“ఏరా అబ్బాయి.. ఏంటి ఈ మధ్య కన్పించడం లేదు. ఎక్కడుంటున్నావేంటి?”
“ఓ మద్రాసులోనా, ఏం చేస్తున్నావు? ఎంతిస్తున్నారేంటి?”
ఈ ప్రశ్నలు జీవితంలో నా మీద చాలా ప్రభావాన్ని చూపించాయి.
మా ఊరిలో ఉండగా స్లీపింగ్ పిల్స్, సిగిరెట్స్, డ్రింక్ వంటి వాటితో ఊళ్లో చాలామంది చులకనగా చూసేవారు. నా జీవితంలో నేను ఎవరికీ ఇప్పటి వరకూ అపకారం చెయ్యలేదు. అప్పుడు కూడా అదే భావన ఉండేది. “నేనెవరికీ అపకారం చెయ్యనప్పుడు నా అలవాట్లని బట్టి ఎలా చులకనగా చూస్తారు” అనే భావన. ఆ భావన కాస్తా కసిగా మారింది. ఆ కసి నుండి సంకల్పించుకున్న విషయం అలవాట్లని ఉన్న ఫళంగా మానేయడం! ఒక్కరోజులో ఎలా మానేశానో ఇంతకు ముందే ప్రస్తావించాను కదా!
అలా అన్నీ అలవాట్లు మానేసి చెన్నైలో ఓ గౌరవప్రదమైన ఉద్యోగంలో పెద్ద పెద్ద హీరోలను ఇంటర్వ్యూ చేస్తూ “నల్లమోతు శ్రీధర్” అంటే ఇండస్ట్రీలో అందరికీ తెలిసే స్థితికి చేరుకున్నప్పుడు అప్పుడప్పుడు మా ఊరు వచ్చేవాడిని.
వచ్చినప్పుడు బంధువుల నుండి, తెలిసిన వాళ్ల నుండి ఎదురైన ప్రశ్నలు అవి.. “ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు” అన్నది!
అంతటితో ఆగే వాళ్లు కాదు.. “ఫలానా విద్యాసాగర్ అమెరికా వెళ్లాడట, లక్షలు లక్షలు సంపాదిస్తున్నాడు అట, వాళ్ల నాన్నకి చాలా డబ్బులు పంపిస్తున్నాడు, నువ్వెప్పుడు అలా ఎదుగుతావో” అనే మాటలూ విన్నాను. అప్పుడు అర్థమైంది ఈ ప్రపంచానికి కావలసింది డబ్బు.
డబ్బు దృక్పధంతో నిన్ను చూసే వాడికి నువ్వు సంపాదించిన డబ్బు వల్ల బూడిద కూడా వాడి మీద రాలి పడకపోయినా వాడికి అదో ఆనందం, నా దృష్టిలో శునకానందం.
నిజానికి నా కెరియర్ మా ఊరుకి నేను టాలెంటెడ్ అని నిరూపించటానికి మొదలైంది. అలా నిరూపించుకోవడం కోసం చాలా కష్టపడ్డాను. కానీ కెరీర్ మొదట్లోనే ఊరెళ్లినప్పుడు నా పేరు, నాకు ఉన్న గుర్తింపు మీద ఎవరికీ ఆసక్తి లేకపోవడం గమనించాక, నా సంపాదనే నా సక్సెస్‌కి పారామీటర్ అన్నది అర్థమయ్యాక మా ఊరిని పక్కన పెట్టేశాను. మా ఊరి కోసం కష్టపడడం పక్కనపెట్టేశాను.
అప్పుడు నిర్ణయించుకున్నాను.. నేను మా జిల్లాకి గర్వకారణంగా ఉండాలని! అంతలోనే అనిపించింది జిల్లాకి ఏంటి, రాష్ట్రానికో, దేశానికో ఎందుకు గర్వకారణం కాకూడదు అనే స్కోప్‌ని ఆలోచనల్లో పెంచుకున్నాను. అప్పటినుండి ఇప్పటివరకు ఎవరైనా మా ఊరి వాడు అంటే నవ్వి ఊరుకుంటాను, ఎవరైనా మా జిల్లా వాడు అంటే లోపల నవ్వుకుంటాను, ఇంకెవరైనా మా రాష్ట్రం వాడు, మా తెలుగు వాడు అన్నా మనసులో చిరునవ్వే ఉంటుంది. నేను విశ్వ మానవుడిని, నాకు ఎలాంటి సరిహద్దులూ లేవు.
ఆ కసితోనే The Verge వంటి అంతర్జాతీయ టెక్నాలజీ పత్రికల్లో కూడా ప్రచురితం కావడానికి ఓ పావుగంట ముందే నేను “కంప్యూటర్ ఎరా” సైట్లో ఆర్టికల్స్ రాసే వాడిని. ఇది ఎవరికో నిరూపించుకోవటానికి కాదు.. నిజానికి అప్పట్లో అలాంటి అంతర్జాతీయ పత్రికలు ఒక అంశం మీద ప్రచురించిన సమయాన్ని, నేను వారి కంటే ముందు ప్రచురించిన సమయాన్నీ స్క్రీన్ షాట్స్ తీసి ఫేస్బుక్ లాంటి వాటిలో పెడితే, కనీసం ఆ విషయాన్ని అక్లాలెడ్జ్ చేసే వాళ్లు కూడా ఉండే వాళ్లు కాదు.
నేను ఒకటే నమ్ముతాను! నా పోరాటం.. నా కృషి, నా సంకల్పం అన్నీ నన్ను నేను సంతృప్తి పరచుకోవడానికి! నన్నెవడు గుర్తించినా గుర్తించకపోయినా నా మానసిక స్థితిలో ఇసుమంతైనా మార్పు ఉండదు. ఒకటే నమ్మకం.. “నాది రాజా లాంటి బ్రతుకు, ఎవడో దానికి మెడలో మెడల్స్ వేసి నువ్వు రాజువి అని గుర్తించేదేంటి” అనే ఆత్మవిశ్వాసం. ఇది పొగరుగా కొంతమందికి అన్పించవచ్చు. అలాంటి వారు నేను చిన్నప్పటి నుండి పడిన కష్టాలు, నేను చూసిన జీవితాన్ని నా స్థానంలో ఉండి చూసి అప్పుడు అది పొగరా, ఎవరెస్ట్ లాంటి ఆత్మవిశ్వాసమా అన్నది అర్థం చేసుకోవచ్చు.
“ఎవరెవరికో అవార్డులు ఇస్తున్నారు, ప్రభుత్వాలు గుర్తిస్తున్నాయి, మీకు ఇంత అర్హత ఉన్నా మీకెందుకు అవార్డులు రావు, బాధగా ఉంది సర్” అంటూ చాలామంది మెసేజ్‌లు పెడతారు. అది చదివినప్పుడు నా మొహంలో చిరునవ్వే ఉంటుంది. ఎక్కడా వెలితి అన్పించదు. అసలు ఈ భూమ్మీద మన బ్రతుకుని ఓ అవార్డ్ ఎలా గొప్పగా చిత్రీకరించగలుగుతుంది? ఈ మనుషులు, వారికుండే రాగద్వేషాలు, అలాంటి మనుషులతో కూడిన సమాజం వీటన్నిటి స్థాయిని దాటిపోయి నేను నిరంతరం నా సోల్‌తో ప్రయాణం చేస్తున్నాను, అది ఇప్పుడు మాత్రమే కాదు, నాకు తెలిసిన చిన్నప్పటినుండి! అలాంటిది “ఏదో ఫంక్షన్లో ఎవరో అవార్డ్ ఇస్తుంటే, నా బ్రతుకు ధన్యమైంది” అని భ్రమలో బ్రతికే జన్మ కాదు నాది! నా జన్మ ఇక్కడ మనుషుల మధ్య ఇరుక్కుపోవడానికి ఉద్దేశించబడినది కాదు. దానికి ఆవల చాలా పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి సమాజానికి చేసి కామ్‌గా జీవితం ముగించుకుని వెళ్లిపోవడానికి!
ఇంకోమాట దర్జాగా చెబుతాను.. నాకు అవార్డ్ ఇస్తే ఆ అవార్డుకి విలువ వస్తుందేమో గానీ, ఇచ్చిన వాళ్లకి విలువ వస్తుందేమో గానీ ఏ అవార్డ్ వల్లా నా జీవితానికి కొత్తగా వచ్చే నగిషీ ఏదీ ఉండదు. నా జీవితానికి నేను ఆల్రెడీ నగిషీలు చెక్కుకున్నాను, దాన్ని అనాకారిగా ఉండే స్థితి నుండి అందంగా మలుచుకున్నాను.
ఇకపోతే సామాజిక బాధ్యత అంటారా.. “తెలుగు వాళ్లకి టెక్నాలజీ ప్రతీ మారుమూలకి అందించాలన్న 1996లో అనుకున్న సంకల్పం కొద్దీ ఈరోజు వరకూ పనిచేస్తూనే ఉన్నాను”. నేను టివి ఛానెళ్లకి వెళితే పైసా డబ్బులు ఇవ్వరు, నేను కంప్యూటర్ ఎరా పత్రిక ద్వారా 2020 వరకూ నెలకి పొందిన జీతం ఇరవై వేలు. యూట్యూబ్ వంటి వాటిలో కూడా పనికిమాలిన థంబ్ నెయిల్స్ పెట్టి సంపాదించుకోవాలన్న కోరికా, ఆశా ఉండేవి కావు. కొంతమంది యూట్యూబ్ ఛానెల్ పెట్టమని సలహాలు ఇస్తుంటారు.. పిచ్చి వాళ్లారా.. 2006లో యూట్యూబ్‌ని గూగుల్ కొన్న నవంబర్ 15వ తేదీన ఇండియాలో మొదలైన మొదటి పది ఛానెళ్లలో నా కంప్యూటర్ ఎరా ఛానెల్ ఒకటి. జనాలకు యూట్యూబ్ అంటే ఏంటో తెలీని రోజునే నేను ఛానెల్ క్రియేట్ చేశాను. ఎవడికీ గ్రీన్ మ్యాట్ అంటే తెలీని 2009 సమయంలోనే గ్రీన్ మ్యాట్ వాడి, స్టూడియో లైట్లు పెట్టుకుని నాకు నేను వీడియోలు షూట్ చేసి, ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేశాను. కానీ అక్కడ యూట్యూబ్ క్వాలిటీ కంటెంట్‌కి కాకుండా ఓ ఆల్గారిథమ్ ఆధారంగా సక్సెస్‌ని నిర్ణయించడం మొదలుపెట్టాక.. నా సక్సెస్ ఎవడి ఆల్గారిథమ్ చేతిలోనే ఉండడం ఏంటి, దాని కోసం SEO లాంటి అడ్డదారులు తొక్కి నన్ను నేను ప్రమోట్ చేసుకోవడం ఏంటి అనే భావనతో యూట్యూబ్ మీద దృష్టి ఆపేశాను. మరోవైపు నాకు రోజంతా టివి స్టూడియోల చుట్టూ లైవ్‌ల కోసమో, రికార్డెడ్ షోల కోసమో తిరగడమే ఈ పదేళ్లకి సరిపోయింది. మరోవైపు నా కంప్యూటర్ ఎరా పత్రిక, పోలీస్ డిపార్ట్మెంంట్ ట్రైనింగ్ లాంటివీ ఇలా!
నేను నమ్మిన శ్రీవేంకటేశ్వరుడి సాక్షిగా గుండెల మీద చేయేసుకుని చెబుతున్నాను.. నా ద్వారా నాలెడ్జ్ పొంది ఈరోజు కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారున్నారు. వారిలో కొంతమంది నన్ను కలిసినప్పుడు ఆ విషయం చెబుతుంటారు కూడా! కానీ నా జీవితంలో ఏరోజూ డబ్బు, మెటీరియల్ థింగ్స్ సమకూర్చుకోవాలన్న ఆశ కలగలేదు. అయినా కూడా నా జీవితంలో ఏ లోటూ లేకుండా భగవంతుడు నిరంతరం కాపాడుతూనే ఉన్నాడు. 2016లో ఒక్క క్షణం తప్పించి నేను బ్రతకలేను అన్న భయం కలగలేదు. అలా భయం కలిగిన వెంటనే నాకు ఓ సపోర్ట్‌ని దేవుడు ఇచ్చాడు.
చాలాసార్లు నన్ను నేను “కర్మ యోగి”ని అని ప్రస్తావించుకుంటూ ఉంటాను. మీకు మీరు చెప్పుకోవడం ఏంటి, ఇంకొకరు చెప్పాలి గానీ అన్నట్లు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నా మీద, నా ఆలోచనా విధానం మీద నాకు అవగాహన ఉంటుందా, బయట వాళ్లకి మీకు అవగాహన ఉంటుందా? నా జీవితంలో ఏరోజూ రోజుకి 15 గంటలకి తక్కువ పనిచేసింది లేదు. నేర్చుకోవడం ఆపింది లేదు.. నాకు తెలిసిన నాలుగు ముక్కల జ్ఞానాన్ని ఇతరులకు నేర్పించడం ఆపింది లేదు. నేను ఫేస్బుక్లో గానీ, ఇతర పద్ధతుల్లో గానీ షేర్ చేసే ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా, స్పిరిట్యువల్ అయినా జ్ఞానాన్ని బయట లక్షలకు లక్షలకు అమ్ముకుంటున్నారు. ఏరోజూ నన్ను నేను అమ్ముకోలేదు. ఆ మధ్య రూ. 300 నామమాత్రపు ఫీజు తీసుకుంటూ నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్లు పెట్టింది కూడా, కంప్యూటర్ ఎరా మేగజైన్ నిలిచిపోయాక పైసా ఆదాయం లేకుండా నడిరోడ్డు మీద ఉన్నప్పుడు “జ్యోతి దేశరాజు” అనే చెల్లెమ్మ చేత చెప్పించబడి… అప్పటి వరకూ నేను ఎవరి మాటా వినని వాడినల్లా నా సోల్ నాకు సిగ్నల్ ఇవ్వబట్టి మొదలుపెట్టబడిన సంపాదన తప్పించి.. అసలు ఈ సంపాదన, మనుషులు, అవార్డులు, “నువ్వు గొప్ప, నేను గొప్ప” అనే కితాబులు ఇవన్నీ ఆలోచించే జీవితం కాదు.
దేవుడు నాకేదో పని అప్పజెప్పాడు. దాన్ని పూర్తి చెయ్యడానికి ఈ మెటీరియల్ థింగ్స్‌లో ఇరుక్కుపోని ఓ వజ్ర సంకల్పం, ఆలోచనల్లో స్పష్టత కూడా ఇచ్చాడు.. నాకు బంధాల వల్ల ఈ భూమ్మీద అడ్డుగోడలు ఉండకూడదు అని ఏ బలమైన బంధాన్నీ ఇవ్వలేదు. సో బ్రతికినంత కాలం తలొంచుకుని పనిచేసుకుని వెళ్లిపోవడమే నా ముందున్న కర్తవ్యం! ఈ మానసిక స్థితి అతి కొద్ది మందికే అర్థమవుతుంది. మళ్లీ చెబుతున్నా.. నేను యోగిని.. కర్మయోగిని.
మరో భాగంతో మళ్లీ కలుస్తాను.
- Sridhar Nallamothu