చెన్నై సూపర్ హిట్ ఆఫీసు వెనుక భాగంలో ప్రింటింగ్ అయ్యాక వేస్ట్ పేపర్స్ పెట్టడానికీ, లంచ్ చెయ్యడానికి ఓ గది ఉండేది. మెయిన్ ఆఫీసుకి నాలుగడుగుల దూరంలో ఇనుప మెట్లెక్కి అందులోకి వెళ్లాలి.
ముందే జయా మేడమ్ చెప్పినట్లుంది.. రాంబాబు అనే ఒకతను ఆ గదికి తీసుకెళ్లాడు. ఆ రాంబాబు ఆ తర్వాత నా జీవితంలో ముఖ్య భాగం అవుతాడని అప్పుడు తెలీదు.
చుట్టూ మేగజైన్లు, ప్రింటింగ్ చెయ్యగా మిగిలిపోయిన పేపర్లూ చెల్లాచెదురుగా సర్థి ఉండగా ఓ చిన్న పరుపు నేలపై వేసి ఉంది. “సూట్ కేసు అక్కడ పెట్టుకుని, ఇక్కడ నువ్వు పడుకోవచ్చు” అని రాంబాబు చెబితే ఆ హ్యాండిల్ విరిగిపోయిన సూట్కేసుని ఓ మూలన పుస్తకాల కట్టల మధ్య పెట్టాను.
“మొహం కడుక్కో టిఫిన్‌కి వెళదాం” అన్నాడు రాంబాబు. సరేనని రెడీ అయి ఆఫీసుకి కొద్ది దూరంలో ఉండే ఓ టిఫిన్ సెంటర్‌కి వెళ్లాం. బిల్ రాంబాబు కట్టాడు. రేపు నేను కట్టాలి కదా, రేపు ఒకరిద్దరు అదనంగా వస్తే ఖర్చులకు డబ్బులు తగ్గిపోతాయి కదా అనే భయం పట్టుకుంది. సరేలే అని స్థిమితపడి, మళ్లీ ఆఫీసుకు వచ్చాం.
అలా బ్రేక్‌ఫాస్ట్ చేసి ఆఫీసుకి వచ్చామో లేదో మరో పది నిముషాల్లో సరిగ్గా 9.30కి జయా మేడమ్ వచ్చారు. అప్పటి దాకా ఎడిటోరియల్ రూమ్‌లో కూర్చున్న నన్ను రాంబాబు జయా మేడమ్ దగ్గరకు వెంట తీసుకెళ్లాడు.
“ఎప్పుడొచ్చావు శ్రీధర్, నువ్వు బాగా వర్క్ చేస్తే నీకు ఫ్యూచర్ ఉంటుంది” అని చెప్పి,
“రాంబాబూ, ప్రూఫ్ రీడింగ్ అప్పజెప్పు శ్రీధర్‌కి” అని చెప్పారామె. మళ్లీ ఎడిటోరియల్ రూమ్‌లోకి ఎంటర్ అయ్యాం.
నాకు ఓ రెడ్ కలర్ పెన్ను ఇచ్చి.. టైప్ చెయ్యబడిన ఓ పది పేజీలు ఇచ్చి, ఎక్కడైనా అక్షరాలు తప్పు పడితే వాటిని రౌండ్ చుట్టాలనీ, వాటిపైన కరెక్ట్ పదం రాయాలనీ, ఆశ్చర్యార్థకం గానీ, ఇతర ప్రత్యేక చిహ్నాలు గానీ రావాల్సి వస్తే వాటిని జతచెయ్యాలనీ ఒక్క తప్పూ లేకుండా చూడాలని ఓ పేరా చేసి చూపించారు.
జీవితంలో మొదటిసారి మీడియా పని మొదలుపెట్టాను. నేను కరెక్షన్ చేసిన ప్రతీ పేజీని మొదటి రోజు మేడమ్ చూసి “బాగా చేస్తున్నావు, కీపిటప్” అని మెచ్చుకుని వెళ్లారు. అప్పటి నుండి ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇతరులు రాసిన ఆర్టికల్స్ సరిచెయ్యడమే నా పని. ఇంతకీ ముఖ్యమైన విషయం చెప్పలేదు. నన్ను క్రేజీ వరల్డ్ పత్రికకు సబ్-ఎడిటర్‌గా పిలిపించినా, బిఎ రాజు గారు, జయా మేడమ్ నడుపుతున్న సూపర్ హిట్ పత్రిక పనులూ నాకు అప్పజెప్పేవారు. అన్నీ సినిమాలకు సంబంధించిన ఇతరులు రాసిన ఆర్టికల్సే కరెక్ట్ చేసే వాడిని.
ఆఫీసులో చేరిన రెండో రోజు.. మేడమ్ రూమ్‌కి పిలిచి, కోదండపాణి రికార్డింగ్ థియేటర్లో ప్రెస్ మీట్ జరుగుతోంది, నాగేశ్వరరావుతో కలిసి వెళ్లు” అన్నారు. ఫొటోగ్రాఫర్ బి. నాగేశ్వరరావు భుజానికి కెమెరా బ్యాగ్ తగిలించుకుని బస్‌లో కోదండపాణి స్టూడియోకి తీసుకెళ్లాడు. అక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లాంటి అన్ని పత్రికల ఫిల్మ్ జర్నలిస్టులు ఉన్నారు. ప్రెస్ మీట్ మొదలైంది.
సీనియర్ దర్శకులు క్రాంతికుమార్ గారు దివంగత హీరోయిన్ సౌందర్య ప్రధాన పాత్రలో దర్శకత్వం వహిస్తున్న “అరుంధతి” సినిమా అది! క్రాంతి కుమార్ గారు మొహంలో ఎక్కడా నవ్వు లేకుండా సీరియస్‌గా సినిమా గురించి వివరిస్తున్నారు. ఆయన బాడీ లాంగ్వేజ్, చెప్పే విధానం చూస్తే మొదటిసారి ప్రెస్ మీట్‌కి వెళ్లిన నాకు భయమేసింది.
ఆయన మాట్లాడుకుంటూ వెళుతుంటే ఒక్క ముక్క పొల్లు పోకుండా వేగంగా రాశాను. ప్రెస్ మీట్ అయ్యాక ఆ సినిమా PRO సరిగా గుర్తు లేదు కానీ, పసుపులేటి రామారావు గారనుకుంటా అందరికీ కవర్లు ఇస్తూ, నా చేతికి, ఫొటోగ్రాఫర్ నాగేశ్వరరావు చేతికీ ఓ కవర్ ఇచ్చాడు. అదేంటో అర్థం కాలేదు. స్టూడియో నుండి బయటకు బస్టాఫ్ వరకూ నడిచి వస్తుంటే నాగేశ్వరరావు కవర్ తీసి లోపల రెండు వంద రూపాయల నోట్లు జేబులో పెట్టుకుంటూ “నీ కవర్లో కూడా డబ్బులు ఉంటాయి, తీసుకో” అని చెప్పాడు.
సినిమా కవరేజీలకు వెళితే డబ్బులు కవర్లో పెట్టి ఇస్తారని అప్పుడు అర్థమైంది. జయా మేడమ్ నాకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు జీతం 1600 మాత్రమే ఇవ్వడానికి కారణం అప్పుడు అర్థమైంది. ఆ తర్వాత రకరకాల ప్రెస్ మీట్లకి వెళ్లే కొద్దీ ఏ బేనర్, ఏ నిర్మాత అయితే ఎంత కవర్ రావొచ్చో ఓ లెక్క ఉండేది. మరీ డబ్బింగ్ సినిమాలు, చిన్న సినిమాలు అయితే రెండొండలు ఇచ్చే వారు. ఒక మాదిరి సినిమాలైతే మూడొందలు. చాలా పెద్ద బడ్జెట్ సినిమాలైతే ఐదొందలు కవర్లో పెట్టి ఇచ్చే వారు. మోహన్ బాబు నిర్మించే ఏ సినిమాకెళ్లినా అత్యధికంగా ఏడొందలు కవర్లో పెట్టి ఇచ్చేవారు.
సరే మొదటిసారి క్రాంతి కుమార్ గారి అరుంధతి ప్రెస్ మీట్ నుండి ఆఫీసుకి వచ్చి దాని గురించి రాశాను. వాస్తవానికి ప్రతీ ప్రెస్ మీట్లో పాత్రికేయుల కోసం PRO ఆ సినిమా గురించి ముందే ముఖ్యమైన సమాచారం రాసి ఆ ప్రింటౌట్ ప్రతీ జర్నలిస్టుకీ ఇస్తారు. 90 శాతం మంది జర్నలిస్టులు ఏం కష్టపడదాంలే అని ఆ సమాచారాన్నే ప్రచురణకి ఇస్తారు. కానీ నేను స్వయంగా నా మాటలతో ఆ సినిమా గురించి రాశాను. జయా మేడమ్ ఇంప్రెస్ అయ్యారు.
పేపర్, బుక్స్ కట్టలతో కూడిన రూమ్ కమ్ గోడౌన్ ఉంది కదా.. నా గది, ప్రతీ రోజూ ఆఫీస్ అయ్యాక, ఆదివారాలైతే ఉదయం నుండి సాయంత్రం వరకూ చిత్తు కాగితాల బైండింగ్ పట్టుకుని కూర్చునే వాడిని. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా రాసుకోవడానికి అన్ని పేపర్లు ఇప్పటికీ గుర్తొస్తే ఆ వైబ్రేషనే వేరు. ఏమైనా రాసుకోవచ్చు, ఎంతైనా రాసుకోవచ్చు అన్న సంతోషం.
ఈనాడు పేపర్ ఎడిటోరియల్ పేజీ ముందు పెట్టుకునే వాడిని. అందులో “కరతలామలకం, ద్విగుణీకృతం, శోచనీయం” వంటి క్లిష్టమైన పదాలను ఓ లిస్టుగా రాసుకునే వాడిని. ఆ పదాలను ఉపయోగిస్తూ నేను ఓ వ్యాసం రాయాలి అనే ప్రాక్టీస్ పెట్టుకునే వాడిని. “ద్విగుణీకృత ఉత్సాహంతో ఆ వ్యక్తి పనిచేస్తున్నాడు” ఇలా వాక్యాలు నిర్మించుకునే వాడిని. అదే ఈనాడు ఎడిటోరియల్ పేజీకి ఇప్పుడు నేను ఆర్టికల్స్ రాయగలుగుతున్నాను. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం.
అలాగే పేపర్లో చదివిన ప్రతీ వార్తనీ నేను స్వయంగా రాయడం మరో ప్రాక్టీస్. ఇవన్నీ ఎవరూ చెప్పలేదు, నాకు నేను తయారు చేసుకున్న ట్రైనింగ్ మాడ్యూళ్లు. ఎలాగైనా భాష మీదా, భావ వ్యక్తీకరణ మీద పట్టు సాధించాలి అనే సంకల్పం బలంగా ఉండేది. నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశాక వచ్చిన ఓ అరుదైన అవకాశం. ఈ రంగంలో పాతుకుపోవాలి అనే పట్టుదల. అందుకే రాత్రింబవళ్లు ఎంత కష్టపడ్డానో మాటల్లో చెప్పలేను.
పేపర్లో చదివిన ప్రతీ ఆర్టికల్కీ నేను కనీసం ఐదు వెర్షన్లు రాయాలని రూల్ పెట్టుకున్నాను. ఉదా.కి.. ఇలా ఉంటాయి.
“ప్రతీ మనిషిలో సేవా దృక్పధం ఉండాలి” అనే అర్థంతో ఓ వ్యాసం ఉంది అనుకోండి..
“సేవా దృక్పధం కలిగిన మనుషులు ఈ సమాజానికి చాలా అవసరం”
“సేవ ద్వారా మాత్రమే మనిషి భగవంతుడు అవుతాడు”.
“ఈ సమాజం సేవ చేసే వాళ్ల కోసం పరితపిస్తోంది.. వాళ్లే సమాజానికి మూలస్థంబాలు” ఇలా ప్రతీ అంశంపై సినిమా రచయితలు ఎలాగైతే రకరకాల వెర్షన్లలో కధలు రాసుకుంటారో అలా రాసేవాడిని.
అప్పటికి చాలామంది భాష గ్రాంధికంగా ఉండేది. ఇప్పటికీ చాలామందిలో అది చూస్తున్నాను. ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి సూటిగా అర్థమయ్యేలా, భాషా గాంభీర్యాన్ని ప్రదర్శించకుండా, మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడినంత సరళంగా ఎలా రాయాలి అన్న ఆలోచన కలిగింది. దాని గురించి విపరీతంగా ప్రాక్టీస్ చేశాను. దాంతో మిగతా జర్నలిస్టులకి నా రాతలకీ స్పష్టమైన తేడా మొదలైంది. నేను రాసేది ఎదురుగా నిలబడి మాట్లాడినట్లు నేరుగా గుండెల్లోకి హత్తుకు పోతోంది అని చాలామంది భుజాలు తట్టడం మొదలుపెట్టారు. దాంతో నాపై నాకు ధైర్యం వచ్చింది. నాకంటూ అరుదైన రచనా శైలి ఏర్పడింది.
గతంలో చెప్పినట్లు నేను మొద్దుని. అంతగా తెలివితేటలు ఉండవు. మరి జీవితంలో ఎలా ఎదగాలి అన్న ఆరాటం వచ్చినప్పుడు ఒకటే నమ్ముకున్నాను.. గొడ్డులా రాత్రింబవళ్లు కష్టపడాలి అని! ఇన్నేళ్ల తర్వాత ఇప్పటికీ రోజుకి 15 గంటలు నేను వర్క్ చేస్తాను. ఉదయం 4.30కి లేస్తే 5.30 నుండి రాత్రి 9 గంటల వరకూ వర్క్ చేస్తూనే ఉంటాను, కొత్తవి నేర్చుకుంటూనే ఉంటాను. జీవితం నాకు చాలా నేర్పింది. జీవితానికి, భగవంతుడికి ప్రణామాలు.
మిగతా మరో భాగంలో!
- Nallamothu Sridhar