“ఇది నా పని, ఇది నా పని కాదు, నేను చెయ్యను” అనే టెక్కులు చాలా మంది పోతుంటారు గానీ నాకు అలా ఉండేది కాదు. ఏ పని అప్పజెప్పినా చెయ్యడమే, అప్పజెప్పని కొత్త పనులు కూడా, తెలీని విషయాలు కూడా నేర్చుకుని దూసుకుపోవడమే నా దృక్పధంలో ఉండేది.
సూపర్ హిట్ వార పత్రిక. ప్రతీ గురువారం ప్రింట్ అవుతుంది. శుక్రవారం మార్కెట్లోకి వస్తుంది. సోమ, మంగళ, బుధ వారాలు మాత్రమే ఎక్కువగా డెస్క్ వర్క్ ఉండేది. మిగతా రోజుల్లో ప్రెస్ మీట్లు లేదంటే డెస్క్‌లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చేది. నాకు అలా ఖాళీగా కూర్చోవడం నచ్చేది కాదు. అందుకే ఏదో ఒక పని సృష్టించుకునే వాడిని. అప్పటికే సినిమా ఇండస్ట్రీ సగం వరకూ హైదరాబాద్‌కి షిఫ్ట్ అయింది. హైదరాబాద్ సూపర్ హిట్ ఆఫీసులో ఆత్మీయులు, మోస్ట్ టాలెంటెడ్ వడ్డి ఓం ప్రకాష్ నారాయణ్ గారు, ఇప్పుడు ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, గతంలో ఆంధ్రప్రభ వారపత్రికను ఎడిటర్‌గా పనిచేసి, ఏబీఎన్‌లో పనిచేస్తున్న వల్లూరి రాఘవ అన్న, రాంబాబు వర్మ గారు, ఆర్.డి.ఎస్. ప్రకాష్ గారు చేస్తుండే వారు.
వాళ్లు రాసిన ఆర్టికల్స్ మాకు చెన్నై ఆఫీసులో ఉండే ఫ్యాక్స్ మెషీన్ ద్వారా పొందేవాళ్లం. వాటిని కంప్యూటర్ ఆపరేటర్లుగా పనిచేసే శ్రీనివాస్, ఇంకో ఒకరిద్దరు మిత్రులు అనూ ఫాంట్స్ డిటిపి సాఫ్ట్వేర్ ద్వారా టైప్ చేసే వాళ్లు. నేను పేపర్‌పై రాసిన ఆర్టికల్స్ కూడా అలాగే టైప్ చేసి పెట్టి ప్రింటౌట్ ఇచ్చేవారు. శ్రీనివాస్ గారు ఓ బుల్లెట్ ట్రైనే టైపింగ్ విషయంలో! ఆయన కీబోర్డ్ మీద టైప్ చేస్తుంటే ఆ వచ్చే సౌండ్, రిథమ్ ఇప్పటికీ నాకు శ్రవణానందకరంగా గుర్తే. దాన్ని చాలా ఆస్వాదించేవాడిని. అలా నాకూ టైప్ చేయాలన్న బలమైన కోరిక కలిగింది.
నేను తెలుగు టైపింగ్ నేర్చుకోవాలన్న బలమైన కోరిక కలగడానికి మరో కారణం, నేను పేపర్‌పై రాసి ఇవ్వడం, వాటిని వాళ్లు టైప్ చెయ్యడం, మళ్లీ నేనే ప్రూఫ్ చూసి కరెక్షన్స్ చేసి ఇవ్వడం, సెకండ్ ప్రూఫ్ ఇవ్వడం, అదీ కరెక్ట్ చేసి ఫైనల్ ప్రింటౌట్ ఇవ్వడం ఇదంతా నాకు పెద్ద తతంతంగా అన్పించేది. నేనే టైపింగ్ నేర్చుకుంటే “ఒక్క తప్పూ లేకుండా నా మనస్సులో నేను రాయాలనుకున్నది నేరుగా ఫైనల్ ప్రింటౌట్కి సిద్ధం చేయొచ్చు కదా” అనే ఆలోచన కలిగింది.
అనుకున్న వెంటనే ఖాళీగా ఉన్నప్పుడల్లా కంప్యూటర్ రూమ్‌లో శ్రీనివాస్ పక్కన స్టూల్ వేసుకుని కూర్చోవడం మొదలుపెట్టాను. నాకూ నేర్చుకోవాలని ఉందంటే చాలా ప్రోత్సహించి నేర్పించారు. తెలుగు టైపింగ్ అంటే, అదీ అనూ ఫాంట్స్‌లో మాడ్యులర్ కీబోర్డ్ అంటే A అని కీబోర్డ్ మీద కొడితే ఆ అనీ, Q అని కొడితే ష అనీ, ష్య అని కొట్టాలంటే qdf అని మూడు కొడితే ష్య వస్తుంది. ఇలా ఒక్కో అక్షరం రావాలంటే ఇన్ని అక్షరాలు టైప్ చేయాలి. ఇప్పుడు ఇదంతా కూడా అన్ని కీలను టైప్ చేస్తూ రాస్తున్నాను.
కంప్యూటర్ శ్రీనివాస్ నాకు ఓ మంచి గురువు. చాలా పొడుగ్గా ఎప్పుడూ నవ్వుతూ ఓ పాజిటివ్ మైండ్‌సెట్‌తో ఉండేవాడు. ఈ మధ్యనే ఇరవై ఏళ్ల తర్వాత మాట్లాడాను. “నాకు ఎందుకు రాదు” అని పట్టుబట్టి మరీ వారం రోజుల్లో అనూ మాడ్యులర్ కీబోర్డ్ లేఅవుట్ నేర్చుకుని తెలుగు టైపింగ్ మొదలుపెట్టాను. ఇంతకుముందే చెప్పాను కదా “కంప్యూటర్ శ్రీనివాస్ టైప్ చేస్తుంటే ఓ రిథమ్ ఉంటుందని”! నెలరోజులు తిరిగేలోపు కీబోర్డ్‌ని దడదడలాడించడం మొదలుపెట్టాను. నా వేగానికి కీబోర్డ్ మీద కీస్ పగిలిపోతాయేమో అన్పించేది.
అలా కీబోర్డ్ నేర్చుకున్న తర్వాత నాకు లభించిన ఊరట, నా ఆర్టికల్స్ నేనే టైప్ చేసుకోవడం! నా వాటితో ఆగలేదు.. నేను టైపింగ్ నేర్చుకోవడం చూసిన జయా మేడమ్ హైదరాబాద్ ఆఫీసు నుండి ఫ్యాక్స్‌లో వచ్చే ఆర్టికల్స్‌ని తన రూములో ఫ్యాక్స్ మెషీన్ నుండి తీసుకుని వచ్చి కట్టలు కట్టలు నా చేతికి ఇచ్చేది. “ఇంత వర్క్ ఎవరు చేస్తారు, నేను సబ్-ఎడిటర్ని, టైపిస్ట్‌ని కాదు లాంటి సెకలు నాకు ఉండేవి కాదు. ఏదైనా పనే, ఖాళీగా కూర్చోవడం కన్నా పని చెయ్యడం తప్పేం కాదు” అనుకునే వాడిని. నేను చెయ్యనని చెప్పినా ఆమె ఇబ్బంది పెట్టరు, కానీ నాకు పనిచెయ్యడం చాలా ఇష్టం.
ఒంగోలులో చిరంజీవి గారి హిట్లర్ వందరోజుల ఫంక్షన్ కవరేజ్‌కి వెళ్లాను. బాలయ్య “పెద్దన్నయ్య” సినిమా కూడా అదే సీజన్లో ఉంది. రెండు సినిమాలూ కవర్ చేశాను. హిట్లర్ ఫంక్షన్ రోజు గ్రౌండ్లోకి జర్నలిస్టులుగా దర్జాగా వెళుతుంటే, “సర్ నన్నూ తీసుకెళ్లండి” అంటూ గెడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతూ, చుట్టూ కట్టిన తాడు, సెక్యూరిటీతో తిట్లు పడుతూ ఉన్న అభిమానుల్ని చూశాను. మొదటిసారిగా సినిమా అభిమానులపై ఆరోజు జాలి కలిగింది. మీ అమ్మా నాన్నలు మిమ్మలను రాజుల్లా గొప్పగా చూస్తుంటే మీరు ఇక్కడ అభిమానం పేరుతో ఇలా బ్రతుకుతున్నారా అనే జాలి. ఆరోజు నుండి ఈరోజు వరకూ ఏ సినిమా హీరో అభిమానులను చూసినా ఒకటే అన్పిస్తుంది.. “జీవితంలో కష్టపడి నువ్వు హీరోలా ఎదగాలి గానీ ఎవరో హీరో కళ్లల్లో పడాలని, ఓ సెల్ఫీ తీసుకోవాలనీ ఎందుకు నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటావు” అని!
ఆ మధ్య కళామందిర్ ప్రసాద్ గారు KLM ఫ్యాషన్ మాల్ ఓపెనింగ్‌కి పిలిస్తే వెళ్లాను. హీరో విజయ్ దేవరకొండ, ఇటీవల విడుదలైన పుష్ప హీరోయిన్ రష్మిక గెస్టులుగా వచ్చారు. వాళ్లు రావడం రావడం, వందల మంది వారి చుట్టూ మూగారు. వాళ్లు అల్లంత దూరంలో ఉంటే వాళ్లు ఫ్రేమ్‌లో ఉంటే చాలు అని ప్రతీ ఒక్కరూ సెల్ఫీలు తీసుకోవడం మొదలుపెట్టారు. అందులో లైఫ్ చూసి వచ్చిన పెద్ద వాళ్లున్నారు. చాలా సక్సెస్ఫుల్ కెరీర్ కలిగిన వాళ్లున్నారు. వయస్సు, వాళ్లు జీవితంలో సాధించిన విజయాలూ అన్నీ మర్చిపోయి, ఓ హీరో, హీరోయిన్‌తో మేమున్నాం అని చెప్పుకోవడానికి తపన.
నాకు ఒకటే అన్పిస్తుంది.. “నేను పాటించిన విలువలు, నేను నేర్పించే విలువలు వినండి, ఎవరో హీరోకన్నా వ్యక్తిత్వంలో ఓ పదిరెట్లు ఎక్కువున్న హీరోగా మిమ్మల్ని చేస్తాను” అనే థాట్ నా మనస్సులో ఇలాంటి వారిని చూసినప్పుడల్లా వస్తుంది. కానీ ఏం చెయ్యలేం, ఎవరి ఇష్టాలు, ఎవరి ఛాయిస్‌లు వాళ్లవి.
ఒంగోలు హిట్లర్ విజయోత్సవ సభ ముగించుకుని తిరిగి రాత్రి 11కి చెన్నై ట్రైన్ ఎక్కాం. పొద్దున్నే చెన్నై చేరుకునే వరకూ ఓ దగ్గర లైట్ వేసుకుని నేను ఆ కవరేజ్ విషయాలు రాసుకుంటూనే ఉన్నాను. దాదాపు ఓ 30 A4 పేజీలు రాశాను. తెల్లారి ఆఫీసుకి చేరగానే దాన్ని టైప్ చేసి ప్రింటింగ్‌కి పంపాలి. సమయం లేదు. టైపింగ్ నేర్చుకున్నాక నేను అటెండ్ అయిన ప్రెస్ మీట్లన్నీ ఒకటి రెండు పేజీల మేటర్ మాత్రమే ఉండేది అయితే, పేపర్ మీద రాయడం మానేసి, నేరుగా కంప్యూటర్ ముందు కూర్చుని టైప్ చేసేవాడిని.
చాలామందికి పేపర్ మీద రాస్తేనే ఆలోచనలు వస్తుంటాయి. వాక్యాలు కుదురుతాయి. మొదట్లో ఆ ఇబ్బంది నాకూ ఉండేది. కంప్యూటర్ కీబోర్డ్ మీద వేళ్లు పెట్టి టైప్ చేస్తుంటే మైండ్ అంతా ఖాళీగా ఉండేది. కొన్నాళ్ల అభ్యాసంతో పేపర్‌తో పనిలేకుండా ఎంత క్లిష్టమైన భావాన్నయినా, తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన పనిలేకుండా టైపింగ్ అలవాటైంది.
నాకు ఓ అలవాటు.. టైప్ చేసేటప్పుడే ఎక్కడా ఏ తప్పూ రాకుండా చూసుకోవడం! తప్పులు టైప్ చేసి, వాటిని కరెక్ట్ చేసుకోవడానికి బ్యాక్ స్పేస్ కొట్టాల్సిన అవసరం ఉండకూడదు అని నాకు నేను ఓ రూల్ పెట్టుకున్నాను. అలా ప్రాక్టీస్ చేశాను. దాంతో ఇప్పటి వరకూ టైప్ చేసిన ఏ మేటర్ మళ్లీ వెనక్కి చూసుకోవలసిన పని ఉండదు. నేను ఏం టైప్ చేశానో అదంతా ఓ స్వేచ్ఛా ప్రవాహంలా నా మనస్సులో నుండి కీబోర్డ్ ద్వారా అక్షరాల్లోకి వస్తుంది తప్పించి “అలా రాస్తే బాగుండేది, ఇలా రాస్తే బాగుండేది” అని వెనక్కి వెళ్లి సరిచేసుకోవడం ఉండదు. దీనివల్ల నా మనస్సు పాఠకుడికి నేరుగా అర్థమవడం మొదలైంది. నేను ఎదురుగా నిలబడి మాట్లాడుతున్న అనుభూతికి లోనవుతున్నారు.
జీవితం నాకు ఓ అవకాశంలా అన్పిస్తుంది. చిన్నప్పుడు జీవితం ఇచ్చిన ఎన్నో అవకాశాలు పోగొట్టుకుని ఉండొచ్చు. కానీ సూపర్‌హిట్‌లో చేరాక కసి పెరిగింది.. “నల్లమోతు శ్రీధర్ మామూలోడు కాదు” అని నాకు నేను భావించేలా పనిచేయాలి అనే కసి! ఇతరులు నన్ను పొగడడం, విమర్శించడంతో సంబంధం లేని కసి.. నేను నాకు నచ్చాలి. నా పని నాకు నచ్చాలి.. దేవుడా నాకు ఇంత శక్తిని, ఆలోచననీ ఇచ్చావు, నాకు నేను నచ్చేలా కర్మయోగిగా పనిచెయ్యాలన్న కసి అప్పటి నుండి ఇప్పటి దాకా కొనసాగుతూ వచ్చింది.
మరో భాగంతో మళ్లీ కలుస్తాను.
- Sridhar Nallamothu