.
నీలిమా కిరణ్ నాకు చాలా చాలా మంచి స్నేహితురాలు. ఎలాంటి కల్మషం లేని స్నేహం మాది. ఒకే క్లాసు అయినా ఇనిస్టిట్యూట్‌లో ఏదో క్యారమ్స్ కాంపిటీషన్ పెడితే, క్యారమ్స్ ఆడేటప్పుడు ఇద్దరం ఒక టీమ్ అవడంతో మొదలైన పరిచయం అలా బలపడిపోయింది. నేనంటే తనకి ప్రాణం. నాకూ అంతే. వాళ్ల ఫాదర్ ఆర్మీలో చేస్తూ ఈ అమ్మాయి చదువు కోసం తెనాలిలో వాళ్ల అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉంచారు.
అప్పటికే ICWAI ఇంటర్ గ్రూప్స్ విజయవాడలో రెండుసార్లు రాయడంతో సబ్జెక్ట్ మీద బాగా పట్టు వచ్చింది. సూపర్ విజ్లో గుప్త గారిని నేరుగా నిలదీశాక ఇక విజయవాడలో లాభం లేదని తెనాలిలో ICFAIలో చేరాను.
క్లాసులో రత్నాకర్ సార్ కాస్ట్ అకౌంటెన్సీ ఇతర సబ్జెక్టులపై ప్రాబ్లెం ఇచ్చి, సొల్యూషన్ రాయమని వెయిట్ చేస్తుంటే అసలు పేపర్‌పై రాయకుండా నోట్లో లెక్కలు వేసుకుని లేదా రఫ్‌గా సాల్వ్ చేసి అందరి కంటే ముందు నేను సమాధానం చెప్పే వాడిని. ఒకటి రెండుసార్లు అలా మిగతా క్లాసుని చెప్పనీయకుండా హైజాక్ చెయ్యడం చూసి రత్నాగర్ గారు గుర్రుగా చూసి కళ్లెర్లచేసి నన్ను చెప్పనీయకుండా కూర్చోబెట్టే వారు.
అప్పుడే స్టార్ట్ అయిన ఇనిస్టిట్యూట్‌కి నేను గ్రూప్‌లో టాపర్‌గా నిలిచి పేరు తెస్తానన్న నమ్మకం రత్నాకర్ గారికి, ఇతరులకి ఉండేది.
నీలిమా కిరణ్ నేనూ నోట్స్ ఎక్సేంజ్ చేసుకునే వాళ్లం. చాలా ప్రేమగా ఉండే వాళ్లం. ఆ అమ్మాయి మనస్సులో ఏం లేదని నాకు తెలుసు, నాకూ ఏం లేదు. అంధులు అక్షరాలు చదవడానికి ఉపయోగపడే బ్రెయిలీ లిపి సరదాగా అప్పటికే నేర్చుకున్నాను. తను ఇంట్రెస్ట్ చూపిస్తే అది నేర్పించాను.
హాస్టల్లో నా రూమ్మేట్ దొడ్డపనేని రవి అని ఉండే వాడు. ఇద్దరం కలిసి ఓరోజు ఇనిస్టిట్యూట్ మీదుగా మెస్‌కి వెళుతున్నాం. ఓసారి లోపలికి వెళ్లి వద్దామని గేటు తీసుకుని లోపలికి వెళ్లాం. సమయం రాత్రి 8 గంటలు.
రత్నాకర్ గారి ఆఫీస్ రూములో నీలిమా కిరణ్ కూర్చుని ఉంది. రత్నాకర్ గారు ఏదో సీరియస్‌గా మాట్లాడుతూ నా వైపు చూసి మళ్లీ తనకి ఏదో చెబుతున్నారు. అసలు ఆ టైమ్‌లో ఆ అమ్మాయి ఎందుకు అక్కడ ఉందో అర్థం కాలేదు, అప్పటికే వాళ్ల అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లిపోయి ఉండాల్సింది.
లోపలికి వెళ్లి చదువుకుంటున్న ఇతర మిత్రుల్ని అడిగాను.. “మీ ఇద్దరి గురించే రత్నాకర్ సార్ ఆ అమ్మాయికి క్లాసు తీసుకుంటున్నారు” అని బదులిచ్చారు.
అప్పటికే కొన్ని రోజులుగా నీలిమా కిరణ్కీ నాకూ రిలేషన్ అంటగడుతూ కొంతమంది చెడు ప్రచారం చేస్తున్నారు. నేను గానీ, ఆ అమ్మాయి గానీ కన్పిస్తే వెకిలిగా నవ్వే వాళ్లు. బాధేసినా ఏం చెయ్యలేక వదిలేసే వాడిని. అలాంటిది ఆరోజు రత్నాకర్ గారు నా గురించి ఆ అమ్మాయికి క్లాసు తీసుకుంటున్నారు అని వినేసరికి చాలా బాధేసింది.
మెస్‌కి భోజనానికి వెళ్తున్న వాళ్లమల్లా.. రవిని “రవీ తట్టుకోవడం నా వల్ల కావట్లేదు, డ్రింక్ చేస్తాను” అని దగ్గరలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్‌కి తీసుకెళ్లి రెండు బీర్లు తాగేశాను. రవిని వెళ్లి భోజనం చేసి రమ్మని నేను హాస్టల్ రూమ్‌కి వెళ్లాను. అది పేరుకు హాస్టల్ అనే గానీ మాకు హాస్టల్లో ఖాళీ లేక ఓ ఇంట్లో పైన పెంట్ హౌస్ కేటాయించారు. నేనూ, రవి మాత్రమే ఉంటాం.
అప్పటికే బీర్లు తాగిన నేను తినకుండా రూముకెళ్తూ ఓ 20 స్లీపింగ్ పిల్స్ తీసుకుని రూముకెళ్లి వేసుకున్నాను. అప్పటికే నేను ఆ హాబిట్ మానేసి ఉండడం వల్ల గతంలో రోజుకి ముప్ఫై స్లీపింగ్ పిల్స్ వేసుకోగలిగిన వాడిని కూడా ఆ రెసిస్టెన్స్ తగ్గిపోయింది, అదీగాక ఒకేసారి ఇరవై వేసుకోవడం అదే మొదటిసారి! దానికి తోడు మందు తాగి ఉన్నాను. రవి భోజనం చేసి రూముకి వచ్చేసరికి అచేతనంగా పడి ఉన్నాను. నోట్లో నుండి నురుగు వస్తోందట. నా ప్రాణం నా నుండి విడిపోతున్న భావన నాకు ఇప్పటికీ గుర్తే.
నన్ను తీసుకెళ్లడానికి బలం చాలక, రవి బయట ఎవర్నో పిలిచి ఓ రెండు వందల అడుగుల దూరంలో ఉన్న ఓ చిన్న హాస్పిటల్‌కి తీసుకు వెళ్లాడు. డాక్టర్ టేబుల్ మీద పడుకోబట్టి వామిట్ చేయితే అల్లంత దూరం వామిట్ చేసుకున్నానట.
ఐదు నిముషాలు ఆలస్యం అయితే చనిపోయే వాడు అని డాక్టర్ అన్నాడట. సెలైన్ పెట్టి మరుసటి రోజు పంపించారు.
ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇనిస్టిట్యూట్‌లో నన్ను ఓ దోషిలా చూడడం మొదలుపెట్టారు. నీలిమా కిరణ్ నా మీద జాలి, ప్రేమతో అరుదుగా ఒకటి రెండుసార్లు మాట్లాడేది. అప్పటికీ మా ఇద్దర్నీ టార్గెట్ చెయ్యడం అక్కడి స్టూడెంట్స్ ఆపలేదు. నాకు వేరే మార్గం లేక ఏదో పిచ్చి ఆలోచన వచ్చి ఓరోజు రత్నాకర్ గారి దగ్గరకు వెళ్లి ఎదురుగా సీట్లో కూర్చుని “నాకు లుకేమియా (బ్లడ్ క్యాన్సర్) సర్” అన్నాను. ఆ అమ్మాయి నుండి ఫోకస్ నా వైపు మళ్లించుకోవడం, ఆ అమ్మాయిని ప్రశాంతంగా బ్రతకనివ్వడం నా ఉద్దేశం. గతంలో సివిల్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు లుకేమియాపై ఓ బుక్ చదివాను అన్నాను కదా. ఆ పరిజ్ఞానం ఇక్కడ ఉపయోగపడింది.
రత్నాకర్ గారు కంగారుపడి, మరుసటి రోజు బ్లడ్ టెస్ట్‌కి ఏర్పాటు చేశారు. బ్లడ్ టెస్ట్ నార్మల్ వచ్చింది.. ఎలాంటి సెల్ డివిజన్ లేదు. ఆరోజు ఆయన నా వైపు ఓ చూపు చూశారు.. అది ఇప్పటికీ కళ్ల ముందు ఉంటుంది.
మా ఊరు మనిషిని పంపించి, మా సుబ్బారాయుడు బావ చేత నన్ను ఇనిస్టిట్యూట్ నుండి పంపించేశారు. టాపర్‌గా నిలుస్తాననుకున్న నా ICWAI అక్కడితో ఆగిపోయింది. ఇంటికెళ్లి మోటివేషన్ లేక చదవలేకపోయాను.
సిగ్గుపడండిరా మనుషుల్లారా.. మీ వెకిలితనాన్ని, మీ సంకుచితత్వాన్ని ఇతరులపైకి రుద్దకండి. నీలిమా కిరణ్కీ నాకూ ఉన్న స్నేహాన్ని అర్థం చేసుకునే మనస్సు మీకు ఉందా, చచ్చిపొండి… ఎందుకు బ్రతకడం అదీ ఆ సమయంలో నా భావాలు. ఒక మనిషిని మనిషిగా అర్థం చేసుకోలేని బ్రతుకులెందుకు? ఆలోచనల్లో వంకర బుద్ధులు పెట్టుకుని పైకి గొప్ప వాళ్లుగా చలామణి అయ్యే ప్రతీ ఒక్కడికీ ఒకటే చెబుతున్నా.. మీరు పైకి గొప్ప డ్రెస్‌లు వేసుకోవచ్చు, చాలా గొప్ప స్టేటస్‌లో ఉండొచ్చు, చుట్టూ పది మంది ఉండొచ్చు.. కానీ మీకన్నా పురుగులు చాలా నయం, పురుగుల కన్నా హీనం మీరు! నా నీలిమా కిరణ్‌ని ఎవరు తెచ్చివ్వగలరు? అది మీ వల్ల అవుతుందా? సిగ్గుపడండి..!
ఆ మధ్య ఏదో అంశం మీద ఒకడు నన్ను ట్రోల్ చేస్తుంటే ఆ క్రింద మరొకడు కామెంట్ రాశాడు.. “శ్రీధర్ ఏదో ఇప్పుడన్నీ తెలిసినట్లుు బిల్డప్ ఇస్తున్నాడు గానీ, అప్పట్లో అమీర్‌పేటలో సెల్‌ఫోన్ రిపేర్లు చేసుకుంటూ ఉండే వాడు, ఓసారి నేనూ వెళ్లాను” అంటూ కామెంట్ చదివాక వీళ్లని చూసి అసహ్యమేసింది. నా జీవితంలో నేను ఎప్పుడూ సెల్‌ఫోన్ రిపేర్లు చెయ్యలేదు. కానీ ఇలాంటి కుక్కలు అన్నీ చూసి వచ్చినట్లు కధలు అల్లుతాయి. నీలిమా కిరణ్ నేనూ దూరం కావడానికైనా, ఈరోజు కష్టపడి ఎదిగిన వ్యక్తులను బజారుకు లాగడానికి ప్రయత్నించేదైనా మీలాంటి కుక్కలే! వాటికన్నా కొంత విశ్వాసం ఉంటుంది, మీ జన్మ ఈ భూమికి భారం! మీ బ్రతుకు మీరు బ్రతకండి. ఇతరుల జీవితాల్లోకి ఎందుకు దూరతారు?
నా పెళ్లి కుదిరినప్పుడు నీలిమా కిరణ్‌ని ఇన్వైట్ చేద్దామని తెనాలిలో వాళ్ల అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లాను. తాళం వేసి ఉంది. తెలిసిన అందర్నీ పిచ్చివాడిలా ఆరా తీశాను. ఫలితం లేదు. మౌనంగా అలా వెనక్కి వచ్చేశాను.
కొందరు మనుషుల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయో ఇది ఉదాహరణ. ఇలాంటి మనుషులు లేకపోతే నేను ICWAI టాపర్‌గా నిలిచే వాడిని. నా కెరీర్ వేరేలా ఉండేది.
చాలా ఏళ్ల తర్వాత మొన్న 2020లో రత్నాకర్ సార్, ఆయర స్టూడెంట్స్ ఓ గూగుల్ మీట్ మీటింగ్ ప్లాన్ చేశారు. అదే ఇనిస్టిట్యూట్‌లో నా తర్వాత చదివిన ఓ తమ్ముడు కళ్యాణ్ నా నెంబర్ తీసుకుని కాల్ చేసి మీటింగ్‌కి ఆహ్వానించారు. రత్నాకర్ సార్, వారి వైఫ్ యుఎస్‌లో సెటిల్ అయ్యారు. ఆరోజు నేను మాట్లాడుతుంటే “శ్రీధర్ నిన్ను రోజూ టివిలో చూస్తుంటాను” అంటూ ఆయనా, వారి వైఫ్ గౌరవంగా చూడడం నా చిన్నప్పటి జ్ఞాపకాలకు ఓ ఊరట. పడిపోయిన వాడిని నిలిచాను, నా కష్టంతో, సంకల్ప బలంతో!
- Sridhar Nallamothu