రజనీకాంత్‌ని తలైవా అని తమిళ నాట ఎంతగా పడి ఛస్తారో తెలిసిందే. కానీ ఆయన ఎంత సింపుల్‌గా, స్నేహపూర్వకంగా ఉంటారో ఆయన్ని దగ్గర నుండి చూసిన వాళ్లకే తెలుసు. రజనీ గారి లాంటి వ్యక్తిత్వం చాలా అరుదుగా చూశాను.
ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త వంటి అన్ని పత్రికలు కలిసి మేము మహా అయితే ఓ ఐదారుగురం మాత్రమే తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులం చెన్నైలో ఉండే వాళ్లం. ఏదైనా ప్రెస్ మీట్ గానీ, ఔట్‌డోర్ షూటింగ్ గానీ ఉందంటే ఆ సినిమా PRO మా పత్రికాఫీసుల ల్యాండ్లైక్కి కాల్ చేసి చెప్పేవారు.
1997లో పేజర్లు వచ్చాయి. నేనూ ముచ్చటబడి ఐదువేలు పెట్టి మోటరోలా పేజర్ కొనుక్కున్నాను. వాటిలో న్యూమరిక్, ఆల్ఫా న్యూమరిక్ అనే రెండు మోడల్స్ ఉండేవి. న్యూమరిక్తో కేవలం మనకు మెసేజ్ పంపాలనుకున్న వ్యక్తి ఫోన్ నెంబర్ మాత్రమే తెలుసుకోవచ్చు. నేను ఆల్ఫా న్యూమరిక్ తీసుకున్నాను.. దానివల్ల ఓ చిన్న లైనులో మేటర్ కూడా వస్తుంది.
ఉదాహరణకి సీనియర్ జర్నలిస్టు జగన్ ఎక్కువగా డబ్బింగ్ సినిమాలకి PROగా ఉండేవారు. ఆయన దగ్గర పేజర్ ఉంటే, మా జర్నలిస్టు మిత్రులకందరికీ “Shooting at AVM 11 AM” అని మెసేజ్ అందరికీ పంపగలిగే వారు. దాన్ని చూసుకుని బయల్దేరే వాళ్లం. సెలవు రోజు షూటింగ్ ఉంటే నేను టీ-నగర్ బస్టాండ్‌కి దగ్గరలో ఉండేవాడిని. మా ఫొటోగ్రాఫర్ నాగేశ్వరరావు కొడంబాక్కంలోనే ఆఫీసుకి దగ్గరలో ఉండే వాడు. ఎవరికి వాళ్లం నేరుగా స్టూడియోకి వెళ్లేవాళ్లం.
నేను టి.నగర్ నుండి వెళుతూ దారిలో మెరుపు శ్రీకృష్ణ అని ఓ సీనియర్ జర్నలిస్టుని కలుపుకుని వెళ్లేవాడిని. ఆయన వయస్సు అప్పటికే 70 దాకా ఉంటుంది. మెరుపు అనే పత్రిక నడిపేవారు. అది పెద్ద పత్రిక కాకపోయినా, ఆయన వయస్సు దృష్ట్యా ఆయనకి పెద్దరికానికి గౌరవం ఇస్తూ, సినిమా కవరేజ్లకి వస్తే ఆయనకి కాస్త ఖర్చులకి డబ్బులు వస్తాయని పిలిచేవారు. నేను ఆయనకి సాధ్యమైనంత వరకూ కంపెనీ ఇచ్చేవాడిని, బస్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఓ సాటి మనిషిగా అండగా!
నా మకాం కొండబాకంలోని ఆఫీస్ నుండి టి.నగర్‌కి మారడానికి ఓ కారణం ఉంది. ఇంతకుముందు చెప్పినట్లు ఆఫీసులో స్టోర్ రూమ్ లాంటి దాంట్లోనే నా మకాం అని చెప్పాను కదా! ఆఫీస్ స్టాఫ్‌కి మధ్యాహ్నం ఓ రెండు క్యారేజ్‌లు తెప్పించే వారు. జయా మేడమ్ కూడా మాతో కలిసి వచ్చి భోజనం చేసేవారు. కొంతకాలానికి క్యారేజ్‌లు తెప్పించడం ఆపేశారు. బయటకెళ్లి భోజనం చేసి రమ్మనే వారు.
చేతిలో బొటాబొటిగా డబ్బులుండేవి. కొడంబాక్కం పవర్ హౌస్ దగ్గర ఆఫీసుకి దగ్గరలో మెయిన్ రోడ్ మీద ఓ చిన్న హోటల్ ఉంటే రాంబాబూ, నేనూ అక్కడికి వెళ్లే వాళ్లం. రాంబాబు మా ఆఫీసులో లేఅవుట్ ఆర్టిస్ట్. పేజ్ మొత్తాన్ని డిజైన్ చెయ్యడం అతని పని. అతని గురించి తర్వాత చెబుతాను.
ఓ చిన్న గిన్నెలో ప్లేట్ మీల్స్.. సాంబార్ బకెట్ ఇచ్చేవారు. ఇంకా కూరలేం ఉండవు. ఎప్పుడన్నా దయతలిచి ఏదైనా కూర చేసినా అది తినగలిగే స్థితిలో ఉండదు. సాంబార్ బకెట్లో సాంబార్ కన్నా 70 శాతం ఆ ముక్కలూ, ఈ ముక్కలే ఉంటాయి. అయినా ఇబ్బందేమీ లేదు… కానీ గరిటెతో సాంబారు ప్లేటులోకి పోసుకుంటే ఇంతింతలావు గుండ్రంగా పురుగులు.. దేవుడా ఇప్పటికీ అవి నా కళ్లముందే ఉన్నాయి. నాకు పురుగులంటే చాలా అలర్జీ. చిన్నప్పుడు తాతయ్యతో పొలం వెళ్లడానికీ ఈ విషయంలోనే భయపడేవాడిని. ఎక్కువ డబ్బులు పెట్టి వేరే హోటల్‌కి వెళ్లే స్థోమత లేదు. పురుగుల్ని పక్కనబెట్టి అలా అన్నంలో సాంబారు పోసుకుని తిని కడుపు నింపుకునే వాళ్లం. అలా ఒకటి రెండు రోజులు కాదు, రెండేళ్లు బ్రతికేశాం. కొన్నిసార్లు ఎక్కువ పురుగులు కన్పించి, వాటిని సపరేట్ చెయ్యడం నా వల్ల కాక సయించకపోతే ఆ పూట తిండి మానేసేవాడిని.
రాంబాబు అప్పటికే టి.నగర్లో ఓ రూమ్ తీసుకుని ఉంటున్నాడు. జయా మేడమ్ అప్పటి వరకూ ఇచ్చిన ఫ్రీ అకామిడేషన్, ఆ స్టాక్ రూమ్‌లో స్టాక్ పెట్టాలని చెప్పి ఆపేసి, “రాంబాబూ ఇక నుండి శ్రీధర్ నువ్వు రూమ్ షేర్ చేసుకోండి” అని చెప్పింది. ఉన్న ఒక సూట్‌కేసు పట్టుకుని టి.నగర్ వెళ్లాను. ఇద్దరం పడుకుంటే కాళ్లు చాపుకునేటంత రూమ్. కొద్దిగా పొడుగు ఉన్న వాళ్లు కాళ్లు ముడుచుకుని పడుకోవలసిందే. లేదంటే గోడ తగులుతుంది. ఇద్దరం పడుకోవడానికి తప్పించి కూర్చోవడానికి కూడా, ఛైర్ వేసుకోవడానికి కూడా స్థలం ఉండేది కాదు. అలా చాలా కాలం గడిపేశాం.
ఉదయం పూట ఆఫీసు దగ్గర పురుగుల సాంబారుతో నెట్టుకొచ్చే వాళ్లం కదా.. సాయంత్రానికి అక్కడికి దగ్గరలో విజయవాడకు చెందిన ఓ ఆంటీ వాళ్లు మెస్ పెడితే వెళ్లి తినేవాళ్లం. భోజనం 20 రూపాయలు. ఉదయం ఆకలి అంతా సాయంత్రం అక్కడ తీర్చుకునే వాళ్లం. ఆమెతో పాటు వాళ్ల అమ్మగారు ఉండే వారు ఇద్దరూ ఆప్యాయంగా చూసుకునే వారు. ఆకలి గురించి తెలిసిన మనుషులు. నెలకి 1800 జీతం, కవర్ల ద్వారా వచ్చే మరో వెయ్యీ, రెండు వేలు (షూటింగ్స్ ఉంటేనే డబ్బులు వస్తాయి, కొన్నిసార్లు షూటింగ్స్ ఉన్నా డబ్బులు రావు) రూమ్ రెంట్, భోజనానికి పోనూ ప్రతీ నెలా 20వ తారీఖు వచ్చేసరికి కనాకష్టంగా ఉండేది ఇద్దరికీ!
ఓ చిన్న బాత్రూమ్లో బట్టలు ఉతుక్కునే వాళ్లం. రాంబాబు ఆఫీసులోనే పనిచేసినా నేను వెళ్లేది పెద్ద పెద్ద హీరోల సినిమాల షూటింగులకి! కొన్నిసార్లు ఐరన్ చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే మేము పడుకున్న పరుపు క్రింద బట్టలు నీట్‌గా ఫోల్డ్ చేసి పెట్టేవాడిని. పొద్దుటికి కాస్త మెరుగ్గా అయ్యేవి. డబ్బులు లేని వాళ్లకి డిటర్జెంట్ సోప్ లాంటివి సగం ముక్క కూడా సగం ధరకి అమ్మేవాళ్లు. మా రూము క్రింద ఉండే షాపులో అప్పుడప్పుడు అలా సగం ముక్క డిటర్జెంట్ సోప్ కొన్న సందర్భాలూ అనేకం.
భోజనానికి 20 రూపాయలకి బదులు 25 రూపాయలు పెట్టగలిగితే టి.నగర్ బస్టాండ్ ఎదురు ఉండే శరవణ భవన్లో మరింత రుచికరమైన భోజనం తినొచ్చు. నెలలో ఒకటి రెండుసార్లు అక్కడికి వెళ్లి ఆ సన్నబియ్యం, తెల్లగా మల్లెపూలల్లా ఉండే అన్నాన్ని అపురూపంగా చూసుకుంటూ తినేవాళ్లం. అయినా అది ప్లేట్ మీల్సే కావడంతో ప్లేట్ ఖాళీ అయిపోవస్తుంటే ఓ దిగులు. ఇక సర్ధుకుని బ్రతికేయడమే.
కొన్నిసార్లు చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. కనీసం ఇరవై అయిదు రూపాయలుంటే రాంబాబూ నేనూ ఒక ప్లేట్ మీల్స్ తీసుకుని ఆ చిన్న గిన్నెలో అన్నం పంచుకుని తినేవాళ్లం. అంత ఆకలి ముందు కడుపు నిండేది కాదు. కానీ ఏం చెయ్యలేం. కొన్నిసార్లు ఆ 25 రూపాయలు కూడా ఉండేది కాదు. ఇక రాత్రంతా మంచినీళ్లు తాగి పస్తు ఉండడమే. విపరీతమైన ఆకలి మీద కడుపులో ప్రేగులు అరిచేవి, మెలిపెట్టినట్లు ఉండేది. ఓర్చుకునే వాళ్లం. తెల్లారి లేస్తే మళ్లీ ఏ పెద్ద హీరోనో ఇంటర్వ్యూ చేస్తూ పూర్తి విభిన్నమైన జీవితాన్ని చూసే వాడిని. లైఫ్ లో ఇంతకన్నా కాంట్రాక్ట్ ఎక్కడ చూడగలను? అప్పుడు అర్థమైంది జీవితం నిజంగానే ఓ సినిమా లాంటిదని!
టి-నగర్లో మేముందే బస్టాఫుకి దగ్గరలో ఓ ఎస్టిడి బూత్ ఉంటే భోజనానికి మెస్‌కి వెళ్లబోయే ముందు రాంబాబూ నేనూ అక్కడికి వెళ్లేవాళ్లం. 08594 అని చీరాల STD కోడ్ కొట్టి ఉమక్క నెంబర్ కొడుతుంటే తెలీని వైబ్రేషన్. లోపలున్న బాధల్లా దాచుకుని, “ఎలా ఉన్నావు ఉమక్కా, నేను బానే ఉన్నాను” అని సమాధానం చెప్పి, ఎక్కువసేపు ఫోన్ మాట్లాడడానికి డబ్బులు సరిపోక పెట్టేసే వాడిని. వీధి దీపాలు పెద్దగా ఉండేవి కాదు. చీకట్లో రాంబాబూ నేనూ నడుచుకుంటూ మెస్ కెళ్లినంత వరకూ ఆ చీకట్లోనే ఎవరికీ కన్పించకుండా కళ్లమ్మట నీళ్లు అలా జారిపోయేవి. మూడు పూట్లా సంతృప్తిగా తినగలిగే వాళ్లకి, జీవితం వడ్డించిన విస్తరిలా ఉన్న వారికి ఆ బాధ అర్థం కాకపోవచ్చు గానీ జీవితం నాకు చాలా నేర్పింది.
చెన్నై టి.నగర్ బస్టాండులో ఇండియన్ కేఫ్ అని ఓ హోటల్ ఉంటుంది. ఎప్పుడైనా బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి డబ్బులు ఉంటే అక్కడికి వెళ్లి సాంబార్ ఇడ్లీ చెప్పి, రెండు ఇడ్లీని ఫోర్క్‌తో ఖండఖండాలుగా చేసుకుని ఇడ్లీ మొత్తం పేస్ట్ అయ్యేలా ఆ సాంబార్‌ని పీల్చుకునేలా కలుపుకుని కడుపునిండా తింటే కొన్ని గంటల పాటు ఆకలి బాధ ఉండదు అనే ధీమా ఉండేది. ఆకలి చాలా నేర్పుతుంది.. చేతిలో పైసా డబ్బు లేకపోతే అప్పుడు జీవితం తెలిసొస్తుంది. ఒడ్డుకు కూర్చుని మనం ఎన్నయినా చెప్పొచ్చు, స్వయంగా అనుభవిస్తే ఆ జీవితానికి ఉండే విలువ డైమండ్ కన్నా అమూల్యమైనది.
మరో భాగంతో మళ్లీ కలుస్తాను.
- Sridhar Nallamothu