అప్పటికింకా సెల్ ఫోన్స్ లేకపోవటం వలన, ఏదైనా సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్, అవుట్ డోర్ షూటింగ్ ఉంటే రాజు గారి దగ్గరకో, జయా మేడమ్ దగ్గరకే ల్యాండ్ లైన్ ఫోన్ కి సమాచారం వచ్చేది. ఆ సమాచారాన్ని ఎడిటోరియల్ రూమ్‌లో కూర్చుని ఉన్న మాకు చేరవేసేవారు. ఎవరు వెళ్లాలో వారికి ఆ సమాచారం చెప్పే వారు.
సూపర్ హిట్ లో జాయిన్ అయిన నాలుగు రోజులకే జయా మేడమ్‌కి నా రచనా శైలి మీద పూర్తి నమ్మకం కలిగింది. అందుకే అధికశాతం ప్రెస్మీట్లకి నన్ను వెళ్లమనేది. నాతోపాటు బి.ఎస్. రావు అనే ఓ మరో మిత్రుడు మాత్రమే చెన్నై ఆఫీసులో ఉండే వాడు. తను అప్పటికే చాలా కాలంగా పని చేస్తున్నాడు. కానీ సృజనాత్మకంగా రాయటం రాదు.
ఎడిటోరియల్ రూమ్‌లో ఎదురు ఎదురుగా కూర్చుని రైటింగ్ ప్యాడ్ పెట్టుకుని ఏదో రాసుకోవడమో, కరెక్షన్ చేసుకోవడమో చేస్తున్న మాకు మేడమ్ రూమ్ నుండి ఎవరో ఒకరు వచ్చి “శ్రీధర్ విజయా గార్డెన్స్‌లో ఫలానా సినిమా షూటింగ్ జరుగుతోంది, మేడమ్ నిన్ను వెళ్లమన్నారు” అని చెబుతుంటే నా ఎదురుగా కూర్చున్న మిత్రుడు బి.ఎస్. రావు మొహంలో హావభావాలు ఇప్పటికీ నాకు కళ్లెదుట ఉంటాయి. క్రింద పెదవిని లోపలికి లాక్కుని ఓర కంట నా వైపు కోపంగా చూస్తూ ఓ రకమైన అభద్రతా భావానికి లోనయ్యే వాడు. అతని పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు, ఇంకా చెప్పాలంటే ప్రేమగా ఉండే వాడిని. కానీ నేనేం చెయ్యలేని పరిస్థితి, నేనూ కెరియర్లో ఎదగాలి కదా!
ఒకటి గుర్తుపెట్టుకోండి.. వర్క్ ప్లేస్‌లో మనమంటే పడని వాళ్లు ఉంటారు. లేదా మనం ఉన్న ప్రొఫెషన్లో మనం ఎదుగుతుంటే అసూయ పడే వాళ్లూ ఉంటారు. వాళ్ల పట్ల తిరిగి ద్వేషం కలిగి ఉండాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి. మీ హృదయంలో ఉన్న స్వచ్ఛత ఎప్పటికైనా వారికి అర్థమవుతుంది. అర్థం కాకపోయినా నష్టం లేదు. మీరు మాత్రం స్వచ్ఛంగా ఉండండి.
సరిగ్గా అలాంటి ఓ సంఘటన గురించి ఇక్కడ ప్రస్తావించాలి. నాలుగేళ్ల క్రితం ఎన్ టివిలో టెక్నాలజీ వల్ల పిల్లల మనస్సుపై పడుతున్న ప్రభావంపై ప్రజెంటర్ దేవి గారితో కూర్చుని లైవ్ చేస్తున్నాను. నాతో పాటు ఒక ప్రముఖ సైకాలజిస్ట్ నా పక్క ఛైర్లో ఉన్నారు. ఆయన పేరు అప్పటివరకు వినటమే తప్పించి పరిచయం లేదు. ఆయన నేను కేవల టెక్నాలజీ గురించి మాట్లాడి వదిలేస్తాను అనుకున్నారు. కానీ నేను బ్రెయిన్లో గ్రే మేటర్, ఎమోషన్స్ వంటి అంశాలను కూడా టచ్ చెయ్యడంతో ఆయన మొహంలో రంగులు మారిపోయాయి. అప్పటివరకు నాతో ప్రశాంతంగా ఉన్న వ్యక్తుల్లా నేను చెప్పిన విషయాలను ఖండించడం మొదలుపెట్టారు. సరే నేను చూస్తూ ఉన్నాను. కారణం ఏ మనిషీ పుట్టుకతో సైకాలజిస్ట్ అవలేరు, టెక్నికల్ ఎక్స్పర్ట్ అవలేరు, ఆసక్తి కొద్దీ ఎవరు దేన్నయినా నేర్చుకోవచ్చు. మాట్లాడవచ్చు అన్నది నా భావన. ఆయన ప్రొఫెషనల్ జెలసీ ఫీలవుతున్నారని అర్థమైంది.
సరే డిబేట్ అయి బయటకు వచ్చాక, స్నేహపూర్వకంగా ఆప్యాయంగా నవ్వుతూ పలకరించి ఆయన నెంబర్ తీసుకుని సేవ్ చేసుకుని కార్లో రిటర్న్ వెళ్లేటప్పుడు ” మిమ్ములను కలవటం సంతోషం సర్” అన్నాను. లోపల ఎలా ఉన్నా ఆయనా అలాగే స్పందించారు. అక్కడితో ఆ విషయం అయిపోయింది అనుకున్నాను.
కర్నూలులో ఇంపాక్ట్ జరుగుతుంటే మిత్రులు గంపా నాగేశ్వరరావు గారి ఆహ్వానం మేరకు వెళ్లి బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అనే టాపిక్ మీద విద్యార్థులకు సెషన్ ఇచ్చాను. వాస్తవానికి ఆ టాపిక్‌కి మైండ్ ప్రోగ్రామింగ్ అని పేరు పెట్టాల్సి ఉంది. అయినా బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అని ఓ కారణంతో పెట్టాను.
సెషన్ అయిపోయి దాని రికార్డింగ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఓరోజు ఓ మిత్రులు కాల్ చేసి “ఫలానా సైకాలజిస్ట్ మీ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ సెషన్‌ని విమర్శిస్తూ, తెలిసీ తెలియని వాళ్లంతా బ్రెయిన్ గురించి మాట్లాడేస్తున్నారు” అని రాశారు సర్ అని ఆయన పేరు చెప్పారు. ఆ సైకాలజిస్ట్ అప్పటికి నా ఫేస్బుక్ ఫ్రెండ్ లిస్టులో ఉన్నారు. ఆయన పోస్టు చదివాను.
నేను సెషన్లో ఓ చోట మన బ్రెయిన్ పవర్ 20 శాతం మాత్రమే వాడుకుంటామని చెప్పి ఉన్నానట, బ్రెయిన్ వేరు, మైండ్ వేరు రెండింటికీ తేడా తెలీని వ్యక్తిని నేను” అన్నట్లు నన్ను చులకనగా చిత్రీకరించారు.
నేను మైండ్ అనే పదానికి బదులు బ్రెయిన్ అనే పదం వాడడానికి ఓ బలమైన కారణం ఉంది. మెంటల్ ఎనర్జీ గురించి అధికశాతం ఆ సెషన్లో వివరించాను. ఒకటికి పది సార్లు మెంటల్ ఎనర్జీ అనే పదం వాడాల్సి ఉంటుంది. నేను సెషన్ ఇస్తున్నది ఐదొందల మంది కాలేజ్ విద్యార్థులకి! మెంటల్ మెంటల్ అనే పదం ఒకటికి పదిసార్లు వాడితే వారు టాపిక్ నుండి డిస్కనెక్ట్ అయి వాళ్లలో వాళ్లు కామెడీ చేసుకునే అవకాశముంది. దీని వల్ల విలువైన టాపిక్ వారి మైండ్‌లో రిజిస్టర్ అవదు. అందుకే అలా మైండ్ ప్రోగ్రామింగ్ అనే పదానికి బదులు బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అనీ, 20 శాతం మెంటల్ ఎనర్జీని వాడుకుంటాం అనే వాక్యానికి బదులు 20 శాతం బ్రెయిన్ ఎనర్జీ వాడుకుంటాం అనే వాక్యాన్నీ వాడాను.
నాకు ఏది ఉన్నా నేరుగా ఫోన్ చేసి తేల్చుకోవడం అలవాటు. ఆయనకి కాల్ చేసి.. “సర్ మీ పోస్టు చూశాను, బ్రెయిన్ అని వాడడం వెనుక నా ఉద్దేశం ఇది” అని వివరించాను. నేను అలా నేరుగా కాల్ చేయడం, నా గురించి అలా తప్పుగా రాసినా నేను ప్రేమగా మాట్లాడడం ఆయన ఊహించలేదు. సరే టాపిక్ అక్కడితో ముగిసింది అనుకున్నాను. ముగియలేదు.
ఆ మధ్య ఓ రాజకీయ ప్రాధాన్యం ఉన్న విషయంలో ఎవర్నీ తప్పుగా ధూషించకుండా నా అభిప్రాయాన్ని నా వాల్లో రాసుకున్నాను. ఆ ఆర్టికల్‌ని ఓ ప్రముఖ ఆన్లైన్ పోర్టల్ “ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు నల్లమోతు శ్రీధర్ ఇలా అన్నారు” అని వారి సైట్లో పబ్లిక్ చేసుకున్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు అనే పదాన్ని వారికి నా గురించి అన్పించినది వాళ్లు రాసుకున్నారు. దీనికి నేనేం చెయ్యగలను? అదే ఆర్టికల్‌ని చాలా సైట్లు నన్ను అలా “వ్యక్తిత్వ వికాస నిపుణులు” అని ప్రస్తావిస్తూ వాళ్ల సైట్లలో రాసుకున్నాయి.
నన్ను ఇలా పోర్టళ్లు వ్యక్తిత్వ వికాస నిపుణులు అనడం ఆయనకి మింగుడు పడలేదు. ప్రొఫెషనల్ జెలసీ. ఒకటి గుర్తు పెట్టుకోండి. ఎదగలేని వాడు ఇతరులపై పడి ఏడుస్తుంటాడు. మన స్వశక్తితో మనం ఎదగాలి గానీ ఇతరుల్ని దిగజార్చే ప్రయత్నం చెయ్యడం మిమ్మల్నే సమాజంలో చులకన చేస్తుంది.
“నల్లమోతు శ్రీధర్‌కి వ్యక్తిత్వం వికాసం గురించి మీనింగ్ తెలుసా, ఫాల్స్ ఇమేజ్‌లో బ్రతికేస్తున్నాడు” అనే టైటిల్లో ఏదో యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. నా ఫాలోయర్ ఎవరో “మీ గురించి ఫలానా ఆయన ఇలా అంటున్నారు సర్, చాలా బాధేసింది” అని లింక్ షేర్ చేస్తే థంబ్ నెయిల్ చూసి, ఆయన వ్యక్తిత్వం అల్రెడీ తెలిసిందే కాబట్టి నవ్వుకుని వదిలేశాను. ఆ వీడియో ఇప్పటి వరకూ నేను చూడలేదు. ఆయన అభిప్రాయానికి నేను ఇచ్చిన గౌరవం పూచికపుల్లలా ఇదీ అన్నది మీకు అర్థమై ఉంటుంది.
రెండు రోజుల తర్వాత అదే యూట్యూబ్ ఛానెల్ వాళ్లు నాకు కాల్ చేసి.. మా ఛానెల్లో మీ గురించి ఫలానా ఆయన ఇలా అన్నారు, మీరేమంటారో మీ ఇంటర్వ్యూ కావాలి అని అడిగారు. “నేను నవ్వి, మీకు టెక్నాలజీ గానీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ గానీ ఏదైనా టాపిక్ మీద ఇంటర్వ్యూ కావాలంటే ఇస్తాను, ఆయనెవరో అంటే నేను బదులిచ్చుకునే స్థితిలో నేను లేను, నాకు చాలా పనులు ఉన్నాయి” అనగానే, ఆ అమ్మాయి “ఓ టెక్నికల్ టాపిక్ మీద షూటింగ్ ప్లాన్ చేసి రేపు కాల్ చేస్తాను సర్” అని పెట్టేసింది.
ఇక్కడ ఆ సైకాలజిస్ట్ కమ్ వ్యక్తిత్వ వికాస నిపుణుడికైనా, నన్ను చూసి ప్రొఫెషనల్ జెలసీ చూపించే ఇతరులకైనా ఒకటే చెబుతున్నా.. నా లైఫ్ స్టోరీ రాయడానికి మీరే స్ఫూర్తి! నా జీవితం గురించి మీకేం తెలుసుని మీరు అంతగా ఫీలవుతున్నారు? ఒక్కసారి నేను పుట్టినప్పటి నుండి ఈ దశకి రావడం వెనుక నా లైఫ్ మీరు లీడ్ చేసి అప్పుడు మాట్లాడండి. ఊరికే రెండు డిగ్రీలు చేసి, సర్టిఫికెట్లు పొంది, కనీసం మీ వ్యక్తిత్వంలో అన్ కండిషనల్ లవ్ లాంటి ఓ చిన్న భావన కూడా లేని మీ సంస్కారం ఎక్కడా.. నిరంతరం నన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించే నా సంస్కారం ఎక్కడా? ఈ క్షణం మీరు నా ఎదురైనా ప్రేమగా పలకరిస్తాను గానీ నాలో ఏమీ ఉండదు. సో నా మీద మెంటల్ ఎనర్జీస్ వృధా చేసుకోవడం మానేసి మీ పనులు మీరు చక్కగా చూసుకోండి.. మహా అయితే మనం ఇంకో 20, 30, 40 ఏళ్లు బ్రతుకుతాం, చనిపోయే లోపు కాస్త ప్రశాంతంగా అందర్నీ సంతోషంగా పెట్టి పోదాం.
వ్యక్తిత్వ వికాసం అని పేరు చెప్పుకుని ఇతరుల్ని ద్వేషించే స్వభావం కలిగి ఉంటే ఇతరులకి చెప్పే అర్హత మీకేం వస్తుంది. ముందు మీ వ్యక్తిత్వాలను సంస్కరించుకోండి. అభం శుభం తెలీని విద్యార్థుల ముందు బ్లేజర్లు వేసుకుని ఫోజులు కొట్టే ముందు!
సూపర్ హిట్లో మిత్రుడు బిఎస్ రావుకీ, ఇప్పటి ప్రముఖ సైకాలజిస్ట్, ఇతరులకి గానీ ఇదే సమస్య. తమ అవకాశాలు తగ్గిపోతాయనీ, ఆ రంగంలో తామే రాజులం అనే ఓ అహంకారం. ఏ రంగంలోకి అయినా ఎవరైనా రావచ్చు, టాలెంట్ ఉన్న వాళ్లు నిలదొక్కుకుంటారు. ఈ భూమీ, ఈ గాలీ ఈ అవకాశాలూ నీ అబ్బ సొత్తా? ఎదిగే వాడిని భుజం తట్టి పెద్ద మనస్సుని నిరూపించుకోవాలి గానీ వెనక్కి లాగితే ఎలా..?
కొంతమంది ఉంటారు నాబోటి వాళ్లు.. లాగితే పడిపోరు, రెట్టించిన ఉత్సాహంతో ఎదుగుతారు. ఇది చదువుతున్న మిత్రులకి గమనిక! మీరు ఐ.టి. జాబ్ చేస్తున్నా, ఇంకో రంగంలో ఉన్నా ఇలాంటి చెత్త బ్యాచ్ మీ చుట్టూ ఉండే ఉంటారు. వాళ్లని చూసి జాలిపడండి తప్పించి బాధతో కుంగిపోకండి. చేతకాని వాడు నాలుగు మాటలు అని నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తాడు.. చేతనైన వాడు నీలా రాత్రింబవళ్లు కష్టపడతాడు. నీకు నువ్వే నిర్ణయించుకో.. నువ్వు జీవితాన్ని దమ్ముగా, ధైర్యంగా కష్టపడి ఎదిగే చేతనైన వాడివా, ఇతరులపై పడి ఏడ్చే చేతగాని వాడివా అన్నది!
మరో భాగంతో మళ్లీ కలుస్తాను.
- Sridhar Nallamothu