

సూపర్ హిట్లో జాయిన్ అయిన వారం రోజులకి ఓరోజు డెస్క్ ముందు కూర్చుని ఏదో రాసుకుంటుండగా, జయా మేడమ్ పిలిచారు.
“రాజు గారు బిజీగా ఉన్నారు. బాలయ్య పవిత్ర ప్రేమ సినిమా ఊటీలో ఔట్‌డోర్ ఉంది. ఈవెనింగ్ ట్రైన్ ఉంది. ఆ టైమ్‌కి రాజు గారు రాకపోతే నువ్వు వెళ్లాల్సి ఉంటుంది. టికెట్ బుక్ చేయిస్తున్నాను” అన్నారు. అంతా బావుంటే అది నాకు మొట్టమొదటి ఔట్‌డోర్ షూటింగ్ కవరేజ్ అవుతుంది. అదీ ఊటీ! లోపల చాలా సంతోషంగా ఉంది, ఓ పక్క బిఎ రాజు గారు ఆ టైమ్‌కి వచ్చేస్తారేమోనని భయమూ కూడా! ఆ రోజంతా ఎలా గడిపానో నాకే తెలీదు.
సాయంత్రం మూడు గంటల కల్లా నేనూ, ఫొటోగ్రాఫర్ బి.నాగేశ్వరరావు చెన్నై సెంట్రల్‌కి వెళ్లాం. నాలుగు గంటలకి ట్రైన్. ఆ సినిమాకి PRO ఉమామహేశ్వరరావు గారు స్టేషన్లో రిసీవ్ చేసుకున్నారు. అప్పటికి బాలయ్య పర్సనల్ PROగానూ, ఆయన సినిమాలన్నింటికీ PROగానూ ఆయన చేస్తున్నారు. ఆ తర్వాతి కాలంలో బాలయ్య PROగా మా బిఎ రాజు గారు మారిపోయారు.
సీనియర్ జర్నలిస్టులు పసుపులేటి రామారావు గారు, జగన్ గారు, ట్రేడ్ గైడ్ వెంకటేశ్వరరావు గారు, హిందూ నుండి ఎంఎల్ నరసింహం గారు కూడా లగేజ్ పట్టుకుని స్టేషన్‌కి వచ్చేశారు. లోపలికి వెళ్లి ఫస్ట్ క్లాస్ ACలో కూర్చున్నాం. నా జీవితంలో అదే మొదటిసారి ఫస్ట్ క్లాసులో ప్రయాణించడం! దాని గురించి ఆలోచించే దానికన్నా, ఏ క్షణాన రాజు గారు స్టేషన్‌కి వచ్చి నన్ను ఆఫీసుకి వెనక్కి పంపిస్తారేమోననే భయం. బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. ట్రైన్ కదలగానే ప్రాణం లేచొచ్చినట్లయింది. ఈ ఔట్‌డోర్ షూటింగ్‌కి, అదీ బాలయ్యబాబుని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాదేనన్నమాట అనే సంతృప్తి!
కోయంబత్తూరు వరకూ ట్రెయిన్. రెండు ఫస్ట్ క్లాస్ బాక్సులూ మావే. ఆ సినిమా ప్రొడక్షన్ యూనిట్ మాతో పాటు అందరికీ సరిపడా వెజ్, నాన్-వెజ్ ఫుడ్ క్యారియర్లు, ఓ నాలుగైదు మందు బాటిల్స్ ట్రైన్‌లోకి చేర్చారు. ఇతర రాత్రి పడుకోబోయే వరకూ సరదాగా కార్డ్స్ ఆడేవాళ్లు ఆడుతూ, తింటూ, తాగుతూ అలా గడిచిపోయింది. ఉదయాన్నే కోయంబత్తూరు చేరుకున్నాక కారు మాట్లాడుకుని ఊటీ బయల్దేరాం. అంత పొద్దున్నే ఊటీ కొండల్లోకి ప్రయాణం చేస్తుంటే, ఆ అనుభూతి ఇప్పుడు నా హృదయంలో అలా పదిలంగా ఉంది.
సినిమా ప్రొడక్షన్ యూనిట్ ఊటీలో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో అప్పటికే రూమ్స్ బుక్ చేశారు. ఫ్రెషప్ అయి బ్రేక్ ఫాస్ట్ చేశాక.. “నిన్నటి నుండి బాగా వర్షం పడుతోంది, ఇవ్వాళ షూటింగ్ లేదు, రూమ్‌లోనే రెస్ట్ తీసుకోండి, రేపు షూటింగ్ స్పాట్‌కి వెళదాం” అన్నారు. సరే ఆ రోజంతా ఊటీ చుట్టేశాం.
మరుసటి రోజు షూటింగ్ స్పాట్‌కి బయల్దేరాం. బాలయ్య, హీరోయిన్ రోషిణి మీద ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన స్టెప్స్‌కి ఇద్దరూ డ్యాన్స్ వేస్తున్నారు. మధ్యలో మమ్మల్ని చూసి బాలయ్య విష్ చేశారు. లంచ్ చేశాక బాలయ్యతో కూర్చున్నాం. సూపర్‌హిట్‌లో నేను జాయిన్ అయి వారం రోజులే అయినా అందరిలా పెన్నూ పేపర్ మీద రాసుకోవడం వల్ల డీటైల్స్ మిస్ అవుతాయని ఓ రోజు చెన్నై బర్మా బజార్కెళ్లి ఓ టేప్ రికార్డర్ కొనుక్కున్నాను. బాలయ్య ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వెళుతున్నారు. ఆయన కొన్నిసార్లు సీరియస్‌గా ఉంటారని అప్పటికే కొందరు చెప్పారు.
ఆయన ముందు కూర్చుంటే నాకు అలా ఏమీ అన్పించలేదు. ఇంకా చెప్పాలంటే ఆ వారం రోజుల్లో నేను వెళ్లిన ఏ షూటింగ్‌లోనూ హీరో అంత సరదాగా, జోవియల్‌గా, చిన్న పిల్లాడి మనస్థత్వంతో లేరు. ఎందుకైనా మంచిది చనువు తీసుకోవద్దని నేనూ పద్ధతిగా ప్రశ్నలు అడిగాను.
ఆ తర్వాత రోషిణి, లైలాలను ఇంటర్వ్యూ చేశాను. లైలా అయితే “నిన్ను అన్నయ్య అనేస్తున్నాను” అని చెప్పి మరీ నన్ను అన్నయ్యగా పిలవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత తనది ఏ షూటింగ్కెళ్లినా నన్ను అలాగే పిలిచేది. మొత్తం షూటింగ్ కవరేజ్ చేసుకుని చెన్నై తిరిగి వచ్చాక, అందరూ వాళ్ల వాళ్ల పేపర్లలో చిన్న చిన్న బాక్సుల మేటర్ రాస్తే నేను సెంటర్ స్ప్రెడ్ మొత్తం.. అంటే మీరు చదివే ఈనాడు లాంటి పేపర్లలో అటూ ఇటూ రెండు ఫుల్ పేజీలు బాలయ్య, లైలా, రోషిణి ఇంటర్వ్యూలు రాశాను. అంత మేటర్ రాసేసరికి చేతులు చాలా నొప్పెట్టాయి.
పెద్ద సినిమాలు, పెద్ద హీరోలను నేను హ్యాండిల్ చెయ్యగలుగుతానన్న నమ్మకం జయా మేడమ్‌కి, రాజు గారికి కలిగాయి. అంతే ఇక రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, బాలయ్య, నాగార్జున, వెంకటేష్ లాంటి పెద్ద హీరోల షూటింగులకి రాజు గారు అందుబాటులో లేకపోతే నన్ను పంపించడం మొదలుపెట్టారు. చిన్న చిన్న డబ్బింగ్ సినిమాలకీ మిత్రుడు బి.ఎస్. రావుని పంపేవారు.
బాలయ్య షూటింగ్ అంటే రాజు గారు అందుబాటులో ఉన్నా కొన్నిసార్లు నన్నే పంపేవారు. అలా బాలయ్యని చాలాసార్లు ఫేస్ చేశాను. అప్పట్లో నేను ఆయనకి బాగా గుర్తు. ఎక్కడ కన్పించినా నవ్వుతూ భుజం మీద చేయేస్తూ ఉండేవారు. అనేకమంది హీరోలను దగ్గరగా చూసి, వారితో చాలా సమయం గడిపాక ఇది పార్షియాలిటీ లేకుండా రాస్తున్న స్వీయ అనుభవం. బాలయ్యకి నిజంగానే కోపం ఎక్కువ. తన ముందు ఎక్స్‌ట్రాలు చేస్తే, ఏదైనా ఓవర్ చేస్తున్నారనిపిస్తే రియాక్ట్ అయ్యే వారు, ప్రేమగా, గౌరవంగా చూస్తే వయస్సులో చిన్నా పెద్దా లేకుండా అందరికీ గౌరవం ఇచ్చేవారు. ఇది నేను కళ్లారా చూసిన అనుభవం.
ఒకరోజు విజయా గార్డెన్స్‌లో కొత్త సినిమా ప్రారంభోత్సవం అంటే నేనూ, నాగేశ్వరరావు వెళ్లాం. కాసేపటికి రజనీకాంత్ గారు వచ్చారు. మిగతా వివరాలు తర్వాతి పార్ట్‌లో!
- Sridhar Nallamothu